31, అక్టోబర్ 2014, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ...ఐదవ భాగం....!!

తెలుగు సాహితీ ముచ్చట్లు అని మొదలు పెట్టి తెలుగు మాష్టారిలా ఈ అక్షరాలు, ఛందస్సు , అలంకారాల గొడవ ఏమిటిరా బాబు అనుకుంటున్నారా.... ఏమి చేయను చెప్పండి మనకు కాస్త సాహిత్యం గురించి తెలియాలి అంటే ఈ మాత్రం భాష.... అదీ మనం ఎప్పుడో మరచిపోయిన తెలుగు మూలాలు కాస్తయినా గుర్తు చేసుకుంటూ తద్వారా మన తెలుగు ఆచార్యులను మననం చేసుకోవడం ఈ ఛందస్సు  చెప్పుకోవడంలో ముఖ్య ఉద్దేశ్యం... చిన్నప్పుడు నేర్చుకున్న సంస్కృత శ్లోకాలు.... చదువుకున్న పెద్దబాల శిక్ష,  శతక పద్యాలు బావున్నట్టుగా అనిపించేవి.... కాని అప్పుడు వాటి వెనుక ఉన్న అందం తెలిసేది కాదు.... ఈ వృత్త జాతుల లక్షణాలు నేర్చుకుంటున్న కొద్ది తెలుగు పద్యాల అందమైన ఆకృతుల అలంకరణ ఎంత చక్కని సొగసులను పొందుపరచుకుందో.... తినగ తినగ వేము తియ్యనుండు.... అన్నట్టు చదవగా చదవగా తెలుగు తేనెలొలుకు అని అనిపించక మానదు....ఈ వారం మనకు అందరికి బాగా తెలిసిన శార్దూలం గురించిన వివరణలు తెలుసుకుందాము....మనకు తెలిసిన శార్దూలం అసలు పేరు శార్దూల విక్రీడితం... 

సారాచార విశారదాయి నయితిన్ శార్దూల విక్రీడితా
కారంబై మసజమ్ము లిమ్ముగ సతాగప్రాప్తమై చెల్వగున్

లక్షణములు

శార్థూల విక్రీడితము వృత్తమునందు గణములు
U U U I I U I U I I I U U U I U U I U
తా టం కా చ ల నం భు తో, భు జ న ట ద్ద మ్మి ల్ల బం డం బు తో
  • పాదాలు: నాలుగు
  • ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య = 19
  • ప్రతిపాదంలోని గణాలు: మ, స, జ, స, త, త, గ
  • యతి : ప్రతిపాదంలోనూ 13 వ అక్షరము
  • ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు

ఉదాహరణలు

తాటంకాచలనంబుతో, భుజనటద్దమ్మిల్ల బండంబుతో,
శాటీముక్త కుచంబుతో, సదృఢచంచత్కాంచితో, శీర్ణలా
లాటాలేపముతో, మనోహరకరాలగ్నోత్తరీయంబుతో
గోటీందుప్రభతో, సురోజభర సంకోచద్విలగ్నంబుతోన్,

భీమంబై తల ద్రుంచి ప్రాణముల బాపెం జక్ర మాశు క్రియన్
హేమక్ష్మాధర దేహముం జకితవన్యేభేంద్ర సందోహముం
గామ క్రోధన గేహమున్ గరటి రక్త స్రావ గాహంబు ని
స్పీమోత్పాహము వీత దాహము జయశ్రీ మోహమున్ గ్రాహమున్.

శార్దూలం అంటే సింహం అని అర్థం. విష్ణుమూర్తి పురుష సింహుడు. ఆయనను నరశార్దూలుడు అని రామాయణంలో విశ్వామిత్రుడు సంబోధించాడు. పైగా ఆయన నరసింహావతారుడు.....
వైదిక ఛందస్సులో పద్యములు పండ్రెండు అక్షరములకు పరిమితములు.  రామాయణ భారతములలో ఇంకను కొన్ని ఎక్కువ నిడివి గల వృత్తములు గలవు.  బహుశా అశ్వఘోషుని బుద్ధ చరితలో, భాసుని నాటకములలో కష్టతరమైన, దీర్ఘమైన వృత్తములు కవులు వ్రాయుటకు ఆరంభించిరి.
అతి పురాతనమైన వృత్తములలో శార్దూలవిక్రీడితము అత్యంత ప్రసిద్ధమైనది. భారతీయ సారస్వత చరిత్రలో రెండు వేల సంవత్సరాలుగ అన్ని భాషలలో ప్రధాన పాత్ర వహించిన ఘనత ఈ వృత్తమునకు గలదు. అందులో పూర్వార్ధము పఠించుటకు సుందరమైనది. బహుశా అందువలన నేమో ఈ వృత్తమునకు విరామము మ-స-జ-స గణములకు పిదప ఉంచబడినది.  ఈ ఉపోద్ఘాతము ఎందుకు అనగా ఈ పూర్వార్ధముతో ఈ ఒక్క వృత్తము మాత్రమే కాదు, ఇంకను మూడు వృత్తములు గలవు.  అవి- శార్దూలము, రెండు భిన్న లక్షణములు గల వాయువేగ అను వృత్తము. శార్దూలవిక్రీడితమును శార్దూలము అనుట వాడుక.  శార్దూలము మఱొక వృత్తము, అది శార్దూల విక్రీడితము కాదు.  శార్దూలము పింగల ఛందస్సులో చెప్పబడినది.  వాయువేగ హేమచంద్రుని ఛందోనుశాసనములో, జానాశ్రయిలో నున్నవి.  ఈ మూడు వృత్తములకు, శార్దూల విక్రీడితమునకు గల భేదము రెండవ భాగములో, అనగా త-త-గ స్థానములో.  శార్దూలములో త-త-గ కు బదులు ర-మ, హేమచంద్రుని వాయువేగకు త-త-గ కు బదులు న-జ-గ, జానాశ్రయి వాయువేగకు త-త-గ కు బదులు న-న-గ.  యతి స్థానము ఈ వృత్తములన్నిటికి ఒక్కటే. 
క్రింది ఉదాహరణలలో పూర్వార్ధము అన్నిటికి ఒకటే. ఉత్తరార్ధమును మార్చి వ్రాశారు .
శార్దూలవిక్రీడితము- మ-స-జ-స-త-త-గ, యతి (1, 13)
19 అతిధృతి 149337
పారావారముగాదె సత్కరుణకున్, పాలించు ప్రాణేశునిన్
శ్రీరామా యని బల్కరాదె ప్రియమై, శ్రీలింక నీకేలనే,
యారామమ్ము విలోల మానసము, నీవందుండు పుష్పాలతో
హారమ్ముల్ బలు గ్రుచ్చరాదె విధిగా, నా దైవ పూజార్థమై
శార్దూలము- మ-స-జ-స-ర-మ, యతి (1, 13)
18 ధృతి 10073
పారావారముగాదె సత్కరుణకున్, పాల ముంచున్ దేల్చున్,
శ్రీరామా యని బల్కరాదె ప్రియమై, శ్రీలవే, వేఱేలా,  
యారామమ్ము విలోల మానసము, నీ వా జపా పుష్పాలన్
హారమ్ముల్ బలు గ్రుచ్చరాదె విధిగా, నా పదా లందుంచన్
వాయువేగ (జా) - మ-స-జ-స-న-న-గ, యతి (1, 13)
19 అతిధృతి 259929
పారావారముగాదె సత్కరుణకున్, వరముల తరువున్
శ్రీరామా యని బల్కరాదె ప్రియమై, సిరు లనవసర-,
మ్మారామమ్ము విలోల మానసము, నీవట గల విరులన్
హారమ్ముల్ బలు గ్రుచ్చరాదె విధిగా, నతనిని గొలువన్
వాయువేగ (హే) - మ-స-జ-స-న-జ-గ, యతి (1, 13)
19 అతిధృతి 194393
పారావారముగాదె సత్కరుణకున్, వరముల భూజమున్
శ్రీరామా యని బల్కరాదె ప్రియమై, సిరు లిక నేలనే,
యారామమ్ము విలోల మానసము, నీ వలరు సుమాలతో
హారమ్ముల్ బలు గ్రుచ్చరాదె విధిగా, నమలుని పూజకై

వివరణ - జెజ్జాల కృష్ణ మోహన రావు గారి సహకారంతో .....
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

30, అక్టోబర్ 2014, గురువారం

నీలోని.....!!

నేను వెన్నెల్లో ఆడుకున్న అక్షరాన్ని
నీతో పంచుకున్న భావాలన్నీ దాచుకున్న మనసుని
జ్ఞాపకాలన్నీ తడిమిన బంధాన్ని

నేను నిన్ను తెలుసుకున్న చుట్టాన్ని
కలసిన జతలో మరచిపోలేని ఆత్మీయరాగాన్ని పంచిన నేస్తాన్ని
ఎద లోతుల్లోని మమకారాన్ని

నేను నీతో కలసి నడచిన గతాన్ని
అనుక్షణం కదలాడుతున్న మది అంతరంగాన్ని
అద్దంలో కనిపించే ప్రతిబింబాన్ని

నేను నీతో పయనించే కాలాన్ని
వాస్తవాల వెలుగులో జీవితాన్ని శాసించే అధికారాన్ని
స్వప్నాలను అందించే స్వాప్నికురాలిని

నేను నీతో విభేదించే అలౌకికాన్ని
అంతర్లోకంలో అనిమేషంగా పయనించే ఆత్మానందాన్ని
అంతర్లోచనాన్ని అందించే మార్గాన్ని

నేను నీలో ఇమిడిన మౌనాన్ని
మాటల ప్రవాహాన్ని అడ్డుకున్న మలయమారుతాన్ని
నీ చుట్టూ అందంగా చుట్టుకున్న చేవ్రాలుని

నేను నీలో ఉండే చిద్విలాసాన్ని
చింతలను వంతలను పారద్రోలే సంతోషాన్ని
నేనే నీవైన  ఆనందభాష్పాన్ని...!!

29, అక్టోబర్ 2014, బుధవారం

నిశబ్దంలో నీ నవ్వులు....!!

నిశబ్దంలో నీ నవ్వులు వినిపించి
దాచుకుందామని దోసిలిపట్టా
జారిపోతున్న సవ్వడిని పట్టుకోలేక
ఖాళీగా ఉండిపోతూ వెక్కిరించింది
చీకటి జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా
చుట్టుముట్టి ఊపిరాడనివ్వలేదు
భయపడి చాటుగా దాగుంటే
మాటునే ఉండి దోబూచులాడుతూ
పట్టుకోలేవంటూ కిల కిలా కవ్వింతలు
వెలుగుల కేరింతలు తలుపు తడితే
తీయడానికి ఆరాటపడే మనసును
నిద్ర పుచ్చే జోలపాట తెలియని
అమాయకత్వానికి లాలి పాడే
మోహానికి లొంగిపోయిన పసితనాన్ని
ముగ్ధత్వంలో దాచుకున్న మానసం
ఏమి తెలియక నవ్వులు వెదజల్లుతూనే ఉంది...!!


28, అక్టోబర్ 2014, మంగళవారం

స్నేహ సుగంధాలు....!!

నేస్తం...
          మన బంధం మొదలై ఎన్ని వసంతాలు గడచినా ఇంకా అలానే స్నేహ సుగంధాలు వెదజల్లుతూనే ఉంది... నిన్నా మొన్నటి జ్ఞాపకంలా.... అవునూ బంధమంటే గుర్తుకు వచ్చింది కాళ్ళకు అడ్డుపడుతున్న చుట్టంలా చుట్టుకున్న చెలిమి సంగతి నీకు నాకు తెలియనే లేదు... పరిచయం ప్రవాహంలా సాగిపోతూనే ఉంది.... అనుభూతులను, అనుభవాలను, కోపాలను. ఆవేశాలను, సంతోషాన్ని, బాధను ఇలా ఒకటేమిటి ప్రతి ఒక్కదాన్ని అందిపుచ్చుకున్న మన స్నేహంలో ఏనాడైనా విడిపోయిన దాఖలాలకు చోటిచ్చామా... ఏ అనుబంధమైనా నిలవడానికి నమ్మకమే అసలైన పునాది... అది మన ఇద్దరిలో పుష్కలంగా ఉంది... నొచ్చుకోవడాలు, మెచ్చుకోవడాలు మనకు కాస్త దూరంలోనే ఉన్నాయి ఎందుకో... ఎలా పిలిచినా, ఎలా పలికినా ఆప్యాయతలోని మాధుర్యాన్ని చవి చూసిన అ సంతోషం ముందు వేల కోట్ల విలువ దిగదుడుపే.... వెంటపడి వేధించే అనుబంధానికి, అభిమానంగా దగ్గరయ్యే ఆత్మీయతకు ఉన్న వ్యత్యాసం అర్ధం చేసుకున్న మనసుల మాధుర్యం ఆస్వాదిస్తున్న ఈ చెలిమి... అహాన్ని సమాధి చేసి ఆత్మాభిమానాన్ని పెంచే మమతల నెలవు... కోపంలో కూడా ప్రేమను పంచడం నీకే చెల్లుతోంది... అందుకే నీ స్నేహానికి దాసోహం ఎప్పటికి... అలకల చిలుకలు అటకలెక్కిన అపార్ధాలకు తావి లేని ఎల్లలెరుగని బంధానికి చిరునామా అయిన నీ స్నేహ సామ్రాజ్యంలో నేను ఓ చినుకైనందుకు నా జన్మ చరితార్ధం... నీ స్నేహ పరిమళాలు ఎప్పటికి ఇలా నాతోనే ఉండిపోవాలన్న చిన్న స్వార్ధంతో.....
నీ నేస్తం...

27, అక్టోబర్ 2014, సోమవారం

ఆ ఆనందం...!!

ఆరు నెలల బిడ్డను వదలిన నాలుగు సంవత్సరాలకు చూసుకున్న ఆనందం అది... అమెరికా కష్టాలు అండి... కొన్ని కావాలంటే కొన్ని వదులుకోక తప్పని పరిస్థితి... ఎన్నో సరిపెట్టుకుంటే కాని ఈ జీవితం సాగదు.... కాకపొతే సరిపెట్టుకోవడంలోనే జీవితం మొత్తం సరిపోతోంది... ఆదిలో మొదలై అంతం వరకు ఇలానే జరిగిపోతూ ఉంటే... ముందు తరంతో సరిపెట్టుకోవడం మొదలై మన తరంతోను అదే పరిస్థితి... ఆఖరికి మన తరువాతి తరంతో కూడా సరిపెట్టుకోవడమే.... ఏం చేద్దాం కొన్ని జీవితాలు ఇంతే అని మళ్ళి సరిపెట్టుకోవడమే.... ఏంటో ఈ సరిపెట్టుకోవడం వదలడం లేదు మరి...!! ఏం చేస్తాం సర్దుకు పోవడమే....!!

భగినీ హస్త భోజన విందు...!!

ఉపశమన తరంగాలు సమూహం లో చిత్రకవిత పోటిలో ప్రధమ విజేతగా నిలిపిన నా కవిత....

కాలాలు మారినా మారని బంధాలకు
పంచుకున్న పెంచుకున్న ప్రేమలకు
సంప్రదాయాల విలువలకు ప్రతీకలే
ఈ ఆప్యాయతల విందు భోజనాలు
అమ్మ కడుపు చల్లగా ఆదరించిన సోదరి
అభిమానంగా అక్కున చేర్చుకున్న అన్నగా
ఆనందాలు విలసిల్లిన ఆ లోగిలి
ప్రాచీన పురాణాల నమ్మకాలను
ఆదరించిన అద్భుత అనుబంధం
అన్నాచెల్లెళ్ళ అనురాగానికి ఆనవాలు
పిలువకనే వెళ్ళి చెల్లి చేతి వంట రుచి చూసే
అరుదైన రోజు ఈ భగినీ హస్త భోజన విందు...!!

25, అక్టోబర్ 2014, శనివారం

నా మనసు నీకు తెలుపుతూ....!!

నేస్తం....
            ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఎందుకో నా గతము నువ్వే , వాస్తవము నువ్వే , వర్తమానమూ నువ్వే అయిపోయావు.... భ్రమించే మనసు పరిభ్రమణము నీ చుట్టూనే నిర్విరామంగా..... మాటల మౌనాలు చెప్పని భావాలు నాకు సొంతమైతే.... చెప్పిన కబుర్లు వెంటనే మర్చిపోవడం నీ వంతు... అందరు బోలెడు సమస్యల వలయాలను ఛేదించే మార్గాలు అన్వేషిస్తుంటే నా సమస్యలన్నీ నీ వెంటే.... గతం చేయని గాయాలు వాస్తవంలో మానని గుండెకోతగా మారి వర్తమానాన్ని చెరిపేస్తే.... వాస్తవానికి చేరువ కాలేని మదిని నింపిన జ్ఞాపకాలే ఊపిరిగా ఇలా గతంలోనే ఉండిపోతే.... కాని వెనక్కు వెళ్ళని కాలం ముందుకే వెళిపోతోంది నిన్ను అక్కడే వదిలేసి తనతో నన్ను తీసుకువెళ్తూ... నువ్వు లేని వాస్తవాన్ని భరించలేక... నేను వదిలేసిన గతాన్ని గుర్తుగా మార్చుకోలేక... ఈ రెండు లేని భవిష్యత్తుని కాదంటూ.... నేను కాని నన్ను చూపిన నీలో మిగిలిన జ్ఞాపకంగా ఉండిపోయిన ఆ క్షణాలు శాశ్వతంగా నిలచిపోతే....నీతో పంచుకోవడానికి అక్షరాలు ఎందుకో నిరాకరిస్తున్నాయి... నేనెప్పుడు నీతో గతంలోనే ఉండిపోతున్నానని నామీద అలిగాయి కాబోలు... అయినా నా మనసు పంచుకోవడానికి నువ్వు తప్ప నాకెవరున్నారు ఈ ప్రపంచంలో.... బాధయినా, సంతోషమయినా నే పంచుకునేది నీతోనే కదా... అందుకే మన చెలిమి ఇలా సాగుతూనే ఉంటుంది చిరకాలం... తెల్లని నీ మనసుపై నల్లని నా సిరా మరకలు మన బంధాన్ని గుర్తు చేస్తూ నాతో నీ స్నేహాన్ని పెంచుతూ... నా మనసు నీకు తెలుపుతూ....
నీ నేస్తం

ఈ రోజు విశేషం....!!

సోదరి ఇంటికి భోజనానికి వెళ్ళడానికి ఈరోజు ఎంత మంది సోదరులు ప్రయాణం కట్టారు...?? ఈ రోజు ప్రత్యేకతను తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ నొక్కండి....
http://naalonenu-manju.blogspot.in/2013/11/blog-post_4.html

24, అక్టోబర్ 2014, శుక్రవారం

నయవంచన విలాసాలు...!!

చేసిన సంతకానికి చెల్లని చీటిగా మిగిలిన బతుకు
తెల్లని కాగితంపై ఒలికిన ఎర్రని సిరా మరకలు అస్పష్టంగా
చెరిగిన అక్షరాల రూపాలు జారిన కన్నీటికి ఆనవాలుగా
ప్రేమపాశానికి చుట్టుకున్న జీవిత ఆర్తనాదం వినిపిస్తోంది
తెంచుకోలేని బంధానికి వేసుకున్న మరణశిక్షగా
సమాధిపై పేర్చిన ఇటుకలే నేస్తాలుగా చేసుకున్న
అంపశయ్యల అప్పగింతల తంతులో మూసిన గుప్పిట
బిగించిన ఆ చేతిలో ఎన్ని అవరోధాల ఆరోహణలో
సంతోషాల అవరోహణాన్ని దిగమింగే ఆ మనసు
తాకిన గాయాల గుమ్మాలను చేరిన గొంతులను
నులిమేసిన రాక్షస హస్తాల చాటున వెలికిరాని
వెతలను దాచలేని జీవితాల కధనాల చరిత్రలే
అడుగడుగునా అగుపించే సమాజ జీవశ్చవాలు
ఈ నాగరిక నయవంచన విలాసాలు...!!

తెలుగు సాహితీ ముచ్చట్లు ...నాలుగవ భాగం....!!

మన సాహితీ ముచ్చట్లలో వృత్త పద్యాల అంద చందాల గురించి కొద్ది కొద్దిగా చెప్పుకుంటూ ఉన్నాము కదా... మా తెలుగు మాష్టారు నా మీద కోపంతో ఎప్పుడు తెలుగులో నాకు ఎక్కువ మార్కులు వేసేవారు కాదు.. ఆడుతూ పాడుతూ మిగిలిన వాటిలో ఎక్కువ తెచ్చుకున్నా తెలుగులో కాసిన్ని తక్కువే వచ్చేవి... ఆ కోపంతోనే ఎందుకో తెలుగంటే బోలెడు ఇష్టం పెరిగి ఛందస్సు బాగా నేర్చుకోవడం మొదలు పెట్టి అప్పట్లో ఉన్న వృత్తాలను బాగా పద్య వివరణతో చెప్పేదాన్ని... ఓ రకంగా ఈ రోజు ఇలా మీ అందరి ముందుకు రావడానికి ప్రత్యక్షంగా తెలుగంటే ఉన్న బోలెడు ఇష్టంతో పాటు.... పరోక్షంగా మా తెలుగు మాష్టారే కారణం... తెలుగు సరిగా పలకలేవంటు ఎద్దేవా చేసేవారు... ఒక్క తప్పు లేకుండా పద్యాలే కాకుండా పాఠాలు కూడా బాగా చదివేయడంతో మీకు ఎంచక్కా సాహితీ ముచ్చట్లు చెప్పేస్తున్నా... పదవ తరగతిలో నాకు వచ్చిన తెలుగు మార్కులు చూసి అందరు ఏం రాసేసావు ఇన్ని మార్కులు వచ్చేసాయి అని అంటూ ఉంటే... చెప్పొద్దూ నాకూ భలే సంతోషం వేసేసింది అప్పుడు... నాకు పురాణాలు, ఇతిహాసాలు చదివిన జ్ఞాపకం లేదు... ఏదో నాకు తెలిసిన కొన్ని సాహిత్యాలను మీతో పంచుకోవాలని ఇలా...
పద్యము తెలుగు కవితా రచనలో ఒక విధానము. పురాతన తెలుగు రచనలు ఎక్కువగా పద్యరూపంలోనే ఉన్నాయి. పద్యంలోని ముఖ్య లక్షణం ఛందస్సు
పద్యం ఒక తెలుగు సాహితీ ప్రక్రియ. పద్యాలు వృత్తాలు కావొచ్చు, జాతులు కావొచ్చు, ఉపజాతులు కావొచ్చు. మనం వృత్తాల లక్షణాల గురించిన వివరణలు చెప్పుకుంటూ ఉన్నాము కదా.... క్రిందటి సారి ఉత్పలమాల గురంచి....  ఇక చంపకమాల విషయానికి వస్తే కావ్యాలలో చంపకమాలది ప్రత్యేకమైన స్థానం... న జ భ జ జ జ ర ఎందుకో ఈ గణాలు భలే కొత్తగా అనిపించేవి అప్పుడు... తరువాత తరువాత మన సినిమా సాహిత్యంలో ఎక్కువగా చోటు చేసుకున్న పేరు కూడా చంపకమాల.....
చంపకమాల గురించి.....

నజభజజ్జలరేఫలు పెనంగి దిశాయతి తోడ గూడినన్
త్రిజగదభిష్టుతా బుధనిధీ విను చంపకమాలయై చనున్.  

లక్షణములు

  • పాదాలు: నాలుగు
  • ఈ పద్య ఛందస్సుకే సరసీ అనే ఇతర నామము కూడా కలదు.
  • వృత్తం రకానికి చెందినది
  • ప్రకృతి ఛందమునకు చెందిన 711600 వ వృత్తము
  • ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య = 21
  • ప్రతిపాదంలోని గణాలు: న, జ, భ, జ, జ, జ, ర
  • యతి : ప్రతిపాదంలోనూ 11 వ అక్షరము
  • ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు

గణ విభజన

చంపకమాల వృత్త పాదము యొక్క గణ విభజన
I I I I U I U I I I U I I U I I U I U I U
దము లబట్టి నందల కుబా టొ కయింత యులెక శూరతన్

ఉదాహరణ 1

పోతన తెలుగు భాగవతంలో 486 చంపకమాల వృత్త పద్యాలను వాడారు.
దముల బట్టినం దలకుబా టొకయింతయు లేక శూరతన్

మదగజవల్లభుండు మతిమంతుడు దంతయు గాంత ఘట్టనం

జెదరగ జిమ్మె నమ్మకరిచిప్పలు పాదులు దప్పనొప్పఱన్


వదలి జలగ్రహంబు కరివాలముమూలముజీరె గోఱలన్.
ఉదాహరణ 2
అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కరకంపిత సాలము శీత శైలమున్
                                  - పెద్దన మనుచరిత్రము నుండి.

చూసారా ఎంత చక్కని తెలుగు సాహిత్యమో....  ఏదో నాకు తెలిసిన నాలుగు మాటలు ఇలా ఈ శీర్షిక ద్వారా సాహితీసేవ సమూహములో మీ అందరితో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది... 

వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

22, అక్టోబర్ 2014, బుధవారం

అభినందనలు....!!

 

హృదయపూర్వక అభినందనలు
క్రిందటి సంవత్సరం బహుమతి  సాధించిన నా మేనకోడలు ప్రవల్లి మళ్ళి ఈసారి కూడా బహుమతిని గెలుచుకుని వాళ్ళ బృందం కలసి సాధించిన విజయానికి వారికి వచ్చిన పారితోషికాన్ని ముఖ్యమంత్రి నిధికి తుపాన్ బాధితులకు విరాళంగా ఇచ్చి తమ పెద్ద మనసును  చాటుకున్నారు... చేతిలో డబ్బులు ఉంటే ఏ  సినిమాకి వెళదామా, లేదా ఎక్కడ పార్టీ చేసుకుందామా అని ఆలోచించే ఈనాటి యువతకు చక్కని మానవతా విలువలు చూపిన వీరు... భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నా సంతోషాన్ని మీ అందరితో పంచుకుంటున్నా.....

21, అక్టోబర్ 2014, మంగళవారం

మారని న్యాయం.....!!

అమ్మ చాటు బొమ్మలా చూసే పాపాయి
ఆటపాటల్లో ఆదమరచిన పసిడికొమ్మగా మారి
బాల్యాన్ని వదలి కౌమారాన్ని చీరగా చుట్టి 
ఆత్మార్పణలో అతివగా అవతరించిన ఇల్లాలై
అందుకున్న చేయి అగ్గిలో నెట్టేసినా అణకువతో
భరించి అమ్మగా మారి బంధాలను పంచినా
అనుబంధం తెలియని అధముల కోరల్లో
అణగ దొక్కబడుతున్నా ఆత్మీయతను
చూపిస్తూనే ఓ కంట కన్నీరు ఓ కంట పన్నీరు
ఒలికించే అమృతమూర్తి ఆడది...
అనాధ బతుకులో ఆలంబనగా మారి అన్ని తానైనా
మగాడనే అహాన్ని వదలని మదాన్ని భరించే
సాధనంగా మారిన సాధుజీవి... 
రాతిరి పగలు నిరంతర శ్రామిక యంత్రమైనా
విశ్రాంతికి నోచని బతుకులో అవిశ్రాంతపు
పోరాటంలో అలసినా సొలసినా అణువంత
ఆదరణకు నోచుకోని ధరణిపుత్రి.... 
అనాది నుంచి ఆధునిక యుగం వరకు
గతులు మారినా గమనాలు మారినా
మారని న్యాయం మగువకు మాత్రమే ఈనాటికి ...!!

18, అక్టోబర్ 2014, శనివారం

మారదు లోకం ఆగదు కాలం....!!

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితో కడుగు ఈ సమాజ జీవశ్చవాల్ని
మారదు లోకం ఆగదు కాలం

వెంటబడి తరిమే రాక్షస న్యాయం కట్టిన
రాతి సమాధులపై నిదురలేచిన అధర్మం
మారదు లోకం ఆగదు కాలం

పసితనాన్ని చిదిమి పడుపు వృత్తిగ మార్చి
అగాధపు జలధిలో అంతేలేని ధన దాహం
మారదు లోకం ఆగదు కాలం

కోర్కెల దాహం కళ్ళు మూసుకున్న కామం
వావి వరుసల నెరుగక మత్తెక్కిన మదగజం
 మారదు లోకం ఆగదు కాలం

రంగుల రాజ్యం హంగుపొంగుల అధికారం
సలాములు కొట్టే గులాములదే చట్టం
మారదు లోకం ఆగదు కాలం

ధన దాహం కీర్తి పతాకం నిరింతర లక్ష్యం
విలువల వలువలు వలచిన అమ్మతనం
మారదు లోకం ఆగదు కాలం

నిరంతరం కదిలే కాలచక్రంలో ఈ కధనాలు
నిత్య సత్య అక్షర వాస్తవ నిదర్శనాలు అయినా
మారదు లోకం ఆగదు కాలం

( సిరివెన్నెల గారికి క్షమాపణలతో.... )

సంద్రంలా నువ్వు.....!!

 ప్రియమైన నేస్తమా....
అమ్మ చాటు బొమ్మలా కొంగుచాటు నుంచి తొంగి చూస్తున్న బుజ్జాయి గుర్తుకు వస్తోంది నిన్ను తలచుకుంటుంటే... ఎప్పుడు చూసినా పుస్తకంలో తల దూర్చి చదివేస్తూనే ఉంటావాయే.... ఎందుకోయ్ అంత తాపత్రయం బాగా చదివేయాలని..... పుస్తకాలను చదవడం కాస్త పక్కన పెట్టి జీవితాన్ని చదువుతూ ప్రపంచాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయరాదు... పుస్తకంలో నుంచి ఒక్కసారి తల ఎత్తి చూడు... ఎన్ని రంగుల హంగుల రాతి జీవితాలు కనిపిస్తాయో.... ఒకప్పుడు నేను అలానే అనుకున్నా... మన చుట్టూ ఉన్న ప్రపంచం చాలా బావుందని... ఎంత బావుందో తెలిసాక జీర్ణించుకోవడం చాలా కష్టం అయ్యింది.... పైకి కనిపించే మంచితనం వెనుక దాగున్న మోసం... దాని చుట్టూ అల్లుకున్న నటన.... అవసరానికి తగినట్లుగా మార్పులు చేర్పులు.... ఓ గొప్పాయన (పేరు గుర్తు లేదులే) అన్నట్టు మానవ బంధాలన్నీ ఆర్ధిక అనుబంధాలుగా మార్చేసిన ఈ మనుష్యులలో మనము ఉన్నామని కించిత్ బాధగా కూడా ఉంది..... భావుకతలో బతికేద్దామంటే బాదరబందీలు ఎక్కువై భాష్యాలు తెలియకుండా కనుమరుగై పోతున్నాయి...ఎందుకో సముద్రం చాలా బావుంటుంది నాకు ... ఎన్నో జీవిత సత్యాలు కనిపిస్తాయి దానిలో... సముద్రంలో ఉన్నది పనికిరాదనుకునే ఉప్పునీరైనా మన అవసరానికి ఉప్పుగా పనికి వస్తోంది.... దానికున్న పారదర్శకత మనలో ఎంత మందికి ఉంది..?? ఎందుకో కాని ప్రతి అల నాకు ఓ జీవిత పాఠం నేర్పుతున్నట్టుగా అనిపిస్తుంది... తీరాన్ని చేరాలన్న తపన మధ్యలో పడిపోయినా మళ్ళి ఎగసిపడే దాని ఉబలాటం భలే ముచ్చటగా అనిపిస్తుంది... అలను విసిరినా మళ్ళి తనలోనికే చేర్చుకునే సాగరం ఎన్ని తప్పులు చేసినా కడుపులో దాచుకునే అమ్మ మనసులా హాయిగా అనిపిస్తుంది.... అలలు వెనుకకు వెళ్ళగానే ఆ తడి తగిలిన ఇసుక ఎంత స్వచ్చంగా ఉంటుందో ఎప్పుడైనా చూసావా... అచ్చు నీ మనసులానే...సంద్రానికి ఏమి పట్టదు... నీకు ఏది పట్టదు... అందుకే సముద్రము, దాని అంత విశాలమైన మనసున్న నువ్వు మీ ఇద్దరు నాకెంతో ఇష్టమైన నా నేస్తాలె ఎప్పటికి... అందుకే ఇలా నా అనుభూతుల భావాలు పంచుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు.... మరి ఉండనా బుజ్జాయి....!!
నీ నేస్తం.... 

17, అక్టోబర్ 2014, శుక్రవారం

ఇలా ఉండనీ నేస్తం....!!

ఏదో తెలియని బంధానికి....


చెప్పొద్దూ నాకు కోపంగానే ఉంది.... నీకోసం దాచిన కానుకను వేరే వాళ్ళకు ఇవ్వడానికి మనసు రాక... ఏం చేయాలో తెలియక అలానే దాచేశాను ఎవ్వరికి ఇవ్వకుండా... నీకు తెలిసినా అప్పుడు ఆ బహుమానాన్ని ఇవ్వమనడానికి బోలెడు బిడియం దానికి తోడు భయం కూడాను... కోపంగా చూడకు నిజం చెప్పేస్తున్నా.... పక్కనే ఉంటూ నక్కి నక్కి చూస్తావు కాని ఎప్పుడో ఓ మాట అది నేను పలకరిస్తేనే.... చూసావా ఎన్ని మాటల కబుర్లు మిగిలి పోయాయో మన మధ్యన... నా మాటలు వినిపించగానే నీ చూపులు ఆటే చూస్తుంటాయి దొంగలా... నువ్వెప్పుడో దొరికిపోయావు నేస్తం.... మాటల్లో చెప్పని మనసు కనిపించింది నీ కన్నుల్లో.... అవి చెప్పిన ఊసుల్లో.... ఏ దూర తీరాల్లో ఉన్నా..... చెరగని జ్ఞాపకాలుగా... చెప్పలేని సాక్ష్యాలుగా రాసిన కధల కావ్యాలు... మరపులేని మధుర సంతకాలుగా నిలిచినా.... ఏనాటికి కలవని బంధం ఇది... మనసులో శిలాక్షరాలుగా నిలిచి పోయిన చెలిమి ఇది.... అయినా దీనికి ఏ పేరు పెడితే సరి పోతుందంటావు...!! మాటాడక  మౌనాన్ని తోడుగా చేసుకుంటే నీ మౌనం నాతో మాట్లాడదనుకున్నావా.... నే మాట్లాడినా నీకర్ధం కాని భావాలు నువ్వు చెప్పక పోయినా నాకెలా తెలిసిపోతాయో మరి.... అవునూ మన ఇద్దరికే తెలిసిన ఈ సంగతి బావుంది కదూ.... నువ్వెప్పుడు నన్ను పలకరిస్తూనే ఉంటావు జ్ఞాపకాలలో.... ఎందరున్నా ఎవరు లేని ఏకాంతాన్ని ఎందుకు ఇంతగా ఇష్టపడతానో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది .... నీ తలపుల పరిమళాలతో నిండిన నా ఏకాంతంలో ఉన్నది నేను..నువ్వు .... అందుకే ఇంత బావుంది.... చెప్పకనే చెప్పినా... చెప్పక పోయినా చేరువగా చెంతనున్న నీ సాన్నిహిత్యం సేదదీరుస్తూనే ఉంటుంది ఎప్పుడు.... జ్ఞాపకాన్ని గతంలోనికి తొంగి చూడమంటే ఎప్పుడు నిన్నే చూపిస్తుంది.... ప్రతి వేకువ పొద్దులో నీ రూపాన్నే చూపిస్తుంది... తడబడే అడుగుల్లో తీపి జ్ఞాపకంగా మిగిలిన ఈ చెలిమి ఇలా ఉండనీ నేస్తం....!!
నీ అనుబంధం....

స్నేహ సమీరమా....!!

నిన్నా మొన్నటి కధగా నే మిగిలినా
రేయి పగలు ఒకటిగ మారినా
జతగ చేరిన జ్ఞాపకాలు గతమై పోవునా....

ఏకాంతానికి తోడుగా ఎదలో నిలిచినా
మాటల మాటున మనసే పంచినా
మౌనానికి తెలిసిన అర్ధాలే మారిపోవునా.....

కలలో కలసిన కల్పన కరిగినా
రాతిరి కాంతను రమ్మని పిలిచినా
వేకువ పొద్దుల వెలుతురు గురుతులు ఆగునా...

ఇలలో మిగిలిన మమతల బంధమా
కదిలే కాలపు క్షణాల మధుర కవనమా
స్వప్నమై చేరి చెంతనే ఉండిపో స్నేహ సమీరమా....!!

తెలుగు సాహితీ ముచ్చట్లు ...మూడవ భాగం....!!

సాహిత్యానికి మూలమైన బాషలోని అందాలు చందస్సు మూలంగా అమరినవే ... అందుకే మన తేట తెనుగులో చక్కనైన సాహిత్యాన్ని అందించిన ఎందరో తెలుగు కవిరాజులు మనకు ఆణిముత్యాలుగా సమకూర్చిన సాహితీ సంపద నేటికి చెక్కు చెదరని శిలాక్షరాలుగా నిలిచి పోయినదనడానికి ఎన్నో ఆధారాలు మనకు అజరామరమైన మధుర కావ్యాలుగా అలరాలుతున్నాయి నేటికీ.... ఇక సాహితీ ముచ్చట్లలో ముచ్చటైనవి గురు లఘువుల గమ్మత్తులతో మనలను అలరాలించిన అందమైన వృత్తాల ఛందస్సుతో కూడిన పద్య రాజాలు ఇప్పటి రోజులలో తెలిసిన వారిని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చును.....
య మా తా రా జ భా న స లగం అంటే చాలు.... తొమ్మిదిలో నేర్చుకోవడం మొదలు పెట్టిన చందస్సు మనలో చాలా మందికి కాస్తయినా గుర్తు ఉండే ఉంటుంది కదూ.... కొత్తగా నేర్చుకోవడం మొదలు పెట్టిన ఈ గురు లఘువుల గుర్తింపు మొదటి అంకం అయితే.... ఇక నోరు తిరగని పద్యాలలో వృత్తాల పేర్లు గుర్తు పట్టడం మరీ కష్టంగా అనిపిస్తూ అందరికి గుర్తున్న వృత్త పద్యం ఉత్పలమాల... చంపకమాల... శార్దూలం.... మత్తేభం.... మత్తకోకిల..... ఈపాటికి మీకు కొన్నయినా గుర్తు వచ్చే ఉంటాయి ఎందుకంటే మన అందరికి తెలుగు అంటే బోలెడు అభిమానం ఉంది కదా....
ఉదాహరణకు కొన్ని భ ర న భ భ ర వ.... స బ ర న మ య వ... మ స జ స త త గ.... ఇలా పద్య పాదంలో గురు లఘువులను గుర్తించి అది ఏ వృత్తమో అని చెప్పడం నాకయితే భలే ఇష్టంగా ఉండేది....
ఉత్పలమాల గురించి .....
భానుసమాన విన్భరన భారలగంబుల గూడి విశ్రమ
స్థానము నందు బద్మజ యుతంబుగ నుత్పలమాలయై చనున్. 

లక్షణములు:
పాదాలు: నాలుగు ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 20 

ప్రతిపాదంలోని గణాలు: భ, ర, న, భ, భ, ర, వ 
యతి : ప్రతిపాదంలోనూ 10 వ అక్షరము 
ప్రాస: పాటించవలెను, ప్రాస యతి చెల్లదు.
గణవిభజన ఉత్పలమాల వృత్త పాదము నందు గణవిభజన
      భ            ర         న           భ            భ         ర         వ


    U I I     U I U     I I I      U I I        U I I    U I U    I U
  పుణ్యుడు రామచం ద్రుడట పోయిము  దంబున గాంచెదం డకా  
పోతన తెలుగు భాగవతంలో 475 ఉత్పలమాల వృత్త పద్యాలను వాడారు. వాటిలో ఒకటిని ఉదాహరణగా పేర్కొంటున్నాను . ఉదాహరణ 1:
పుణ్యుడు రామచంద్రుడట వోయి ముదంబున గాంచె దండకా
రణ్యము దాపసోత్తమ శరణ్యము నుద్దత బర్హిబర్హలా
వణ్యము గౌతమీ విమల వాఃకణ పర్యటన ప్రభూత సా
ద్గుణ్యము నుల్ల సత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్.


మరికొన్ని వృత్తాల లక్షణాలు మళ్ళి వారం....

16, అక్టోబర్ 2014, గురువారం

మరల పలకరిస్తా....!!

పక్కనే దాగుని నా అక్షరాల్లోనికి
తొంగి చూస్తున్నావెందుకు...
తెల్లని నా మనసు కాగితంపై
నల్లని పదాల పవ్వళింపులు నీ కోసమే....

రేగిన ముంగురుల హొయల్లో
జలపాతాల అందాన్ని చూసావా....
చెదరిన ఆ సిరిగంధం తెచ్చిన
సు'మధుర' పరిమళం నీదే కదూ....

రారమ్మని పిలిచే రాగం పలికే
స్వరం వేల జన్మాల చిరపరిచితమా....
మనసు మౌనాలు మాటాడే వేళ
నాకు వినిపించే ఊసులు నీవే కదా...

చెలిమికి చేరువైన సాన్నిహిత్యంతో
చొరవగా చెంతకు చేరిన నేస్తానివా.... 
పోవోయి అనుకోని అతిధి
మరు జన్మకు మరల పలకరిస్తా....!! 

15, అక్టోబర్ 2014, బుధవారం

రాతిరి వేళ.....!!



రాతిరి పొద్దులో రాయంచను రారాజును అలరించు వేళ.....

చేజారుస్తూ...!!

రసాయనాలు పూసుకుని రంగులు మార్చేస్తూ 
వేషాల్లో మనసుని దాచేసి అవలీలగా నటించేస్తూ
నమ్మిన జీవితాల్లో సుడిగుండాల సుడులు తిప్పేస్తూ
కాసుల కోసం కుముక్కై బంధాలను బావురుమనిపిస్తూ 
నిజాన్ని అమ్మేసి నమ్మకాన్ని నట్టేట ముంచేస్తూ
అబద్దపు రాయితీలను అవలీలగా అందించేస్తూ
పబ్బాలు గడుపుకునే కుహనా వాదాన్ని కుమ్మరిస్తూ
వాస్తవాన్ని ముసుగేసి భ్రమలో మునకలేయిస్తూ
రాతిరి స్వప్నాలను పగటి కల్లలుగా మార్చేస్తూ
అద్దెకు తెచ్చిపెట్టుకున్నఅలంకారాన్ని మెరిపిస్తూ
రెప్పపాటు జీవితానికి రెప్ప పడని రేయిగా చేస్తూ
నిలువు దోపిడీల నియంతృత్వానికి కొమ్ము కాస్తూ
సహనానికి సాధికారానికి మధ్యన నలిపేస్తూ
అణగదొక్కుతున్న అభిమానం నోరు మూసేస్తూ
కన్నీటి సంద్రాలను అడ్డ దిడ్డంగా కాళ్ళతో తన్నేస్తూ
అదే గెలుపుగా ఊహించే అనాగరికతే అమలు చేస్తూ
ఏకాకిలా బతికే ఎడారి... సేదదీర్చే ఒయాసిస్సును చేజారుస్తూ...!!

14, అక్టోబర్ 2014, మంగళవారం

కలగా మిగిలింది నా నువ్వే....!!

ఎనకటి పొద్దులో ఎతికిన గురుతే
ఏ తావిల వెదుకాడినా ఎన్నెలంటి నీ రూపే
చేసిన బాసల్లో ముచ్చటలెన్నో
ఏటి ఇసుకలో రాసిన గీతలన్నీ నీ ఊసులే
నా వెంట రానని మొరాయిస్తున్న
మనసుని వెంబడించినది నీ జ్ఞాపకాలే
రాలిన ఆకుల గల గలల్లో
వినిపించే సడి నీ నవ్వుల సవ్వడే
ముసిరిన సందె వెలుగులో
కనిపించిన చుక్కల కాంతి నీ చిరునవ్వే
వేసారిన గుండెల్లో వెలితి
నీ చేరువలో చిలిపిగా మాయమాయనే
వేసవి నిట్టూర్పుల్లో తాకిన
తాపంలో దరి చేరిన మలయ సమీరం నువ్వే
భావాల రాగం భూపాలమై
అక్షర సాకారంలో అందమైన కలగా మిగిలింది నా నువ్వే....!!

ఇలానే ఉండిపోయాను.....!!

ఇదిగో వింటున్నావా....
                             ఎప్పుడు నేను చెప్పడమే కాని నువ్వు చెప్పడానికి ఏమి లేదా... లేక నేనే నీకు ఆ అవకాశం ఇవ్వకుండా అన్ని చెప్పేస్తున్నానా అని ఓ పక్కన చిన్న అనుమానం వస్తోంది.... అందుకేనేమో మాటలు మనసు సంద్రాన్ని అవలీలగా దాటేసి ఆవలి తీరం తెలియక పోయినా ధారాళంగా ప్రవహిస్తూనే ఉన్నాయి... అలల తాకిడి ముంచెత్తుతున్నా కెరటాలపై తేలియాడుతున్న వెండి వెన్నెల అందంలా నన్ను పలకరిస్తూనే ఉన్నాయి నీ జ్ఞాపకాలు.... చూసావా నీకు తెలియకుండానే ఎన్ని భావాలు నా మది పొత్తిళ్ళలో దాచుకున్నానో... చెప్పే అవకాశమే నువ్వు ఇవ్వడం లేదు మరి.... నాకెంతో ఇష్టమైన సముద్రం నా చెంతనే ఉంది కాని దానితో నేను పంచుకునే విషాదమే ఎక్కువై దానికి నన్ను సముదాయించడానికి ఏమి చేయాలో తోచక తన వద్దనే కూర్చున్న నా తనువుని తన కెరటాల స్పర్శతో ఊరడిస్తూ అప్పుడప్పుడు నన్ను తనలోనికి రమ్మని ఆహ్వానం పలుకుతోంది....వెళ్ళాలనే ఉన్నా దారితప్పి నువ్వు వస్తే బోసిగా ఉన్నతీరాన్ని చూసి నిరాశగా మరలి పోతావేమో అని అనిపించి ఇక్కడే ఉండిపోతున్నా.... తగిలిన గాయాలన్నీ గతాల పుటల్లో చేరుతుంటే బరువు మోయలేక గుండె కూడా ఆగిపోతోంది.... నా వద్దకు నీ రాక వాసంతమే తెస్తుందో లేక వర్షపు ధారలలో కలసిన నా కన్నీటికి జతగా వచ్చి హర్షపు జల్లుగా చేరుతుందో చూడాలని అనుకుంటూ నీ కోసం ఇక్కడే పొద్దుపొడుపు అరుణోదయాలు.... సాయంకాలపు నీరెండలు సాక్ష్యంగా అలల కలల కన్నుల్లో తొంగి చూస్తూ ఇలానే ఉండిపోయాను.....!!వేయి కన్నులతో వేచి చూస్తూ.....

13, అక్టోబర్ 2014, సోమవారం

నిత్యమైన ఆత్మ సత్యం....!!

ఆత్మాభిమానం తలను ఎత్తింది
అహంకారపు తిమిరాన్ని దాటుకుని
చేష్టలు ఉడిగిన చైతన్యం ఒక్కసారిగా
జూలు విదిలించి కట్టలు తెంచుకుంది
నిద్రాణమైన సత్తువ కొత్తగా నిదురలేచి
రహదారుల కొలతలు లెక్కలు వేస్తూ
అభిమానానికి అహానికి అడ్డు గోడలను
తొలగించే ఆయుధాన్ని సాధనంగా మలచే
మనసు మంత్రాన్ని జపించే యోగాన్ని
పురిటిగడ్డ  ఋణ భారాన్ని మోసుకుంటూ
రుద్రభూమికి అంకురార్పణ చేసిన
కుంపటి నిప్పుల సెగల పొగల దాహాన్ని
కప్పేసిన దుప్పటి చాటుగా చూస్తున్న
దేహాన్ని వీడని ఆత్మని పంపుతున్న
తరుణాన్ని పహరా కాస్తున్న చివరి మజిలి
చెప్పిన ఆత్మకధ ఈ అక్షరాల అల్లిక....!!

12, అక్టోబర్ 2014, ఆదివారం

నా వద్దకు రాని నిన్ను చూస్తున్నా...!!

ఎంతో ఇష్టమైన సంతోషానికి....
                                  నువ్వేమో చెప్పాపెట్టకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు ఎప్పుడో.... అప్పటి నుంచి ఇప్పటి వరకు వెదుకుతూనే ఉన్నా కనపడని నీకోసం ఆరాటంగా...ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూనే ఏ రోజుకారోజు గడిపేస్తున్నా... రాని నీకోసం దిగంతాల ఆవల వరకు పయనిస్తున్న మనసుని ఆరాటంగా అడుగుతూనే ఉన్నా... ఒక్కసారైనా నువ్వు కనిపించావని అబద్దమైనా చెప్పక పోతుందా నాకోసం అనుకుంటూ... ఏమిటో ఈ పిచ్చి వెదుకులాట నాకే తెలియడం లేదు... నీకు తెలుసా అందరు అనుకుంటున్నారు... నువ్వు లేవని విషాదాన్ని చెలిమిగా చేసుకుని కన్నీటి చుక్కలతో సహవాసం చేస్తున్నానని.... అది నిజమేనేమో కదా... మరి ఏం  చేయను చిరునవ్వు చెంతకు రాకుండా దాక్కుంది నీలానే.... అన్నట్టు చెప్పడం మరిచా ...నీ ఛాయైన నవ్వు నలుగురి కోసం నా పెదవులపై పవళించినా పక్కనే దాగిన కన్నీటిని దాయలేక ఎంత అవస్థ పడాల్సి వస్తోందో.... నువ్వు నాకు తెలియనప్పుడు మాత్రం ఎప్పుడు నాతోనే ఉన్నావు... నిన్ను తెలుసుకుందామనుకునే సరికి అందకుండా దాక్కుంటున్నావు.... నీకు బావున్నట్టుగా ఉంది ఈ దాగుడుమూతలాట.... బావుంటే సరే కాని అది నాతోనే ఎందుకు...?? చెదరని నీ చిరు దరహాసాన్ని నావద్దే ఉండమన్నా కాని... అది నువ్వు లేకుండా ఉండలేనని మారం చేస్తోంది... దాన్ని సముదాయించే మార్గం అయినా చెప్పవూ.... వెతికి వెతికి అలసిపోయాను నీ చిరునామా కోసం....చేరని లేఖలు ఎన్నో నాకు తెలియకుండానే నీతో పంచేసుకున్నా... అందుకేనేమో నువ్వు నా దగ్గర లేని వాస్తవం అంటే ఇష్టం లేకుండా నాకు తెలియక పోయినా నువ్వు నాతోనే ఉన్న గతం ఇప్పుడు తలచుకుంటుంటే ఎంతో బావున్నట్టుగా.... అదే నిజం అనుకుంటూ ఉండిపోతూ... నీ నేస్తమైన చిరునవ్వు చిలిపితనాన్ని చూస్తూ దాని వెనుకే దాగుని నా వద్దకు రాని నిన్ను
చూస్తున్నా...!!
ఎప్పటికి .....
నీ కోసం నిరీక్షించే నేను

10, అక్టోబర్ 2014, శుక్రవారం

నాకు నచ్చినట్టుగా....!!

నేను నీవుగా మారినా
నువ్వు నాలా మారక
నీవులా ఉండిపోయావు...!!

ఏకాంతంలో నీ జ్ఞాపకం
ఎద నిండుగా చేరగా
సహవాసం నీతోనే నిరంతరం....!!

అర్ధమైన అనుబంధం వ్యర్ధంగా
వగచి దూరంగా పోయినా
చుట్టుకున్న బంధం ఇదేనేమో...!!

పరుగు పెడుతున్న కాలాన్ని
ఆపలేక దానితో పోటి పడలేక
నిలిచి పోయిన జీవితం నాదేనేమో...!!

పట్టు పరుపులను వదలి
ముళ్ళ బాటలో నడిచిన కాళ్ళకు
అంటిన రక్తపు చారికలు పోనేలేదు ఇంకా...!!

చరమ గీతాల సాగనంపు సంగీతం
మృత్యు గీతాల మరణ మృదంగం
మధురంగానే అనిపిస్తోంది మరి....!!

జీవిత చివరి అంకంలో మిగిలిన
తెర పడని నాటకానికి ముగింపు
నేనే రాసుకోవాలి నాకు నచ్చినట్టుగా....!!

ఆస్వాదిస్తూ.....!!






రాలిన పూల రెక్కల జ్ఞాపకాల్లో నీ పరిచయ పరిమళాన్ని ఆస్వాదిస్తూ..... 

యాంత్రికత....!!

యాంత్రికంగా మారిపోయిన యంత్రాన్ని నేను
యాంత్రికతే తప్ప భావుకత లేని బతుకుగా 
మరల అతుకులే కాని మమతానురాగాలు లేకుండా 
రాపిడి ఒరిపిడుల రాజ్యాలలో ఓ పావుగా మిగిలి
అహంకారానికి అతకని మమకారాన్ని మరచి
మనసు లేని మరల యంత్రాలతో సహజీవనం సాగిస్తూ
అలంకారపు చిరునవ్వుని ఆసరాగా తీసుకుని
ఆశల సౌధాలలో విహరిస్తూ జారిపడిన వాస్తవంలో
నిలదొక్కుకోలేక మోసపు వలయంలో ఇమడలేక
ఎదురుగా అద్దంలో కనిపించే ప్రతిబింబాన్ని చూస్తూ
అసమర్ధతలో సమర్ధతని వెదికే సామర్ధ్యాన్ని పొగడలేక
నిరాశావాదాన్ని దరిచేరనివ్వని ఉదయపు సాయంత్రాల
క్రీనీడలలో కనిపించే నీలి నీడల నిజాలను నమ్మని
జీవితాల చీకటి కోణాల వెలుగులు విరజిమ్మిన కాంతిని
తట్టుకునే శక్తి లేని అశక్తత తల ఎత్తుకుంది వికటాట్టహాసంతో....!!

9, అక్టోబర్ 2014, గురువారం

అంతిమ విజయ సోపానం....!!

నా సమాధి మాట్లాడుతోంది వినిపిస్తోందా...
నిద్రాణమైన మనసు నిదుర పోతూనే ఉంది
మెలకువలో అబద్దపు నిష్టూరాలను తట్టుకోలేక  
అలసిన శరీరానికి ఆలంబన దొరకలేదని
తపన పడిన రోదన స్వరం ఆర్తిగా పిలుస్తున్నా...
వినిపించని దూర తీరాలలో దాగిపోయిన
దాతృత్వం కన్నీటిలో కరుగుతున్న కాలాన్ని
వెనుకకు తిప్పలేని నిస్సహాయత వెక్కిరిస్తూ...
ఆశల వలయాల శృంఖలాలను ఛేదించలేని
బంధనాలుగా బంధాలను వాస్తవంగా బంధిస్తే...
కరిగి పోతున్న జీవితంలో 'ని'వేదన మరచి
వేదన వరదలో మునుగుతున్న రాతిముక్క
ఆక్రోశం సూది మొనగా మారి శరమై శిఖరమై
అణచివేతకు ధీటుగా నిలబడాలన్న ఆ చిత్తం
పెనుగులాటల్లో పలుకుతున్న శిలా శాసనాలు
జీవ సమాదుల్లోని సజీవ ఘట్టాలుగా నిలుస్తూ
నినదిస్తున్న ఈ చిర పరిచిత స్వరాల ఘోషల
పోరాటమే అంతిమ విజయ సోపానం....!!

నేనుగా మిగిలి పోవాలని.....!!

 నాకేమీ కాని నీకు....
నాకు అర్ధం కాని మాటల పదాలు నీకెలా తెలుసా అని బోలెడు ఆశ్చర్యంగా ఉంది... అస్సలు మాటలే వద్దు అనుకున్నా మాటాడక తప్పని జీవితాలై పోయాయి... మరచి పోయిన బోలెడు అక్షరాలు ఇక్కడ ప్రత్యక్షమై పోతున్నాయి ఎందుకో... విలువలు తెలియని బతుకుని విలువగా చూడటానికి పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరుగా జారి పోయింది అని మధన పడే ఒపికే లేకుండా పోయింది... ముక్కలైన మనసుకి ఎన్నిసార్లు అతుకులు వేద్దామని ప్రయత్నం చేసినా అది అతుకులు పడక విడి పోతూనే ఉంది... సర్దుకు పోవడానికి చేసే ప్రతి ప్రయత్నాన్ని చేతగానితనంలా నువ్వు అనుకుంటూ... కారుతున్న ప్రతి కన్నీటి చుక్కకి సమాధానం చెప్పే రోజు కోసం ఎదురు చూసే సహనాన్ని కూడా చంపేసిన నీ అహం... నువ్వు ఇచ్చిందే నీకు తిరిగి ఇవ్వాలని చూస్తుంటే ఎందుకు ఒప్పుకోలేక పోతున్నావు..?? ఎప్పుడైనా మనం ఎదుటివారికి ఇచ్చేదే మనకి తిరిగి వస్తుంది అన్న చిన్న విషయం నీకు ఎందుకు గుర్తుకి రావడం లేదు... నమ్మిన పాపానికి పడిన ఈ మానసిక రోదనకు ఇంకా ఏం శిక్ష వేయాలని నీ కోరిక... కుటుంబం అంటే తెలియని వాళ్ళకి ఈ అనుబంధాలు.. అభిమానాలు... ప్రేమల గురించి ఎంత చెప్పినా ఉపయోగం ఉండదని చాలా ఆలశ్యంగా తెలిసింది.. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది... పెళ్ళాం, పిల్లలు మన హోదా కోసం కాదు... మన కోసం అని నీకు తెలిసే సమయం ఈ జన్మకు లేదని...
మొన్నీమద్యన జరిగిన దారుణం బాగా చదువుకున్న ప్రొపెసర్ తమ మధ్యన జరిగిన గొడవలకు కన్నబిడ్డలను చంపి తను ఆత్మహత్య చేసుకున్న వార్త విన్న రోజు ఆ ప్రోపెసర్ని తప్పు పట్టాను... చస్తే వాడు చావచ్చు కదా... పిల్లల్ని పొట్టన పెట్టుకున్నాడు.. ఏం హక్కు ఉంది అని... నీ పలాయన వాదాలు విని విని నాకు అనిపిస్తోంది అలా చేయడానికి ఆ తండ్రి మనసు  ఎంత క్షోభ పడిందో ఇప్పుడు తెలుస్తోంది.... మనం తప్పులు చేస్తూ గొంతు ఉంది కదా అని అరిస్తే తప్పు ఒప్పు అయిపోదు కదా.... నేనుగా బతకాలి అన్న ఆశను సమాధి చేసిన నీకు... నీతో సహకరించిన సమూహానికి... మీ అందరి చేతిలో మోసపోయిన మా బతుకుల చితిని కానుకగా సమర్పించి కనీసం ఆత్మగా మిగిలి పోవాలని కోరుకోవడం కూడా ఆ దేవునికి అత్యాశగా అనిపించి మృత్యువుని దగ్గర చేసినట్టే చేసి దూరం చేస్తూ ఆడుకుంటున్నాడు నీలానే....!!
నేనుగా మిగిలి పోవాలని.....

7, అక్టోబర్ 2014, మంగళవారం

నా కోసమే కాబోలు...!!

శాపగ్రస్థగా మారిన నా మనసు
చిలికిన హలాహలాన్ని దాచిన
వెన్నెల పరదాలు తూట్లు పడి
ఒలికించిన రుధిర వర్షపు ధారలలో
తడిసిన తనువు మరణించినా
తడి ఆరని గురుతుల కొవ్వొత్తుల
తరుగుతున్న రూపానికి సాక్ష్యంగా
వెలుగుతున్న కాంతుల వెలుతురులో
కారుతున్న కన్నీటికి తడిచిన కంటికి
చెమ్మను అద్దిన చెంపకు తెలిసిన
చెలిమి సంగతికి గడిచిన గతానికి
జరుగుతున్న వాస్తవానికి మధ్యన
ఇంకా జ్ఞాపకాలు మిగిలే ఉన్నాయి
నా కోసమే కాబోలు...!!

తెలుగు సాహితీ ముచ్చట్లు ...రెండవ భాగం....!!

 సభ్యులందరికీ........విజయదశమి శుభాకాంక్షలు.......
ఎన్నో అద్భుతాలు చోటు చోటు చేసుకున్న మన తెలుగు సాహిత్యానికి ముందుగా అమ్మ పాడిన లాలిపాటలు మధురమైనవి.... అన్నమయ్య పదాలు... జాణ పదాల జావళి పాటలు... ఇలా చెప్పుకుంటూ పొతే బోలెడు .... ఇక సాహితీ ముచ్చట్లలో ముచ్చటైనవి గురు లఘువుల గమ్మత్తులతో మనలను అలరాలించిన అందమైన వృత్తాల ఛందస్సుతో కూడిన పద్య రాజాలు ఇప్పటి రోజులలో తెలిసిన వారిని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చును.....అర్దాల ప్రతిపదార్దాలు  పదాల వ్యతిరేక పదాల నొక్కులతో ప్రకృతి వికృతుల కలయిక గ్రాంధికాల గమ్మత్తులతో అందమైన తెలుగు సొగసులు ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటాయి... అందమైన అలంకారాలు తెలుగు సొగసుకు మరింత శోభను చేకుర్చగా.... 

అతివకు నగలు సౌందర్యము కలిగించును. అలాగే కావ్యములకు ఈ అలంకారములు సౌందర్యమును కలిగించును. అలంకారములు రెండు రకములు. అవి:

శబ్దాలంకారములు

శబ్దమాత్ర ప్రధానములయినవి శబ్దాలంకారములు.
  • వృత్త్యానుప్రాసాలంకారము : ఒక హల్లు అనేక పర్యాయములు వచ్చునట్లు చెప్పబడినది. ఉదాహరణ: చొక్క పుటుక్కు క్రిక్కిరిసి స్రుక్కక పెక్కువ నక్క జంబుగన్. మరొక్క ఉదాహరణ పద్యంలో. గడన గల మగని జూసిన, అడుగడుగున మడుగులిడుదురు అతివలు తమలో, గడనుడిగిన మగని జూసిన నడుపీనుగ వచ్చె ననుచు నగుదురు సిమతీ. ఈ పద్యంలో అనే అక్షరము పలుమార్లు వచ్చి శబ్దాలంకారాన్ని చేకూర్చింది. అలాగే వచనములో కూడ శబ్ధాలంకరమునకు మరొక ఉదాహరణ: (అల్లసాని పెద్దనగారి మనుచరిత్రము లో) అనినన్ జిటిలుండు పటపటమని బండ్లు గొరికి, యటమటంమ్మున విద్య గొనుటయుంగాక గుట గుటలు గురుతోనా యని ..... ఇందులో ట అను అక్షరము పలుమార్లు వచ్చినది.
  • ఛేకానుప్రాసాలంకారము : అర్థ భేదము గల రెండేసి అక్షరములు వ్యవధానము లేకుండా వెనువెంటనే వచ్చుట. ఉదాహరణ: భీకర కర వికరముల్.
  • లాటానుప్రాసాలంకారము : అర్థభేధము లేక తాత్పర్య భేధము కలుగునట్లు ఒక పదము రెండు సార్లు ప్రయోగింపబడిన అది లాటానుప్రాసము. ఉదాహరణ: శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ.
  • యమకాలంకారము : అర్థభేదముగల అక్షరముల సమూహమును మరల మరల ప్రయోగింపబడినచో దానిని యమకము అందురు. ఉదాహరణ: పురమునందు నందిపురమునందు.
  • ముక్తపదగ్రస్తాలంకారము : విడిచిన పద భాగము అవ్యవధానముగా మరల గ్రహించుచు వ్రాయబడిన అది ముక్తపదగ్రస్తము. ఉదాహరణ: ఓ రాజా! శత్రువులను జయించుము, జయించి రాజ్యమును పొందువు. పొంది ప్రజలను పాలింపుము. పాలించి సుఖమును పొందుము.
  • అంత్యప్రాసాలంకారము : మొదటి పాదం చివరి భాగంలో ఏ అక్షరంతో (అక్షరాలతో) ముగిసిందో, రెండో పాదం కూడా అదే అక్షరంతో (అక్షరాలతో) ముగుసినట్లైతే అది అంత్య ప్రాసం అవుతుంది. ఉదాహరణ: తోటలో నారాజు తొంగి చేసెను నాడు; నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు.

అర్థాలంకారములు

అర్థ విశేషములను బట్టి వచ్చునవి అర్థాలంకారములు.
  1. ఉపమాలంకారం: ఉపమానానికి, ఉపమేయానికి సామ్య రూపమైన సౌందర్యాన్ని సహృదయ రంజకంగా చెప్పడం ఉపమాలంకారం.
  2. అన్వయము
  3. ఉపమేయోపమ అలంకారం: రెండు వస్తువులకు పర్యాయ క్రమమున ఉపమేయ ఉపమానత్వమును కల్పించి చెప్పడం ఉపమేయోపమ అలంకారం.
  4. ప్రతీపాలంకారం : ఉపమానముగా ప్రసిద్ధమయిన దానిని, ఉపమేయంగా కల్పించి చెప్పడం ప్రతీపాలంకారం. అంటే ఉపమానం కావలసింది ఉపమేయంగా మారినందువల్ల రెండింటినీ ఉపమేయాలుగానే భావించవలసి వస్తుంది.
  5. రూపకాలంకారం : ఉపమేయమునందు ఉపమాన ధర్మాన్ని అరోపించడం రూపకాలంకారం. ఉపమేయమునకు ఉపమానం తోటి అభేదాన్ని గాని, తాద్రూప్యాన్ని గాని వర్ణించటం రూపకం. ఒకటి అభేద రూపకం, రెండవది తాద్రూప్య రూపకం.
  6. పరిణామము
  7. ఉల్లేఖాలంకారం : ఒక్క వస్తువే ఒక్కొక్కరికి ఒక్కొక్కటిగా కనిపించడం ఉల్లేఖాలంకారం.
  8. స్మృతి
  9. భ్రాంతి మదలంకారం : ఒక దానిని చూచి మరొకటిగా భ్రమించినచో అది భ్రాంతిమత్ అలంకారం
  10. సందేహాలంకారం : సందేహం (అనిశ్చయ జ్ఞానం) వలన ఏర్పడే అలంకారం సందేహాలంకారం.
  11. అపహ్నుతి
  12. ఉత్ప్రేక్షాలంకారము : ఉపమానమునందున్న ధర్మాలు ఉపమేయమునందు కూడా ఉండటం వలన ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఉత్ప్రేక్షాలంకారం.
  13. అతిశయోక్త్యలంకారము : చెప్పవలసిన దానిని ఎక్కువ చేసి చెప్పడం, గొప్పగా చెప్పడం అతిశయోక్తి అలంకారం.
  14. తుల్యయోగిత
  15. దీపకాలంకారం : ప్రకృతాప్రకృతములకు ధర్మైక్యం చేసి చెప్పడం దీపకాలంకారం.
  16. ఆవృత్తిదీపకము
  17. ప్రతివస్తూపమాలంకారం : రెండు వాక్యముల కొక సామాన్య ధర్మముతో అన్వయం ఉంటే అది ప్రతి వస్తూపమాలంకారం. అంటే ప్రతి వాక్యార్ధంలోనూ ఒకే సమాన ధర్మాలను భిన్న పదాలచేత తెలియజేయడం.
  18. దృష్టాంతాలంకారము : రెండు వాక్యాల యొక్క వేరువేరు ధర్మాలు బింబ ప్రతిబింబ భావంతో చెబితూ ఉంటే అది దృష్టాంతాలంకారం.
  19. నిదర్శన
  20. వ్యతిరేకాలంకారం : ఉపమేయ ఉపమానములకు పోలికతో పాటు భేదమును కూడా చెప్పినచో అది వ్యతిరేకాలంకారం.
  21. సహోక్తి
  22. వినోక్తి
  23. సమాసోక్తి
  24. పరికరాలంకారం : సాభిప్రాయ విశేషణాలతో కూడినచో అది పరికరాలంకారం.
  25. పరికరాంకురము
  26. శ్లేషాలంకారము : అనేకార్థాల నాశ్రయించుకొని యుండిన ఎడల అది శ్లేషాలంకారం.
  27. అప్రస్తుత ప్రశంసాలంకారం : ప్రస్తుతమును ఆశ్రయించుకొని, అప్రస్తుతమును తలచుకొన్నచో అది అప్రస్తుత ప్రశంసాలంకారం.
  28. ప్రస్తుతాంకురము
  29. పర్యాయోక్తము
  30. వ్యాజస్తుతి అలంకారం : పైకి నిందిస్తున్నట్లుగా కనిపించినా తరచిచూస్తే స్తుతి చేస్తున్న విధం కనిపిస్తుంది. పైకి స్తుతిస్తున్నా తరచిచుస్తే నిందిస్తున్నట్లు కనిపిస్తుంటే వ్యాజస్తుతి అలంకారం.
  31. వ్యాజనిందాలంకారం : నింద చేత మరియొక నింద స్ఫురించటం వ్యాజనిందాలంకారం.
  32. ఆక్షేపము
  33. విరోధాభాసాలంకారం : విరోధమునకు అభాసత్వము కలుగుచుండగా విరోధాభాసం అవుతుంది. పైకి కనిపించే విరోధం విరోధంగా కాకుండా విరోధం ఉన్నట్లుగా అనిపించి, ఆలోచిస్తే ఆ విరోధం అభాసం (పోతుంది) అవుతుంది. కనుక ఇది విరోధాభాసాలంకారం.
  34. విభావన
  35. విశేషోక్తి అలంకారం : సమృద్ధంగా కారణం ఉండి కూడా కార్యోత్పత్తి జరగక పోవడం విశేషోక్తి అలంకారం.
  36. అసంభవము
  37. అసంగతి
  38. విషమాలంకారం : అనను రూపాలయిన (సమాలు కాని) రెండింటికి సంబంధం వర్ణింపబడిన ఎడల అది విషమాలంకారం.
  39. సమము
  40. చిత్రము
  41. అధికము
  42. అల్పము
  43. అన్యోన్యము
  44. విశేషము
  45. వ్యాఘాతము
  46. కారణమాల
  47. ఏకావలి
  48. మాలాదీపకము
  49. సారాలంకారం : పూర్వపూర్వముల కంటె ఉత్తరోత్తరాలకు ఉత్కర్ష కలిగించడం సారాలంకారం. ముందున్న వాటి కంటె తర్వాత వచ్చేవాటికి గొప్పతనాన్ని కలిగించడం ఉత్తరోత్తర ఉత్కర్ష అంటారు.
  50. యథాసంఖ్య అలంకారం : ఒక దాని తరువాత ఒకటిగా వరుసగా సమాన సంఖ్యాకాలయ్యే వాటి యొక్క సముదాయం యథాసంఖ్య లేదా క్రమ అలంకారం.
  51. పర్యాయము
  52. పరివృత్తి
  53. పరిసంఖ్య
  54. వికల్పము
  55. సముచ్చయము
  56. కారకదీపకము
  57. సమాధి
  58. ప్రత్యనీకము
  59. కావ్యార్థాపత్తి
  60. కావ్యలింగాలంకారం : సమర్థనీయమయిన అర్థానికి సమర్థనం కావ్యలింగాలంకారం.
  61. అర్థాంతరన్యాసాలంకారం : సామాన్యం చేత విశేషం గాని, విశేషం చేత సామాన్యం గాని సమర్థింప బడితే అది అర్థాంతరన్యాసాలంకారం.
  62. వికస్వరము
  63. ప్రౌడోక్తి
  64. సంభావన
  65. మిథ్యాధ్యవసితి
  66. లలితము
  67. ప్రహర్షణము
  68. విషాదము
  69. ఉల్లాసము
  70. అవజ్ఞ
  71. అనుజ్ఞ
  72. లేశము
  73. ముద్ర
  74. రత్నావళి
  75. తద్గుణాలంకారం : స్వీయ గుణాన్ని వదిలేసి మరొక దాని గుణాన్ని స్వీకరించటం వర్ణించినట్లయితే అది తద్గుణాలంకారం.
  76. పూర్వరూపము
  77. అతద్గుణము
  78. అనుగుణము
  79. మీలితము
  80. సామాన్యము
  81. ఉన్మీలితము
  82. విశేషము
  83. ఉత్తరము
  84. సూక్ష్మము
  85. పిహితము
  86. వ్యాజోక్తి
  87. గూడోక్తి
  88. వివృతోక్తి
  89. యుక్తి
  90. లోకోక్తి అలంకారం : సందర్భాన్ని అనుసరించి ఒక సామెత లేదా నానుడి చెప్పడం లోకోక్తి అలంకారం.
  91. ఛేకోక్తి అలంకారం : లోకోక్తితో పాటు అర్థాంతర స్ఫురణం కూడా ఉండటం ఛేకోక్తి అలంకారం.
  92. వక్రోక్తి అలంకారం : శ్లేష వలన గాని, కాకువు వలన గాని అన్యార్ధం కల్పించబడిన అది వక్రోక్తి అలంకారం.
  93. స్వభావోక్తి అలంకారం : జాతి, గుణ, క్రియాదుల చేత దాని స్వభావాన్ని వర్ణించిన ఎడల అది స్వభావోక్తి అలంకారం.
  94. భావికము
  95. ఉదాత్తాలంకారం : సమృద్ధిని గాని, అన్యోపలక్షిత మయిన శ్లాఘ్య చరిత్రను గాని వర్ణించిన ఎడల అది ఉదాత్తాలంకారం అవుతుంది.
  96. అత్యుక్తి
  97. నిరుక్తి
  98. ప్రతిషేధము
  99. విధి
  100. హేతువు
కావ్యానికైనా, కవితకైనా, పాటకైనా, పద్యానికైనా అలంకారం అలంకారాలే. ఈ సొమ్ములతో గూడిన రచనలను స్రావ్యమైన గొంతుతో గానం చేసినప్పుడు వినే మనిషి తనకు తెలియకుండానే లీనమై పరవశించి పోతాడు. మనిషి పుట్టుకతో అలంకారాలు పుట్టినట్టు భాష పుట్టుకతో పాటే ఈ అలంకారాలు పుట్టాయేమో! నిజమైన ఆవేశంతో మాట్లాడే మనిషిని గమనించండి. అతని మాటల్లో ఎన్ని అలంకారాలు దొర్లుతాయో !. వ్యాకరణ శాస్త్రాలు పుట్టి అలంకారాన్ని రకరకాలు గా విభజించి అలంకార శాస్త్రానిగా ప్రాచుర్యం జరిపారు కానీ నిజానికి వ్యాకరణం వల్ల భాషకానీ అలంకారాలు కానీ పుట్టలేదు. బహుశా పద్యం పుట్టిందేమో !. ఏ వ్యాకరణం తెలియని పల్లె వాసీల భాషలో ఎన్నో అలంకారాలు అలవోకగా దొర్లుతుంటాయి.

ఇక మన వాఙ్మయ చరిత్ర చూసినట్లైతే భరతుడు నాట్యశాస్త్రాన్ని యమకమనే శబ్దాలంకారాన్ని, ఉపమ, దీపక, రూపక ములనెడి అర్థాలంకారాలను చెప్పాడని అంటారు. వివిధ వ్యాకరణ శాస్త్రవేత్తలు ఈ అలంకారాలను వివిధరకాలుగా విభజించినట్లు కనిపిస్తుంది.

దండి - 34 అలంకారాలని చెప్పాడు
మమ్మటుడు - 59 అలంకారాలు
విద్యానాథుడు - 66 అలంకారాలు
చన్ద్రాలోక కర్త - 101 అలంకారాలు
కువలయానందము ( అప్పయ్య దీక్షుతులు ) - 124 అలంకారాలు .....నాకు నాకు తెలిసిన నేను సేకరించిన అలంకారాల సమాచారాన్ని ఈ వారం అందించాను.... 

వివరణ తెలుగు   వికిపీడియా సౌజన్యంతో....
హృదయస్పందనల చిరుసవ్వడి సహకారంతో.....
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో..... .

తెలుగు సాహితీ ముచ్చట్లు ....మొదటి భాగం....!!

ఏ సాహిత్యానికైనా  మూలం భాష ... భాషకు పట్టుకొమ్మలు అక్షరాలు... ఆ క్రమలోనే మన తెలుగు అక్షరాలు ఇలా ఉన్నాయి... తెలుగు భాషకు అక్షరములు యాభై ఆరు. వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములు గా విభజిస్తారు. ఇరవై ఒకటవ శతాబ్దంలో బాగా వాడుకలో ఉన్నవి 12 అచ్చులు, 31 హల్లులు, నకార పొల్లు, నిండు సున్న, వెరసి 45 అక్షరములు. అరసున్న, విసర్గ వాడకం చాలవరకూ తగ్గిపోయింది. తెలుగు వర్ణ సముదాయమును మూడు విధాలుగా విభజించవచ్చును.
 అచ్చులుఅచ్చులు 16 అక్షరాలు. స్వతంత్రమైన ఉచ్చారణ కలిగియుండుట వలన వీటిని ప్రాణములనీ, స్వరములనీ కూడా అంటారు. అచ్చులు మూడు రకములు. అవి:
  • హ్రస్వములు - కేవలము ఒక మాత్ర అనగా రెప్పపాటు కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను హ్రస్వములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: అ, ఇ, ఉ, ఋ, ఌ, ఎ, ఒ.
  • దీర్ఘములు - రెండు మాత్రల కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను దీర్ఘములు అంటారు. ఇవి తొమ్మిది అక్షరములు: ఆ, ఈ, ఊ, ౠ, ౡ, ఏ, ఓ.
  • ప్లుతములు - ఇవి ఉచ్ఛరించడానికి మూడు మాత్రల కాలం పట్టును. ఇవి రెండు అక్షరములు: ఐ, ఔ.
అచ్చులు






ఉభయాక్షరమలు


  అం    అః

హల్లులు

హల్లులు 37 అక్షరములు. క నుండి హ వరకు గల అక్షరములను హల్లులు అందురు. ఈ హల్లులు అచ్చుల సహాయము లేనిదే పలుకబడవు. ఉదాహరణ: క అనాలంటే క్ + అ కలిస్తేనే క అవుతుంది. వీటిని ప్రాణులనీ, వ్యంజనములనీ పేర్లు కలవు.
  • పరుషములు: పలుకడానికి కొంత శ్రమ అవుసరమైనవి. వీటికి "శ్వాసములు" అన్న పేరు కూడా ఉంది. "క,చ,ట,త,ప"లు పరుషములు.
  • సరళములు : తేలికగా పలికేవి. వీటికి "నాదములు" అన్న పేరు కూడా ఉంది. - "గ,జ,డ,ద,బ"లు సరళములు
  • సరళములు - హల్లులలో సులభముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - గ, జ, డ, ద, బ.
  • పరుషములు - హల్లులలో కఠినముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - క, చ, ట, త, ప.
  • స్థిరములు - పరుషములు, సరళములు కాక మిగిలిన హల్లులన్నియు స్థిరములు. ఇవి - ఖ, ఘ, ఙ, ఛ, ఝ, ఞ, ఠ, ఢ, ణ, థ, ధ, న, ఫ, భ, మ, య, ర, ఱ, ల, ళ, వ, శ, ష, స, హ, క్ష.
  • స్పర్శములు - ఇవి క నుండి మ వరకు గల అక్షరములు. ఇవి ఐదు వర్గములుగా విభజింపబడినవి.
    • క వర్గము - క, ఖ, గ, ఘ, ఙ
    • చ వర్గము - చ, ఛ, జ, ఝ, ఞ
    • ట వర్గము - ట, ఠ, డ, ఢ, ణ
    • త వర్గము - త, థ, ద, ధ, న
    • ప వర్గము - ప, ఫ, బ, భ, మ

ఉభయాక్షరములు

ఉభయాక్షరములు 3 అక్షరములు. సున్న, అరసున్న, విసర్గలు.
  • సున్న - దీనిని పూర్ణబిందువు, నిండు సున్న, పూర్ణానుస్వారము అని పేర్లు కలవు. అనుస్వారము అనగా మరియొక అక్షరముతో చేరి ఉచ్చరించబడుట. పంక్తికి మొదట, పదానికి చివర సున్న ను వ్రాయుట తప్పు. అదే విధంగా సున్న తరువాత అనునాసికమును గాని, ద్విత్వాక్షరమును గాని వ్రాయరాదు. ఇవి రెండు రకములు.
    • సిద్ధానుస్వారము - శబ్దముతో సహజముగా ఉన్న అనుస్వారము. ఉదాహరణ: అంగము, రంగు.
    • సాధ్యానుస్వారము - వ్యాకరణ నియమముచే సాధించబడిన అనుస్వారము. ఉదాహరణ: పూచెను+కలువలు = పూచెంగలువలు.
  • అరసున్న - దీనిని అర్ధబిందువు, అర్ధానుస్వారము, ఖండబిందువు అని పేర్లు కలవు. ప్రస్తుతము ఇది తెలుగు వ్యావహారిక భాషలో వాడుకలో లేదు. కానీ ఛందోబద్ధమైన కవిత్వంలో కవులు దీనిని వాడుతారు.
  • విసర్గ - ఇది సంస్కృత పదములలో వినియోగింపబడుతూ ఉంటుంది. ఉదాహరణ: అంతఃపురము, దుఃఖము.

ఉత్పత్తి స్థానములు

ఉత్పత్తి స్థానములు
  • కంఠ్యములు : కంఠము నుండి పుట్టినవి - అ, ఆ, క, ఖ, గ, ఘ, జ్ఞ, హ.
  • తాలవ్యములు : దవడల నుండి పుట్టినవి - ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, య, శ.
  • మూర్థన్యములు : అంగిలి పైభాగము నుండి పుట్టినవి - ఋ, ౠ, ట, ఠ, డ, ఢ, ణ, ష, ఱ, ర.
  • దంత్యములు : దంతముల నుండి పుట్టినవి - త, థ, ద, ధ, న, చ, జ, ర, ల, స.
  • ఓష్ఠ్యములు : పెదవుల|పెదవి నుండి పుట్టినవి - ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ.
  • నాసిక్యములు (అనునాసికములు) : నాసిక నుండి పుట్టినవి - ఙ, ఞ, ణ, న, మ.
  • కంఠతాలవ్యములు : కంఠము, తాలువుల నుండి పుట్టినవి - ఎ, ఏ, ఐ.
  • కంఠోష్ఠ్యములు : కంఠము, పెదవుల నుండి పుట్టినవి - ఒ, ఓ, ఔ.
  • దంత్యోష్ఠ్యములు : దంతము, పెదవుల నుండి పుట్టినవి - వ.

ఆధునిక భాషలో వాడుకలో ఉన్న వర్ణమాల

  • అచ్చులు (12): అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఒ , ఓ , ఔ,
  • పూర్ణ బిందువు (1): అం (ఒక ఉదాహరణ)
  • నకారపొల్లు (1): క్ (ఒక ఉదాహరణ)
  • హల్లులు (31):
    • క వర్గము - క, ఖ, గ, ఘ
    • చ వర్గము - చ, ఛ, జ, ఝ
    • ట వర్గము - ట, ఠ, డ, ఢ, ణ
    • త వర్గము - త, థ, ద, ధ, న
    • ప వర్గము - ప, ఫ, బ, భ, మ
    • య, ర, ల, వ, శ, ష, స, హ,ళ, క్ష, ఱ

గుణింతాలు

తెలుగులొ, ఒక్కొక్క అక్షరానికి గుణింతాలు ఉన్నాయి. "క" అక్షరానికి గుణింతాలు: క, కా, కి, కీ, కు, కూ, కె, కే, కై, కొ, కో, కౌ, కం, కః

ఒత్తులు

ఒక హల్లుకి ఇంకొక హల్లు చేరినప్పుడు తరువాతి హల్లు చాలా సార్లు తలకట్టులేని రూపమును లేక వేరొక రూపములో కనబడుతుంది. ఉదాహరణకు హల్లు కు అదే హల్లు చేరినప్పుడు కనబడే విధం చూడండి
  • క్క, ఖ్ఖ, గ్గ, ఘ్ఘ, ఙ్ఙ
  • చ్చ, ఛ్ఛ, జ్జ, ఝ్ఝ, ఞ్ఞ
  • ట్ట, ఠ్ఠ, డ్డ, ఢ్ఢ, ణ్ణ
  • త్త, థ్థ, ద్ద, ధ్ధ, న్న
  • ప్ప, ఫ్ఫ, బ్బ, భ్భ, మ్మ
  • య్య, ర్ర, ల్ల, వ్వ, శ్శ, ష్ష, స్స, హ్హ, ళ్ళ, ఱ్ఱ.

అఖండము

కు వత్తు చేర్చినప్పుడు మామూలు ష వత్తు బదులు వేరే రూపం(క్ష) వస్తుంది.

చిన్నప్పుడు  ణ రాయడం రాక దెబ్బలు తినడం మొదటిసారి... ఈ అక్షరాలు చూస్తుంటే నాకైతే ఓ పెన్నిదిని చూసినట్టుగా ఉంది... మనం వాడే మనకు తెలిసిన సంఖ్యలు కూడా తెలుగు సంఖ్యలు కాదు... అవి కూడా మీకోసం...
తెలుగు సంఖ్యలు. ౧. ౨. ౩. ౪. ౫. ౬. ౭. ౮. ౯. ౧౦
                           1. 2. 3. 4.  5.  6. 7. 8. 9.  10.

అమ్మ తో అ ఆ ల అచ్చులు క చ ట ప గ జ డ ద బ హల్లులతో సాగి య ర ల వ లతో నిండి ద్విత్తాక్షరాల లతో  కూడి ఱ తో నిలిచి సంయుక్తాక్షరాల సంయమనంతో గుణింతాల గమ్మత్తులతో చేరిన పసందైన తెలుగు... స రి గ మ ప ద ని సప్త స్వరాల సంగీతానికి ఆద్యమై విలసిల్లుతున్న గానామృతమే మన తెలుగు సాహిత్యం... ఎందరో మహానుభావులు అందరికి వందనాలు...
ప్రాచీన మన తెలుగు సంస్కృతిలో కావ్యాలకు పెద్ద పీట వేసారు ఆ రోజుల్లో.... ఆదికవి నన్నయ్య నుండి తిక్కన, ఎర్రన .... శ్రీనాధ కవిల కావ్యాలతో అలరాలిన తెలుగు గడ్డ  మహా భారత పంచమ వేదాన్ని తెలుగులో అనువదించిన కవిత్రయం... శ్రీనాధుని శృంగార నైషధం,  హర విలాసం, సహజ కవి పోతనామాత్యుని తేనే సొగసుల తీయదనాన్ని అందించిన భాగవతాన్ని... ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఎన్నెన్నో మధురమైన కావ్యాలు మన సొంతం.... ఇవి మనకు కొన్ని తరాల ముందు ....
విశ్వనాధ వారి వేయి పడగలు మనలో తెలియని వారు అప్పటిలో చాలా తక్కువ.... కృష్ణ శాస్తి కిన్నెరసాని.... తిలక్ సాహిత్యం .... ఒక భాగమైతే గురజాడ, కందుకూరి వీరేశలింగం వీరి నాటక రచనలు ప్రజల్లో ఇప్పటికి చెరగని ముద్రలుగా నిలిచిపోయాయి... కావ్యం, కవిత్వం , వచనం, నాటకం వీటిలో...  ప్రతి ఒక్కరిది ఒక్కో శైలి...తెలుగు నుడికారాలను ఒంపులు తిప్పుతూ ఒక్కో తరం ఒక్కో రకమైన భావుకతను అందించి తెలుగు భాషకు తరగని వన్నెలు అద్దడం మన మహద్భాగ్యం....!!
వివరణ తెలుగు   వికిపీడియా సౌజన్యంతో.....
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....  
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner