12, డిసెంబర్ 2014, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... పదునొకటవ భాగం....!!

సహిత్యస్య భావః ఇతిః సాహిత్యం అని వ్యుత్పత్తి. అంటే హితముతో కూడి వున్నదే సాహిత్యము అని అర్థం. హితమును ఇవ్వనిది సాహిత్యము కాదు అని కూడా అర్థం... వారం వారం మనం చెప్పుకుంటున్న సాహితీ ముచ్చట్లలో సాహిత్యానికి అర్ధాన్ని ఇలా చెప్పారు... ఏదో చిన్న అనుమాన నివృత్తి కోసం అడిగిన వెంటనే తమ సమయాన్ని నాకు కేటాయించి ఇంత చక్కని అర్ధాన్ని నాకు వివరించిన గౌతమ్ కాశ్యప్ గారికి నమస్సులు... వాడుక భాషలో మనం వాడే పదాలు మనకు తెలియకుండానే కొన్నిసార్లు చాలా బరువైన భావాన్ని అందిస్తాయి... మన ప్రమేయం లేకుండానే ఎన్నో సంస్కృత పదాలు మన దైనందిన జీవితంలో భాగంగా మారిపోయాయి... కొన్ని పాటలు పద్యాలు మనకు అర్ధం తెలియక పోయినా చాలా బావున్నట్టుగా అనిపిస్తాయి... దానికి కారణం మనం చెప్పలేము కాని దానిలోని ఆ లోతైన భావన మనకు చేరి మనసుకు నచ్చుతుంది.... ఇదే సాహిత్యంలోని అందం... ఇక ఈ వారం మరో రెండు వృత్త లక్షణాలు చూద్దామా...

లయగ్రాహి

ఎందు నిల నేజనులకుం దలఁపరాని తప మంది కొని చేసిరొకొ నందుఁడు యశోదా సుందరియుఁ బూర్ణనిధిఁ బొందిరి కడు న్దొరసి పొందగును ముప్పు తఱి నందనునిగా శ్రీ మందిరుని నంచు నిటు లందముగఁ బ్రాసములు గ్రందుకొని చెప్పు మునిబృందము లయగ్రా హిం దనర సబ్భజసలుందగ నకారమును బొంద నిరుచోట్లను బిఱుం దభయ లొందన్.
ఏకోనచచ్వారింశన్మాత్రా గర్భితంబుఁ ద్రింశదక్షరంబు నైన లయగ్రాహి

గణ విభజన

లయగ్రాహి వృత్త పాదము నందు గణవిభజన
UII IUI IIU III UII IUI IIU III UII IUU
ఎందుని లనేజ నులకుం దలఁప రానిత పమంది కొనిచే సిరొకొ నందుఁడు యశోదా

లక్షణములు

లయగ్రాహి వృత్త పద్యాల లక్షణములు
పాదాలు: నాలుగు – కాని పఠన, లేఖన సౌకర్యార్థం పాదమును 2గా విభజించ వచ్చు.
అక్షరాలు                     30
ప్రతిపాదంలోని        గణాలు: భ, జ, స, న, భ , జ, స, న, భ, య
యతి :
ప్రాస: పాటించవలెను
ప్రాస: యతి ప్రాసయతి స్థానములు – 2వ, 10వ, 18వ, 26వ అక్షరములు.

భ జ స న భ జ స న భ య ఛందస్సు గల వృత్తము/ఉద్ధురమాల లయగ్రాహి. భజసనభజసనభయ అంటే తెలియటలేదు గానీ, దీని ఛందస్సు చాలా తేలిక. UIII అని ఏడు సార్లు వచ్చి, చివఱిగా UU అని వస్తుంది. అంటే..గణములు:- UiII UIII UiII UIII UiII UIII UiII UU
నడక :-
లాలలల లాలలల లాలలల లాలలల లాలలల లాలలల లాలలల లల్లా

ఒక గురువు నాలుగు లఘువులు వస్తూండాలి. ఇక ఇందులో యతి వుండదు. ప్రాసయతి మాత్రం వుంటుంది - పై క్రమములో i వున్న చోట, అంటే పాదానికి నాలుగు సార్లు ! సీసంలోలా కాకుండా ఇందులో ఆ నాలుగు సార్లూ ఒకే ప్రాస రావాలి. నాలుగు పాదాల్లోనూ ఒకే ప్రాస వుండాలి! కాబట్టి మీరు ప్రాసగా ఎంచుకున్న పదబంధానికి మీ దగ్గర కనీసం పదహారు ఉచిత ప్రయోగాలు వుండకపోతే, పద్యము వ్రాసే పనిని ఆ వాగమశాసనుడికి వదిలివేసుకోవాలి.


మహాభారతం ఆది పర్వములో నన్నయ్యభట్టు వసంత వర్ణనకి లయగ్రాహి వృత్తాని దివ్యంగా వాడారు అని నేనడం, సీమకోతి హనుమంతునికి సిపారసు ఇవ్వడంలాగుంటుంది. క్రిత వారం గరికిపాటి నరసింహారావుగారు, భక్తి దూరదర్శన స్రవంతిలో వసంత వర్ణనకి సంబంధించిన ఈ రెండు లయగ్రాహి పద్యాలను చాలా చక్కగా వినిపించి, అంత కన్నా చక్కగా వివరించారు. ఆయన మాటల్లో చెప్పాలంటే, "నన్నయ్య వ్రాసిన ఈ పద్యాలు వినడానికి, వాటిని నేను మీకు వివరించడానికి మీరెంతో అదృష్టవంతులు". మీరెలాగూ వినలేకపోయారు, కనీసం చదువుకొని ఆనందించండి.

లయగ్రాహి

గణములు:- భజసన భజసన భయగణములు:- UiII UIII UiII UIII UiII UIII UiII UU నడక :- లాలలల లాలలల లాలలల లాలలల లాలలల లాలలల లాలలల లల్లా

లయగ్రాహి.

కమ్మని లతాంతములకు మ్మొనసి వచ్చు మధు-పమ్ముల సుగీత నినదమ్ములెసఁగెం జూ
తమ్ముల లసత్కిసలయమ్ముల సుగంధిముకు-ళమ్ములను నానుచు ముదమ్మొనర వాచా

లమ్మలగు కోకిల కులమ్ముల రవమ్ము మధు-రమ్మగుచు విన్చె ననిశమ్ము సుమనోభా
రమ్ముల నశోకనికరమ్ములను జంపకచ-యమ్ములును గింశుకవనమ్ములును నొప్పెన్


లయగ్రాహి
చందనతమాలతరులందు నగరుద్రుమము-లందుఁ గదళీవనములందు లవలీమా
కందతరుషండములయందు ననిమీలదర-విందసరసీవనములందు వనరాజీ

కందళితపుష్ప మకరంద రసముం దగులు-చుం దనువు సౌరభమునొంది జనచిత్తా
నందముగఁ బ్రోషితులడెందములలందురఁగ - మందమలయానిల మమంద గతి వీచెన్

 పోతన తెలుగు భాగవతంలో వాడిన లయగ్రాహి వృత్త పద్యాల సంఖ్య: 4


పోతన తెలుగు భాగవతము/షష్ఠ స్కంధము/వృత్రాసుర వృత్తాంతము|(భా-6-385-లగ్రా.)

కూలిరి వియచ్చరలు; సోలిరి దిశాధిపులు; వ్రాలి రమరవ్రజము; దూలి రురగేంద్రుల్;
ప్రేలిరి మరుత్తు; లెదజాలిగొని రాశ్వినులు; కాలుడిగి రుద్రు లవలీలబడి రార్తిన్;
వ్రేలిరి దినేశ్వరులు; కీలెడలినట్లు సురజాలములు పెన్నిదుర పాలగుచు ధారా
భీల గతితోడఁ దమ కేలి ధనువు ల్విడిచి నేలఁబడి మూర్ఛలను దేలిరి మహాత్మా!

లయవిభాతి

పడయరె తనూభముల న్బడయుదురు గాక పెర పడతులును భర్తలును బడసిరె తలపన్ బుడమి గల నందుడును బడతుక యశోదయును గడపున జగత్రయ మునిడికొనిన పుత్రున్ బడసి రట యంచు బెడ గడరు నసనత్రివృతి గడనసగము ల్పొసగనిడ లయవిభాతిన్ నొడువుదురు సత్కవు లెపుడును విరితేనియలు వడియు పగిది న్రనము గడలు కొనుచుండున్.
ఏ కో న చ త్వాం శ న్మా త్రా గ ర్భి త పా దం బు ను చ తు స్త్రిం శ ద క్ష రం బు న యి న ల య వి భా తి

గణ విభజన

లయవిభాతి వృత్త పాదము నందు గణవిభజన
III IIU IIU III IIU III III IIU III III III U
పడయ రెతనూ భముల న్బడయు దురుగా కపెర పడతు లునుభ ర్తలును బడసి రెతల పన్

లక్షణములు

లయవిభాతి వృత్త పద్యాల లక్షణములు
పాదాలు: నాలుగు – కాని పఠన, లేఖన సౌకర్యార్థం పాదమును 2గా విభజించ వచ్చు.
అక్షరాలు                  34
ప్రతిపాదంలోని గణాలు: న, స, స, న, స, న, న, స, న, న, న, గ
యతి :
ప్రాస: పాటించవలెను
ప్రాస: యతి ప్రాసయతి స్థానములు – 2వ, 11వ, 20వ, 29వ అక్షరములు

లయవిభాతి

చలువ గల నెన్నెలల చెలువునకు సౌరభము
- గలిగినను సౌరభముఁ జలువయుఁ దలిర్పం

బొలు పెసఁగు కప్పురపుఁ బలుకులకుఁ గోమలత
- నెలకొనిన సౌరభముఁ జలువ పసయుం గో

మలతయును గల్గి జగముల మిగులఁ బెంపెసఁగు
- మలయ పవనంపుఁ గొదమలకు మధురత్వం

బలవడిన నీడు మఱి కల దనఁగ వచ్చుఁ గడు
- వెలయఁ గల యూ సుకవి పులుకులకు నెంచన్

ఛందస్సు :- నసన నసన నసన నసగ
గణములు:- IiIII UIII IiIII UIII IiIII UIII IiIII UU
నడక :-
లలలలల లాలలల లలలలల లాలలల లలలలల లాలలల లలలలల లల్లా

ఉదాహరణ 1:

పోతన తెలుగు భాగవతంలో వాడిన లయవిభాతి వృత్త పద్యాల సంఖ్య: 3
పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమ)/బలరాముడు విజృంభించుట|(భా-10.1-1563-లవి.)
హసితహరినీలనిభవసనమువిశాలకటి నసమనయనాద్రిపరిహసితమగుమేఘో ల్లసనమువహింపఁగరకిసలయముహేమమణి విసరవలయద్యుతులుదెసలతుదలందుం బసలఁగురియంగసరభసమునబలుండుదర హసితముముఖాబ్జముననెసఁగఘనకాలా యసమయమహోగ్రతరముసలమువడిన్విసరి కసిమసఁగిశత్రువులనసువులకుఁబాపెన్.


వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....  

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

శ్యామలీయం చెప్పారు...

లయగ్రాహిని మూడేసి అక్షరాలా గణాల చాదస్తపు నియమంతో కాక నాలుగేసి అక్షరాల విభాగాలుగా చూస్తే దీని నడక సరిగా తెలుస్తుంది.

ప్రతిపాదంలోనూ 7 సార్లు భల గణం వచ్చి చివరన గగ అనే గణం వస్తుంది. (ఈ ఏడూకూడా ఒక్కొక్కటీ ఐదు మాత్రల పాటూ చివరిది నాలుగు పాత్రలపాటూ నడిచే గణాలు. కాని ప్రత్యక్షరం లఘువేదీ గురువేదీ అన్న నియతి ఉంది కాబట్టి మాత్రాగణాలు కావు.)

ఒకపాదం గణవిభజన చూడండి.
UIII UIII UIII UIII UIII UIII UIII UU
ఎందునిల నేజనుల కుందలఁప రానితప మందికొని చేసిరొకొ నందుఁడుయ శోదా

ఇటువంటి నడకనే లయవిభాతిలోనూ చూడండి.

ఈ పద్యాలను మూడక్షరాల గణాల వరుసగా ఎవరూ భావించి వ్రాయరు.

చెప్పాలంటే...... చెప్పారు...

చక్కని మీ వివరణకు ధన్యవాదాలు అండి.... నేను సేకరించిన సమాచారంలో అలా ఉంది....నాకు తెలిసిన కొద్ది పాటిలో మీలాంటి పెద్దల వివరణలు నేర్చుకోవడానికి పనికి వస్తున్నాయి.....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner