20, సెప్టెంబర్ 2014, శనివారం

చదువుల గురువుల కబుర్లు....!!

నేస్తం....!!
              ఎలా ఉన్నావు...!!  పిల్లలు బావున్నారా.... వాళ్ళ చదువులు ఎలా ఉన్నాయి... ఏంటో మన రోజుల్లో ఎంత హాయిగా గడిచి పోయాయి ఆ చదువుకున్న రోజులు.... ఇప్పుడు చదువు కొనుక్కున్నా ఏ సంతోషము సరదా లేదు పిల్లలకి... ఎంత సేపు చదువు లేదా వాడికి అది ఉంది వీడికి ఇది ఉంది... అంటూ మన ఇంట్లో ఏది లేదని గోల... తప్పని పరిస్థితిలో నలుగురితో పాటు మనం కూడా అని రాంకుల గోల ఎలా ఉన్నా ఈ కార్పోరేట్ స్కూల్స్ లో జాయిన్ చేయడంతో మనకు ముందు గొయ్యి వెనుక నుయ్యి అన్నట్టుగా ఉంది... మన రోజుల్లో చదువుతో పాటు ఎన్ని విషయాలు చెప్పేవారు మన టీచర్లు.... ఆటలు, పాటలు, కబుర్లు, కధలు, నీతి పద్యాలు, మంచి, చెడు మనకు ఏరోజు స్కూలు ఎగ్గొట్టాలని ఉండేది కాదు... శెలవు వచ్చినా మనం స్కూలుతో అనుబంధాన్ని తెంచుకోలేక పోయేవాళ్ళం... ఇప్పటి పిల్లలకు బంధాలు బాధ్యతలు ఏవి లేకుండా పోతున్నాయి చాలా వరకు.... తప్పు చేస్తే మనల్ని గురువులే దండించేవాళ్ళు.... ఇప్పుడు పిల్లలకు భయపడుతున్నారు... సమాజం గురించి మనకు అన్ని చెప్పి ఎలా ఉండాలో నేర్పించింది ఎక్కువగా మన గురువులే.... మరి ఆ గురువులు ఈనాడు ఎక్కడ.... ఎంత వెదికినా దొరకడం లేదు ఈ రోజుల్లో... తల్లిదండ్రులకన్నా గురువులకు పిల్లలపై ఎక్కువ హక్కు ఉంటుంది... వచ్చామా... మన పని చెప్పడం... అర్ధం అయినా కాకపోయినా చెప్పేసామా.... వెళ్ళి మన జీతం మనం తీసుకున్నామా అన్నట్టు ఉంది గురువుల సంగతి.... పిల్లల మీద కాస్త శ్రద్ద పెట్టి చదువుతో పాటు నాలుగు మంచి ముక్కలు చెప్పే గురువులు కొందరయినా ఉంటే ఎంత బావుండు... మన పిల్లలు కూడా బావుంటారు... సమాజము బావుంటుంది.... చదువుని కొనుక్కుంటున్నాము అన్న బాధ తగ్గి ప్రశాంతంగా మనకు ఉంటుంది కదూ.... ఏంటో ఇప్పటి చదువులు పిల్లలు స్కూల్స్, టీచర్స్... మన రోజులతో పోల్చుకుని బాధగా అనిపించి ఇలా నీకు చెప్పేసాను.... అందరిని అడిగానని చెప్పు ... మరి ఇప్పటికి ఉండనా...
నీ ప్రియ నేస్తం  

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner