26, మార్చి 2014, బుధవారం

మోసపోకండి...అమ్ముడు పోకండి...!!

ఇప్పటి తరం అబ్బాయిలు చాలా మంది హైదరాబాదు, విజయవాడల్లో పుట్టిన అమ్మాయిలు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు లేదా బాగా చదువుకున్న వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఉంటారు... అని ఒక నమ్మకంతో పెళ్లి చూపులకు వెళ్ళడం వాళ్ళు పెళ్ళిచూపులకు కూడా అతి సాధారణంగా ఉండటం చూసి అదేంటి ఇలా ఉన్నారు...పల్లెటూరి అమ్మాయిలే చాలా వేగంగా ఉంటున్నారు అని అనడం వింటున్నా ఈ మధ్య....!! అమ్మాయిలయినా అబ్బాయిలయినా చూడటానికి సాధారణంగా ఉన్నారని తక్కువగా చూడకండి...అలా ఉండగలగడంలో ఉన్న వారి వ్యక్తిత్వానికి విలువ ఇవ్వండి...!! ఆ మంచి గుణాన్ని చూసే మనసు అలవాటు చేసుకోండి....అప్పుడు మీ బంధాలు కలకాలం కన్నుల పండుగగా ఉంటాయి ....!! పై పై పెరుగులు చూసి మోసపోకండి...!!
ఈ రోజుల్లో మనం అందరం చూస్తున్న అతి మామూలు సంఘటనలే...పెళ్ళిళ్ళు అయినా వేరే ఏదైనా సందర్భాలయినా బాగా కనిపించే జరీ చీరలకు, నగలతో నిండిన లక్ష్మీదేవిలకు చేసే మర్యాదలు మామూలు చీరలు కట్టుకు వెళ్ళే వాళ్లకు ఎంత తేడా చూపిస్తున్నారో...చూస్తూనే ఉన్నాము కదా...!! అదే అబ్బాయిలయితే పని చేసే కంపెనీలు...సంపాదించే జీతాలు ఇవే చూస్తున్నారు పలకరింపుల్లో కూడా...!! ఏ బంధానికైనా బంధుత్వానికైనా కావాల్సింది సంపదే....అది అందరు ఒప్పుకోవాల్సిన నిజం...!! మరీ కొన్ని విషయాల్లో అయితే రక్త సంభంధాలు కూడా గుర్తురానంతగా ఈ ధనాధికారం పెత్తనం చెలాయిస్తోంది...లక్ష్మీదేవి నిలకడగా ఎక్కడా ఒక చోట ఉండలేదు...ఈ రోజు మన దగ్గర ఉంటె రేపు మరొకరి దగ్గరకు వెళిపోతుంది...మనకు కోట్లు ఉంటే మహా అయితే నాలుగు గంధపు చెక్కలు వేస్తారు చితి మీద....ఏమి లేక పోయినా అలానే కాల్చకుండా ఉంచేయరు కదా...!! ఉన్నవాడు నాలుగు కూరలు తింటే లేని వాడు గంజి తాగి బతుకుతాడు...మన సొమ్ము మనవాళ్ళు చూసినా చూడక పోయినా మనవాళ్ళకే కాని బయటి వాళ్లకు ఇవ్వడానికి మనలో ఎంత మందికి ప్రాణం ఒప్పుతుంది..కనీసం ఒక రూపాయి ఇవ్వగలమా చెప్పండి...అలా ఇచ్చే మహాత్ములు కొందరే.... కాకపొతే అది కూడా అపాత్రదానం అయి పోతోంది ఈ రోజుల్లో...!! మంచిని పెంచండి...మానవత్వానికి... మమతానుబంధాలకు విలువ ఇవ్వండి కాని వాటిని కూడా మీ స్వార్ధానికి వాడుకుంటూ మనిషి అన్న పదానికి మానవ జన్మకు కళంకాన్ని ఆపాదించకండి...!! ధన దాహానికి... నటనలకు మోసపోకండి...అమ్ముడు పోకండి...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner