17, ఫిబ్రవరి 2015, మంగళవారం

శూన్యం....!!

మనసు మెదడుకు పంపే నిశబ్ద నాద సంకేతం 
ఒక్కసారిగా మూగబోయి చలన రహితమయ్యి
ఎద పొరల్లో అంతులేని ఆలోచనా ప్రవాహాలు
మూకుమ్మడిగా దాడి చేసి యుద్ధం ప్రకటిస్తే
తట్టుకోలేని గుప్పెడు గుండె బావురుమంటూ
మది తరంగాలను మెదడుకు తర్జుమా చేయలేక
స్తబ్దుగా ఉండిపోతే....
ఆ ఘడియలో నన్ను నేను మరచిన మరో కొత్త ప్రపంచం
నాకే తెలియని వింతల విడ్డూరాల ఆవిష్కరణలు
పదే పదే తొలిచే గత జ్ఞాపకాలు లేవు దానిలో
భవిష్యత్తును గురించిన చింత అసలే లేదు
బతికి ఉన్నా బతుకంటే తెలియని భార రహిత స్థితి
అదే నా లోకమనుకొంటుంటే...
మళ్ళి జనారణ్యంలోనికి పొమ్మంటు విసిరేసింది
భవ బంధాలు లేని శూన్యమే బహు ముచ్చటగా ఉందంటే
కాదు కాదంటూ అనుబంధాల సంకెళ్ళు వేసి
ఆత్మీయతలను అందుకొమ్మంటూ బుజ్జగిస్తూ
శూన్యాన్ని చుట్టి వద్దామని నే వెళితే నన్నే తిప్పి పంపేసింది...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner