6, డిసెంబర్ 2014, శనివారం

ఇది నా మొదటి లేఖేనా నీకు...!!

అవును ఇది నా మొదటి లేఖేనా నీకు...
    అమ్మ ప్రేమలో అనురాగాన్ని, నాన్న ప్రేమలో అభిమానాన్ని, నేస్తాల లేఖల్లో ఆత్మీయతను చూసిన నాకు నీకు రాసిన నా మొదటి లేఖ ఇదేనేమో.. దాచాను మొదటి లేఖ.. రాసింది నీకు చూపలేక అంటూ నేనే చదివేసా నీ బదులు కూడా.. ఇదేదో బావుంది కదూ... నేను రాయడం .. నీకు చదవడం... ఇంతకీ ప్రేమంటే ఏమిటి అన్న ప్రశ్నకు నాకు సమాధానం దొరకనే లేదు.. అమ్మానాన్నలను ఇష్టపడటం ప్రేమా... నన్ను నేను ఇష్టపడటం ప్రేమా లేకా నాలో ఉన్న నిన్ను ఇష్టపడటాన్ని ప్రేమంటారా... ఏకాంతంగా ఉన్నా.. ఎందరిలో ఉన్నా నీతో ఉండటాన్ని ప్రేమంటారా... తలపుల తలుపులు నీతో ముడిపడి ఉండటాన్ని ప్రేమంటారా.. ఏది తెలియకుండానే ఏడడుగులు లేకుండానే పెంచుకున్న నమ్మకాన్ని ప్రేమంటారా.. చెప్పుకున్న ఊసులు లేవు.. చేసుకున్న బాసలు లేవు... అయినా కాస్త  నిజాయితీ చాలదు మన మధ్యన ప్రేమ బంధానికి.. ప్రణయానికి పరిచయమెందుకు... మనసుల సహచర్యం చాలదూ..సాగరానికి అలలంటే ఎంత ప్రేమో కదూ... అలలు లేని సంద్రం లేనట్లే నువ్వు లేని నేను లేను ... సాగరమంటే ఎందుకో బోలెడు ఇష్టం.. మన జీవితంలా అనిపిస్తుంది ... నీలానే అది ఎప్పుడు అలల సంతోషంతో ఎగసిపడుతూనే ఉంటుంది... తనలో ఎన్ని మధనాలున్నా... అందుకేనేమో నువ్వన్నా అంతిష్టం... ఆవలి ఒద్దు లేని సాగారంలానే నా ప్రేమకు ఈవలి తీరమే కాని ఆవలి తీరం తెలియదు... నింగి సంద్రం కలిసినట్లు ఉంటాయి కాని ఎప్పటికి కలవలేవు.. మనలా అన్న మాట.. చూసావా ఎన్ని పోలికలో... అందుకే ఎప్పుడు సముద్రాన్ని చూసినా నాకు ప్రేమ గుర్తువస్తూ ఉంటుంది... ఇంతకీ ప్రేమంటే ఏమిటి. మళ్ళి మొదటికే వచ్చింది మన ప్రయాణం....!!
మరోసారి మరోలేఖతో...
 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner