30, జులై 2014, బుధవారం

మధ్యలో ఎప్పటికి...!!

మనుష్యుల మధ్య దూరాన్ని తగ్గించి దగ్గర చేసే మంత్రం ఒక్కటే అదే ఆప్యాయత...కొంత మంది దగ్గరే ఉన్నా
మనసుకు మనకు దగ్గరగా రాలేరు...దూరాన్ని దగ్గర చేసి పంచే ఆ ప్రేమకు ఇష్టానికి దాసోహం కాక తప్పదు...దగ్గరలోకి వచ్చి కూడా దగ్గరగా రాలేని అనుబంధాలు ఎన్నో...!! మాటల వరకే పరిమితం కొన్ని... డబ్బుల వరకే సరి చూసుకునేవి కొన్ని.... అవసరానికి నటించేవి మరికొన్ని...!! అమెరికా నుంచి గుంటూరు వచ్చినా పక్కన ఊరు రాలేక ఫోన్ లో పలకరించి అబ్బా పలకరించానులే పని అయిపొయింది సరి పెట్టుకుంటే సరిపోతుంది.. .చూడాలని మనసు ఉంటే మార్గం అదే వస్తుంది...మనమేమో అబ్బో అమెరికా నుంచి వచ్చి గుర్తు ఉంచుకుని ఫోన్ చేసి పలకరించారు చూసావా అని తృప్తి పడే అల్ప సంతోషులం...!! మనుష్యులు మమతలు ఎక్కడ ఉన్నా అవే కదా..!! మరి ఎందుకీ తేడాలు...!! ముక్కు మొహం తెలియని ఎందరో పలకరించే పలకరింపు మనం ఎందుకు పలకరించుకోలేక పోతున్నాం...?? ఎందుకీ దూరం...మన అంతరంగంలో దాగిన అభిమానం అనంత దూరంగా అందకుండా చేసుకోవాల్సిన అవసరం ఉందా..!!  పేరుకి మాత్రం పలకరింపులు ఎందుకు..?? చిన్నప్పటి స్నేహాలు కల్మషం లేనివి ఇక తరువాత స్నేహాలు అంటారా మనకు నచ్చిన మనము మెచ్చిన బాంధవ్యాలు అనుకుంటాము కాని వాటిలో కొన్నే నిజమైనవి అని కాలంతో పాటు మనకున్న డబ్బు, హోదాని బట్టి వస్తూ ఉంటాయి...ఎన్ని రోజుల స్నేహం అన్నది కాదు ఎన్నాళ్ళ నుంచి అలానే ఉన్నాయి ఆ ఆప్యాయతలు అన్నది ముఖ్యం,,,, కొందరికేమో తీరికే ఉండదు మరికొందరేమో తీరిక చేసుకుని కొద్ది సమయమైనా చూడాలని కలుస్తారు... మనసులో లేకుండా మాటలతో సరిపెడితే సరిపోదు... దేనికైనా మనసుతో కలిపి ఉంటేనే అది చిరకాలం నిలుస్తుంది.... అది ఏ అనుబంధమైనా...!! మనం కావాలనుకునే అనుబంధాలను దూరం చేసే దూరాన్ని దూరంగా ఉంచితే అన్ని మనకు దగ్గరగా మన అందుబాటులోనే ఉంటాయి.....!! కొన్నిటిని డబ్బుతో కొనలేము.... కోట్లు పోసినా సంతోషాన్ని తేలేము... జరిగిపోయిన కాలాన్ని గుర్తు చేసుకోగలం కాని మళ్ళి ఆ కాలాన్ని వెనక్కు తీసుకురాలేము...!! విరిగి పోయిన మనసుని అతుకు వేసినా అది అతుకుల విస్తరే కాని నిండు విస్తరి కాదు... ఎప్పటికి కాలేదు...!! మనసులో ఉంటే ఇరవై ఏళ్ళు కాదు నలభై ఏళ్ళు అయినా గత జ్ఞాపకాల అనుభూతుల గురుతులు మదిలో పదిలంగానే ఉండిపోతాయి.... వదిలేసుకుంటే ఏది మనతో ఉండదు... కొందరేమో వదులుకోలేరు మరికొందరేమో విదుల్చుకుంటారు..... అదే చిన్న తేడా మనసుల మనుష్యుల మధ్యలో ఎప్పటికి...!! 
నా అల్ప సంతోషాన్ని అధికమైన ఆనందంగా మార్చుతున్న కొందరు ఆత్మీయులకు ఈ రాత అంకితం...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner