11, జులై 2014, శుక్రవారం

మిగులుతున్న పాత జీవితాలు.... !!

వేద మంత్రాల పంచభూతాల
ఖేద మోదాల నాద వాద్యాల
అష్టదిక్కుల అగ్నిహోత్రాల
సప్తపదుల నడకల మధ్యన
పచ్చని పందిరిలో పసుపు కుంకుమ  జంటగా
ముచ్చటైన ముత్తైదుల బంధు జనాల నడుమ
ముత్యాల తలంబ్రాల వర్షపు హర్షాల
చినుకుల మధ్యన జంటగా మారుతూ
వేసిన ముచ్చటైన మూడు ముళ్ళ బంధం
తడి ఆరని కాళ్ళ పారాణి మెరుస్తుంటే
ఏడడుగుల సాక్షిగా ఏడుజన్మలకు
అనుబంధంగా అప్పగింతల అంపకాల
ఆనందం చాటుగా దాగిన కన్నీటి భాష్పాల
నడుమన ఎక్కడో ఆకాశంలో కనిపించిందో లేదో
తెలియని అరుంధతి నక్షత్రం ఆలంబనగా
మొదలైన కొత్త జీవితం.....
వేసిన మూడు ముళ్ళు నూరు ముళ్ళై గుచ్చుతు
ఏడేడు జన్మల బంధం ఏడురోజులకే ఎన్నో రోజులైతే
అప్పగింతల అంపకాలే అంపశయ్యలుగా మారుతుంటే
చూసి చూడనట్టు పోయే బాంధవ్యాలు చూస్తూ
బాధను దిగమింగుతూ మరణ శాసనాన్ని సోపానంగా
ఆరని అగ్నిహోత్రాన్ని చితిగా చేసుకుని చితికి పోతున్న
కొత్తైన పాత జీవితాలు మారని మనసులకు
మార్పు లేని సమాజానికి చితా భస్మాలుగా
మిగులుతున్న పాత జీవితాలు.... !!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner