22, జులై 2013, సోమవారం

బురద కూడా బావుంది.....!!

చాలా సంవత్సరాల తరువాత బురదలో నడిస్తే ఎందుకో కాని చాలా బావుంది.....చాలా ఆత్మీయంగా తాకుతున్నట్టుగా అనిపించింది. చిన్నప్పుడు బురదలో నడుస్తూ పడిపోయిన రోజులు  వచ్చాయి....ప్రకటనల్లో చూసినట్లు మరక కూడా మంచిదే అన్నట్టుగా బురద కూడా బావున్నట్లు అనిపించింది కాని అమ్మో బురదా...!! అని చీదరగా అనిపించలేదు. చిన్నప్పుడు వర్షం వస్తే కూడా బడికి వెళ్ళాలని బయలుదేరి ఆ వానలో బురద నీళ్ళలో ఎన్ని సార్లు పడుతూ లేచామో గుర్తు చేసుకుంటుంటే  ఎంత బావుందో ఇప్పుడు....!!
ఇప్పుడు కూడా బురదలో అడుగులు పడిపోకుండా వేస్తూ వుంటే చిన్నప్పటి ఆ బురదలో నడుస్తూ  పడిన జ్ఞాపకాలు గుర్తు వచ్చి చటుక్కున నవ్వు పెదవులపైకి వచ్చేసింది...అందరు అరుగుల మీద కూర్చుని ఉన్నా కూడా పాములు అక్కడే చాలా సేపు ఆడుతూ ఉంటే చూడటానికి భలే బావుంది. వాన నీళ్ళలో వేసిన రకరకాల కాగితం పడవలు అవి తొందరగా పోతూ ఉంటే సంతోషంతో కొట్టిన కేరింతలు, మునిగి పోతుంటే అయ్యో అంటూ మునగకుండా చేసిన ప్రయత్నాలు, రాలిన నేరేడుకాయలు ఏరుకున్న జ్ఞాపకాలు ఇలా ఎన్నో జ్ఞాపకాల గురుతులు ఈ బురదనేలలో ఇమిడి మరుగున పడిపోతున్నాయి.....
మనసుకు బురద అంటితే కష్టం...మన కాలికి బురద అంటితే ఇబ్బంది ఏమి లేదు....చీదరగా అనిపిస్తే కాళ్ళు కడుక్కుంటే బురద పోతుంది కాని మనసుకంటిన బురదని ఎలా కడుక్కోగలం చెప్పండి...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner