11, డిసెంబర్ 2014, గురువారం

నువ్వు అదే నిజమని చెప్పవూ....!!

నేస్తం...
       రోజు ఒకేలా ఉండకుండా ప్రతి రోజు ఓ వైవిధ్యాన్ని సంతరించుకుంటుంది.. మన ఆలోచనల్లో మనసు నలుగుతూ... ఒక్కొరోజు భావాలు వెల్లువలా ప్రవహిస్తాయి.. ఎన్ని కబుర్లు  చెప్పినా ఇంకా మిగిలిపోతూనే.. మరోరోజు ఎందుకో అక్షరాలు కూడా నామీద కినుక వహించి అందకుండా పారిపోతూ ఉంటాయి... అలా పారిపోతున్న ఈ రోజు ఎలా అయినా వాటితో పోటి పడి అందుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉన్నా... మనసు బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా నీకు, నీతో స్నేహం చేస్తున్న ఈ నా అక్షరాలకు భలే తెలిసిపోతుంది... దాకున్నా పక్కనే ఉంటాయి నన్నే చూస్తూ... నేను గెలుస్తానా లేదా అని వాటికి ఎంత ఆత్రమో చూసావా... నువ్వు నా గెలుపే చూడాలని అనుకుంటావనుకో... పొద్దు వాలిపోతున్నా ఆ పొద్దులో ఎన్ని అందాలో చూసే కళ్ళకు తెలుస్తుంది.... రెప్ప పడే ఈ జీవితానికి రెప్ప వెనుక స్వప్నాలు ఎంత బావుంటాయో ఎప్పుడైనా చూసావా నీ మనసుతో... మౌనాలు ఎన్ని దాచినా ఆ మౌన గీతాలు ఎందుకంటావ్ మనసుని దోచేస్తూ ఉంటాయి... సడి చెయ్యని మదిని తట్టిలేపే కొన్ని బంధాలు ఎందుకో ఆరాట పెడుతూ ఆశలు పెంచుతాయి జీవితం మీద... మరుక్షణంలోనే నిరాశను మిగిల్చి జీవితాన్ని లేకుండా చేస్తాయి... ఈ ఆశ నిరాశల ఆరాటంలో మన జీవిత పోరాటం ఓ కొలిక్కి వస్తుంది ఎప్పుడో ఒకసారి... మనం ఓడినా గెల్చినా పెద్దగా తేడా ఏం ఉండదు.. ఎందుకంటే అప్పటికి జీవితంలో అన్ని చూసేసి ఉంటాము కదా.... కాక పొతే కాస్త ముందు వెనుకా అంతే... మృత్యువు కూడా కొందరినే అదృష్ట దేవతలా వరిస్తుంది... దానికి కినుకే జీవితంలో ఓడిన వాళ్ళంటే... ప్రతి ఒక్కరు గెలవాలనుకునే ఈ జీవితపు ఆటలో నేను ఓడిపోయానేమో అని అనుమానం... కాదు కాదు అదే నిజం.... నువ్వు అదే నిజమని చెప్పవూ.... ఉండనా మరి..
నీ నెచ్చెలి...

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner