9, జనవరి 2015, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... పదునైదవ భాగం....!!

మన తెలుగు సాహితీ ముచ్చట్లలో వారం వారం కాస్త తెలుగు సాహిత్యంతో పాటు పద్యాలకు గల ముఖ్య లక్షణమైన ఛందస్సులోని కొన్ని లక్షణాలను తెలుసుకుంటున్నాము కదా... ముందుగా ఈ వారం తెలుగు సాహిత్యంలో నన్నయ యుగము తరువాతి యుగమైన శివకవి యుగము గురించి కొద్దిగా చూద్దాము... 

1100 - 1225 : శివకవి యుగము

నన్నయ తరువాతికాలంలో ముఖ్యమైన సామాజిక, మత సంస్కరణలు చోటు చేసుకొన్నాయి. వీరశైవము భక్తిమార్గము ప్రబలమై ఎన్నో కావ్యాలకు కారణమైనది.

రాజకీయ, సామాజిక వేపధ్యం

ఈ సమయానికి చాళుక్యచోళరాజ్యం క్షీణదశకు చేరుకొంది. తెలంగాణ ప్రాంతంలో పశ్చిమ చాళుక్యుల, రాష్ట్రకూటుల బలం అధికంగా ఉంది. తీరాంధ్రంలో సరైన కేంద్ర పాలన కొరవడిందని, వేంగి రాజ్యంలో రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యులు, చోళులు ఎడతెరిపి లేకుండా యుద్ధాలు జరిపారని తెలుస్తుంది. ఈ సమయంలో చాళుక్యులకు సామంతులుగా ఉండిన కాకతీయులు స్వతంత్రులై తెలంగాణ ప్రాంతంలో బలపడసాగారు.

సాంస్కృతికంగా అప్పటికి బౌద్ధం, జైనం బాగా బలహీనపడ్డాయి. శైవం, వీరశైవం విజతంభించాయి. శైవులు బౌద్ధ , జైనాలనే కాక వైదిక విధానాలను కూడా నిరసించారు. శివుడు తప్ప వేరు దైవము లేదని, శివారాధన చేయనివానిని మన్నింపతగదని వాదించారు. వారికి వాఙ్మయం కూడా మతబోధనకు మార్గం తప్ప దానికి వేరు లక్ష్యం లేదు.

 ముఖ్య కవులు, రచనలు
ఈ యుగానికి చెందిన నన్నెచోడుడు, మల్లికార్జున పండితారాధ్యుడు, పాల్కురికి సోమనాధుడు అనే కవులను శైవ కవిత్రయంగా పేర్కొంటారు. శ్రీపతి పండితుడు, శివలెంక మంచన, యథావాక్కుల అన్నమయ్య కూడా శివకవులే. శివకవులలో శైవాభిమానం, దేశికవితాభిమానం, శైలీస్వేచ్ఛ ముఖ్య లక్షణాలు. క్రీ.శ. 1160 కాలానికి చెందిన నన్నెచోడుడు కుమార సంభవం రచించాడు. నన్నయ కంటే నన్నెచోడుడు ముందువాడని మానవల్లి రామకృష్ణకవి వాదించాడు కాని ఆ వాదం నిలబడలేదు. పాల్కురికి సోమనాధుడు 1160-1230 కాలంవాడు కావచ్చును. ఇతడు తెలుగు, సంస్కృతం, కన్నడ భాషలలో గొప్ప పండితుడు. ఇతని రచనలలో అనుభవ సారము, బసవ పురాణము, పండితారాధ్య చరిత్ర, వృషాధిప శతకం, చతుర్వేద సారం అనేవి మాత్రం లభించాయి. శతక వాఙ్మయంలో లమకు లభిస్తున్న మొట్ట మొదటి శతకంగా వృషాధిప శతకాన్ని పేర్కొంటారు. మల్లికార్జున పండితారాధ్యుడు చాలా గ్రంధాలు వ్రాసి ఉండాలికాని శివతత్వ సారము మాత్రం లభిస్తున్నది. మిగిలిన కొన్న గ్రంధాల కర్తృత్వం స్పష్టంగా తెలియరావడంలేదు.

1133-1198 మధ్యకాలంలో ఓరుగల్లును పాళించిన కాకతీయరాజు ప్రతాప రుద్రుడు "నీతి సారము" అనే గ్రంధాన్ని రచించాడని భావిస్తున్నారు. చక్రపాణి రంగన కూడా ఈ యుగంలోనివాడు కాని, తిక్కన యుగంలోనివాడు కాని కావచ్చును.

జాను తెనుగు

నన్నెచోడుడు మొట్టమొదటిసారిగా "జాను తెనుగు", వస్తు కవిత" అనే పదాలను వాడాడు. జాను తెనుగు అంటే ఏమిటనే విషయంపై పండితుల మధ్య చాలా చర్చలు జరిగాయి. కన్నడంలో "జాణ్ణుడి" (చమత్కారమైన నుడి) అనే పదం నుండి "జాను కవిత" అనే ప్రయోగం వచ్చిందని ఒక అభిప్రాయం. "జాను" అనగా ఇంపైన, అందమైన, స్పష్టమైన భావం కల తెలుగు అని కొందరన్నారు. అందరి అభిప్రాయాలను క్రోడీకరించి జి.నాగయ్య చెప్పిన నిర్వచనం - "తెలుగు భాషలో స్వభావసిద్ధంగా వాడే సంస్కృత సమాసాలను జనసామాన్యంలో వాడబడే దేశిదాలతో అన్వయించి, అన్వయ క్లిష్టత లేకుండా మంజులమై, సరసమై, ప్రసన్నమైన తెలుగు జాను తెనుగు"
జాను తెనుగును వాడిన వారిలో రెండవవాడు లింగాయతకవి పాల్కూరికి సోమనాధుడు.
ప్రాచీనులెవ్వరూ దీని అర్ధమును నిర్వచించలేదు. వాజ్మయమునందలి ప్రయోగముల మూలమున దీని అర్ధమును తెలుసొకోవాలే తప్ప. కాని యిట్టి ప్రయోగములు యెన్నియో లెవు. లభ్యమైన ఆంధ్ర గ్రంధములలో మూడునాలుగు మాత్రమే కానవచ్చుచున్నవి. ఇందొకటి నన్నెచోడుడి కుమారసంభవము లోనిది.
                     సరళముగా భావములు జానుదెనుంగున నింపుపెంపుతో 
                     బిరిగొన వర్ణనల్ ఫణితివేర్కొన నర్ధము లొత్తగిల్ల బం
                     ధురముగ బ్రాణముల్ మధుమృదుత్వరసంబున గందళింప న
                     క్షరములు సూక్తు లార్యులకు గర్ణరసాయనలీల గ్రాలగాన్.         [కుమారసంభవము,1-35]
ఇందు నన్నెచోడుడు తాను కావ్యమును జానుతెనుంగున రచియించెదనని చెప్పెనేకాని ఆ జానుతెనుగు స్వభావమెట్టిదో తెలియపరచలేదు.
మరి మూడు ప్రయోగములు పాల్కూరికి సోమనాధుని గ్రంధములనుండి:
                   ఉరుతరగద్యపద్యోక్తులకంటే-సరసమై పరగిన జానుదెనుంగు 
                   చర్చించగా సర్వసామాన్యమగుట- గూర్చెద ద్విపదల గోర్కేదైవార    [బసవపురాణము పుట-5]
                   ఆరూఢగద్యపద్యాదిప్రబంధ-పూరిత సంస్కృతభూయిష్ఠరచన 
                   మానుగా సర్వసామాన్యంబుగామి- జానుదెనుగు విశేషము బ్రసన్నతకు. [ప్రండితారాధ్యచరిత్ర, దీక్షాప్రకరణము పుట-18]
ఈ ద్విపదలవలన గద్యపద్యాది ప్రబంధ సంస్కృత భూయిష్టము గానిది జానుదెనుగు అని బోధపడుచున్నది. ఇంతేకాదు; వృషాధిశతకమున జానుదెనుగు స్వభావమిట్టిదని ఈ క్రిది పద్యములో పాల్కూరి చెప్పినాడు.
                   బలుపొడతోలు సీరయును బాపసరుల్ గిలుపారు కన్ను వె 
                   న్నెలతల సేదుకుత్తుకయు నిండిన వేలుపుటేరు వల్గుపూ 
                   సల గల ఱేని లెంకనని జానుదెనుంగున విన్నవించెదన్
                   వలపు మదిం దలిర్ప బసవా బసవా వృషాధిపా.
కావున పాల్కూరికి సోముని మతమున జానుదెనుగు అనగ అచ్చ తెలుగుఅని తెలియవచ్చుచున్నది.
జానుదెనుగు సమస్తపదము. జాను+తెనుగు అను రెండుమాటల కలయిక వల్ల యేర్పడినది. దీనియందలి తెనుగు భాషానామము; జాను శబ్ద మా భాషా స్వభావమును దెలుపుచున్నది. జాను శబ్దము దేశ్య శబ్దమని కొందరి అభిప్రాయము. ఇది జ్ఞాశబ్దభవ మనియు; 'జాణ' కు తోబుట్టువని అందురు. దీనికి 'అందము', 'సౌందర్యము' అని అర్ధము. అందువలన జానుదెనుగు అనగా సొంపైన, లేక నుడికారము గల తెనుగని అంవయించుకోవచ్చును. తెనుగు కవులు జానుదెనుగును ప్రశంసించినట్లు కర్ణాటకులు 'జాణ్ణుడి' ని (జానుకన్నడము) ప్రశంసించియున్నారు.
కర్ణాటక 'జాణ్ణుడి' యే జానుదెనుగునకు మతృక అని కొదరు తలిచెదరు. తెనుగున కావ్య రచన లేనికాలమున నూతనాంధ్ర కావ్యనిర్మాణమునకు గడంగిన నన్నెచోడుడు కర్ణాటక వాజ్మయమునుండి పెక్కు విషయములను గ్రహించినట్లు 'జాణ్ణుడి' గొని దానిని జానుదెనుగుగా మార్చెననియు, నతని గ్రంధములనుండి పాల్కూరికి సోముడు గ్రహించెనని తలిచెదరు.

ఇక ఈ వారం మన ఛందస్సులో ఈ క్రింది వివరణలు చూద్దాము...

పద్యము తెలుగు కవితా రచనలో ఒక విధానము. పురాతన తెలుగు రచనలు ఎక్కువగా పద్యరూపంలోనే ఉన్నాయి. పద్యంలోని ముఖ్య లక్షణం ఛందస్సు..

పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్ని ఛందస్సు అంటారు. ఛందస్సును మొట్టమొదట సంస్కృతములో రచించిన వేదాలలో ఉపయోగించారు. వేదముల యొక్క అంగములనబడు ఆరు వేదాంగములలో ఛందస్సు ఒకటి. వేదత్రయాన్ని ఛందస్సు అని కూడ అంటారు. ఋగ్వేదము మరియు సామవేదము సంపూర్ణముగా పద్య (శ్లోక) రూపములో నున్నవి. యజుర్వేదములో గద్యము కూడ ఉన్నది. సామవేదమంతయూ ఛందస్సేనని పండితుల అభిప్రాయము. బ్రహ్మవిష్ణుశివులలాగా ప్రతి మంత్రానికీ ఋషి, ఛందస్సు, దేవత త్రిమూర్తులని భావిస్తారు. కావ్య నిర్మాణానికి వాడబడునది ఛందస్సు.

తెలుగు ఛందస్సు

పాదాది నియమములు గలిగిన పద్య లక్షణములను తెలుపుంది చందస్సు అనబడును. తెలుగు ఛందస్సు, సంస్కృత ఛందస్సు పై ఆధార పడి అభివృద్ధి చెందినది. సంస్కృత ఛందస్సులోని వృత్తాలతో బాటు జాతులు, ఉపజాతులు తెలుగులోని ప్రత్యేకతలు. ఆధునిక పాఠకులు, లేఖకులు, నవ కవులు, విప్లవ కవులు ఛందస్సు పురాతనమైనదని, ప్రగతి నిరోధకమని భావించినా కొన్ని సినిమా పాటలలో, శ్రీ శ్రీ గేయాలలో మాత్రా ఛందస్సును చూడవచ్చు. 

గణాలు

గణాలు అనగా, రెండు లేక అంత కంటే ఎక్కువ అక్షరాల గురు లఘు నిర్ణయాన్ని బట్టి వాటిని ఏదో ఒక (గ్రూపు)విభాగము లో ఉంచుతారు, దీనినే ఏదో ఒక గణము అని అంటారు.

రెండక్షరాల గణాలు

మొత్తము ఉన్నవి రెండు రకాల అక్షరాలు గురువు, లఘువు; రెండక్షరాల గణాలు మొత్తము నాలుగు వస్తాయి (బైనరీ 0, 1 కాంబినేషన్లు తీసుకున్న 00, 01, 10, 11 వచ్చినట్లు) ఆ నాలుగు రెండక్షరాల గణాలు:
  1. లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు
  2. లగ IU ఉదా: రమా
  3. గల UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ
  4. గగ UU ఉదా: రంరం, సంతాన్

మూడక్షరాల గణాలు

ఇవి మూడక్షరాల కలయికలతో ఏర్పడేవి (బైనరీ 0, 1, తీసుకున్న 000, 001, 010, 011, 100, 101, 110, 111) కింది వాక్యాన్ని మననం చేసుకుంటూ వీటిని సులువుగా గుర్తుంచుకోవచ్చు. య మా తా రా జ భా న స ల గం గణం కావాలంటే పై వాక్యంలో తో మొదలుపెట్టి వరుసగా మూడక్షరాల గురు లఘువులను గుర్తిస్తే యగణం అవుతుంది. య తో మొదలుపెట్టి మూడక్షరాలు: య మా తా - లఘువు, గురువు, గురువు IUU అలాగే రా తో మొదలుపెట్టి మూడక్షరాలు (రా జ భా - UIU) రగణం అవుతుంది. ఈ విధంగా అన్ని గణాలను గుర్తుంచుకోవచ్చు
అన్ని గణాలు:
  1. ఆది గురువు గణము UII
  2. మధ్య గురువు గణము IUI
  3. అంత్య గురువు గణము IIU
  4. సర్వ లఘువులు గణము III
  5. ఆది లఘువు గణము IUU
  6. మధ్య లఘువు గణము UIU
  7. అంత్య లఘువు గణము UUI
  8. సర్వ గురువులు గణము UUU
ఇవి మూడక్షరముల గణములు

ఉపగణాలు

ఉప గణములు అనగా పైవాటి సమ్మేళనం లో ఏర్పడేవి. ఇవి మూడు రకములు
  1. సూర్య గణములు
    1. న = న = III
    2. హ = గల = UI
  2. ఇంద్ర గణములు
    1. నగ = IIIU
    2. సల = IIUI
    3. నల = IIII
    4. భ = UII
    5. ర = UIU
    6. త = UUI
      3. చంద్ర గణములు
  1. భల = UIII
  2. భగరు = UIIU
  3. తల = UUII
  4. తగ = UUIU
  5. మలఘ = UUUI
  6. నలల = IIIII
  7. నగగ = IIIUU
  8. నవ = IIIIU
  9. సహ = IIIUI
  10. సవ = IIUIU
  11. సగగ = IIUUU
  12. నహ = IIIUI
  13. రగురు = UIUU
  14. నల = IIII

పద్యం ఒక తెలుగు సాహితీ ప్రక్రియ. పద్యాలు వృత్తాలు కావొచ్చు, జాతులు కావొచ్చు, ఉపజాతులు కావొచ్చు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము, మున్నగునవి వృత్తాలు. కందము, ఉత్సాహ, ద్విపద, తరువోజ, అక్కర, మున్నగునవి జాతులు. సీసము, తేటగీతి, ఆటవెలది అనునవి ఉపజాతులు.
మనము వృత్తాల గురించి, జాతుల గురించి కొన్ని వివరాలు చూసాము. ఈ వారం ఉపజాతుఅల గురించిన వివరణలు చూద్దాము...

మొదటగా తేటగీతి ...
తేనెలొలుకు తెనుగు పద్యము తేటగీతిగా వెలుగు
"సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు
దినకరద్వయంబు తేటగీతి"

తేటగీతి పద్య లక్షణములు

  1. ఉపజాతి రకానికి చెందినది
  2. 12 నుండి 17 అక్షరములు ఉండును.
  3. 4 పాదములు ఉండును.
  4. ప్రాస నియమం లేదు
  5. ప్రాస యతి నియమం కలదు
  6. ప్రతి పాదమునందు 4 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
  7. ప్రతి పాదమునందు ఒక సూర్య , రెండు ఇంద్ర , రెండు సూర్య గణములుండును.
  8. ఉదాహరణలు:
    1. దేవదేవుని చింతించు దినము దినము;
      చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు;
      కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు;
      తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి.
    2. అరసి నిర్గుణబ్రహ్మంబు నాశ్రయించి
      విధినిషేధ నివృత్తి సద్విమలమతులు
      సేయుచుందురు హరిగుణచింతనములు
      మానసంబుల నేప్రొద్దు మానవేంద్ర!
    3. మంద గొందల మంద నమందవృష్టిఁ,
      గ్రందుకొనుఁ డంచు నింద్రుండు మందలింపఁ
      జండపవన సముద్ధూత చటుల విలయ
      సమయ సంవర్త కాభీల జలధరములు.
    4. భద్రమగుఁగాక! నీకు నో! పద్మగర్భ!
      వరము నిపు డిత్తు నెఱిఁగింపు వాంఛితంబు;
      దేవదేవుఁడ నగు నస్మదీయ పాద
      దర్శనం బవధి విపత్తిదశల కనఘ!
    5. చేతులారంగ శివునిఁ బూజింపఁడేని
      నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని
      దయయు సత్యంబు లోనుగాఁ దలఁపఁడేనిఁ
      గలుగ నేటికిఁ దల్లుల కడుపుఁ జేటు.
    6. క్షితిని గోశంబు లరసి వీక్షింపవలయుఁ
      బిదప నాలింపఁజనును గోవిదులఁ బ్రశ్న
      సేయఁదగుఁ గడుమదిని యోచింపుటొప్పు
      నెచట నెఱుఁగనిచో నేరమెంచఁగూడ
      దనుచు నే భావి లోకుల నభినుతింతు. 

ఆటవెలది, సీసముల గురించిన వివరణలు వచ్చే వారం చూద్దాము....
సేకరణ : వికీపీడియా నుండి 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner