10, డిసెంబర్ 2014, బుధవారం

ఇలా ఉండమంది...!!

నమ్మకం మోసపోయి
నిశబ్దంగా చూస్తోంది
ఏడు జన్మాల ఎత్తు
ఏడుస్తూ మిగిలింది

కలసి నడచిన దారిలో
ఓ క్షణమైనా దాయలేక
నేనుగా నిలువక పోయినా
నువ్వుగా ఉండి పోవాలనుకున్నా

గుచ్చిన గులాబి ఇంకా చెమరుస్తూనే ఉంది
తడి లేని కళ్ళలో మిగిలిన పొడి భాష్పం
రాలకుండా జ్ఞాపకాలను చూస్తోంది
ఒక్కటైనా తడిగా తగలక పోతుందా అని ఆశతో

వెన్నెల్లో ఆడుకునే నా అక్షరాలను
వేధిస్తున్నా శరాలను సంధించమని
అలవాటులేదేమో అందకుండా
అటు ఇటు పరుగెత్తుతున్నాయి

విషాదానికి వినయమెక్కువని
సంతోషం సంబరాన్ని పంపేసి
ఏకాంతానికి వనవాసం శిక్షగా వేసి
ఈ జీవితానికి ఇలా ఉండమంది...!!


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner