20, జనవరి 2015, మంగళవారం

ఈ ముద్రాక్షరాలను...!!

నేస్తం ...
               ఒకప్పుడు తెరచిన పుస్తకమే అయినా ఇప్పుడు మూసుకుపోయి మౌనంగానే రోదిస్తోంది... ఆనందంగా మొదలైన కొత్త పుస్తకంలో లోనికి తొంగి చూస్తే కొన్ని పేజీల్లో అక్షరాలు కనిపించక మనసే కనిపించింది... ఆ మనసు చదివి కొన్ని జ్ఞాపకాల గాయాల బంధాలను ఊరడించే శక్తిని అందుకోవాలని ఆ అక్షరాలలోనే అది వెదుక్కుంటూ  చివరి వరకు ఏక బిగిన చదువుతూనే ఉండిపోయిన పుస్తకం కూడా ఇదేనేమో... ఎందుకో కొన్ని పేజీల్లో అక్షరాలు కినుక వహించినట్టుగా అనిపించినా అది కూడా అందమైన అర్దాలంకారంగా అమరింది... తీరాన్ని తాకిన అలకు ఎంత సంతోషమో... ఈ మనసు పుస్తకంలోని ప్రతి అక్షరానికి అంతే ఆనందం... తన నిర్దేశ గమ్యానికి చేరిన సంకేతానికి గుర్తుగా ప్రతి పేజిలోని పదానికి రాలిపడుతున్న ఈ మనసాక్షరాలను అందుకోవాలని ఎంత కోరికో... కన్నీటి తడితో తడచిన అక్షరానికి ఆ కన్నీటి చినుకు తపన హృదయపు పొరలను దాటుకుని కనురెప్పలను చేరిన వైనం తెలుసు... అందుకేనేమో ఎప్పుడు ఆ రెప్పల మాటునే దాగి మనసు పొరలను చెమ్మగానే మిగిల్చింది... సంద్రాన్ని తలపిస్తూ... గుండె కోతను తట్టుకుంటూ చెరగని శిలాక్షరాలను చెక్కుతూ తెలియని గమ్యాన్ని చేరుకోవాలన్న దిశా నిర్దేశాన్ని లక్ష్యంగా మార్చుకుని సాగుతున్నపుస్తకంలోని ప్రతి పేజి ఓ మౌన తరంగమే... ఎప్పుడో మొదలైనా నిన్నా   మొన్న చూసినట్లుగానే అనిపిస్తూ ఎప్పటికప్పుడు కొత్త హంగులను దిద్దుకుంటున్న జీవిత పుస్తకానికి జన్మ చందాను కానుకగా అర్పిస్తూ..... ఈ జన్మకు నెలవైన ఈ ముద్రాక్షరాలను ముచ్చటగా శెలవు కోరుతూ....
ఉండనా నేస్తం...

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner