19, జూన్ 2014, గురువారం

కోరికెందుకో నీకు...??

ఎందరికో నచ్చిన ఈ స్వరం
నీకెందుకు వికటంగా అనిపిస్తూ
ఎప్పుడూ జాలువారే చిరునవ్వును
తుంచేయాలని అంత ఆత్రంగా చూస్తావు...??
'సు'స్వరాల సంగతుల వినికిడిలో
పుట్టిన చిట్టి పొట్టి పలుకులను
అపస్వరాల అంపశయ్యలపై
పరుండజేయాలన్న కోరికెందుకో నీకు...??
ప్రతిసారి ఎదురు చూస్తూనే గడిపేస్తున్నా
కొన్ని క్షణాల సంతోషాన్ని నాలో కాకపోయినా
నీ నా అనుకున్న బంధాలలో అయినా
కనిపిస్తుందేమో చూద్దామని చిన్న ఆశ
అది అడియాశే అని నిరూపిస్తూ నిరంతరం
నిన్ను నువ్వు నిరూపించుకుంటున్నావు
మనసు ముక్కలు అతికించినా
అక్కడక్కడా కోస్తూ గుచ్చుకుంటూనే
పగిలిన గాయాల్లో కారిన రుధిరాన్ని
ఎండిన మరకలుగా అలానే ఉంచేసాయి
ఎంత తుడిచినా పోనంటూ గేలి చేస్తున్నాయి
అటూ ఇటూ ఎటూ పోలేని ఈ ప్రాణం
నిస్సహాయంగా తనతో ముడి పడిన
మరికొన్ని జీవాల కోసం జీవశ్చవమై
చూస్తూనే ఉంది ఆశను చంపుకోలేక....!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Chandra Vemula చెప్పారు...

పగిలిన మనసు ముక్కలు అతికించినా .... అక్కడక్కడా కోస్తూ గుచ్చుకుంటూ .... ఆ గాయాల్లో కారిన ఆలోచనల రుధిరం, ఎండిన మరకలై అలానే ఉండిపోయాయి
ఆవేదనను అక్షర రూపీకరించిన విధానం చాలా బాగుంది
అభినందనలు మంజు గారు! శుభోదయం!!

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు అండి చంద్ర గారు చక్కని మీ ఆత్మీయ స్పందనకు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner