5, డిసెంబర్ 2014, శుక్రవారం

రెప్పపాటు ఈ జీవితానికి....!!

నేస్తం...
         ఎన్నో అనుకుంటాం... దేనికోసమో తెగ తాపత్రయ పడిపోతూ నిరంతరం ఏదో ఒకటి చేస్తూనే లేదా ఆలోచిస్తూనే ఉంటాం... రెప్పపాటు ఈ జీవితానికి ఎన్నెన్ని కోరికలో.. మనం అనుకుంటూ ఉంటాం మనం లేని మరుక్షణం ఈ ప్రపంచం ఏమై పోతుందా అని.. కాని మనకి తెలుసు ... ఏమి కాదు... అన్ని పనులు మాములుగానే మనం లేక పోయినా జరిగి పోతూనే ఉంటాయి... ఈ రోజు పొతే రేపు రెండు అని మనకే తెలియదు... మనం ఒక్కరం లేనంత మాత్రాన ఈ ప్రపంచం ఏమైనా తలక్రిందులు అయిపోతుందా... మనం చాటుగా ఉండి మన కోసం ఎవరైనా ఆలోచిస్తారా లేదా అని అనుకున్నా మన గురించి ఓ క్షణం ఆలోచించే తీరిక ఎవరికీ ఉండదు... మహాత్ముడినే మరచి పోయాం...  ఇక మాములు మనుష్యులం మనమెక్కడ... నాలుగు రోజులు కనిపించనంత మాత్రాన నాలుగు సార్లు అడుగుతారు... తరువాత  మర్చి పోతారు... అంతే కాని మన కోసమే ఆలోచించరు... అలా అనుకుంటే అది మన పొరపాటే... ఎంతో దగ్గర బాంధవ్యాలనే మరచిపోతున్న రోజులు... క్షణాల సహవాసాన్ని రోజుల తరబడి తల్చుకునే తీరిక ఇంకెక్కడ... అభిమానం అనేది మనసు పొరల నుంచి రావాలి.. అంతేకాని పైకి తెచ్చి పెట్టుకుని అంత ప్రేమ ఇంత ప్రేమ అని నాలుగు రోజులు మాట్లాడితే సరిపోతుందా... అవతలి వారికి అది అలవాటు కావచ్చు కాని నమ్మిన బంధం ఎంతగా బాధపడుతుందో ఎందరికి తెలుసు నేస్తం... బాంధవ్యాలను కూడా మన అవసరాలకు బలి చేసేస్తూ నటించేసే ఈ రోజులు ఎంత బావున్నాయి కదూ... మన స్నేహం ఎన్నాళ్ళయినా చెక్కు చెదరక ఇప్పటికి అప్పటి స్నేహంలానే హాయిగా ఉంది... అన్ని పంచుకుంటూ... ఇంత అదృష్టాన్ని నాకందించిన నీ స్నేహానికి కృతజ్ఞతలు ఎప్పటికి... ఎన్ని జన్మలకయినా కావాలనిపించే ఈ నేస్తాన్ని నాకందించిన దైవానికి వందనాలు....
ఇప్పటికి ఉండనా మరి...
నీ  నెచ్చెలి...

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner