27, ఫిబ్రవరి 2015, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ఇరువది ఒకటవ భాగం....!!

వారం వారం సాగుతున్న మన సాహితీ ముచ్చట్ల ప్రయాణంలో ఈ వారం క్షీణ యుగం గురించిన వివరాలు
చూద్దాము.. ఈ యుగంలో ముఖ్యులైన కవుల గురించి, ప్రముఖమైన రచనల గురించిన వివరాలు చూద్దాం.. 
తెలుగు సాహిత్యంలో 1775నుండి 1875 వరకు క్షీణ యుగము అంటారు.
క్షీణ యుగంలో ప్రముఖులైన కవులు త్యాగరాజు, కంకంటి పాపరాజు, కూచిమంచి తిమ్మ కవి,కూచిమంచి జగ్గకవి, అడిదము సూరకవి, తరిగొండ వేంకమాంబ, మండపాక పార్వతీశ్వర శాస్త్రి .... మొదలైన వారు...
ప్రముఖ రచనలు : త్యాగరాజు కీర్తనలు, ఉత్తర రామాయణము, అనిరుద్ధ చరిత్ర, కుక్కుటేశ్వర శతకము, అచ్చ తెనుగు రామాయణము,  దశావతార చరిత్రము, కుచేలోపాఖ్యానము ... మొదలైనవి...


త్యాగరాజు (మే 4, 1767 - జనవరి 6, 1847) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. ఉపనయనం తరువాత తండ్రిగారి బోధలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షడక్షరీ మంత్ర ప్రభావం, తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగ రాజస్వామి వారిలో మూర్తీభవించాయి.

బాల్యం, విద్యాభ్యాసం

త్యాగరాజు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కంభం మండలం లో కాకర్ల అను గ్రామం నందు తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబంలో 1767 లో జన్మించాడు. త్యాగరాజు కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం. ఇతని జన్మనామం కాకర్ల త్యాగ బ్రహ్మం. వీరు మురిగినాడు తెలుగు బ్రాహ్మణులు.త్రిలింగ వైదీకులు. ఇతడి పూర్వీకులు ప్రస్తుత ప్రకాశం జిల్లా కంభం మండలం లో కాకర్ల అను గ్రామం నుండి తమిళ దేశానికి వలస వెళ్లారు. తండ్రి రామబ్రహ్మం తంజావూరు ప్రభువు శరభోజీ ఆద్వర్యం లో ఉండేవాడు. త్యాగరాజు గారి తాతగారు గిరిరాజ కవిగారు. వీరిని గురించి త్యాగయ్య తన బంగాళరాగ కృతిలో "గిరిరాజసుతా తనయ" అని తన తాతగార్ని స్తుతించియున్నారు. త్యాగయ్య గారి విద్య కొరకు రామబ్రహ్మము తిరువారూర్ నుంచి తిరువయ్యూర్ కు పోయిరి. త్యాగయ్య గారు అచట సంస్కృతమును, వేదవేదాంగములను అమూలాగ్రము పఠించెను. సంగీతాభ్యసము కొరకు త్యాగయ్య గారు శొంఠి వేంకటరమణయ్య గారి దగ్గర విడువబడెను. వేంకటరమణయ్య గారు త్యాగయ్య గారి చాకచక్యమును, సంగీతమునందుగల ప్రావీణ్యతను గమనించి వారియందు అతి శ్రద్ధతో సంగీతోపదేశము చేయసాగిరి.

జీవిత విశేషాలు

త్యాగయ్య గారి తండ్రి గారు పిన్న వయస్సులోనే గతించిరి. కనుక అన్నదమ్ముల మధ్య అయిన భాగపరిష్కారములలో త్యాగయ్య గారి భాగములో కులప్రతిమలైన శ్రీరామ లక్ష్మణులు విగ్రహములు వచ్చెను. ఆ ప్రతిమను అతి భక్తితో పూజించుచుండిరి. అయ్యగారు ఉంఛవృత్తి నవలంబించి సర్వసామాన్యముగా జీవనం చేయుచుండిరి. తక్కిన సమయమంతయు తన యిష్టదైవమైన "శ్రీరాములు" పై కృతులు రచించుటలో పాల్గొనుచుండిరి. త్యాగయ్య 96 కోట్ల శ్రీరామ నామములు జపించి వారి దర్శనము పొంది వారి ఆశీర్వాదము పొందిరి.అయ్యగారు మంచి శారీరము కలిగియుండిరి. అయ్యగారు వైణికులు కూడా.
18 సంవత్సరాల వయసులో త్యాగరాజుకు పార్వతి అనే యువతితో వివాహమైంది. కానీ ఆయన 23 వయస్సులో ఉండగా ఆమె మరణించడం జరిగింది. తరువాత ఆయన పార్వతి సోదరియైన కమలాంబను వివాహమాడాడు. వీరికి సీతామహాలక్ష్మి అనే కూతురు కలిగింది. ఈమె ద్వారా త్యాగరాజుకు ఒక మనుమడు కలిగాడు కానీ యవ్వనంలోకి అడుగుపెట్టక మునుపే మరణించాడు. కాబట్టి త్యాగరాజుకు ఖచ్చితమైన వారసులెవరూ లేరు కానీ ఆయన ఏర్పరచిన సాంప్రదాయం మాత్రం ఈనాటికీ కొనసాగుతూనే ఉంది.

సంగీత ప్రతిభ

త్యాగరాజు తన సంగీత శిక్షణను శొంఠి వెంకటరమణయ్య దగ్గర, చాలా చిన్న వయసులోనే ప్రారంభించాడు. పదమూడేండ్ల చిరు ప్రాయమునాడే త్యాగరాజు నమో నమో రాఘవా అనే కీర్తనను దేశికతోడి రాగంలో స్వరపరచాడు. గురువు శొంఠి వేంకటరమణయ్య ఇంటిలో చేసిన కచేరీలో ఎందరో మహానుభావులు అనే కీర్తనను స్వరపరచి పాడాడు. ఇది పంచరత్న కృతులలో ఐదవది. ఈ పాటకు వెంకటరమణయ్య గారు చాలా సంతోషించి, త్యాగరాజులోని బాలమేధావి గురించి తంజావూరు రాజుగారికి చెప్పగా, రాజు సంతోషించి అనేక ధన కనక వస్తు వాహనాది రాజలాంఛనాలతో త్యాగరాజును సభకు ఆహ్వానించాడు. కానీ త్యాగరాజు తనకు నిధి కన్నా రామ సన్నిధి మాత్రమే సుఖమని ఆ కానుకలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. ఈ సందర్భంగా స్వరపరచి పాడినదే నిధి చాల సుఖమా అనే కీర్తన. సంగీతాన్ని భగవంతుని ప్రేమను పొందే మార్గముగా త్యాగరాజు భావించాడు. సంగీతంలోని రాగ, తాళములను వాటిపై తన ప్రావీణ్యాన్ని చూపించుకోవడానికి కాక, భగవంతుని నామాలను చెప్పడానికి, భగవంతుని లీలలను పొగడటానికి ఓ సాధనముగా మాత్రమే చూసాడు.
తంజావూరు రాజు పంపిన కానుకలను తిరస్కరించినపుడు ఆగ్రహించిన అతని అన్నయ్య జపేశుడు, త్యాగరాజు నిత్యం పూజించుకునే శ్రీరామ పట్టాభిషేక విగ్రహాలను కావేరీ నదిలో విసిరివేసాడు. శ్రీరామ వియోగ బాధను తట్టుకోలేక, రాముడు లేని ఊరిలో ఉండలేక దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్ళి అనేకానేక దేవాలయములను, తీర్థములను దర్శించి, ఎన్నో అద్భుత కీర్తనలను త్యాగయ్య రచించాడు. చివరగా శ్రీరాముని అనుగ్రహంతో విగ్రహాలను పొందాడు. వైకుంఠ ఏకాదశి నాడు త్యాగరాజు శ్రీరామ సన్నిధిని చేరుకున్నాడు.
త్యాగరాజు జీవితంలో జరిగినట్లుగా కొన్ని విశేషాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దేవముని అయిన నారదుడే స్వయంగా ఇతనికి సంగీతంలోని రహస్యాలను చెప్పి,"స్వరార్నవ"మనే ఓ అద్భుతమైన పుస్తకం ఇచ్చాడనీ, ఆ సంధర్భంలో త్యాగరాజు చెప్పిన కృతిగా పంచరత్న కృతులలో మూడవదైన "సాధించెనే" అనీ చెపుతారు. ఈ పుస్తకము వల్ల త్యాగయ్యగారు సంగీతములో అత్యుత్కృష్టమైన విషయములను తెలిసికొనినట్లు తెలియుచున్నది. శంకరాభరణము లోని "స్వరరాగ సుధారసము" అను కృతిలో ఈ గ్రంథమును గురించి త్యాగయ్య పేర్కొనియున్నారు. త్యాగయ్యవారు 24000 రచనల వరకు రచించిరి. "దివ్యనామ సంకీర్తనలు" , "ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు" అను బృంద కీర్తనలు కూడా రచించెను. "ప్రహ్లాద భక్తి విజయము", నౌకా చరిత్రము అను సంగీత నాటకములు కూడా రచించిరి.

త్యాగరాజు జీవితంలో కొన్ని సంఘటనలు

  1. త్యాగరాజు తన రామచంద్రుని పూజా విగ్రహాలు పోగొట్టుకున్నప్పుడు పాడిన పాట: ఎందు దాగినావో
  2. ఇతడు తిరుపతి వేంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ తెరవేసి ఉంటే, తెరతీయగరాదా అనే పాట పాడితే తెరలు వేంకటేశ్వరుని దయచేత అవే తొలగిపోయినాయి. ఆ తరువాత ఆయన వేంకటేశ నిను సేవింప అనే పాట పాడినాడు.
  3. త్యాగయ్య పరమపదము చేరటానికి ముందు పాడిన పాటలు: గిరిపై, పరితాపము

త్యాగరాజ ఆరాధనోత్సవాలు

అసంఖ్యాకమైన కీర్తనలు రచించి, కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను సోదాహరణంగా నిరూపించి శాశ్వతమైన కీర్తి సంపాదించిన త్యాగరాజును కర్ణాటసంగీతానికి మూలస్థంభంగా చెపుతారు. ఈ సంగీత నిధికి నివాళిగా ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు (జనవరి, ఫిబ్రవరి నెలలలో) తిరువయ్యూర్ లో ఆయన సమాధి చెందిన త్యాగరాజ మహోత్సవ సభనందు త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు.
ఆయన భక్తులు మరియు సంగీత కళాకారులు మొదట ఉంచవృతి భజన, తరువాత ఆయన నివాస స్థలమైన తిరుమంజనవీధి నుంచి బయలుదేరి ఆయన సమాధి వరకూ కీర్తనలు గానం చేస్తూ ఊరేగింపుగా వస్తారు. వందలకొద్దీ కర్ణాటక సంగీత కళాకారులు ఆయన రచించిన పంచరత్న కృతులను కావేరీ నది ఒడ్డున గల ఆయన సమాధి వద్ద బృందగానం చేస్తారు. సంగీతాభిమానులకు ఈ గానం శ్రవణానందాన్ని కలిగించడమే కాకుండా భక్తిభావాన్ని కూడా రేకెత్తిస్తుంది. ఈ ఉత్సవాన్ని ప్రపంచంలో చాలాచోట్ల నిర్వహిస్తారు కానీ తిరువయ్యూరులో నిర్వహించే ఆరాధన చాలా ప్రసిద్ధి గాంచినది. ప్రతీ సంవత్సరం పెరుగుతూ వస్తున్న కళాకారుల మరియు సందర్శకుల కోసం ఇక్కడ ఒక పెద్ద భవనం కూడా నిర్మాణదశలో ఉంది.

సమాధి

త్యాగరాజ స్వామివారి మహాభక్తురాలు బెంగుళూరు నాగరత్నమ్మ కావేరీ నది ఒడ్డున శిధిలావస్థలోనున్న స్వామి వారి సమాధి చూసింది. ఆ స్థలాన్ని, దాని చుట్టు ఉన్న ప్రదేశాన్ని తంజావూరు రాజుల ద్వారా, రెవిన్యూ అధికారుల ద్వారా తన వశము చేసికొని పరిశుభ్రము చేయించి, గుడి, గోడలు కట్టించింది. మదరాసులోని తన ఇంటిని అమ్మి రాత్రనక పగలనక వ్యయప్రయాసల కోర్చి దేవాలయ నిర్మాణాన్ని ముగించింది. అక్టోబర్ 27, 1921లో పునాదిరాయిని నాటగా, జనవరి 7, 1925న గుడి కుంభాభిషేకము జరిగింది. స్థలాభావము వలన ఇంకా నేల కొని ఒక మంటపము, పాకశాల 1938లో నిర్మించింది. ఈ నిర్మాణములతో ఆమె సంపద, ఆభరణాలు హరించుకుపోయాయి. 1946లో త్యాగయ్య చిత్ర నిర్మాణసందర్భములో చిత్తూరు నాగయ్య గారు నాగరత్నమ్మను కలిశారు. ఆమె సలహాపై నాగయ్య గారు త్యాగరాజనిలయం అనే సత్రాన్ని కట్టించారు.

రచనలు

రామేతి మధురం వాచం' అన్నట్లు 96 కోట్ల సార్లు రామనామాన్ని జపించి, స్వీయానుభవ భావనలే కృతి రూపంలో మలచి గాంధర్వగాన మధురానుభూతిగా లోకానికి అందించారు. భూలోక నారదుడైన త్యాగరాజ స్వామి నారద మంత్రోపదేశం పొంది, అనుగ్రహం ప్రాభవంతో 'స్వరార్ణ వం' 'నారదీయం' అనే రెండు సంగీత రహస్యార్ధ 'శాస్త్ర గ్రంథాలు రచించారు. పంచరత్న కృతి సందేశం : శ్రీత్యాగరాజస్వామి రచించిన కృతులను ప్రాపంచికం, తాత్వికం, కీర్తనం, నిత్యానుష్ఠానాలని వర్గీకరించవచ్చు. త్యాగరాజస్వామి కీర్తనలలో ఘనరాగ పంచరత్న కీర్తనలు ముఖ్యమైనవి.శ్రీత్యాగరాజస్వామి. రామభక్తా మృతాన్ని సేవించి, కర్ణాటక సంగీత సంప్రదాయంలో అనేక కృతులను మధుర కీర్తనలుగా మలచి సంగీత, సాహిత్య రసజ్ఞుల హృదయాల్లో చిరంజీవిగా నిలిచారు. త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో విశేషంగా పంచరత్న కీర్తనలు ఆలపించడం సంప్రదాయం.

కీర్తనలు

త్యాగయ్య దాదాపు 800 కీర్తనలను రచించాడు.. వీటిలో చాలావరకు ఆయన మాతృభాష ఐనటువంటి తెలుగులో రచించినవే. కొన్ని సంస్కృతంలో రచించబడినవి. కానీ ఈ కీర్తనలు మాత్రం ఆంధ్రదేశంలోకన్ననూ కర్ణాటక సంగీతం బాగా ప్రాచుర్యంలో ఉన్న తమిళనాట బాగా ప్రాచుర్యం పొందాయి. సంస్కృతంలో రచించబడిన జగదానందకారక అనే కీర్తన శ్రీరామునికున్న 108 పేర్లను ప్రస్తావిస్తుంది. 'ప్రహ్లాద భక్తి విజయం','నౌకా చరితం' అనే నాట్యరూపకాలను కూడా రచించాడు. త్యాగరాజు కీర్తనల పూర్తి పట్టిక కోసం త్యాగరాజు కీర్తనలు అనే వ్యాసాన్ని చూడండి.
త్యాగయ్య గారు క్షేత్రములకు వెళ్ళునపుడు, ఆయా క్షేత్రము మీదను, క్షేత్రములోని దేవుని మీదను కృతులు రచించెను. అవి యేవనిన:

కొవ్వూరు పంచరత్నములు

(కొవ్వూరు లోని శ్రీ సుందరేశ్వర స్వామి పై వ్రాసిన ఐదు కృతులు)
సంఖ్య పాట మొదలు రాగము తాళము
1 నమ్మివచ్చిన కల్యాణి రూపకము
2 కోరిసేవింప ఖరహరప్రియ ఆదితాళము
3 శంభోమహదేవ పంతువరాళి రూపకతాళము
4 ఈ వసుధ శహాన ఆదితాళము
5 సుందరేశ్వరుని కల్యాణి ఆదితాళము

తిరువత్తియూరు పంచరత్నములు

(తిరువత్తియూరులో వెలసిన శ్రీ త్రిపుర సుందరీ దేవిపై రచించిన కృతులు)
సంఖ్య పాట మొదలు రాగము తాళము
1 సుందరి నన్ను బేగడ రూపకము
2 సుందరీ నీ దివ్య కళ్యాణి ఆదితాళము
3 దారిని తెలుసుకొంటి శుద్ధ సావేరి ఆది
4 సుందరి నిన్ను వర్ణింప ఆరభి చాపు
5 కన్నతల్లి నిన్ను సావేరి ఆదితాళము


కూచిమంచి తిమ్మకవి
18వ శతాబ్దపు తెలుగు కవి. తిమ్మకవి పదిహేడవ శతాబ్దపు నాలుగవ భాగంలో జన్మించి, పద్దెనిమిదవ శతాబ్దపు మూడవభాగం వరకు జీవించి ఉండేవాడని విమర్శకులు, చారిత్రకులు చెప్తున్నారు.
తడు ఆరువేల నియోగి. కౌండిన్యస గోత్రుడు. ఇతని ముత్తాత బయ్యనామాత్యుడు. తామ తిమ్మయార్యుడు. తండ్రి గంగనామాత్యుడు, తల్లి లచ్చమాంబ. సింగన్న, జగ్గన్న, సూరన్న ఇతనికి తమ్ములు. గొట్తిముక్కుల రామయమంత్రిగారి కుమార్తె బుచ్చమ్మ ఇతని భార్య. దెందులూరి లింగయ్య ఇతనికి గురువు.

చారిత్రక విశేషాలు

తిమ్మకవి పిఠాపురం సంస్థానంలోని కందరాడ గ్రామానికి కరణమట. ఇతడు ప్రతిదినము పిఠాపురానికి వచ్చి కుక్కుటేశ్వరడుని సేవించేవాడు. సహస్రమాస జీవి. పిఠాపురాన్ని పరిపాలించిన ప్రభువులలో రావు పెదమాధవరావు, రావు నరసింహారావు, రావు వేంకటరావు, రావు వేంకటకృష్ణారావు, రావు చినమాధవరావు పాలనాసమయంలో ఇతడు జీవించి వున్నాడు. రావు చినమాధవరావు తిమ్మకవికి "కవి సార్వభౌమ" అనే బిరుదాన్నిచ్చాడు. అయినా తిమ్మకవి తన గ్రంథాలను పిఠాపురపు కుక్కుటేశ్వర స్వామికి అంకితం చేశాడు. ఇతని చివరిదశలో భార్యావియోగంతో సన్యాసం స్వీకరించి శేషజీవితాన్ని పిఠాపురంలోని కుక్కుటేశ్వరాలయంలోనే గడిపాడు.

రచనలు

  1. అచ్చతెలుగు రామాయణము
  2. రుక్మిణీ పరిణయము (1715)
  3. సింహాచల మహాత్మ్యము (1719)
  4. నీలాసుందరీ పరిణయము
  5. సారంగధర చరిత్ర
  6. రాజశేఖర విలాసము (1705)
  7. రసికజన మనోభిరామము (1750)
  8. సర్వలక్షణసార సంగ్రహము (1740)
  9. సర్పపురీ మహాత్మ్యము (1754)
  10. శివలీలా విలాసము (1756)
  11. కుక్కుటేశ్వర శతకము
  12. శ్రీ భర్గ శతకము (1729)
  13. భర్గీ శతకము
  14. చిరవిభవ శతకము

బిరుదులు

  • అభినవ వాగనుశాసనుడు
  • కవిసార్వభౌమ
కూచిమంచి జగ్గకవి
18వ శతాబ్దపు కవి. పిఠాపురం సమీపంలోని కందరాడ గ్రామాణికి చెందినవాడు. కూచిమంచి తిమ్మకవికి తమ్ముడు. చంద్రరేఖా విలాపం అనే బూతు ప్రబంధం రాశాడు. పుదుచ్చేరిలోని కామ గ్రంధమాల సంపాదకులు యస్.చిన్నయ్య 1922 లో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తే ప్రభుత్వం దీన్ని నిషేదించిందట.
ఈయన 1700-1765 కాలానికి చెందిన కవి. డబ్బు కక్కుర్తితో నీలాద్రిరాజు వేశ్యమీద మొదట 'చంద్రరేఖా విలాసం'అనే కావ్యం వ్రాసి, తరువాత కృతి స్వీకరింప నిరాకరించిన ఆ నీలాద్రిరాజు మీద కోపంతో 'చంద్రరేఖా విలాపం' అనే బూతుల బుంగ కావ్యం వ్రాసి తిట్టు కవిగా సుప్రసిద్ధుడైన ఈ ప్రబుద్ధుడు వ్రాసిన ఒక చాటు శతకం కూడా ఉంది. (తెలుగులో తిట్టుకవులు పుటలు 133-145). 'రామా! భక్తమందారమా!' అనే మకుటంతో వ్రాసిన ఈ శతకంలోని పద్యాలు అనేకం కవి ఆర్తిని, ఆనాటి కవుల హీనస్థితినీ వర్ణించేవిగా ఉన్నాయి. ఈ పద్యం చూడండి;
మ. గడియల్ రెండిక సైచి రా, వెనుక రా, కాసంతసేపుండి రా.
  విడిదింటం గడె సేద దీర్చుకొని రా, వేగంబె భోంచేసి రా,
  ఎడపొద్దప్పుడు రమ్మటంచు సుకవిన్ హీనప్రభుండీ గతిన్
  మడతల్ పల్కుచు త్రిప్పు కా సిడక రామా ! భక్తమందారమా !
ఈయన అన్న కూచిమంచి తిమ్మకవి 'నిరాఘాట నత చ్చాటు కవిత్వాంకు డరయ జగ్గన ధరణిన్' అని ఇతడిని వర్ణించాడు.

రచనలు

  • చంద్రలేఖా విలాసం
  • చంద్రలేఖా విలాపం
  • "రామా భక్తమందారమా" శతకము
  • నర్మదా పరిణయము
  • రాధాకృష్ణ చరిత్ర
  • సుభద్రా పరిణయము
  • సోమదేవరాజీయము
  • పార్వతీ పరిణయము
తెలుగు సాహిత్య చరిత్రలో చెప్పకోదగ్గ కవుల్లో 18వ శతాబ్దంలో జీవించిన అడిదము సూరకవి (Adidam Surakavi) ఒకరు. ఇతడు చంద్రాలోకం, ఆంధ్రనామశేషం వంటి రచనలు చేశాడు. పైడిపాటి లక్ష్మణకవి తో కలసి ఆంధ్రనామ సంగ్రహం రచించాడు.

అడిదము వారి వంశచరిత్ర

ఆంధ్రదేశంలో కవితా వృత్తిచే పేరు పొందిన నియోగి బ్రాహ్మణ కుటుంబాలలో అడిదము వారు ఒకరు. ఈ వంశీయులు కవిత చెప్పడంలోనే గాక కత్తి తిప్పడంలోనూ సమర్ధులు. 'వసిష్ట' గోత్రులు శివ శ్యామలాదేవతోపాసకులు. ఈ వంశీయులు 23 తరాలనుండి కవితా వృత్తిచే జీవించారని, 14 తరాలనుండి వీరికి రాజాస్థానం లభించిందని తెలుస్తుంది. ఈ వంశీయులలో మొదటి వారిని గురించిన సమాచారం దొరకడం లేదు. ఈ వంశీయులు రాజాస్థానం పొందిన దగ్గర నుండి సమాచారం దొరుకుతుంది.
గృహనామం
కళింగదేశం లోని సుప్రసిద్ధ విద్వత్కవి వంశాలలో ఒకటి అడిదము వారి వంశం. మొదట మోదుకూరి, తరువాత గంధవారణం అనే ఇంటిపేర్లు గల ఈ వంశం వారికి వీరి పూర్వీకుడైన నీలాద్రి కవి రణరంగ వీరుడై ఒక అడిదాన్ని (కత్తిని) కానుక గా పొందిన నాటి నుండి అడిదము వారని ప్రసిద్ధి వచ్చింది. గోదావరి మండలం మోదుకూరు కాపురం వచ్చిన వీరికి మోదుకూరు ఇంటి పేరు అయింది. తరువాత వీరి ఇంటి పేరు 'గంధవారణం' అయింది.
లోకంలో తిట్టుకవిగానూ, లోకజ్ఞ్డుడుగానే విఖ్యాతుడైనా, నిజానికి 'మృడ పద పంకజ రిరంసు మృదు మానసు'డై రామలింగేశ శతకం వంటి పదహారణాల చాటుత్వం గల చక్కని శతకం చెప్పిన ఆడిదం సూరకవి ఆ నీలాద్రి కవికి 9 వ తరం వాడు. తనను గూర్చిన వివరాలను సంభాషణాత్మక చాటువు లో ఇలా స్వయంగా సూరకవి చెప్పుకున్నాడు--
కం. "ఊరెయ్యది?" "చీపురుపలి",
  "పేరో?" "సూరకవి" ; "ఇంటిపే?" "రడిదమువార్" ;
  "మీ రాజు?" "విజయరామ మ
  హా రా": "జత డేమి సరసుడా ?" "భోజు డయా!"
ఈ పద్యాన్నిబట్టి ఈ కవి విజయనగర ప్రభువు శ్రీ పూసపాటి విజయరామరాజు ఆస్థానానికి చెందిన వాడని తెలుస్తూంది. తన ప్రభువును స్తుతిస్తూ పెద్దాపురం ఆస్థానంలో ఈ కవి చెప్పిన సుప్రసిద్ధ చాటువు -
ఉ. రాజు కళంకమూర్తి; రతిరాజు శరీర విహీను ; డంబికా
  రాజు దిగంబరుడు; మృగరాజు గుహాంతర సీమవర్తి ; వి
  భ్రాజిత పూసపా డ్విజయరామ నృపాలుడు రాజు కాక ఈ
  రాజులు రాజులా పెను తరాజులు కాక ధరాతలంబునన్.
సభలో ఉన్న రాజు లంతా తమనే తరాజు లంటున్నా డని రోషం తెచ్చుకోగా, చమత్కారంగా ఈ కవి తాను పద్యంలో పేర్కొన్న రాజు (చంద్రుడు), రతిరాజు (మన్మధుడు), మొదలైన రాజుల్నే తాను తరాజు లన్నా నని చెప్పి శాంత పరిచాడట. సూరకవికి కనకాభిషేకం చేయించిన విలువైన చాటు విది.

'పొణుగుపాటి వేంకట మంత్రీ!' అనే మకుటం తో సూరకవి చెప్పిన 39 కందాలు కళింగ దేశ ప్రాంతాల్లో వ్యాప్తిలో ఉన్నాయి. ఈ వేంకట మంత్రి (1720-1780) శృంగవరపుకోట జమీందారు శ్రీ ముఖీ కాశీపతిరావుగారి వద్ద దివానట! ఈయన మహాదాత, కవి, పండిత పక్షపాతి. సూరకవి ఈ మంత్రిగారి ఇంట ప్రతి యేడూ మూడు నాలుగు మాసాలపాటు గడుపుతూ ఉండే వా డని 'ఆడిదం సూరకవి జీవితం' (పుట 80) చెబుతూంది.
కం. వెన్నెల వలె కర్పూరపు
  దిన్నెల వలె నీదు కీర్తి దిగ్దేశములన్
  మిన్నంది వన్నె కెక్కెను
  విన్నావా ? పొణుగుపాటి వేంకట మంత్రీ !

కం. చుక్కల వలె కర్పూరపు
  ముక్కల వలె నీదు కీర్తి ముల్లోకములన్
   క్రిక్కిరిసి పిక్కటిల్లెను
   వెక్కసముగ పొణ్గుపాటి వెంకట మంత్రీ !

కం. సన తేనియ గైకొను భృం
   గ నిరూఢిని దాత మనసు కందక యుండన్
   కొనవలె యాచకు డర్ధము
   విను మవహిత ! పొణుగుపాటి వేంకట మంత్రీ !

కం. పొగ త్రాగనట్టి నోరును
   పొగడంగా బడయనట్టి భూపతి బ్రదుకున్
   మగడొల్లని సతి బ్రదుకును
   వెగటు సుమీ పొణుగుపాటి వేంకట మంత్రీ !
కందానికి కవి చౌడప్ప అలవరించిన తేటతనానికి మెరుగులు పెట్టదం సూర కవి చెప్పిన ఈ కందాల్లో కనిపిస్తుంది. 'చుక్కల వలె' అనే పద్యం 'కన్యాశుల్కం' (పుట 82) లో గిరీశం ఉపన్యాసాలలో చోటు చేసుకునేటంత ప్రసిద్ధి పొందింది. పొణుగుపాటి వేంకట మంత్రి బ్రాహ్మణ సమారాధానలకు పేరు మోసినవాడు. ఒకనాటి సమారాధన వైభవం చూసి, సూరకవి 'ఒక్క సముద్రము దక్కగ' అనే పద్యం చెప్పాడట. ఒక ఉప్పు సముద్రం తప్ప, క్షీర, దధి, ఘృతాది ఇతర ఆరు సముద్రాలూ ఆ సమారాధనలో వెల్లివిరిసినాయట. ఈ పద్యం విని సమారాధనలో మదిచార పోసి పట్టుకోక ధరించి విప్రులకి నెయ్యి వడ్డిస్తున్న వేంకటమంత్రిగారి సోదరి బావ గారి వరస అయిన సూరకవితో 'స్వయంపాకులైన బావగారి కోసం ఆ సముద్రం మా అన్నయ్య విడిచి పెట్టాడు లెండి' అని ముసి ముసి నవ్వులు నవ్వుతూ విసరిన చెణుకుకి సూరకవి అంతటి వాదే నిరుత్తరు డయాడని ఐతిహాస్యం.

నియోగి, వైదీకి మనస్పర్ధలు సూరకవి నాడే తారస్థాయి అందుకున్నట్లు 'చెన్నగు నియోగి కవనపు' లాంటి పద్యాలే గాక, విద్వత్కవి, గొప్ప తార్కికుడు, వైదికుడు అయిన రేకపల్లి సోమప్ప తో సూరకవి వివాదం లాంటివి కూడా స్పష్టం చేస్తున్నాయి. ఆ సోమప్పను సూరకవి ఇలా పరిహసిస్తాడు -
కం. ఏమేమో శాస్త్రంబులు
  తా మిక్కిలి సతికె నంట తద్దయు కవితా
  సామర్ధ్య మెరుగ నేరని
  సోముని జృంభణము కలదె సూరుని ఎదుటన్ ?

కం. తెలుగుం గబ్బపు రీతులు
  కల నెరుగని శుష్క తర్క కర్కశ మతికిన్
  తెలిసె నొకయించు కించుక
  వెలిపలి గౌతన్న కృప కవిత్వపు జాడల్.

సూరకవి తిట్టుకవి గా ప్రసిద్ధుడవడానికి ఈయన శాపానుగ్రహ సమర్ధుడని అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. తన తిట్టు పటిమను గూర్చి సూరకవే ఇలా చెప్పుకుంటాడు -
చం. గడియకు నూరు పద్యములు గంటము లేక రచింతు, తిట్టగా
  దొడగితినా పఠీలు మని తూలి పడున్ కుల శైల రాజముల్
  విడువ కను గ్రహించి నిరుపేద ధనాధిపు తుల్యు చేతు నే
  నడిదము వాడ సూరన సమాఖ్యుడ నా కొకరుండు సాటియే ?
సూరకవి వివిధ రాజాస్థానాలు సందర్శించినట్టూ, సర్వత్రా విజయలక్ష్మిని చేపట్టినట్టూ ఆయన జీవిత చరిత్ర చెపుతూంది. బొబ్బిలి సంస్థానం దర్శించినప్పుడు ఈయన పూరించినట్లు చెప్పబడుతున్న ఒక సమస్య;
ఉ. సౌరతర ప్రబంధము లసంఖ్యముగా నొనరించు నట్టి ఈ
  సూర కవీంద్రునిం జునిగి చూత మటంచును మాటి మాటికిన్
  ఈరస మెత్తి దుష్కృతుల నిచ్చిన నారల నోరు మొత్తుడీ
  మీరును మీరు మీరు మరి మీరును మీరును మీర లందరున్.

ఒకసారి సూరకవి భార్య "అందరి మీదా మీరు పద్యాలు చెబుతారు, మన బాచన్నమీద కూడా ఒక పద్యం చెప్పకూడదూ?" అందిట నిష్టూరంగా. వెంటనే 'తన,పర' అనే భేదం లేని సూర కవి ఆ ఎత్తు పళ్ళ సుందరాంగుడి మీద ఈ హాస్య చాటువు చెప్పాడు-
కం. బాచా బూచులలోపల
  బాచన్నే పెద్ద బూచి పళ్ళున్ తానున్
  బూచంటె రాత్రి వెరతురు
  బాచన్నను చూసి పట్టపగలే వెరతుర్.
సూర కవి పద్యాల్లో ఎంతటి మహారాజునైనా 'నువ్వు', ను'వ్వని ఏకవచన ప్రయోగం చేస్తూండడాన్ని ఆక్షేపించిన పూసపాటి సేతారామరాజు గారికి సూరకవి ఇలా జవాబు చెబుతాడు. పిల్లల్నీ, రతి సమయంలోనూ, కవిత్వంలోనూ, యుద్ధంలోనూ ఎవరినైనా 'ఏరా' అనవచ్చునట !
కం. చిన్నప్పుడు, రతికేళిని
  ఉన్నప్పుడు, కవితలోన, యుద్ధములోనన్
  వన్నె సుమీ 'రా' కొట్టుట
  చెన్నగు నో పూసపాటి సీతారామా !

త్యాగరాజు కీర్తనలు 

త్యాగయ్య, త్యాగ బ్రహ్మ, త్యాగ రాజు గా ప్రసిద్ది కెక్కిన ఈయన ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి లతో పాటు కర్ణాటక సంగీత వాగ్గేయకారులైన త్రిమూర్తులలో ఒకడు. 16 వ శతాబ్దాంతమున విజయ నగర సామ్రాజ్య పతనానంతరం జన జీవన శైలిలో వచ్చిన విపరీతమైన మార్పుల వలన ఎంతో మంది తెలుగు వాళ్ళు తమిళనాడుకు వలస పోయారు, ఆ విధంగా వలస పోయిన కుటుంబాలకు చెందిన వాడే త్యాగయ్య కూడా. కర్నూలు జిల్లా కు చెందిన కాకర్ల గ్రామమునకు చెందినవాడని చెప్పుకున్నాడు త్యాగయ్య. 1767?? లో కాకర్ల రామబ్రహ్మం,సీతమ్మలకు తిరువారూర్ గ్రామంలో జన్మించాడు త్యాగయ్య. తరువాత కావేరీ నదీ తీరాన ఉన్న తిరువయ్యూరు కు మారాడు కాకర్ల రామబ్రహ్మం. ఇప్పటికీ తిరువయ్యూరులో త్యాగరాజ వంశస్తులు ఆయన ఇంటిని పరిరక్షిస్తూనే ఉన్నారు.
ఈయన పంచరత్న కీర్తనలు, సంగీతం మీద త్యాగయ్య పట్టు ను వెల్లడిచేస్తాయి. వీటితో పాటు ఈయన ఎన్నో ఉత్సవ సంప్రదాయ కీర్తనలు, దివ్య నామ సంకీర్తనలు కూర్చాడు.
కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడయిన త్యాగరాజులవారి కీర్తనలు

పంచరత్న కీర్తనలు

త్యాగరాజ స్వామి వారి కీర్తనలలో ఉత్తమమైనవిగా విద్వాంసుల చేత నిర్ణయించబడినవి పంచరత్న కీర్తనలు:
అవి....
  • జగదానంద కారక - నాట రాగం
  • దుడుకుగల - గౌళ రాగం
  • సాధించెనె - ఆరభి రాగం
  • కనకనరుచిరా - వరాళి రాగం
  • ఎందరో మహానుభావులు - శ్రీ రాగం

కీర్తనలు

మచ్చుకు ఈ కీర్తనను చూడండి:
బిళహరి రాగము - ఆది తాళము
దొరకునా ఇటువంటి సేవ ॥దొరకునా॥ దొరకునా తప మొనరించిన భూ సురవరులకైన సురలకైన ॥దొరకునా॥

తుంబుర నారదులు సుగుణకీర్త

నంబుల నాలాపము సేయగా
అంబరీష ముఖ్యులు నామము సే
యగ జాజులపై చల్లగా
బింబాధరులగు సురవారయళి
వేణులు నాట్యములాడగా
అంబుజభవ పాకారు లిరుగడల
నన్వయ బిరుదావళిని బొగడగా
అంబరవాస సతులు కరకంక
ణంబులు ఘల్లని విసరగ మణిహా
రంబులు ఘల్లని విసరగ మణిహా
రంబులు గదలగ సూచే ఫణి త
ల్పంబున నెలకొన్న హరిని గనుగొన ॥దొరకునా॥


మరకతమణిసన్నిభ దేహంబున
మెఱుగు గనకచేలము శోభిల్ల
చరణయుగ నభావళికాంతులు
జందురు పిల్లలను గేర
వరనూపురము వెలుగంగ గతయుగమున
వజ్రపు భూషణములు మెఱయ
ఉరమున ముక్తాహారములు మఱియు
ఉచితమైన మకరకుండలంబులు
చిఱునవ్వులుగల వదనంబున ముం
గురు లద్దంపుగపోలము ముద్దు
గురియు దివ్యఫాలంబున దిలకము
మెఱసే భువిలావణ్యనిధిని గన
తామసగుణరహిత మునులకు బొగడ
దరముగాకనే భమసి నిల్వగ
శ్రీమత్కనకపు దొట్లపైని చెలు
వందగ గొలువుండగ
కామితఫలదాయకియౌ సీత
కాంతునిగని యుప్పొంగగ
రామబ్రహ్మ తనయుడౌ త్యాగ
రాజు తా బాడుచు నూచగ
రాముని జగదుద్ధారుని సురరిపు
భీముని త్రిగుణాతీతుని బూర్ణ
కాముని చిన్మయరూపుని సద్గుణ
ధాముని కనులార మదిని కనుగొన ॥దొరకునా॥

నగుమోము కనవా!

పల్లవి:నగుమోము గలవాని నామనోహరుని
జగమేలు శూరుని జానకీ వరుని

చరణం1:దేవాదిదేవుని దివ్యసుందరుని
శ్రీవాసుదేవుని సీతా రాఘవుని

చరణం2:నిర్మాలాకారుని నిఖిల లోచనుని
ధర్మాది మోక్షంబు దయచేయు ఘనుని

చరణం3:సుజ్ఞాన నిధిని సోమసూర్యలోచనుని
అజ్ఞాన తమమును అణచు భాస్కరుని

చరణం4:భోధతో పలుమారు పూజించి నేను
ఆరాధింతు శ్రీత్యాగరాజా సన్నుతుని

కోదండ రామ

రామ కోదండ రామ
రామ కల్యాణ రామ
రామ పట్టాభి రామ
రామ పావన రామ

రామ సీతాపతి
రామ నేవేగతి
రామ నీకుమ్రొక్కితి
రామ నీచేజిక్కితి

రామ నేనందయినను
రామ నిను వేడగలేను
రామ ఎన్నడైనను
రామ బాయగలేను

రామ నీకొక్క మాట
రామ నాకొక్క మూట
రామ నీమాటే మాట
రామ నీపాటే పాట

రామ నామమే మేలు
రామ చింతనే చాలు
రామ నేవు నన్నేలు
రామ రాయడే చాలు

రామ నీకెవ్వరు జోడు
రామ క్రీకంట జూడు
రామ నేను నీవాడు
రామ నాతో మాటాడు

రామాభి రాజ రాజ
రామ ముగజీతరాజ
రామ భక్త సమాజ
రక్షిత త్యాగరాజ


గంధము పూయరుగా...

గంధము పూయరుగా
పన్నీరు గంధము పూయరుగా
అందమైన యదునందుని పైని
కుందరదనవర వందగ పరిమళ "గంధము"

తిలకము దిద్దరుగా
కస్తూరి తిలకము దిద్దరుగా
కళకళమని ముఖకళగని సొక్కుచు
పలుకుల నమృతము నొలెకిడి స్వామికి "తిలకము"

చేలము గట్టరుగా
బంగారు చేలము గట్టరుగా
మాలిమితో గోపాల బాలులతో
నాల మేపిన విశాల నయనునికి "చేలము"

ఆరతులెత్తరుగా
ముత్యాల ఆరతులెత్తరుగా
నారీమణులకు వారము యవ్వన
వారక యొసగెడి వారిజాక్షునికి "హారతులు"

పూజలు చేయరుగా
మనసారా పూజలు చేయరుగా
జాజులు మరివిర జాజుల దవనము
రాజిత త్యాగరాజ వినుతునికి "పూజలు"

"గంధము" "తిలకము" "చేలము" "హారతులు" పూజలు"


ఇలా చెప్పుకుంటు పోతుంటే అంతు లేని మహా సాగరం ఈ సాహితీ సంద్రం... ఇక ఈ వారానికి ముగిస్తూ వచ్చే వారం మరి కొన్ని సాహితీ ముచ్చట్లతో మళ్ళి కలుద్దాం....

సేకరణ : వికీపీడియా నుండి 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner