12, డిసెంబర్ 2014, శుక్రవారం

నువ్వు నేను ఒకే చోట....!!

నేస్తం....
  నాకే సమస్య వచ్చినా నీకే కదా మొదటగా చెప్పేది... సమస్య లేని జీవితం లేదు అలా అని మనం దాన్నే పట్టుకుని వేలాడుతూ ఉన్నామా.. లేదు కదా... పోనీ ఎవరినైనా ఇబ్బంది పెడుతూ ఉన్నామా లేదే.... అర్ధ రాత్రి అపరాత్రి అని చూడకుండా మనం బాధలో ఉంటే ఎదుటివాళ్ళని ఇబ్బంది పెట్టడమేనా.... ఎక్కడిదా అధికారం... వేరొకరి కాలాన్ని మనం తీసుకోవడం ఎంత వరకు సమంజసం... అయినా ఏదైనా సమస్య వస్తే చావు ఒక్కటేనా పరిష్కారం.... ఎవరిని బెదిరించడానికి ఈ చావులు... చస్తే సమస్య తీరిపోతుందా.... మన జీవిత కాలంతో పోలిస్తే సమస్య జీవిత కాలం చాలా చిన్నది అని యండమూరి చెప్పారు... నాకెందుకో ఎప్పుడు సమస్య వఛ్చినా ఆ మాటలు గుర్తు వస్తు ఉంటాయి... నిజమే కదా ఒకే సమస్య మన జీవిత కాలం ఉండదు.... రకరకాల సమస్యలు నిత్యం మన జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి... ఆ సమస్యల కాల పరిధి ఒకరోజు కావచ్చు , రెండు రోజులు కావచ్చు, లేదా వారాలు పట్టవచ్చు, నెల, సంవత్సరం పట్టవచ్చు సమస్య మనల్ని వదిలేయడానికి...ప్రతి సమస్యకు తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది... అంతే కాని చావు పరిష్కారం కాదు సమస్యకు...ఈ రోజు పొతే రేపు రెండు అంతే... మృత్యువు ఎలాను దాని సమయానికి అది మనల్ని దగ్గరకు తీసుకుంటుంది... దాని కోసం మనం ఎదురు చూడటమెందుకు... చేయడానికి ఎన్నో మంచి పనులు మన కోసం ఎదురు చూస్తున్నప్పుడు రాని చావును గురించి ఆలోచించడమెందుకు.... మన జీవితం ఒక్కరికి ఉపయోగపడినా ఈ జన్మకు పరిపూర్ణత సాధించినట్లే... చనిపోవాలని ఆలోచన వచ్చినప్పుడు ఓ క్షణం ఆలోచించండి అని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎవరి దారి వారిదే కాని మాట వినరు ఎందుకని... ఏంటో నేస్తం ఒక్కోసారి కోపంగాను, ఏమి చేయలేకపోతున్నామన్న నిస్పృహ నన్ను వెన్నాడుతూ వేధిస్తోంది... నీకే దారి లేదు మరొకరి సంగతి నీకెందుకు అంటావా... ఏం  చేయను ఏదో మనసు ఊరుకోక ఇలా నీతో మొరపెట్టుకుంటున్నా... సరే మరి ... మరో కబురుతో మళ్ళి వస్తాను నీకోసం...
నీ నెచ్చెలి...

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner