Wednesday, June 30, 2010
నేనేనా అన్న భావన!!!
నీ కోపంలో....నీ సంతోషంలో....నీ ఏడుపులో...
నీ ఆటల్లో...నీ పాటల్లో...నీ నవ్వుల్లో.....
నీ మాటల్లో...ఇలా అన్నిట్లో...
చిన్నప్పటి నన్ను మళ్లీ చూసుకుంటున్న అనుభూతి!!!
నిన్ను చూస్తుంటే.....బంగారు తండ్రీ!!!!
Wednesday, June 23, 2010
ఇబ్బందులు...
ఇంట్లో ఎంత గారాబంగా పెరిగినా బయట నలుగురితో శభాష్ అనిపించుకోవాలి గాని…
వీడెప్పుడు పోతాడా అని ఎదురు చూసేటట్లు ఉండకూడదు.
మన పెద్దలు చెప్పినట్లు కాలు జారితే వెనక్కి తీసుకోగలం కాని మాట జారితే తీసుకోలేము అని వీళ్ళకు ఎప్పుడు తెలుస్తుందో మరి .
మీ ప్రవర్తన ఎదుటివారికి ఇబ్బంది కలిగించకుండా ఆహ్లాదాన్ని ఇవ్వాలి కాని అసహ్యాన్ని పెంచకూడదు. మరి ఈ నిజాన్ని వాళ్ళు ఎప్పుడూ తెలుసుకుంటారో!!.
ఈ నాటి పల్లె దుస్థితి

పల్లె ఏడుస్తోంది…..
దూరమౌతున్న అనుబంధాలను దూరం చేసుకోలేక….
బతకడానికి వలసలు పోతున్న కుటుంబాలను ఆపలేక…
మసకబారుతున్న మానవత్వపు విలువలు చూడలేక…
ఓట్ల కోసం వచ్చి వాగ్థానాల వర్షాన్ని కురిపించే
రాజకీయ నాయకుల రాక్షస నీతిని చూడలేక..
పాడి పంటలతో..పచ్చని పైరులతో…అష్టైశ్వర్యాలతో కళ కళలాడిన పల్లెలు ఒకప్పుడు.....మరి ఇప్పుడు ......
ఎప్పుడు పడుతుందో తెలియని వానదేముని చల్లని చూపు కోసం…
ఏ ప్రళయం ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో తెలియక
పండిన పంటకు కనీసం గిట్టుబాటు లేక
పంట పండించాలో లేదో తెలియని
అయోమయ స్థితిలో వున్న ఈ నాటి పల్లె రైతుని చూసి
గుండే చెరువైయ్యేలా పొగిలి పొగిలి ఏడుస్తోంది…ఈనాడు.....
ఆనాటి బంగారు పంటల పసిడి పల్లె
Monday, June 21, 2010
నీ తలపుల పరిమళాలు....
మదిలో ఉప్పొంగి....
జడివానలో తడిచి
సుడిగాలిలో ఎగిరి....
చిగురాకులా వణికి
చిరుజల్లు గా మారి....
విరి పానుపై నను చుట్టుముట్టేలే నీ తలపుల పరిమళాలు....
Saturday, June 19, 2010
నీకేమివ్వగలను???
అలై వచ్చి అల్లిబిల్లి ఆశలు రేపావు......
బాష రాని నాకు భావమై నిలిచావు.....
మాట రాని నాకు పదాల అమరిక నీవైనావు....
మౌనమై పోయి నా మదిలో నిండి పోయావు.....
నా అన్నదంతా నీవే నిండి వున్నావు....
నా ప్రాణమే నీవైన నీకేమివ్వగలను???
Friday, June 11, 2010
సొంత డబ్బా - పిచ్చా పాటి
పక్కనొడు ఏమి చేస్తున్నాడు అని కాకుండా మనం ఏమిటో చూసుకుంటే మంచిది.ఎంతసేపు ఎదుటి వాళ్ళలో వంకలు ఏమి వెదుకుదామా అని కాకుండా మన పని మనం చూసుకుంటే ఒంటికి, ఇంటికి కుడా మంచిది.
Monday, June 7, 2010
ఆటోగ్రాఫ్…..
అందమైన సంతకం కాదు ఆటోగ్రాఫ్ అంటే
నాపై నీకున్న అభిప్రాయాన్ని చెప్పే ఓ నిజం…
ఏదోఒకటి రాసామనకుండా.....
రాసేదాన్ని మనసు లోపలి నుంచి వెలికి తీసి
అందం గా రాస్తే అవుతుంది అది ఓ చక్కని తీపి జ్ఞాపకం..!!
Sunday, June 6, 2010
శుభాకాంక్షలు
అమ్మా!!
పుట్టినరోజు శుభాకాంక్షలు…ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ....
ప్రేమతో….
Friday, June 4, 2010
బొమ్మకు మాటలు
నిన్ను చూస్తూనే మైమరచా...నీ అందమైన మోవిలోని అపరంజి మెరుపులు...
చెప్పనలవికాని తలపుల మైమరపులు...
పున్నమి చంద్రుని చల్లని వెన్నెల తేరుపై
మాటలకందని భావనల మధుర స్వాగతసుమాంజలితో...
అంజలి ఘటించే నీకేమి చెప్పను మాటలు??
బాపు బొమ్మను తలపించే తరుణీమణి..!!
(జ్ఞాన ప్రసూనగారు వేసిన బొమ్మకు జ్యోతి గారు మాటలు చెప్పమంటే ఓ చిన్న కవిత....)
బాలు గారికి....
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.....అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు.....అంటూ
ఎవరు పాడలేనన్ని, పాడలేని పాటలు పాడిన పాడుతున్న గాన గంధర్వుడి కి పుట్టినరోజు శుభాకాంక్షలు...
Wednesday, June 2, 2010
ఏదోఒకటి
ఈనాటి మనిషి.....
మనసు మూగగా రోదిస్తోంది......దిగజారుతున్న నైతిక విలువలని చూడలేక
పతనమౌతున్న అనుబంధాలను చూడలేక
పైపైకి నటించే ఆప్యాయతల్ని తట్టుకోలేక
ఓ మనిషి ఇలా ఎంతవరకు నీ నటనా ప్రయాణం!!





