30, జనవరి 2013, బుధవారం

నీవు వదిలిన గుర్తులతో....!!

మనసు మాటున దాగినావు....
మసక ఎన్నెల్లో కనుమరుగై పోయావు....
మబ్బుల చాటుగా తొంగి చూస్తున్నావు...
ఎందుకిలా దోబూచులాడుతున్నావు...??
ఆశల పల్లకీలెక్కి ఆకాశంలో విహారమన్నావు...
ఆనందపు తరంగాల్లో తేలియాడాలన్నావు....
చేయి వదలనన్నావు...చేజారి పోయావు...
శిలాక్షరాల్ని శిధిలాక్షరాలుగా చేసావు...
చేసిన బాసలు...చెప్పిన ఊసులు...
పంచుకున్న అనుభూతులు...
పెంచుకున్న మమకారాలు...
అన్ని నీటి మీది రాతలుగా చేశావు....!!
నీకేది గుర్తు లేదు....కానీ...
నీవు వదిలిన గుర్తులతో....మిగిలిన నేను...!!

29, జనవరి 2013, మంగళవారం

ఎందుకో మరి...!!

ఒంటరితనంతో ఏకాంతంలో
నీ ఆలోచనలతో సహవాసం...!!
ఊపిరి పీల్చలేని వత్తిటిడిలోనూ
నీ ఊహల తోనే స్నేహం...!!
అందరితో ఉన్నా...
నీతో మాత్రమే ఉన్న అనుభూతి...!!
ఎందుకో మరి...!!
అనుక్షణం నా తలపులు
నీ చుట్టూనే పరిభ్రమణం...!!
నువ్వు కాదన్నా...
నీతోనే నిరంతరం...!!
నే వద్దన్నా నను వదలని
నీ తలపుల పరిమళాలు
గుభాళిస్తూనే...ఉన్నాయి..!!
ఆ మత్తులో నను ముంచేస్తున్నాయి...!!
అలా ఉన్నా బావుంది....నీతోనే ఉన్నట్టుగా...!!

28, జనవరి 2013, సోమవారం

జ్ఞాపకంగా ఉంటే చాలు...!!

శిధిలమైన శిల్పాన్ని నేను
సజీవమైన జ్ఞాపకంగా నువ్వు
చిద్రమైన గుండెతో ఉన్నా....
చితికిన మనసుతో ఉన్నా...
నే జీవశ్చవాన్నైనా నాలో...ఇంకా...
జీవాన్ని నిలిపింది నువ్వే...!!
నే కృశించి నశించినా...
నాలో చెక్కు చెదరని
నీ జ్ఞాపకాలు మాత్రం...
జీవ కళతో ఉట్టి పడుతున్నాయి....!!
అందుకేనేమో....జ్ఞాపకంగా మిగిలితే చాలు...
జీవితాంతం అదే ఊపిరిగా బతికేయోచ్చు...!!

24, జనవరి 2013, గురువారం

ఎప్పటికి చెప్పని మనసు మాట....!!

ఎంతో ఆనందంగా ఉంది నా మనసుకి...ఈ రోజు చిన్నప్పటి నుంచి నాలో ఉన్న ఇష్టానికి అప్పటి నా ఇష్టానికి తెలియని కారణం ఇప్పుడు తెలుకున్నాను...అందుకే ఎంత తొందరగా నిన్ను చూద్దామా అని నీతో నా ఇష్టాన్ని చెప్పాలని నీ దగ్గరకి బయలుదేరాను...ఆత్రం ఆపుకోలేని మనసుని మురిపెంగా కసురుతూ నేను మాత్రం నీ ఆలోచనల్లో అలా పయనిస్తూ గతం లోకి వెళిపోయాను...ఎందుకో తెలియదు కానీ అందరికి నువ్వంటే ఇష్టం...నాకు బోలెడు ఇష్టం...అల్లరి చేస్తూ గల గలా సందడి చేసే నువ్వంటే ఇష్టపడని వారు చాలా తక్కువే...నీతో ఉన్నంత సేపు బావున్నట్టు ఉండేది అప్పట్లో అంత కన్నా ఇంకా ఏం తెలియదు కదా...!! ఐదు ఏళ్ళు కలిసున్న అనుబంధం విలువ అప్పుడు తెలియలేదు....దూరం ఐన తరువాత దగ్గరలేని నీతో పంచుకున్న మాటలు....ఆటలు...చదువులో పోటి..అన్ని గుర్తు వచ్చి మళ్ళి నువ్వు కనిపిస్తే బావుండు అని అనిపించేది ఎప్పుడూ....!! పది పదకొండేళ్ళప్పుడు చూసిన నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో....!! అప్పటి నుంచి నీ మీద పెరిగిన నా ఇష్టానికి ఓ అర్ధాన్ని ఇప్పుడు నీకు చెప్పాలని నా మనసు నేను ఇద్దరమూ ఎంతగా ఆరాట పడుతున్నామో...నీకు తెలియదు ఎందుకంటే...నువ్వు అందరితో ఒకేలా ఉంటావు...మరి అప్పటిలానే అలానే ఉన్నావో....లేక కాస్త మారావో నాకు తెలియదు...!!
సరేలే కాసేపట్లో తినబోతూ రుచెందుకన్నట్లు నీ దగ్గరకు రాబోతూ...నిన్ను చూడబోతు....చూడు నా మాట వినని మనసుకు...నాకు ఎన్ని ఆలోచనలో....!!
అన్నట్లు నన్ను చూడగానే గుర్తు పడతావో...!! లేదో...!! చూశావా ఎంత వద్దన్నా వదలడం లేదు నీ ఆలోచనలు...!!
అమ్మో అప్పుడే వచ్చేసాను....కొన్ని నిమిషాలలో నీ ముందు ఉంటాను...!!
అడుగుతూ వెళ్ళానా....చెప్పగానే ఆ మోహంలో చెప్పలేనంత ఆశ్చర్యం...!! నిజంగా నువ్వేనా...!! అప్పుడు ఇలా ఉండేవాడివి అస్సలు గుర్తు పట్టలేదు...చాలా మారిపోయావు...!! ఏం చేస్తున్నావు...?? ఎలా ఉన్నావు...?? అంటూ ప్రశ్నల వర్షం....ఏంటి ఇప్పుడా రావడం...!! ఇన్నిరోజులకి రావాలనిపించిందా...!! అంటే అందుకు చిరునవ్వే సమాధానం నా నుంచి....నా...నిన్ను చూసుకుంటూ...!! నిన్ను చూస్తే నాకనిపించింది అప్పటి చిన్నపిల్ల మనసే ఇప్పటికి నీదని...!!
చెప్పాలనుకున్న నా మనసు మాట నాలోనే దాగుండి పోయింది మౌనంగా...ఎందుకో మరి....!!
ఈ జన్మకు నిను చేరుకునే అదృష్టం లేకేమో...!! 

23, జనవరి 2013, బుధవారం

అందరూ బావుండాలి...!!

ఏవిటోనండి ఒక్కోసారి చిన్న విష్యమే పెద్దదిగా చేసుకుని అందరిని దూరం చేసుకుంటూ ఉంటాము....పిలవక పొతే ఎందుకు పిలవలేదు....?? పిలిస్తే అదిగో వాళ్ళని బాగా ఆప్యాయంగా పిలిచారు...నన్ను ఏదో పిలవాలని పిలిచారు....ఇలా ప్రతిదానికి వెదుకుతూ పొతే ఒక్కటి కూడా నిజాయితీగా అనిపించదు...తప్పులు వెదకడమే మన ధ్యేయమైతే....!! సరిపెట్టుకుంటే అన్ని బానే అనిపిస్తాయి....గొడవ పెట్టుకోవాలి అంటే సవాలక్ష కారణాలు కనిపిస్తాయి....ఏదో సామెత చెప్పినట్లు ఇష్టం లేకపోతె అమ్మ అని  పిలిచినా కూడా నీయమ్మ లా అనిపిస్తుంది....!!
ఉన్న ఈ నాలుగు రోజులు మనం అందరితో బావుంటే మనతో అందరూ బావుంటారు...కోపం రాదనీ రావద్దని చెప్పడం లేదు...కోపం రాక పొతే మనం మనుష్యులమే కాదు...మహర్షులు దేవుడే కోపానికి బానిసలు...ఇక మనమెంత చెప్పండి....!!
సాద్యమైనంత వరకు మనం అందరితో బావుంటే వాళ్ళు బావుంటారు.....చిన్న చిన్న కోపాలు అలుకలు లేక పొతేనేమో జీవితం చప్పగాను ఉంటుంది....అందుకే మనం బావుండాలి...అందరూ బావుండాలి...!!

22, జనవరి 2013, మంగళవారం

ఇప్పటికి ఎప్పటికి.....!!

పిలిస్తే పారిపోతావు
పిలవకపోతే పక్కనే ఉంటావు 
పలకరిస్తే పలకనంటావు
పలక్కపోతే అలుగుతావు 
రమ్మంటే రానంటావు
వద్దంటే పోనంటావు 
మాటాడమంటే మాటాడనంటావు
మాటలొద్దంటే మాటాడుతూనే ఉంటావు
అల్లరొద్దంటే అల్లరి చేస్తూ అలుకలు బోతావు
అల్లరి చేయమంటే సడి సేయక వడిలో వాలతావు
పెద్దైనా పసితనపు చాయలు అమ్మ దగ్గర
ఇప్పటికి ఎప్పటికి పసితనమే....అందరికి...!!

19, జనవరి 2013, శనివారం

మంచితనం ఈ రోజుల్లో...!!

మంచితనం ఈ రోజుల్లో ఇంకా మిగిలి ఉందనడానికి ఓ తిరుగులేని సాక్ష్యం....ఇది జరిగి తొమ్మిది పది నెలలు ఐ ఉండొచ్చు...అమ్మకు బాలేక ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది...కనీసం మాటలతో ఎక్కువగా పెనవేసుకున్న బంధమూ కాదు...అలా అని ఏదో కాస్త ఆహా ఓహో అనుకునే పరిచయం.. అప్పట్లో....పిల్లలకు మేము దూరంగా ఉన్నప్పుడు మా పిల్లలకు వాళ్ళ పిల్లలతో పాటుగా వాళ్ళు తినే అన్నమే పిల్లలు ఎంతగా విసిగించినా అన్నం పెట్టిన ఆత్మ బంధువులు...రా బందు(వు)లు ఇంట్లో తిని సొమ్ము హరించి విషం చిమ్మితే...ఏమి కాని ఈ ఆత్మ బంధువులు నా పిల్లలను వాళ్ళ పిల్లలతో పాటుగా చూసుకున్నారు...అప్పటికి నాకు వాళ్ళతో పరిచయం కూడా చాలా తక్కువే..!!
సరే అసలు విష్యానికి వచ్చేస్తున్నాను...అమ్మకు ఆపరేషన్కి అవసరానికి డబ్బులు కావాలా అని కూడా అడగకుండా నా దగ్గర ఇంత ఉన్నాయి ఎవరికి ఇచ్చి పంపించను అని ఫోన్ చేసి అడిగిన ఆ పలకరింపు ఎప్పటికి నేను మర్చిపోలేను...నా జీవితం లో నన్ను అలా అడిగిన మొదటి వ్యక్తి...!! కనీసం ఇప్పటి వరకు ఎవరూ అలా అడిగి ఉండరు...పిల్లడు చచ్చి బతికినా చూడటానికి రాని రాబందు(వు)లు...డబ్బు కోసం మాత్రం చేయి చాచారు...అది వాళ్ళ పద్దతి...వాళ్లకు ఉన్న దానిలోనే సాయానికి ముందుకు వచ్చిన మాస్టారికి, నాగూర్ బి కి ఏమిచ్చినా ఋణం తీరదు....ఒకప్పుడు రక్త సంబంధీకులే మాట్లాడిస్తే ఏం మీద పడుతుందో అని భయపడిన రోజులు ఉన్నాయి...ఒకరేమో అడగకూడదు కానీ అన్నీ బానే జరుగుతున్నాయి ఎలా చేస్తున్నారు అని అడిగిన రోజులు ఉన్నాయి....డబ్బు కోసమే అన్ని బంధాలు అనుకుంటున్న ఈ రోజుల్లో...మాటలు చెప్పి పబ్బాలు గడుపుకుంటున్న జనాలున్న ఈ సమాజంలో అన్న అక్క చెల్లి ఏమై పొతే నాకెందుకు వాళ్ళని అధ పాతాళానికి తొక్కైనా సరే వాళ్ళు నన్ను నా జీవితాన్ని బాగుచేసినా నాకేంటి నేను నా పెళ్ళాము నా కొడుకు నా పెళ్ళాం వైపు వాళ్ళు బావుంటే చాలు నాకు డబ్బులు వస్తాయి అనుకుంటే అమ్మా నాన్నని కూడా విడదీయడానికి వెనుకాడను అన్న ప్రపంచం లో పోల్చడానికి ఏ పదము లేని నికృష్టులున్న ఈ జనారణ్యంలో ఇలాంటి వారు ఇంకా మంచితనం నశించి  పోలేదు అని మనకు నమ్మకాన్ని కలిగిస్తున్నారు....!!
మనకి కోట్లు ఉండొచ్చు ఒక్కోసారి ఆ కోట్లే అక్కరకు రావు...కాకపొతే అవసరానికి ఓ ఓదార్పు దొరకదు అది డబ్బుతో కొనలేము కదా....!! మంచితనం మన రక్తంలో ఉండాలి కాని అవసరానికి నటిస్తే రాదు...అభిమానం...ఆప్యాయతా కూడా అంతే....మనసు లో నుంచి రావాలి కాని నటిస్తేనో డబ్బిస్తేనో దొరకవు...!!
అవసరానికి డబ్బు కావాలి కాని అదే పరమావధి కాదు ఈ జీవితానికి....!!

17, జనవరి 2013, గురువారం

పండుగ ఆనందం....!!


 అనుకోకుండా ఈ సారి సంక్రాంతి ఎంత బాగా జరిగిందంటే.....చిన్నప్పటి సరదాలు ఇప్పుడు లేక పోయినా....చదుకోడానికి పొద్దున్నే లేవని నేను ఆవు పేడ దొరకదని తెల్లవారు ఝామునే లేచి ఓ ఇద్దరు ముగ్గురిని పోగేసుకుని వెళ్లి ఆవుపేడ తెఛ్చి  గొబ్బెమ్మలు చేసి వాటికి ముగ్గు, పసుపు, కుంకుమ, పూల తో అలంకరణ చేసి అమ్మమ్మ వేసిన ముగ్గుల్లో అందంగా పేర్చి ప్రసాదం పెట్టి మళ్ళి ఎవరివి బావున్నాయో అని చూడటం...గంగిరెద్దుల ఆటలు..హరిదాసు కీర్తనలు...పొద్దున్నే గుళ్ళో ప్రసాదాలు...అలా ఆ రోజులు భలే బావుండేవి....!!
రాను రానూ ఒపికలు తగ్గిపోయి  పండుగ అంటే భయపడే రోజులు వచ్చేసాయి...ఇంట్లో అందరికి జలుబులు...జ్వరాలతో...ఈ సారి ఏదో పండుగ అయ్యిందనిపిద్దాంలే అనుకుంటే...మా కుటుంబం లోని అందరు సాయంత్రం మా ఇంటికి రావడం మా మామయ్య కూతురు భావన పాత కొత్త పాటలు పాడటం కరంట్ లేక పోయినా ఆపకుండా రెండు గంటలు అంత్యాక్షరి హుషారైన పాత కొత్త పాటలతో హోరెత్తించేసాము.చిన్నా పెద్దా తేడా లేకుండా...!! చిన్నప్పుడు పండగ అంటే మా పక్క ఊరిలొ టూరింగ్ టాకీసులో లో ఒక టికెట్ కి రెండు సినిమాలు వేసేవాళ్ళు....రెండు మైళ్ళు నడుచుకుని వెళ్లి మరీ సినిమాలు చూసేవాళ్ళం...ఈ సారి అంత కష్టం లేదు కాని పెద్ద వాళ్ళని కూడా తీసుకుని రెండో ఆట సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు....సినిమాకి వెళ్ళాము....!!
మరుసటి రోజు కనుమ కదా  తలా రెండు వంటలు వండి అందరమూ ఒక్కచోటే అంటే మా ఇంటి దగ్గరే భోజనాలు చేసాము..మా పెద్దమ్మ మా అమ్మమ్మ తాతయ్యలకు పెద్దవాళ్ళని బట్టలు పెట్టి గౌరవిస్తే...ఇక అందరమూ వాళ్ళ ఆశిస్సులు తీసుకున్నాము...!!
అవును  సంగతి చెప్పనే లేదు కదూ....భోజనాల్లో వెజిటబుల్ బిరియాని...మటన్..పందెపు కోడి..అన్ని కూరగాయలతో పచ్చడి...రసం...ఆలూ ఫ్రై...తీయని గడ్డ పెరుగు...భోజనం బావుంది కదూ....ఆఖరికి పిల్లల అందరిలో ఒక్కటే భావన....ఇప్పటి వరకు జరిగిన అన్ని పండుగల్లో ఇదే....మరిచిపోలేని సంక్రాంతి అని....ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి ఈ రోజుల్లో....!!
అన్ని మరచి పోయి హాయిగా గడచి పోయింది ఈ సంక్రాంతి...ఇంతకు ముందు మా కుటుంబంలో అందరు కలసినప్పుడు రాని వాళ్ళు ఈ సారి వచ్చారు...కలయిక ఆత్మీయకలయిక గా మిగిలి పోయింది మా అందరికి....!!

8, జనవరి 2013, మంగళవారం

నీ ప్రతిరూపమే....!!

నీ చిత్రాన్ని గీయాలనుకున్నా....!!
ఎలా వేస్తె నీకు నచ్చుతుందో...!!
నిన్ను నీలానే గీయనా...!!
లేక నాలో ఉన్న నిన్ను చిత్రించనా...!!
పంచెవన్నెల రంగులు లేవు నా దగ్గర....
చీకటి వెలుగుల రంగులలో...
నా ప్రేమను రంగరించి...
ఆకాశమంత కాన్వాసుపై
చిత్రించిన నీ చిత్రం.... చూసావా...!!
నీ అందం నా చిత్రంలో లేకపోయినా...
నే వేసిన నీ బొమ్మ.....
నా మదిలో చెరిగి పోని...
నీ ప్రతిరూపమే....!!

7, జనవరి 2013, సోమవారం

తేడా.....!!

అబ్బాయిలకేం ఇంచక్కగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళిపోతారు.....ఏ బాదరబంది లేకుండా...!! అదే అమ్మాయి ఐతే పెళ్లి కాక ముందు అమ్మా నాన్న పర్మిషన్ తీసుకోవాలి....పెళ్లి అయితే మొగుడి పర్మిషన్...తరువాత పిల్లల పర్మిషన్ కూడా తీసుకోవాలి...అప్పుడప్పుడు....!! ఏం చేస్తాం సృష్టి కర్త కూడా మొగవాడే కదా....అందుకే తేడా చూపించాడు తన సృష్టి లో కూడా....!!
ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉన్నా వదిలేసి వెళిపోగలడు మగాడు...అమ్మాయి వెళ్ళలేదు...ఎంత ముఖ్యమైన అవసరమైనా....ఇంటిని పిల్లల్ని వదిలి వెళ్ళలేదు...!! అదీను ఎక్కడికి వెళుతున్నాడో చెప్పనక్కరలేదు...అబ్బాయి..!! ఎంత వెసులుబాటో కదా...అబ్బాయికి...!! అదే అమ్మాయి ఐతే ఎన్ని ప్రశ్నలో....ఎన్ని ఆరాలో...!!! బయటికి వెళ్ళాలంటే...!!
ఏ పని చేయాలన్నా కూడా ముందుగా అందరి దగ్గరా ఆమోదముద్ర వేయించుకోవాలి అమ్మాయి...!!
అబ్బాయికైతే....నాకు అనిపించింది...నేను అది చేసేసాను...అని చెప్పేస్తే అబ్బో వాడు అది చేసేసాడంటా...వాడికి చాలా ధైర్యం అని గొప్పగా చెప్తారు...!!
అందరూ కాదండి కాని చాలా మంది ఇలానే ఉన్నారు ఇంకా...!!
ఎందుకో ఈ తారతమ్యం...ఎప్పటికి మారుతుందో....ఈ పరిస్థితి....!!

పిచ్చి ముదిరి....అయినట్లు...!!

ఎందుకండీ మరీ ఇంత దౌర్భాగ్యపు ఆలోచనలు చేస్తున్నాము....కనీసం కాస్తయినా మానవత్వం లేకుండా...!! నిన్న ఒక టపాకి కొన్నికామెంట్లు చూసాక రాయకుండా ఉండలేక పోతున్నాను...
చనిపోయిన నిర్భయ గురించి...జరిగిన దారుణం గురించి....!!

మనది......... భరతభూమి...ఖర్మభూమి...వేదభూమి..!!
ఎక్కడో వేరే దేశాల్లో వాళ్ళు అలా ఉంటున్నారు...ఇలా ఉంటున్నారు....మనం కూడా అలా ఉంటే తప్పేంటి...??
తప్పేం లేదు మంచిని ఎక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు...కాకపొతే తెలివి వెర్రి తలలు వేస్తున్న ఈ రోజుల్లో చెడుని మాత్రమే తీసుకుంటున్నాము...మంచిని వదిలేస్తున్నాము...!!

వర్ధమాన దేశాల్లో కూడా ఇష్టం లేకుండా ఏమి చేయరు....అలా చేస్తే అది చాలా పెద్ద నేరం..!! మేం చాలా ముందు ఆలోచనలు చేస్తున్నాము...మిగిలిన అందరు వెనుకబడిన వారు...మా అంత దూరపు ఆలోచనలు చేయలేరు...మేము చాలా విశాల....హృదయులము అని అనుకునే మీకు పాపం ఈ విష్యం తెలియదా...!!

ఏం అబ్బాయిలు సహజీవనం...చెత్తా..చెదారం అంటూ వాళ్లకి ఇష్టం వచ్చినట్లు ఉండటం లేదా.!! జరిగిన దారుణం గురించి మాట్లాడకుండా ఆ అమ్మాయి తన ఫ్రెండ్ తో డేటింగ్ కి వెళితే తప్పు లేదు....వాళ్ళు రేప్ చేస్తే తప్పేంటి...??
డేటింగ్ చేసే వాళ్ళని ఏం చేసినా తప్పు లేదు అన్నట్లుగా ఉంది...!! ఎవరి అబిప్రాయాలు వాళ్లకి ఉంటాయి... కాని...మన ఇష్టాన్ని...అభిప్రాయాల్ని ఎదుటివారి మీద రుద్దడం ఎంత వరకు సమంజసం...ఒక్కసారి ఆలోచించండి...!!
ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు...అమ్మాయి తనకి నచ్చిన పని చేస్తే తప్పు...అదే అబ్బాయి ఏం చేసినా పర్లేదు....ఇదేం న్యాయమండి...??
మనం జనారణ్యం లోనే ఉన్నామని మరొక్క సారి ఋజువైంది...జనారణ్యం మాత్రమే కాదు రాక్షస నీతిని సమర్ధించే జనరాక్షసుల మద్యలో ఉన్నామని నిరూపిస్తున్నారు....!!
జరుగుతున్న దారుణాలకి స్పందించక పోయినా పర్లేదు కాని...కాస్తయినా మానవత్వంతో ఆలోచించండి...!! లేదంటారా....కూర్చోండి..అంతే కాని మీరు మనుష్యులని మరచి పోకండి....!!

6, జనవరి 2013, ఆదివారం

మన'సెల్లి' ... పోయింది....!!

చలనం గమనమై
గమనం గమ్యమై
సాగే ప్రయాణం నీ కోసం....!!
అక్షరాలు పదాలై
పదాలు వాక్యాలై
వాక్యాలు కావ్యాలై
వెదుకులాడెను నీ కోసం....!!
మనసులోని నిన్ను
కనులతో చూద్దామంటే....!!
నా మనసే...ఖాళీగా ఉంది....!!
ఎక్కడా అని చుస్తే...!!
ఎప్పుడో వెళిపోయింది
నాకు తెలియకుండానే....నీ కోసం...!!

4, జనవరి 2013, శుక్రవారం

నీ కోసం నేనెందుకిలా..!!

ఎక్కడో తెలియని తీరం....
నీ చుట్టూ తిరిగే నా ఆలోచనల్లా...!!
దరి అంతే లేని సంద్రం....
నీ మనసు నాకు తెలియనట్లే..!!
సముద్రాన్ని తాకే ఆకాశం దూరంగా...
చూడటానికి బావుంటుంది నీలాగా...!!
నింగి నేలా కలవలేవు....కలుసుకోవాలని ఉన్నా...
సంద్రాన్ని తాకలేని ఆకాశం...
ఎప్పటికి అలానే ఉంటుంది తాకినట్లుగా....!!
నా ఆలోచనలు నీ చుట్టూ తిరగక మానవు....
నే జీవించి ఉన్నంత వరకు..!!
ఈ జన్మకు తెలియదు నీ మనసు....!!

2, జనవరి 2013, బుధవారం

నాలుగో పుట్టినరోజు....!!

మొత్తానికి అదిగో ఇదిగో అంటూ నాలుగో పుట్టినరోజు చేసుకుంటోంది నా బ్లాగు...తీపి చేదు కబుర్లు కాకరకాయలతో...నాకు రాయాలనిపించిన కవితలతో...!!
నా కబుర్లను కవితలను....మొత్తంగా నా రాతలను అభిమానిస్తున్న...ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు....!!
బ్లాగు మొదలెట్టి నాలుగేళ్ళు అయినా రాయడం మొదలు పెట్టి మూడు ఏళ్ళు పూర్తి అయింది...తారిఖు గుర్తు లేదు కాని జనవరి నెల అని గుర్తు కాబట్టి ఈ నెలంతా నా బ్లాగు పుట్టినరోజే....!!
మా ట్రస్ట్ కోసం బ్లాగు మొదలెట్టి నాఆలొచనలు పంచుకుందామని...
నాలోనేను అని పేరు పెట్టి..చాలా ఉన్నాయి ఆ పేరుతొ....అని మళ్ళి కబుర్లు కాకరకాయలుగా రూపాంతరం చెందిన నా బ్లాగు ఇలా నాలుగో పుట్టినరోజు చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది...ఎందుకంటే...ఇన్ని టపాలు రాస్తానని కాని...ఇంత మంది చూస్తారని కాని...అభిమానిస్తారని కాని..అనుకోలేదు...ఏదో నాకు అనిపించింది రాయడం తప్ప చేయి తిరిగిన రచయితను కాదు...నా కోపాన్ని రాయడం...ఉత్తరాలు రాయడం తప్ప రాయడానికి వేరే ఏమి రాదు...!!
ఆవేదనను...ఆక్రోశాన్ని...సంతోషాన్ని...బాధను...ఇలా ప్రతి అనుభూతిని పంచుకునే ప్రియ నేస్తం..అదే నాకు నా బ్లాగుతో ఉన్న అనుబంధం...!!
మరి నాకు ఇంత ఇష్టమైన నా కబుర్లు కాకరకాయలు కి మీ అభినందనలు చెప్పరూ...!!

1, జనవరి 2013, మంగళవారం

ఏమైందో మరి అప్పుడు నాకు...!!

ఇది చాలా రోజుల క్రిందటి మాట....నాకు బాగా కావాల్సిన ఫ్రెండ్ వాళ్ళ ఆయనకి ఏదో తెలియని ఆరోగ్య ఇబ్బంది వచ్చింది...అప్పటికే చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నారు..తను ఫోన్ చేసి చెప్పి బాధ పడింది..వాళ్ళు చికాగో లో ఉన్నారు అనుకుంటా అప్పుడు. నేను హంట్స్విల్ లో ఉన్నా...నా ఫ్రెండ్స్ తో కలిసి అప్పుడప్పుడు చర్చ్ కి వెళుతుంటాను..చిన్నప్పటి నుంచి కూడా అలా నాకు వెళ్ళాలని అనిపించినప్పుడు వెళుతుంటాను...నాకు ఆ దేవుడు ఈ దేవుడు అని తేడా ఏం లేదు...ఎక్కడికైనా వెళుతుంటాను..చిన్నప్పుడు పాటల కోసం ఆదివారం చర్చ్ కి వెళ్ళేదాన్ని...సరే అసలు విష్యానికి వస్తే...నా ఫ్రెండ్ వాళ్ళ గురించి బాధ వేసింది...ఎందుకో నా ఫ్రెండ్ రేఖ కి ఫోన్ చేసి మీరు చర్చ్ కి వెళ్ళేటప్పుడు నేను వస్తాను అని చెప్తే వాళ్ళు వెళ్తూ నన్ను తీసుకు వెళ్లారు...ఎందుకో తెలియలేదు కాని నా ఫ్రెండ్ వాళ్ళు బావుండాలి..ఆ అబ్బాయికి పూర్తిగా తగ్గిపోవాలి...ఇలా వాళ్ళ గురించే అనుకున్నాను..అప్పుడు ఆ టైం లో నా కళ్ళ వెంట నీరు కారుతూనే ఉంది...ఎందుకో తెలియలేదు....ఏమైందో మరి అప్పుడు నాకు...!! ఇప్పటికి అది గుర్తు వస్తే ఎందుకలా ఐందా అనిపిస్తుంది...!!
ఏది ఏమైనా నా ఫ్రెండ్స్ మాత్రం బావున్నారు...!!

అందరికి.....!!

పాత కొత్తల మేలు కలయికలో....
రాబోయే కొత్త సంవత్సరం....!!
ప్రతి ఒక్కరికి ఆనందాన్ని పంచాలని...
చిరునవ్వుల ముత్యాలు ప్రతి ఇంటా...
వెల్లువలై పారాలని....
ఆహ్లాదపు జల్లులతో....
సంతోషం నిండాలని...
  అందరికి హృదయపూర్వక నూతన ఆంగ్ల సంవత్సర శుభాభినందనలు....!!



Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner