27, నవంబర్ 2014, గురువారం

నాకు దిగులెందుకు చెప్పు నేస్తం....!!

నేస్తం....
           ఏంటో చాలా రోజులు అయ్యింది మనం 'స్వ'గతాలుమాట్లాడుకుని... జీవితంలో మనం ఎవ్వరి గురించి పట్టించుకోకపోయినా మన గురించి పట్టించుకునే వాళ్ళు కొంతమందయినా ఉండటం ఓ రకంగా చాలా అదృష్టమనే చెప్పుకోవాలి... నేను నా బ్లాగులో రాయడం మొదలుపెట్టి ఐదు ఏళ్ళు గడచినా ఎప్పుడు ఎవరిని వ్యక్తిగతంగా ఓ మాట అన్నది లేదు... తప్పు ఉంటే మాత్రం తర తమ బేధం చూడలేదు... రాజకీయ పరంగా వ్యాసాలూ రాసి ఉండవచ్చు కాని.. ఎప్పుడు నా వ్యక్తిగతాన్నే రాసుకున్నా... ఎవరైనా అడిగితే వాళ్ళది నాది అనుకునే రాశాను సామాజిక పరంగా సమస్య ఉంటే... ఒక్కోసారి చిన్న మాటకు కూడా మనసులు మార్చుకునే మానవత్వం ఉంటుంది అని నాకు ప్రత్యక్షంగా తెలుసు... నా చిన్నప్పటి నుంచి ఈ రాయడం అన్నది నాలో భాగమై పోయింది... సంతోషమయినా, బాధయినా అక్షరాలతో పంచుకోవడం అలవాటుగా మారి ఇంజనీరింగ్లో మా సార్ తన మనసు మార్చుకోవడానికి కూడా ఈ అక్షరాలే కారణం అయ్యాయి... నేను మారడానికి కూడా ఈ రోజు ఇలా ఉండటానికి ఈ అక్షరాలే కారణం... పుస్తకాలు చదివినంత మాత్రాన జనాలు మారతారా ... వీళ్ళ పిచ్చి కాని అని అనుకుంటారు చాలా మంది... పిచ్చి కాదు వాస్తవం ఇది... అందుకు నేను, నా జీవితమే సాక్ష్యం... కాలు తడవకుండా సముద్రాన్ని దాటవచ్చు.. కాని కన్ను తడవకుండా సంసారాన్ని ఈదలేము అన్నది ఎంత నిజమో అందరికి తెలుసు... నేను ఎవరి స్వ విషయాల జోలికి వెళ్ళను... ఈ సంగతి నేను రాసిన నా తొమ్మిది వందలకు దగ్గరలో ఉన్న పోస్ట్స్ చూస్తే ఎవరికైనా అర్ధం అవుతుంది... ఒకరు మనకి తెలుసు అని చెప్పడం వేరు వాళ్ళ సొంత విషయాలు వాళ్ళ పరోక్షంలో వేరే వాళ్ళతో చర్చించడం ఎంత వరకు న్యాయం...?? నా నేస్తాలయిన అందరికి నేనేంటో బాగా తెలుసు... సంసారం అన్నాక సవాలక్ష చిన్నా చితక సమస్యలు ఉంటాయి... లేకుండా ఒక్కరైనా ఉన్నారా నేస్తం... మనం అభిమానించే వారి దగ్గర మన విషయాలు చెప్పుకుంటే బావుంటుంది అంతే కాని ఫలానా వాళ్ళు ఇలా... అలా అని చెప్తే ఏం వస్తుంది... నాకు ఇది ఎప్పటికి అర్ధం కాని పెద్ద ప్రశ్నే...!! మన అవసరం కోసం ఎదుటివాళ్ళని పావులుగా వాడుకోవడమంత ఆత్మ ద్రోహం మరేది లేదు... రెండు చేతులు కలవనిదే చప్పట్లు రావు కదా... మంచి చెడుల బేరీజే చక్కని జీవితానికి పునాది... అమ్మో చాలా విషయాలు చెప్పేసాను ఈసారికి... ఎన్ని చెప్పినా భరించే నువ్వు నాకు తోడుగా ఉండగా నాకు దిగులెందుకు చెప్పు నేస్తం.... ఉండనా మరి ఇప్పటికి...
నీ ప్రియ నెచ్చెలి...

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner