28, జనవరి 2015, బుధవారం

అక్షరాల అలుక....!!

నేస్తం...
     పలకరించి కాసిని రోజులయ్యింది కదూ... రోజు నీతో కబుర్లు చెప్పాలనే అనుకుంటాను.. కాని ఎందుకో ఈ మధ్య భావాలు అలిగినట్లు ఉన్నాయి నా మీద... అక్షరాలకు అందడం లేదు... మాటల చాటుగా చేరి దోబూచులాడుతున్నాయి.. కొన్నిసార్లేమో అందినట్లే అంది దొరకకుండా జారిపోతున్నాయి శైకత రేణువుల్లా... నా ఏకాంతానికి స్నేహంగా వచ్చి చేరి అంతలోనే పారిపోతూ దాగుడుముతలాడుతున్నాయి ఈ భావనలు... అవునూ అసలు ఈ స్పందించే మనసెందుకు నాతో ఉంది... అదే లేక పొతే నా ఏకాంతంలో నేనే ఉండేదాన్ని కదా... మదిలో రొద చేసే ఎన్నో ఆలోచనలకు సర్ది చెప్తూ కొన్నిటికయినా అక్షరరూపాన్ని ఇవ్వాలన్న నా ఈ ప్రయత్నాన్ని విరమించేదాన్ని ఎప్పుడో...
     ఈ మధ్య పలకరింపుల ప్రహసనాల్లో నాకు కనిపించని నిజాయితీ గురించి ఆలోచిస్తూ తరచి చూసుకుంటే నిజాయితీ అన్న పదాన్నే మర్చిపోయినట్లుగా అనిపించింది... కాసిన్ని కవితలు, ఓ నాలుగు బహుమతులు, నాలుగు పుస్తకాలు వచ్చేస్తే చాలు.. మనమే గొప్ప కవులమని అనేసుకుంటూ ఎదుటివారిని చులకన చేసే సంప్రదాయం ఎందుకు మనలో వేళ్ళు  నాటుకుంది..? చూసే మనసే ఉండాలి కాని...  ప్రతి వ్యక్తిలో గొప్పదనం ఉంటుంది... కాకపొతే ఆ గొప్పదనాన్ని గుర్తించి ఒప్పుకునే మనసే మనకుండదు.. ఏంటో ఒకరికి పేరు వచ్చినా తట్టుకోలేము... పోనీ మనకున్న పేరు నిలుపుకోడానికి ప్రయత్నించనూ లేము... ఎదుటి వారిలో తప్పును చూసే ముందు మనలోనికి మనం ఒక్కసారి తొంగి చూసుకుంటే ఎంత బావుండు... అసలు ఇలా ప్రతి దానిలో చెడునే ఎత్తి చూపాలని కంకణం ఎందుకు కట్టుకోవాలి... చెడులో మంచిని ఎందుకు చూడలేక పోతున్నాము... మనని పోగిడితేనే మన ఆత్మీయులా... విమర్శకుల్లో మన బంధువులు లేరా... ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా మంచి చెడు రెండు ఉంటాయి... సద్విమర్శను స్వీకరిస్తూ సాధ్యమైనంత వరకు ఎదుటివారి మనసు నొప్పించకుండా సాగిపోతే చాలనే చిన్న మాటను చేతల్లో చేయగలిగితే చాలు... అందరు సంతోషపడే వారే కదా మిగిలేది .... ఏం  నేస్తం నువ్వేమంటావు...?
ఏంటో కలగాపులంగా చెప్పినట్లు ఉన్నా కదా కబుర్లు ఈసారి... చెప్పానుగా అక్షరాలూ భావాలు రెండు నామీద అలిగాయి ..అందుకే ఇలా నీకు కాస్త కష్టంగా.... ఉండనా మరి ఇప్పటికి
నీ నెచ్చెలి

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner