7, సెప్టెంబర్ 2014, ఆదివారం

నీ జ్ఞాపకాల గుర్తులను దాచుకుని....!!

ఏమోయ్,
             అన్నిట్లోనూ నాకన్నా నువ్వే ముందు ఉండాలని ఎప్పుడు అనుకుంటూ ఆఖరికి ఇప్పుడు కూడా నువ్వే ముందు ఉన్నావు .... నీకు తెలియకుండానే ఇక్కడా నువ్వే గెలిచావు.... చదువులో సరే.... ఆటల్లో మనిద్దరం ఒక జట్టు గెలిచినా ఓడినా.... అన్ని ఆలోచనలు పంచుకున్న మన స్నేహం చూసి దేవుడు కూడా అసూయ పడి నిన్ను గెలిపించి నన్ను ఓడించానని సంబరపడి పోతున్నాడు చూడు... పాపం దేవుడికి తెలియదు కదా మన స్నేహం ముందు తనే ఓడిపోయానని తెలుసుకోలేక పోయాడు....  జ్ఞాపకాలు సజీవమని మనం ఉన్నా లేక పోయినా ఎప్పటికి మనతోనే ఉంటాయని వాటిలో జీవం ఉట్టిపడుతుందని.... ఏరుకుంటున్న కొద్ది దొరుకుతూనే ఉండే సముద్రపు ఆల్చిప్పల్లా ముత్యాలు రాసులుగా వాటిలో పోసుకుని దాచుకున్నామని తెలియక అలా అనుకున్నాడు విలయకారుడు... విలయంలో వినోదాన్ని అందించేది స్నేహమని దానిలోని మాధుర్యాన్ని చవి చూసిన మనకు దాని తీపిదనం తెలుసు కదా.... ఎప్పటికి మరచిపోలేని ఆ తియ్యదనం ముందు లయకారుడైనా తలను వంచాల్సిందే.... చెప్పా పెట్టకుండా నువ్వు వెళ్ళిపోయినా లేవని ఒప్పుకోలేని నిజాన్ని నీ గెలుపుగా అనుకుని ఇక్కడా నువ్వే ముందు ఉన్నావని సంతోషించాలో లేక ఆర్తిగా ఊసులాడే ఓ జాబిలమ్మా ఊసులే లేక మూగబోయావేమమ్మా అంటూ పలకరించే పిలుపు దూరమైందని బాధ పడాలో తెలియక సందిగ్ధంలో ఉండిపోయాను.... నీ జ్ఞాపకాల గుర్తులను దాచుకుని లేని నువ్వు మాకోసం మాతోనే ఉన్నావని తలుస్తూ..... !!
ఎప్పటికి నీ ప్రియ నేస్తం.

1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

"జ్ఞాపకాలు సజీవమని మనం ఉన్నా లేక పోయినా ఎప్పటికి అవి మనతోనే ఉంటాయని వాటిలో జీవం ఉట్టిపడుతుందని.... ఏరుకుంటున్న కొద్ది దొరుకుతూనే ఉండే సముద్రపు ఆల్చిప్పల్లా ముత్యాలు రాసులుగా వాటిలో పోసుకుని దాచుకున్నామని తెలియదు కాలానికి"

మనిషి మనోభావనల్లోని స్నేహరాగబంధ జ్ఞాపకాల ప్రత్యేకత .... చాలా బాగా ఆవిష్కరించారు
మనఃపూర్వక అభినందనలు మంజు గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner