30, జులై 2013, మంగళవారం

తెలుగు ఇలా అయిపొయింది...!!




తెలుగుని అభిమానించే బాలు గారు కీరవాణి గారు నిన్నటి పాడుతా తీయగా లో attitude కి అర్ధం మర్చిపోయారు...
వారే ఇలా అయిపోతే ఇక మనలాంటి వాళ్ళ సంగతి ఏంటి..? ఎవరో దృక్పధం అని చెప్పారు సమయానికి.... నడవడి అయినా సరిపోతుంది..... బాలు గారు పాటలే కాదండి తెలుగు కూడా గుర్తు ఉంచుకోండి అప్పుడప్పుడు ఇలా అవసరం అవుతుంది....!! ఇది ఎవరిని కించపరచడానికి రాసింది కాదు.  

ఇకనైనా మారండి....!!

తెలంగాణా ఇచ్చేస్తారంట  తన్నుకు చావండి.....!! విడగొట్టాలన్నా  ఉంచాలన్నా రాజ్యాంగ పరిధులు అక్కర లేదు, తీర్మానాలు, ఆమోదాలు ఎవరివి అక్కరలేదు..అమ్మగారు ఎంత చెప్తే అంత...సి డ బ్యూ సి సబ్యులంతా కలిసి ఏక వాక్య తీర్మానం చేసే అవకాశం అమ్మగారికి ఇస్తారంట...ఆవిడ గారు కేక్ కత్తిరిస్తారంట... అందరు చప్పట్లు మాత్రమే కొట్టండి...ఇక తెలంగాణా నాయకులంతా కాంగెస్ లోకి దూకండి...విజయశాంతి ముందు వరుసలో ఉంటుంది.. చిరంజీవి గారు దారి చూపారు కదా....!! వీరు అదే దారిలో పోతారు. ఇంకా చాలా మంది ఉన్నారు లెండి కె సి ఆర్ గారితో సహా....

పంచాయితీ ఎన్నికల ఫలితాలకు భయపడి ఇప్పటికిప్పుడు నిర్ణయాలు చేయడంలో నీతి సీమాంద్ర నేతలకు ఇప్పటికయినా అర్ధం అయితే జరగనున్న మిగిలిన పంచాయితీ ఎన్నికలను కాంగెస్ కు వ్యతిరేకం చేయండి...!! కనీసం ఇప్పుడయినా మీ రాజకీయ లబ్ధిని చూసుకోకుండా నిజాయితీగా ఆంద్ర రాష్టం కోసం పనిచేయండి పార్టీలకు అతీతంగా....!! ఇప్పటికయినా కళ్ళు తెరవండి...!! నాయకులే కాదు.. ఓటర్లు మీరు కూడా డబ్బుకు అమ్ముడు పోకుండా మనకోసం ఓటు వేయండి స్వార్ధ నాయకులకు బుద్ది చెప్పండి. 

ఏం మాయ సేసావో...!!

పొద్దు వాలి పోయింది
చీకటింటికి చేరింది
సుక్కల ఎలుగులో ఎక్కడని ఎతికేది
మబ్బుల మాటున దాగిన చల్లనయ్యను...!!
నిశి రాతిరి చీరని నక్షత్రాల మసక ఎలుగులో
అక్కడక్కగా అద్దుకున్న చుక్కలు... 
ఎక్కడో దూరంగా చిన్న తారక
అది నా మావ రూపేమో....!!
ఏ దిక్కునసూసినా ఏ పక్కకు ఎతికినా
నీ రూపే కాన వస్తోంది
నీ తలపే సుట్టు ముడుతోంది
ఇది మనసు సిత్రమో
మనిషి మాయో తెలియకుంది...!!
ఏం మాయ సేసావో...!!
ఏ మత్తు సల్లినావో...!!
ఎరికైతా లేదు.

29, జులై 2013, సోమవారం

ఇంతకీ ఎవరు నువ్వు...??

ఎందుకు ఇష్టమో చెప్పనేలేదు నువ్వు
ఎంత ఇష్టమో మాత్రం తెలియచెప్పావు...!!
ఊహలతో సహవాసమే అన్నావు
ఊపిరిగా మారమంటున్నావు...!!
మనసుకే బందీని అన్నావు
మనిషినే కట్టి పడేశావు...!!
కాలంతో పోటి పడలేనన్నావు
నా కాలమంతా నువ్వే తీసుకున్నావు...!!
మాటలే రావన్నావు మౌనమే నువ్వన్నావు
మౌనంతోనే మాటల గారడీలు చేశావు..!!
అన్ని మరచి పోతానన్నావు
మరుపన్నదే లేకుండా చేశావు నాకు...!!
ఇంతకీ ఎవరు నువ్వు...??

28, జులై 2013, ఆదివారం

ఈ తెలివి చూసారా.....!!

మొదటి విడత పంచాయితీల్లో వెనుకబడిపోయామని కొత్తగా మళ్ళి మరో ప్రహసనం మొదలుపెట్టి రెండో విడత ఎన్నికల ఓట్ల కోసం తద్వారా సీట్ల కోసం అమ్మగారు చేసిన ప్రయత్నం కాస్త సఫలం అయ్యింది...మొత్తానికి  తెలంగాణా ఇస్తున్నాము రండి అంటూ మరోసారి జనాలను మోసం చేస్తున్న రాజకీయ చరురతను అర్ధం చేసుకోగలిగిన వాళ్ళు ఎంతమంది మనలో ఉన్నారు....??  చేతులెత్తండి మరి... -:).
మింగ మంటే కప్పకు కోపం వదలమంటే పాముకు కోపం....!! మరి ఏం చేయాలి చెప్మా...ఇలా ప్రాంతాలలో చిచ్చులు పెట్టి ఆడుకోవాలన్న మాట. చూసారా ఎంత తెలివో... అత్తగారు ఉంటే కోడలమ్మ తెలివి చూసి ఎంత సంబర పడిపోయేదో....పాపం...!! ఇక్కడ పాము కప్పల్లో దేనికి బలం ఎక్కువో చూసి దాని వైపు వెళ్ళాలి ఇది అంతే...లాభం ఎటో, ఎంతో చూసుకోవడమే...!!
తెలంగాణా ఇస్తామంటే సిమాంద్ర నేతలు ఊరుకోరు...ఇవ్వమంటే తెలంగాణా నేతలు ముఖ్యంగా అప్పుడప్పుడునే...వేరే ఏ వ్యాపకం లేనప్పుడు జనాలు తనని మర్చి పోతున్నారేమో అని అనుకుంటూ మా తెలంగాణా ప్రజలు వెనుకబడిపోతున్నారు అని గుర్తు చేసుకునే కె సి ఆర్ గారు అస్సలు ఊరుకొరు....మళ్ళి ఎన్నికల వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది....మనమూ చూడటం తప్ప ఏమి చేయలేము కదా...ఇష్టమైతే ఓటు వేస్తాం అంత కన్నా చేయగలిగినది మాత్రం ఏముంది...!! ఇది ఇలా సాగుతూనే ఉంటుంది మనం నాయకులను నమ్మినన్ని రోజులు...కొత్తగా మార్పేం ఉండదు....!! ఎటొచ్చి నాయకులు ఖాళి చేసిన ఖజానాలు నింపడానికి మనకు సంబంధం లేని కరంట్ బిల్లులు కడుతున్నట్లుగానే, రోజు పెరిగే ఇంధన ధరలను... ఇలా దేనిని ఆపలేం...!! 

27, జులై 2013, శనివారం

నీ ప్రేమకు నా కానుకగా...!!

ఎందుకోయి అంత ప్రేమ
చెప్పలేని మనసు ఊసులు
మౌనమైన మాటల దొంతర్లు
పలుకలేని గుండె గొంతుక
మూగబోయిన మధుర స్వరమూ....
చెప్పకనే చెప్పాయి అన్నింటా
నీ ప్రేమే నిండి ఉందని...
చెలిమి ఎప్పటిదయినా తీయనని
జన్మ జన్మల బంధమని
దూరమన్నది లేదని
జంటగ వీడినా జతగ తోడుగా 
జీవితమంతా నీకే...
జన్మంతా నీతోనే...
ఇది చాలదా....!!
నీ ప్రేమకు నా కానుకగా...!!

26, జులై 2013, శుక్రవారం

ఆ ఆలోచనే....!!

సీతమ్మలో రాముడు ఉన్నాడు కదా...!! మరి కనిపించలేదు అంటారేంటి..?? సీతమ్మ జీవితం అంతా రాముడే నిండి
ఉన్నాడు కదా...!! సీతమ్మ జీవితమే రామాయణం అయినప్పుడు రాముడు లేకపోవడమేంటి...?? అప్పుడు రామాయణానికే అర్ధం లేకుండా పోతుంది. జనం కోసం రాముడు కానీ రాముడి కోసమే సీత....అందుకే నాకు సీతమ్మ అంటేనే ఇష్టం...రాముడంటే కోపం...!! ఎంత ప్రేమ గుండెల నిండా ఉన్నా చూపలేని రామయ్య మనసులోనే దాచుకున్నాడు జనం కోసం...!! తండ్రి మాట కోసం కానలకేగిన రామయ్య అందరికి ఆదర్శమే కాని రాముని కోసం అన్ని వదిలి తన వెంట నడిచిన సీతమ్మ, లక్ష్మయ్య రాముని కన్నా ఎక్కువ నాకు. రామయ్య జీవితంలో అందరు ఉన్నారు కాని సీతమ్మకు రాముడే జీవితం...!! కానలకేగినా, కారడవుల వెంట నడిచినా, అశోకవనంలో ఉన్నా రామయ్యే సీతమ్మ లోకం...బంగరు లేడిని చూసి ముచ్చట పడినా, మునివాటికలను చూడాలని కోరినా రామయ్యతోనే ఉండాలనుకుంది కాని ఒంటరిగా కాదు...రామయ్య గొప్పతనం చూపించడానికే ఆ కోరికలు సీతమ్మ కోరింది ఆనాడు....లేక పొతే రామాయణము లేదు ఉత్తర రామాయణము లేదు...!!
రామాయణమైనా, భారతమైనా, భాగవతమైనా...ఏ పురాణమైనా, ఏ ఇతిహాసమైనా, చరిత్ర అయినా, కధలైనా, కవితలైనా, పద్యాలైనా, కావ్యాలైనా, చాణుక్యుని అర్ధ శాస్త్రమైనా, కౌటిల్యుని నీతి అయినా, మను చరిత్రయినా, శృంగార నైషధమైనా...ఇలా ఏది తీసుకున్నా మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. ప్రపంచంలో మరెక్కడా లేని ఈ పద సంపద మన భారతీయుల సొంతం. ఎంతోమంది మన సంస్కృతీ సంప్రదాయాలను, వివాహ వ్యవస్థను గౌరవిస్తుంటే మనం మాత్రం దూరపు కొండల వెంట అలుపెరగక పరుగులు తీస్తూ అదే జీవితం అనుకుంటున్నాము. బంధాలకు, కుటుంబ విలువలకు వలువలు తీసేస్తూ డాలర్ల నాగరికత కోసం పరుగులు తీస్తున్నాము....అదే జీవితం అనుకుంటున్నాము...బతకడానికి డబ్బులు కావాలి కాని బతుకే డబ్బులు అయిపోతున్నాయి ఇప్పుడు...!! వీటి ముందు ఏది సరిపోవడం లేదు....!! మనమే ఇలా ఉంటే మరి మన తరువాతి తరాలు ఇక ఎలా ఉంటాయో....!! 

24, జులై 2013, బుధవారం

ఒంటరితనంలో ఏకాకి.....!!

మనం ఎదుటి వారికి ఏది ఇస్తే మనకు అదే తిరిగి వస్తుంది కొన్ని సార్లు...అన్ని సార్లు కాదండోయ్ మళ్ళి పొరపాటు
పడకండి...అపాత్ర దానం అనేది ఒకటుంది అది చేస్తే మాత్రం మనకు వచ్చేది ఇచ్చిన దానికి వ్యతిరేకం మాత్రమే..దానిలో ఎటువంటి పొరపాటు లేదు. మనం కోపాన్ని చూపిస్తే కోపమే మనకు తిరిగి సమాధానంగా వస్తుంది....కాని  గాంధి గారిలా శాంతం మనకు దొరకదు. కొంత మందికి పిన్న వయసులోనే పెద్ద మనసు ఉంటే కొందరు ఎన్నో అనుభవాలను జీవితపు ఆటుపోట్లను చూసిన పండు వయసులోకూడా కోపతాపాలు చిరాకులు చిందులు వగైరా వేస్తూ ఉంటారు....అది ఎందుకో తెలియని అభద్రతా భావం అనిపిస్తూ ఉంటుంది....అందరూ  అనుకుంటున్నా ఇలాంటి ప్రవర్తనతో అందరికి దూరమౌతూ ఒంటరిగా ఉండటానికి అలవాటుపడి ఎవరి పొడ గిట్టకుండా ఒక్కరిగా బతకడానికి ఇష్టపడుతూ ఎవ్వరు చూడటం లేదని అనుకుంటూ అదో రకమైన భ్రమలో బతుకుతుంటారు....ప్రేమను అభిమానాన్ని పంచితే దానిలో కూడా ద్వేషాన్ని వెదుక్కుంటూ ఒంటరితనానికి తోడుగా ఏకాంతాన్ని తెచ్చుకున్నా అన్న భ్రమలో ఎవ్వరికి ఏమి కాని ఏకాకిలా మిగిలి పోతున్నామని అనుకోకుండా ఆ జీవితమే చాలా బావుంది అనుకునే మనస్తత్వాన్ని ఏమనుకోవాలి...?? మన జీవితం మన ఇష్ట ప్రకారమే ఉండాలి కాని కనీసం మన కోసం ఆలోచించే వారిని కష్ట పెట్టకుండా ఉంటే చాలు అనుకుంటే అందరి జీవితాలు హాయిగా ఉంటాయి. పిల్లలయినా పెద్దలయినా నేను అన్న అహం వదలి మేము అన్న అనుబంధం పెంచుకుంటే జీవిత అనుబంధం అందంగా ఉంటుంది...తరువాతి తరాలకు ఆదర్శంగా ఉంటుంది.....!!

23, జులై 2013, మంగళవారం

గ్రామాలకు పండగ కళ వచ్చేసిందోచ్చ్.....!!

మొత్తానికి పల్లెటూళ్ళలో పండగ వాతావరణం వచ్చేసింది పంచాయితీ ఎన్నికల పుణ్యమా అని....మాంచి సందడి సందడిగా హడావిడిగా ఎక్కడా లేని కంగారు అంతా ఇక్కడే కనిపిస్తోంది...ఏ  ముగ్గురు కలిసినా ఎన్నికల కబుర్లే వినిపిస్తూ అందరి గొంతుల్లోను ఏదో తెలియని హుషారే....!! ఎక్కడయినా బావ కాని వంగతోట  కాదు అన్న సామెతలా ఎంత అయిన  వాళ్ళయినా ఎన్నికల్లో మాత్రం ప్రత్యర్దులే...!! ఏ బంధమయినా పంచాయితీ ఎన్నికల్లో బలాదూరే...!! ఇక్కడ పార్టీలకన్నావ్యక్తుల మద్య పోటినే ఎక్కువ. ఊళ్ళలో బలాబలాలు తేల్చేది ఈ ఎన్నికలే....అందుకే మిగిలిన ఎన్నికల కన్నా పంచాయితీ ఎన్నికలే అధిక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటున్నాయి...!! ఎప్పుడు కనిపించని వారందరు కనిపిస్తుంటారు... వరుసలు వావిలు గుర్తుకు తెచ్చుకుంటూ బంధుత్వాలు కలుపుతారు...ఇన్ని సంవత్సరాలు ఊరు ఎలా ఉన్నా ఊరిలొ తాగునీరు లేకపోయినా... ముసలి ముతకా ఇన్నాళ్ళు పలకరించే దిక్కులేక అల్లాడినా పట్టించుకోని వారు ఈ నాలుగు రోజులు మాత్రం ఎంత జాగ్రత్తగా పలకరిస్తారో....!! బడా నాయకుల లక్షణాలు పుణికి పుచ్చుకుంటూ వారి అడుగు జాడల్లో నడుస్తూ వాగ్దానాలు చేస్తూ అయ్యలకు అమ్మలకు ఎందులోనూ మేమూ తీసిపోమంటూన్నారు.  ఓటర్లు అంతే ఉన్నారులెండి ఇప్పుడు యధా రాజా తధా ప్రజా అన్నట్టు అందరి దగ్గరా డబ్బులు దండుకుంటూ కావాల్సిన వాళ్ళకి ఓటేసి గెలిపిస్తూ వాళ్ళ లాభం వాళ్ళు చూసుకుంటున్నారు.
ఇప్పటి ఓటరు తెలివైనవాడినే అనుకుంటూ తన ఆ క్షణం లాభం చూసుకుంటూ తరువాతది మరచిపోతున్నాడు...ఓటు అమ్ముకోండి తప్పు లేదు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకండి....!! మీ గురించి ఆలోచించుకుంటూ మీ ఊరి బాగు గురించి తద్వారా జిల్లాలు...రాష్ట్రాలు...దేశం ఏమౌతుందో అని కాస్త ఆలోచించి ఓటుని వినియోగించండి...మనకు ఎవ్వరూ ఊరికినే పధకాలు అమలు లేదు మన డబ్బులే అన్ని...ఎవ్వరి మాటలకు మోసపోకుండా మీ ఓటుని వేయండి... మీరు వాళ్ళ కన్నా  తెలివి కల వాళ్ళని నిరూపించుకోండి ఓటరు దేవుళ్ళు....గ్రామ స్వరాజ్యమే దేశ సంపద అని  గుర్తు చేయండి మన నాయకులకు... -:)

22, జులై 2013, సోమవారం

బురద కూడా బావుంది.....!!

చాలా సంవత్సరాల తరువాత బురదలో నడిస్తే ఎందుకో కాని చాలా బావుంది.....చాలా ఆత్మీయంగా తాకుతున్నట్టుగా అనిపించింది. చిన్నప్పుడు బురదలో నడుస్తూ పడిపోయిన రోజులు  వచ్చాయి....ప్రకటనల్లో చూసినట్లు మరక కూడా మంచిదే అన్నట్టుగా బురద కూడా బావున్నట్లు అనిపించింది కాని అమ్మో బురదా...!! అని చీదరగా అనిపించలేదు. చిన్నప్పుడు వర్షం వస్తే కూడా బడికి వెళ్ళాలని బయలుదేరి ఆ వానలో బురద నీళ్ళలో ఎన్ని సార్లు పడుతూ లేచామో గుర్తు చేసుకుంటుంటే  ఎంత బావుందో ఇప్పుడు....!!
ఇప్పుడు కూడా బురదలో అడుగులు పడిపోకుండా వేస్తూ వుంటే చిన్నప్పటి ఆ బురదలో నడుస్తూ  పడిన జ్ఞాపకాలు గుర్తు వచ్చి చటుక్కున నవ్వు పెదవులపైకి వచ్చేసింది...అందరు అరుగుల మీద కూర్చుని ఉన్నా కూడా పాములు అక్కడే చాలా సేపు ఆడుతూ ఉంటే చూడటానికి భలే బావుంది. వాన నీళ్ళలో వేసిన రకరకాల కాగితం పడవలు అవి తొందరగా పోతూ ఉంటే సంతోషంతో కొట్టిన కేరింతలు, మునిగి పోతుంటే అయ్యో అంటూ మునగకుండా చేసిన ప్రయత్నాలు, రాలిన నేరేడుకాయలు ఏరుకున్న జ్ఞాపకాలు ఇలా ఎన్నో జ్ఞాపకాల గురుతులు ఈ బురదనేలలో ఇమిడి మరుగున పడిపోతున్నాయి.....
మనసుకు బురద అంటితే కష్టం...మన కాలికి బురద అంటితే ఇబ్బంది ఏమి లేదు....చీదరగా అనిపిస్తే కాళ్ళు కడుక్కుంటే బురద పోతుంది కాని మనసుకంటిన బురదని ఎలా కడుక్కోగలం చెప్పండి...!!

18, జులై 2013, గురువారం

అందమైనది... ని(వి)షాదం....!!

నిర్మల హృదయంలో నిలిచిన ఆశల సౌధం
కలిసిన మనసుల అనురాగపు మమతలలో
పొంగిన ప్రేమల వెల్లువ గురుతులు గుండెలలో
నిండిన అపురూప క్షణం అలా ఉండి పొతే....!!

అందించిన చేతిని కర్కశంగా విసిరి కొడితే
కన్నీటితో తడిసిన బ్రతుకు అల్లరిపాలౌతుంటే
అలరించిన ప్రేమ అంధకారంలోకి నెడుతుంటే
అదృష్టమో...!! దురదృష్టమో...!! అనుకోకుండా...
చావకుండా అడ్డుపడిన పేగు బంధం ఓ వైపు....!!

మాటల తూట్లతో ప్రతి క్షణం కుళ్ళబొడిచే
లోకం పోకడ అర్ధం కాక దారి తెన్నూ తెలియక
నమ్మిన పాపానికి మోసపోయిన బతుకును మోస్తూ
నిరంతరం చస్తూ బతికే జీవశ్చవాలెన్నో....!!

అందమైన జీవితానికి ఒద్దికైన రూపానికి
విషాదానికి విలయానికి ఒకే ఒక్క తేడా
చీకటి ముసుగులో కనిపించని వెలుగు రేకలు
అడ్డు పడుతున్న రాహుకేతువులు...!! 

17, జులై 2013, బుధవారం

బంధానికర్ధం...!!

బంధానికర్ధం...
బంధుత్వమా...!! బాంధవ్యమా...!!
ఏ బందానిదేతీరమో...!!
ఏ అనుబంధ మెక్కడిదో...!!
గత జన్మ జ్ఞాపకాలో ఏమో...!!
మనసుల జత గుండెల కత
మమతల వెత రక్తపు స్పర్శల చాటుగా
వినిపించే రోదన రాగం...
కనిపించని అనురాగాల సమ్మేళనం....!!
వదలలేని ఆత్మీయతలో
కనిపించని అభిమానం
చేజారిన బంధపు ముడిలో
సుడిగుండాల ముళ్ళ పొదల గురుతులు
పేర్చి కూర్చుకున్న పొదరింటికి
శులాల శరాఘాతాలు విఘాతాలుగా చేరి
తూట్లు తూట్లుగా పొడుస్తుంటే
తట్టుకోలేని తనువు అనుబంధాల నడుమ
తెరచాప లేని నావలా ఊగిసలాడుతోంది
ఏ దరి చేరాలో తెలియక....!!

16, జులై 2013, మంగళవారం

మహిళలూ....మహరాణులూ...!!

మహిళలూ....మహరాణులూ...!! అని అందరు అనుకుంటుంటే అబ్బో నిజమేనేమో అనుకున్నా చాలా రోజులు...తరువాత గాని తెలిసిరాలేదు ఆ మాటల వెనుక దాగిన మనసు...!! మహిళ నిజంగానే మహారాణే తన కుటుంబానికి...అలుపు సొలుపు లేకుండా అందరి అవసరాలు తీరుస్తూ తనను తనే మర్చిపోయేంతగా లీనమయ్యే మనసు మగువ సొంతం. క్షమించే ధీర గుణం ఆమెకు దేవుడిచ్చిన ఆభరణం...!! తల్లిగా, తోబుట్టువుగా, సహధర్మచారిణిగా, హితురాలిగా, సన్నిహితురాలిగా, ఇలా ఎన్నో బంధాలలో మమేకమై తన ఉనికిని చాటుకుంటోంది.
ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళ రాను రాను తన ప్రభావాన్ని అన్నిటిలో ధాటిగా చాటి చెప్తు తనదైన ముద్ర వేస్తోంది. వంటింటి సామ్రాజ్యాన్ని విస్తరించి ప్రభుత్వాలను సైతం శాసిస్తోంది ఈనాడు. అందని అంబరాన్ని తాకి తనకు సాధ్యం కానిది లేదని చూపింది. ఇంతకు ముందు పెళ్ళి, పిల్లలు, ఇల్లు తన లోకమని అనుకున్న మహిళల ఆలోచనల్లో మార్పు వచ్చి....ఆ మార్పు కూడా గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులైన సామెతను నిజం చేసిందేమో అనిపించక మానదు.
చాలా వరకు ప్రతికూల పరిస్థితులే ఎదగడానికి, ఆలోచనల్లో మార్పు రావడానికి దోహదపదతాయనేది నా స్వానుభవంలో తెలిసిన నిజం. నమ్మితేనే కదా మోసపోయేది...!! ఆ నమ్మక ద్రోహం నుంచి తనను తాను బయటకు లాగుతూ నేర్చుకున్న గుణ పాఠం నుంచి మాససికంగా శారీరకంగా బలపడుతూ ఈ పోటి ప్రపంచంలో మును ముందుకు దూసుకుపోవడానికి దారిలో ఎదురౌతున్న అడ్డంకులను అధిరోహిస్తూ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటోంది. 
అమెరికా అయినా అండమానయినా ప్రపంచంలో ఎక్కడైనా తన బాధ్యతను నిర్వహించక తప్పడం లేదు. మన కుటుంబ వ్యవస్థ లో కాస్త వెసులుబాటు ఉన్న మాట నిజమే అయినా పరాయి దేశాల ప్రభావంతో అక్కడి మంచిని వదిలేసి చెడుని మాత్రమే తొందరగా ఇష్టపడుతున్నాం ఇప్పుడు. చాలా వరకు విలువలు లేని బంధాలు వారివి...ఎక్కడైనా తల్లి బిడ్డలను వదలి వేయలేదు...వివాహ బంధం కానివ్వండి...కలిసున్న బంధమైనా కానివ్వండి (సహజీవనం) తండ్రి వదిలేసినంత తేలికగా తల్లి బిడ్డలను వదులుకోలేదు...నేను చూసిన చాలా నాగరికతల్లో నాకు అనిపించింది ఇది. ప్రతి వ్యక్తి విజయం వెనుక ఉన్న స్త్రీ మూర్తి ...ఏది ఎలా ఉన్నా ఈ భూమి మీద మహిళ మహారాణే ఎప్పటికి....!!

14, జులై 2013, ఆదివారం

చేరువ కావు...దూరం కావు....!!

వికసిత విలసిత వదనమో
విరాజిల్లే విరుల అందమో
మదిని  దోచే మందస్మిత స్నిగ్ధ ముగ్ధత్వమో
కమ్మని కోమల మృదు మధుర స్వరమో
ఎక్కడో సుదూర తీరాలలో ఉందేమో
ఏ జన్మ బంధమో ఏనాటి అనుబంధమో
ఏ ఆవలి తీరంలోనో ఎక్కడో ఎప్పుడో
బతుకు పయనంలో నాకు చేరువవుతుందేమో...!!

ఎడారిలో ఎండమావులే ఒయాసిస్సులని భ్రమలో
చేరువనున్న మలయ సమీరాలను కాలదన్ని
అందని ఆకాశం కోసం అర్రులుచాచే
ఆశల గుంపుల విహంగాల రెక్కల రొదలో
నిను చేరాలని తపనపడే మనసు చేసిన
సన్నని మువ్వల సవ్వడి వినిపించలేదేమో....!!

మనసు పరచి మమత పంచిన మౌన తరంగం
అలుపెరగని అడ్డు పడని ఉత్తుంగ తరంగం
చేరువై నిను చేరాలని తపన పడే తాపత్రయం
కఠిన శిలవో కరకు రాతిగుండెవో తెలియని అయోమయంలో
చేరువ కాని దూరం కాని నీ జ్ఞాపకాల గురుతులలో
మంచుపూల స్వప్నమో మలయమారుతమో
స్పర్శించిన అనుభూతిలో నీ చుట్టూ అల్లుకున్న
ఆశల సౌధాల నడుమ నీ కోసమే నేస్తమా....!!

9, జులై 2013, మంగళవారం

నీకే వదిలేస్తున్నా.....!!

కలల అలల కవ్వింతల్లో
వలపు తలపు వరద గోదారై....
నీ ప్రేమ ప్రాంగణంలో.....
అలల కలలు ఆటాలాడగా...
ఎక్కడో  దాగిన జ్ఞాపకం
తొంగి చూసింది...
నువ్వున్నావేమోనని....!!
నీకేమో అంతా తొందరేనాయే....
ఎప్పుడెప్పుడు పారిపోదామా అని....!!
ఇంకాసేపు ఇక్కడే ఉంటే
బంధీవై పోతావేమోనని...భయం నీకు...!!
బంధనాలతో బంధించనూలేను....
భావాలతో కట్టిపడెయ్యనూలేను....
జ్ఞాపకంగా ఉంటావో....
గతంలా మిగిలిపోతావో....
నీకే వదిలేస్తున్నా.....!!

8, జులై 2013, సోమవారం

నువ్వెందుకు నాకు చేరువలో.....!!

నిదురించే తోటలో ఎన్ని పూల గుత్తులో...!! 
మత్తుగా  ఊగుతు మరిపిస్తూ మురిపిస్తూ....!!
సేద దీరే మదిలో ఎన్నెన్ని తలపులో....!!
మనసు  ముంగిట ఎదురు చూస్తూ...!!
ఉసులాడే జాబిలిని చుక్కలతో సరాగాలు చూసి
మబ్బుల్లో దాగున్న మేఘాలు అలిగాయి....!!
మాట రాని మది తలపులు ఎద వాకిట చేరి....
మౌన రాగాలు మనసు తరంగాలుగా....
నిను తాకడంలేదూ....!! నీకు తెలియడం లేదా...!!
నీ రాకను తెలిపే అలికిడి నను చేరింది మరి....!!
నను చేరిన నువ్వు నాకు తెలుసు... 
మరి నేనెందుకు నీకు దూరం....!!
నువ్వెందుకు నాకు చేరువలో.....!!

( అన్నట్టు నేను ఓ రెండు వందల కవితలు రాసేసానండోయ్.....ఇది నా రెండు వందల ఒకటో కవిత....-:) )

6, జులై 2013, శనివారం

విన్నవించనా చిన్న కోరిక...!!

నీ కోసం అక్షరాలతో ఆటాడుకుందామంటే
అందకుండా  అల్లరిగా అటు ఇటు
పరుగెత్తి పోతున్నాయి పట్టుకోమంటూ.....!!

పద లయల హొయలతో పూజిద్దామంటే
పట్టు చిక్కకుండా జారిపోతూ
పదాలు  పరాకుగా శీతకన్నేసాయి....!!

వాయు లీనాలలో స్వరం కలిపి
మనోగీతాన్ని వినిపిద్దామంటే
మూగవోయిన స్వరం పలుకలేనంటోంది....!!

అక్షరాలు పదాలై...పదాలు పద కావ్యాలై...
కావ్య మాలికలు కుసుమాక్షర నీరాజనాలై....
సుస్వర సరిగమలుగానిను చేరే క్షణం...!!

మానసం ముగ్ధ మోహనమై
మౌనాన్ని వీడి....నీ సమక్షంలో...
గుప్పెడు గుండెలో పిడికెడు ప్రేమను కోరుతోంది....!!

4, జులై 2013, గురువారం

నాకు ఏమి కాని నేను....!!

నాకు నేనే ఏమి కాని నేను
నీకేం అవుతానని చెప్పను....??
ఏ బంధం లేని నాకు
అనుబంధమై అడ్డు పడతానంటే ఎలా....??
ఆత్మీయతలకు బందీని కాని నన్ను
అభిమానంతో కట్టి పడేస్తానంటే ఎలా....??
స్వేచ్చగా పయనించే నన్ను
పట్టేసుకుని వదలనంటే ఎలా....??
ప్రపంచాన్ని చుట్టేయాలనుకునే నన్ను
నీ గుప్పెడంత గుండె గూటిలో ఉండమంటే ఎలా....??
అందర్నీ చుట్టుకునే నన్ను
నువ్వు మాత్రమే దాచుకుంటానంటే ఎలా...??
ఎవరికీ ఏమి కాని నేను
అందరికి కావాలి.....కాని నాకు నేనే వద్దు....!!

3, జులై 2013, బుధవారం

ఎలా కుదురుతుంది....!!

ఏకాంతం నాతొ సహవాసం చేస్తానంటోంది
ఎలా కుదురుతుంది నువ్వు నాతోనే ఉంటే...!!

ఏకాంతంలో ఉన్నా ఎడారిలో ఉన్నా
అందరితో ఉన్నా ఒంటరిగా ఉన్నా
ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా
నువ్వు నాతోనే ఉంటావాయే...!!

నువ్వు ఎప్పుడెప్పుడు వెళ్తావా అని
ఎదురు చూసే ఏకాంతానికి
ఎప్పుడు నిరాశే పాపం....!!

ఇంతకీ నీకేమైనా తెలుసా
నేనంటే అంత ప్రేమెందుకో...
ఏకాంతానికి...!!

అమ్మ భాష....!!

కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు బ్రతుకుదెరువుకు పరాయి భాషలు
అనుబంధాన్ని పెంచుకోవడానికి ఆత్మీయతను పంచుకోవడానికి అమ్మ భాష సరిపోతుంది...!!
మన భావాన్ని మన భాషలో ఒలికించినంత అందంగా మరే భాషలోనూ చెప్పలేము..!!
బిడ్డ చెప్పక పోయినా అమ్మకు అర్ధమయ్యే భాష....అమ్మ స్పర్శ లోనే అన్ని అందుకునే పాపాయిలు....  అందుకేనేమో ఒక్కోసారి భాషతో పనే ఉండదు భావాన్ని పంచుకోవడానికి....!!

2, జులై 2013, మంగళవారం

నువ్వు వదలి రాలేవు....!!

పెంచుకున్న బంధాన్ని
తుంచాలని నువ్వు....!!
అడ్డు పడుతున్న అనుబంధాన్ని
ఆసరాగా చేసుకోవాలని నేను ...!!
పంచుకున్న  పాశాన్ని
ఎగతాళి చేసిన నువ్వు...!!
ఎగతాళి చేసినా ఎద్దేవా చేసినా
ఆర్తిగా పెనవేసుకుందామని నేను...!!
అహాన్ని అడ్డుగోడగా చేసుకున్న నువ్వు...!!
అనురాగపు మైనపువత్తితో వెలుగుతూ నేను...!!
నువ్వు వదలి రాలేవు....!!
నేను కరగకుండా ఉండలేను....!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner