28, డిసెంబర్ 2014, ఆదివారం

మనసు ఆంతర్యం...!!

మౌనం తన భావాలకు విరుద్దంగా
విచ్చిన్నమై  మాటల ప్రవాహంగా
రూపాంతరం చెంది నాలో చేరడానికి
సమాయత్తమౌతుంటే ....   
మనసు  పొరల్లో ప్రకంపనాలు ఎక్కువై
చిట్లిన అంతరంగం దిక్కులు చూస్తోంది...
భళ్ళున బద్దలైన ఆకాశానికి పడిన
చిల్లులన్నీ వర్షించిన రుధిరాన్ని
మదిలో దాయలేక కళ్ళలో నింపి
శుష్కించిన దేహానికి కప్పిన
చర్మపు దుప్పటికి వేసిన అతుకులలో
మిగిలిపోయిన రంగులు వెలసిన
జ్ఞాపకాల గతాన్ని అడగకుండానే
నీడల జాబితాల కోసం వెదుకులాడుతోంది...
ఎక్కడో జారి పడిన శిధిలాలలో చేరిన శకలాలు
మరెక్కడికో చేరి దారి తప్పిన చేవ్రాలుగా మిగిలి
చిరునామాకి చేరలేని ఉత్తరంగా మారిపోయి
దీర్ఘకాలంగా తెర చాటునే దాగిన ఎన్నో సంఘర్షణలు
ఒక్కసారిగా గొంతెత్తినట్లుగా అనిపిస్తే
అటు ఇటు చూసిన చూపుల అర్ధంలో
కనిపించిన తార్కాణం నిరంతరం కల్లోలమైన
మానసిక నిర్వేదంలో జనించిన అంతర్నేత్రం
నిట్టూరుస్తూ కనిపించింది....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner