31, జనవరి 2011, సోమవారం

ప్రేమ - పెళ్లి

ఈమద్య తరచూ వింటున్న విష్యం ఇంట్లోవాళ్ళని కాదని పారిపోయి పెళ్లి చేసుకోవడం. ప్రేమ తప్పు కాదు, కాని అందరిని బాధ పెట్టి వాళ్ళు సంతోషంగా ఉండగలరా!! పెద్ద వాళ్ళ అండ అవసరం లేకుండా బతకడం చాలా కష్టం. అల్లారుముద్దుగా పెంచి మనకి ఏది కావాలంటే అది ఇచ్చి కష్టం అనేది తెలియకుండా పెంచిన వారిని కాదని వెళ్లి పోవడం మంచి పని కాదు. ఇంట్లోవాళ్ళు ఇష్టపడక పొతే అర్ధం అయ్యేటట్లు చెప్పాలి కాని వారిని నలుగురిలో తలదిన్చుకునేటట్లు చేయకూడదు, అది ప్రతి ఒక్కరి బాద్యత.
నా విష్యమే తీసుకుంటే....నాన్నకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను. అప్పటి వరకు మనుష్యులు రెండు రకాలుగా మాట్లాడగలరని నాకు తెలియదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ పది జన్మలకు సరిపడా జీవిత పాఠాల్ని నేర్చుకున్నాను. రాసిపెట్టి వున్నప్పుడు ఏది మనం తప్పించుకోలేము. ఇది మాత్రం నిజం అక్షరాలా!!
నీ చుట్టూ డబ్బు వుంటే అందరూ నీ చుట్టాలే లేకపోతే అస్సలు నువ్వు, నీ ఉనికి కుడా వాళ్లకు తెలియదు, నువ్వు ఎదురుగా వున్నా కుడా!! కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా పంచుకోడానికి ఎవరు వుండరు నీ దగ్గర డబ్బు లేకపోతే. ఈ విషయంలో ఎవరికీ మినహాహింపు లేదు ఒక్క అమ్మానాన్నలకు తప్ప. కొడుకైనా,కూతురైనా, భార్యైనా, భర్తైనా, ఏ బంధుత్వమైనా!! ఒక పది శాతం ఈ కోవకు చెందని వాళ్ళుంటారేమో!!
ప్రేమ...అందరి ప్రేమను పొందాలి కాని అందరిని ఏడిపించకూడదు.

27, జనవరి 2011, గురువారం

గుండె చప్పుడు.....

ఇన్నేళ్ళ ఈ జీవన ప్రయాణంలో వెనుదిరిగి చూసుకుంటే...
నా నీడ కుడా నా వెంట లేనంది.
ఆటలో గెలుపోటములు సహజమే అయినా
నా వెన్నంటి ఉంటోంది ఓటమే ఎప్పుడూ....
పడిన చోటే లేచి నిలబడాలనే నా తపన
ఓటమిలో నుంచి గెలుపుకి ఎదగాలనే
నా ప్రయత్నం నిరంతరం సాగుతూనే వుంటుంది
గెలుపు పిలుపు వినబడే వరకు....
హేళన చేసిన వారే హర్షధ్వానాలు చేసేవరకు...
నే వేసే ప్రతి అడుగుకు నీరాజనాలు పట్టే వరకు....
అనుక్షణం ప్రతిక్షణం సాగుతుంది ఈ పయనం
అనుకున్నది సాధించేవరకు.

25, జనవరి 2011, మంగళవారం

నీకు తెలుసా!!

ప్రపంచం అంతా రాతిరి కౌగిలిలో
నిద్ర పోతూ వుంటే చటుక్కున
మెలకువొస్తుంది నువ్వు పలకరించినట్లుగా !!
చుట్టూ చుస్తే నువ్వుండవు
నీ జ్ఞాపకాల అనుభూతులు తప్ప!!
నీ పిలుపు కాదేమో అనుకోవడానికి
నీ గొంతు సవ్వడి నా గుండెల నిండుగా వుంటే
ఎలా కాదనగలను?
గుర్తు వచ్చావేమో అనుకుంటే
అస్సలు మర్చిపొతే కదా!!
గుర్తు చేసుకోవడానికి!!

తెలుగువాడి ఆత్మగౌరవం

తెలుగు వాడి ఆత్మ గౌరవం ఈ మాట ఎక్కడో విన్నట్లు ఉందే! అనుకుంటున్నారా

ప్రస్తుతం ఏ జండా లేని ఒక రాజకీయ నాయకుడి అజెండాలే...ఇది…ఇంతకీ ఎవరా రాజకీయ నాయకుడు అనుకుంటున్నారా?

రాజకీయ మనుగడ కోసం మన తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ లో తాకట్టు పెట్టిన కొందరి స్వార్ధ రాజకీయ ఎత్తుగడలతో విసుగు చెంది…తెలుగు వాడి కోసం, తెలుగు వాడి ఆత్మ గౌరవం కోసం పార్టీ పెట్టి..మన సత్తా గల్లీ నుంచి ఢిల్లీ కి వినిపించి ….ఢిల్లీ నాయకుల తల వంచి తెలుగు వాడికి సలాం కొట్టించిన మన ప్రియతమ నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు…

అలానే తెలుగు బాష స్వేచ్ఛ కోసం, తెలుగు వాడి స్వతంత్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి…మన తెలుగు తల్లిని మనకి ఇచ్చి…తను మాత్రం తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిన మహా మనీషి మన పొట్టి శ్రీరాములు గారికి మనం ఇచ్చే గౌరవం ఏ పాటిది…?? నేను ఆంధ్రుడిని అని గర్వంగా చెప్పుకునే ప్రతిసారి మనకు గుర్తుకురావాల్సిన ఆ మహామూర్తికి మన ఉద్యమ కారులు చేస్తున్న ఘన సన్మానం(చెప్పులతో కొట్టడం, విగ్రహాలు ద్వంసం చేయడం) చూస్తుంటే… ఒక సగటు రాజకీయ నాయకునికి ఇచ్చే గౌరవం కూడా మనం ఆ మహానీయునికి ఇవ్వలేక పోతున్నామే అని ఎంతో బాధగా ఉంది…

ఓరి తెలుగు వాడా.... నీ తల్లికి ఇచ్చే గౌరవం మన తెలుగుతల్లి కి ఇవ్వలేక పోతున్నావా? అమ్మ అని మనం పిలిచే పదం తెలుగుతల్లి మనకి ఇచ్చిన గొప్ప వరం అని మరిచావా?

తెలుగుతల్లి , తెలంగాణాతల్లి అని తల్లినే వేరుచేసి పంచుతున్న ఈ రాజకీయ నాయకుల ఎత్తుగడలు అర్ధం కానంత మత్తు లో ఉన్నావా….

రంగులు మార్చే ఊసరవెల్లులకి మన రాజకీయ నాయకులకి తేడా లేదు అని చెప్పేందుకే ఈ నా చిరు ప్రయత్నం. ఉద్యమం ప్రజలే చేయాలి, తన్నులూ ప్రజలే తినాలి , ఊపిరి ప్రజలే వదలాలి, ఆస్తులు ప్రజలే కోల్పోవాలి, ఆకలి చావులు ప్రజలే చావాలి, పన్నులు ప్రజలే కట్టాలి, నాయకులని గెలిపించాలి గద్దెలు ఎక్కించాలి, చివరికి సగటు వోటర్ లా మిగిలి పోవాలి…

నల్ల మచ్చ నీ వేలికి …..తెల్ల బట్ట వాడి వంటికి అదేరా రాజకీయం…

రాజకీయ ఉద్యమంలో చచ్చిన నాయకుడే లేడురా…

ఓరి వోటరా… రాజకీయం ఒక రంగుల వల….అందులో చిక్కకురా, నీ కోసం, నీ వాళ్ళ కోసం , నీ వాళ్ళ ఆకలి కోసం బ్రతకరా…వాళ్ళని బ్రతికించరా….రాజకీయం కోసం చావకురా .....

ఈ నీచ..కుల, వర్గ, ప్రాంత, వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పరా…నీ చేతి లో ఉన్న వోటు బ్రమ్మాస్త్రం అని మరవకురా.

రాష్ట్రాలు వేరు ఐనా మన తెలుగు వాళ్ళు అంతా ఒక్కటే అని ఈ ప్రపంచానికి చాటి చెప్పరా సోదరా….

ఎంతో ఘనచరిత్ర ఉన్న మన తెలుగునీ...తెలుగుతల్లినీ ఢిల్లీ లో తాకట్టు పెట్టకుండా కాపాడుకుందాం.

(ఈ రచన నాది కాదు )

24, జనవరి 2011, సోమవారం

ఏకాకి....!!



ఎందరున్నా ఎవరు లేరు
అన్ని వున్నా ఏమి లేవు
ఇదే కదా ఒంటరితనం!!
ఎందరున్నా ఎవరు లేని ఎకాతంలో
అన్ని వున్నా ఏమి లేని తనంతో
బతుకు బరువుతో భారంగా
అనిపిస్తోంది కదలలేనట్లున్న కాలం!!

21, జనవరి 2011, శుక్రవారం

నా ఎంకి...



ఏటి ఒడ్డున ఎదురు చూసేను
నీటి గట్టున నిదుర కాచేను
పొదల మాటున పరి పరి వెదికేను
ఝామురాతిరి జాబిలమ్మ ఎలుగుల జిలుగులలో
అప్పుడప్పుడు మబ్బులతో దోబూచులాడే
చందురుని మసక ఎలుతురులో
కానరాని రూపుకై కలవరపడుతూ
నా ఎంకి ఎదురుసూత్తున్నాది నాకోసమే!!

18, జనవరి 2011, మంగళవారం

అన్ని తానై......

ఒంటిగా నేనుండలేనంటే
జంటగా తోడుంటానంది.
నాకెవరు లేరని వాపోతే
అన్ని తానౌతానంది.
కడ వరకు కలిసి వస్తానంది
కలలోలా కదలి వెళిపోయింది.
దూరమైన బాంధవ్యం తో
భారమైపోయిన బతుకుతో
ఎందరున్నా ఎవరూలేని ఏకాంతంలో
నాతోనే నీవున్నావని నీతోనే నా లోకమని
కడ వరకు కలిసి ఉంటావని...
నిజం కాని ఓ అబద్దంలో ఆనందాన్ని ఆస్వాదిస్తున్నా!!

17, జనవరి 2011, సోమవారం

ఈనాటి వైద్యం

వైద్యో నారాయణో హరి అన్నారు మన పెద్దలు, కాని నాటి నుంచి ఈనాటికి డబ్బుల నైవేద్యం ఉంటేనే వైద్యం అన్నట్లు వుంది. వైద్యుని దేవునికి ప్రతిరూపంగా భావిస్తాము. శారీరకమైనా, మానసికమైనా, ఇంకా ఏ రూపంగానైనా ఇబ్బంది వస్తే వైద్యుడు చెప్పిందే వేదవాక్కు మనకు. ఒక అమ్మాయికి రెండు సార్లు అబార్షన్ అయితే మూడోసారి మొదటి నుంచి భాగ్యనగరంలో అద్దెకు ఇల్లు తీసుకుని నెలలు నిండే వరకు డాక్టర్ పర్యవేక్షణ లో వుంటే వాళ్లకు చివరకు మిగిలిన బహుమతి చనిపోయిన పాప. వేరొకరికి బెంగుళూరులో పేరున్న పెద్ద హాస్పటల్లో ఎనిమిదో నెలలో తేడా అనిపించి వెళితే ఐదు, ఆరు రోజులు ఏమి జరిగిందో కుడా చెప్పకుండా కదలికలు లేవు చూద్దాము అని చెప్పారు. తరువాత విశాఖ లోని మరో పేరున్న హాస్పటల్లో నెలలు నిండే వరకు చూపిస్తుంటే రేపు రండి, ఎల్లుండి రండి అని చెప్పి తరువాత బాలేదని వెళితే ఆఖరుకి ఆపరేషన్ చేసి చనిపోయిన పాపని ఇచ్చారు.
పూర్వకాలంలో అవకాశాలు లేక ఇలాంటి సంఘటనలు చాలా జరిగేవి. అన్నిరకాలుగా ఎంతో అభివృద్ధి చెందిన, చెందుతున్న,
విజ్ఞానమున్న, విజ్ఞులున్న ఈ రోజులలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే ఇది ఎవరి నిర్లక్ష్యం?
అనుకోవాలి. అందరూ బాధ్యతలేని వారు కాదు,
పనిలోనే దైవత్వాన్ని చూసే వారు కొందరుంటే డబ్బుని చూసే వారు మరికొందరు, ప్రాణాలతో చెలగాటమాడే వారు ఇంకొందరు. ప్రాణం పోసేందుకే వైద్యం కాని తీసేందుకు కాదని వైద్యాన్ని అందరికి అందుబాటులో ఉండేలా చేయాలని కొంత మంది తపన పడే మహా యజ్ఞంలో నిస్వార్ధంగా మీ చేయి అందించాలని ప్రతి ఒక్క వైద్యనారాయణుని అర్ధిస్తున్నాను.

11, జనవరి 2011, మంగళవారం

మానవత్వం పరిమళించిన వేళ....

క్రిందటి నెల పదహారో తారీకున జరిగిన ఓ సంఘటనతో కొద్ది మందిలోనైనా మంచి, మానవత్వం ఇంకా మిగిలి వున్నాయని దైవత్వం అనేది కష్టంలో వున్నవారికి మనం చేయగలిగిన సాయం చేయడమే అని అనుభవపూర్వకంగా నిరూపితమైన విష్యం మీతో పంచుకోవాలని ఈ టపా.
మా నాన్నగారు ఓ ఇరవై ఏళ్ల పైనే ప్రతి సంవత్సరం శబరిమలై కి మాల లో వెళ్తున్నారు. రెండు ఏళ్ల క్రిందట కుడా మా ఊరు దగ్గర నుంచి ఒక్కరే పాదయాత్రతో ఇరవైఐదు, ఇరవైఆరు రోజులలో బరిమలైకి వెళ్లి వచ్చారు. ఈ సంవత్సరం కుడా యానాం నుంచి పాదయాత్రతో బయలుదేరిన ఇరవై మందితో కలిసి అయ్యప్ప దగ్గరకు బయలుదేరి వెళ్లారు. కొంతమంది తిరుపతి కొండకు వెళ్ళడంతో మిగిలిన వాళ్ళు ముందుకు సాగారు. ఇంకా ఒక రెండు మూడు రోజులలో బరిమలైకి వెళిపోతారు అనగా డిసెంబరు పదహారో తారీకున తెల్లవారు ఝామున ఒక ఇద్దరు స్వాములకు ఏది కొట్టిందో కుడా తెలియకుండా దెబ్బలు బాగా తగిలాయి. ఒక స్వామికి కొద్ది దెబ్బలు, మరొక స్వామికి కాలు విరిగి పోయింది. నాన్న హెల్ప్ లైన్ కి ఫోన్ చేసి, వాళ్ళని హాస్పటల్ కి పంపడానికి అన్ని ఏర్పాటులు చేసి ఒకరిని ఆ స్వామితో వుండి వాళ్ళ ఊరు తీసుకు వెళ్ళమని చెప్తే మిగిలిన వారిలో ఎవరు అందుకు ఒప్పుకోలేదంట. అందరూ హాస్పటల్ కి వెళ్లి వాళ్ళ వాళ్ళు వచ్చేవరకు వుండి తరువాత వెళ్దాము అంటే నడకన బయలుదేరి బస్సు ఎక్కడానికి ఇష్టం లేక అందరిని పంపి దెబ్బ తగిలిన స్వామి వెంటరమ్మని అడిగినా అంతా ఇబ్బంది లేకుండా చేశాను అని చెప్పి ఈయన ఒక్కరే నడక మొదలు పెట్టారు. ఆ రోజు సాయంత్రానికి ఒక యాభై ఎనిమిది కిలోమీటర్లు ముందుకు వచ్చారు. ఇంకో రెండు గంటలు నడిస్తే పెట్రోలు బంకు వస్తుంది అక్కడ వుంవచ్చు అనుకుంటుంటే సాయంత్రం ఏడు కి రోడ్డుకి నాలుగు, ఐదు అడుగుల దూరంలో నడుస్తుంటే ఏది కొట్టిందో కుడా తెలియకుండా పడిపోయారు. పడిన చోటుకి వండ గజాల దూరం వరకు కుడా ఎవరు ఉండరంట. కాని పడిన వెంటనే ఒకటి రెండు నిముషాల వ్యవధిలోనే ఇద్దరు కొద్దిగా పెద్ద పిల్లలు వచ్చారంట. దూరంగా పడిపోయిన ఫోను, చేతి కర్ర ఇమ్మంటే ఇచ్చి కొద్దిగా ఇవతలికి రమ్మంటే అప్పటికీ కాని ఈయనకు కాలు విరిగిన సంగతి తెలియలేదంట. వాళ్ళ సాయంతో విరిగి వేలాడిన కాలుతో కొద్దిగా రోడ్డు వైపుకి జరిగారంట. ఈలొపల ఓ పది మంది వరకు వచ్చారంట. హెల్ప్ లైన్ కి ఫోన్ చేయమని చెప్తే వాళ్ళలో ఒకరు ఫోన్ చేసారంట. తరువాత హాస్పటల్కి వెళ్ళేటప్పుడు వివరాలు అడిగితే నాన్న ఫ్రెండ్ పేరు చెప్పి ఫోన్ చేస్తే, ఫస్ట్ ఎయిడ్ చేసి పంపండి అని చెప్తే అంబులెన్స్ లో వాళ్ళు, వాళ్లకి ఫోన్ చేసిన అతనిని మీ కేర్ టేకర్ అని నాన్నకి చూపించారంట. హాస్పటల్ లో పక్కన ఒక లాయర్ పదివేలో, ఇరవై వేలో తెలియదు ఒక కట్ట డబ్బులు పొట్ట మీద పెట్టి తీసుకోమంటే డబ్బులు నాకు వద్దు అంటే ఎవరికైనా మంచి పనికి ఇవ్వండి అన్నారంట. మీ డబ్బులు నేను కాదు మీరే మంచి పనికి ఉపయోగించండి అపాత్ర దానం చేయవద్దు అని తిరిగి నాన్న ఇచ్చేసారంట. పక్కనే వున్న కేర్ టేకర్ అని చెప్పిన అతనిని అప్పటివరకు హాస్పటల్ మనిషి అనుకుని వివరాలు అడిగితే "మీకు దెబ్బ తగిలినప్పటి నుంచి అన్ని నేనే చేసాను" అని చెప్పాడంట. వెంటనే నాన్న నువ్వే నా దేవుడివి నీ ఫోన్ నెంబరు నా డైరి లో మొదటి పేజిలో రాయి అంటే కళ్ళవెంట నీరు పెట్టుకున్నాడంట. తరువాత అంబులెన్స్ కి డబ్బులు కట్టడానికి వెళ్లినంక ఇస్తాను అంటే కొద్దిగా నమ్మలేదంట. అతనే వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి రమ్మని అన్ని డబ్బులు కట్టేసి నాన్నకి చెప్పి తమ్ముడికి ఒక యాభైవేలు ఇచ్చి నాన్నతో పంపారు. వాళ్ళ ఫోన్ నెంబరు కాని, అడ్రస్ కాని, అకౌంట్ నెంబరు కాని ఇవ్వలేదు, అడిగితే తమ్ముడు ఇస్తాడు అని చెప్పి ఎంతో జాగ్రత్తగా పంపారు. వచ్చిన వాళ్లకు డబ్బులు ఇవ్వబోతే అస్సలు తీసుకోలేదు, వివరాలు చెప్పలేదు. డ్రైవర్ ఫోన్ నెంబరు బలవంతాన ఇచ్చాడు. ఒక లెటరు జాగ్రత్తగా చేర్చాము అని రాసి సంతకం చేయించుకుని కనీసం మంచినీళ్ళు కుడా తాగకుండా వెళ్ళిపోయారు. తరువాత నాలుగూ రోజులకు లాయర్ కి నాన్న ఫోన్ చేస్తే అతనే యాక్సిడెంట్ చేసింది అని నాన్న వాళ్ళు బయలుదేరిన వెంటనే అందరిలో ఒప్పుకున్నాడంట. పోలీసులు మళ్ళి వెనక్కి పిలిపిస్తాము అంతే వద్దు వెళ్లనీయండి అని చెప్పాడంట. నాన్న పోలీసులు అడిగితే ఎవరో, ఏదో కుడా చూడలేదు తెలియదు అని చెప్పారు. నిజంగా అతను ఒప్పుకోవాల్సిన అవసరం కుడా లేదు.
తప్పులు అందరూ చేస్తారు కాని తెలుసుకుని ఒప్పుకునే వాళ్ళు ఈ రోజుల్లో ఎంతమంది వున్నారో మన అందరికి తెలుసు. అమ్మానాన్నని చూడటం కుడా భారమనుకునే కొడుకులు, కూతుర్లు వున్న ఈ రోజుల్లో తప్పు తనవల్ల జరిగినా మాకు మా నాన్నని పువ్వుల్లో పెట్టి అప్పగించిన పేరు తెలియని ఆ మహానీయునికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఎవరికి ఏమైతే మనకెందుకు మనం బాగున్నామా లేదా అని, దానికోసం వావి వరుసలు చూడకుండా తమ స్వార్ధాన్నే చూసుకునే వాళ్ళున్న ఈ రోజుల్లో మానవత్వం మూర్తిభవించిన ఈ మానవతామూర్తికి తల ఒగ్గి పాదాభివందనం చేస్తున్నా!!

10, జనవరి 2011, సోమవారం

కొత్త సంవత్సరం...కొంగ్రొత్త ఆశలు

కొత్త సంవత్సరం గురించి ఇప్పుడు రాయాలంటే చాలా భయాలు, బెరుకులు,ఆనందం, ఆహ్లాదం...ఇలా ఎన్నో చుట్టుముడుతున్నాయి.
కోటి ఆశలతో కొంగ్రొత్త వత్సరానికి స్వాగత సుమాంజలితో...
చిగురాకుల పైనుంచి రాలిపడే మంచు ముత్యాల దండలతో...
హరివిల్లు అందాలతో...ధనుర్మాసపు హరిదాసుల వేకువ మేలుకోలుపులతో....
పచ్చని పేడకళ్ళాపులతో...తీర్చిదిద్దిన రంగుల రంగవల్లులతో...
ముగ్గుల్లో గొబ్బెమ్మలు..చుట్టూ కావ్యకన్నెల్ని తలపించే అందాల అతివలతో...
సరదాల సరాగాల పాటలతో...చలి మంటలతో...పసిడి రాశులకు ధీటైన ధాన్యపు రాసులతో..
గంగిరెద్దుల నాట్యాలతో....బుడబుక్కల వాని దీవెనలతో...కళలాడే పల్లెలు, పట్టణాలు....
సంకురాతిరి ముందు వచ్చే నూతన సంవత్సరం
సంక్రాంతి శోభతో.... దేదీప్యమానంగా అందరి ఇళ్ళలో కొత్త కాంతులతో...
ధగ ధగా మెరవాలని...శుభాలు కొలువు తీరాలని.....
ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.....

నా జ్ఞాపకాలు కొన్ని....మీ కోసం!!

నాకు గుర్తు వున్నంత వరకు అప్పట్లో నూతన సంవత్సరం వస్తోందంటే ఎవరికి ఏ సినిమా హిరో / హిరోయిన్ ఇష్టమో ఆ గ్రీటింగ్ కార్డులు కొని ఇవ్వడమో లేదా పోస్టు చేయడమో, నాకు గుర్తు ఉన్నంత వరకు మా చిన్నప్పటి స్కూలులో ఆ రోజు మా హెడ్ మాస్టర్ గారు ప్రయివేట్ క్లాసు పెట్టి యాపిల్ / బోకే ఇవ్వని వాళ్ళని కొద్దిగా కోపం గా ఏదోఒక వంకతో కొట్టడం, తిట్టడం. తర్వాత అది చెప్పుకుని మేము నవ్వుకోవడం...ఇక ఇంటిదగ్గర ముందు రోజు రాత్రి అమ్మతో, అక్కతో..ముగ్గులు వేయమని పోట్లాట. పొద్దున్నే అమ్మ ముగ్గుతో రాస్తే దానిలో రంగులు వేయడం అప్పటికి విచ్చుకున్న బంతిపూలు తుంపి అలంకారాలు చేయడం, అమ్మమ్మ చెప్పింది కదా ఈ ఒక్క రోజు చదివితే సంవత్సరం అంతా బాగా చదువుతామని బుద్దిగా ఇష్టమైన పుస్తకం oతీసి చదవడం, తొమ్మిది లో అనుకుంటా జనవరి ఒకటినే తిరుమలతిరుపతి దేవస్థానం వారు పెట్టిన పరిఖ్స రాయడం స్కూల్లో మూడో స్థానంలో రావడం ఆ ప్రసంసాపత్రంపై జూనియర్ సుముద్రాల గారి సంతకం, వీలైతే సినిమాకి చెక్కేయడం.....ఇక తర్వాత వచ్చిన గ్రీటింగ్ కార్డులు ఎవరివి ఎక్కువ అని లెక్కలు చూసుకోవడం.....నిజంగా ఎంతో సరదాగా సంతోషంగా గడిచిపోయేది ఆ కొత్త సంవత్సరం వచ్చిన రోజు. అప్పట్లో శుభాకాంక్షలు చెప్పుకున్నా మనసులో నుంచి ఆప్యాయంగా వచ్చినట్లు అనిపించేది, కాని ఇప్పుడు మొహమాటానికో, మొక్కుబడికో చెప్పుకుంటునట్లుగా అనిపిస్తోంది.....ఏదైనా కానివ్వండి రాబోయే కొత్త సంవత్సరం నుంచైనా అందరూ సంతోషంగా వుండాలని...ఆశలు, ఆశయాలు,కలలు,కోరికలు అన్ని ఈడేరి ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటూ మరొక్కమారు అందరికి ఇవే నా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.....
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner