17, డిసెంబర్ 2014, బుధవారం

గొప్ప గుణం...!!

నేస్తం...
          పొరపాటు మానవ సహజం అని సరిపెట్టేసుకుంటూ ఉంటాం... కాని కొన్ని పొరపాట్లు మనం సరిపెట్టుకున్నా అవి సరిపుచ్చుకోకుండా మన జీవితాన్ని చిన్నాభిన్నం చేసేస్తాయి... తప్పు దిద్దుకునే సమయాన్ని ఇవ్వకుండానే... ఒక్కోసారి చిన్న తప్పే కదా అనుకుంటాము కాని దానికి మనం చెల్లించాల్సిన మూల్యం చాలా భారీగానే ఉంటుంది... కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదు అని అన్నా ఆది నిజం ఎలా అవుతుంది ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి... స్థానం మారితే ఓడినట్లే అని చెప్పకనే చెప్పినట్లు చెప్పిన దేవదాసు కథ మనకు చిర పరిచితమే కదా...కూరలో ఉప్పో కారమో మర్చిపోతే మళ్ళి వేసుకుంటాం అది చిన్న తప్పు కనుక... అదే జీవితానికి సంబందించి ఒక నిర్ణయాన్ని తప్పుగా తీసుకుంటే దానికి మనతోపాటు మనవాళ్ళు కూడా బలి కాక తప్పదు... దానికి కూడా మనం మన ఖర్మ అని సరిపెట్టేసుకుంటూ దైవాన్ని దోషిగా నిలబెట్టేస్తాం... మనం తప్పుకుంటూ.. మన చాతకాని తనాన్ని కప్పెట్టుకుంటూ... విధి రాతను మార్చలేము అని.... కాని మన నోరు ఉందే దాన్ని అదుపులో ఉంచుకుంటే చాలా తప్పులకు కారణం కాకుండా ఉండొచ్చు.... ఎదుటివారి మీద అధికారం చెలాయించడానికి బంధాలు పెంచుకుంటాం... బాధ్యతలు పంచుకోకుండా.... మనకి ఎందుకో మరి అంత ఇష్టం ఒకరి మీద పెత్తనం చెలాయించాలి అంటే.... అదే పెత్తనం మన మీద చెలాయిస్తే భరించలేము... ఎందుకో మరి ఈ తేడా....ఒక్కోసారి ఎదుటివారి తప్పులు భరించడం కూడా తప్పే అవుతుంది.... సహనానికి ఓ హద్దు ఉంటుంది అన్నట్టుగా తప్పుని చెప్పక పోవడం మన తప్పే అవుతుంది.... తప్పు చేసినా ధైర్యంగా ఒప్పుకునే వారు ఎంత మంది ఉన్నారు ఈ రోజుల్లో.... పొరపాటుని ఒప్పుకునే మంచి లక్షణం చాలా  కొద్దిమందికే ఉంటుంది... అది చాలా గొప్ప గుణం... ఆ గుణానికి నా వందనాలు... నీకున్న ఆ మంచి లక్షణమే నీలో నాకు నచ్చింది... తప్పుని చెప్పి నాతో తిట్లు తినే నీ చెలిమి నాకు ఎప్పుడు అత్యంత ప్రియమైనదే నేస్తం... మంచో చెడో చేసినది చెప్పే నీ కల్మషమెరుగని ఆ స్నేహాన్ని దూరం చేసిన దైవం మీద కాస్త కోపం కూడానూ... నువ్వు దగ్గరగా లేక పోయినా నా భావాలు పంచుకుంటూనే ఉంటూ దైవాన్ని సవాలు చేస్తున్నా మన స్నేహాన్ని ఏమి చేయలేని ఆ దూరానికి వీడ్కోలు చెప్తూ.... మరి ఇప్పటికి ఉండనా....
నీ నెచ్చెలి...

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner