9, డిసెంబర్ 2014, మంగళవారం

ఏం చేయను..!!

నేస్తం.....
          ఎప్పుడో వదిలేసిన గతమైనా మళ్ళి  మళ్ళి  వెన్నాడుతూనే ఉంది... నేను వదిలేసినా నన్ను వదలని నీడలా నా చుట్టూనే తిరుగుతూ ఉంది... ఎన్ని సార్లు సరిపెట్టుకుపోను... అయినా ప్రతిసారి నేనే ఎందుకు సరిపెట్టుకోవాలి... ఏం వాళ్ళలా అహం లేక పోయినా నాకూ ఆత్మాభిమానం ఉంది కదా.... దానిని పాపం ఎందుకు సర్దుకోమనాలి.... నేనేమన్నా గాంధినా, గౌతమ బుద్దుడినా ఒక చెంపన కొడితే రెండో చెంప చూపించడానికి... భూదేవిని అసలే కాదు ప్రతి భారాన్ని మోయడానికి... నా చిన్న ప్రపంచాన్నిఛిద్రం  చేశారు... మనిషిలో రెండో కోణాన్ని చూపించారు... మమకారం మీద నమ్మకాన్ని పోగొట్టారు... దానితో పాటుగా మనిషిని నమ్మడానికి కూడా వీలు లేకుండా చేసి ఆలోచనలో పడేశారు... అన్ని వెరశి మనిషిలో అసలు 'మనీ'షిని చూపించారు.... వర్షంలో కాకులు తడిస్తే తట్టుకోలేని ప్రాణాన్ని ఏది వచ్చినా, చూసినా చలనం లేని శిలగా మార్చారు... ఇన్ని చేసినా సర్దుకున్నా... ఇక సర్దుకోవడానికి నా ఓపిక సహకరించడం లేదు... జీవితంలో కొన్ని ఘడియలను కూడా మరచిపోయాను... ఇక ఏమి మిగలలేదు.. చావులు తప్ప... వీటి కోసం ఇంకా సర్దుకోవడం అవసరమంటావా... మన అవసరానికి ఆపదకు చలించని మనసులేని మనుష్యులకు ఏదో కాస్త మిగిలిన ఈ నాలుగు రోజుల జీవితాన్ని ఫణంగా పెట్టడం నాకు ఇష్టంగా అనిపించడం లేదు... ఏం చేయను..?? చెప్పడానికి నువ్వేమో ఏదో ఆత్రం వచ్చినట్లు ముందే స్వర్గానికి వెళ్లి కూర్చున్నావాయే... మేమేవరమో చదువులో పోటికి వచ్చినట్లు చావులో కూడా వచ్చేస్తామని భయపడి అది ముందే తీసేసుకుని అక్కడా నువ్వే ముందున్నావు... నాకేం ఇలా నువ్వు చేయడం నచ్చలేదు.. అక్కడ నుండి సలహా ఎలా చెప్తావు మరి.... సరే నీమీద కోపంగా కూడా ఉంది.. ఇక మాట్లాడను... ఉంటాను

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

బివిడి ప్రసాదరావు చెప్పారు...

టపా నచ్చిందండీ ... అభినందన ...

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner