14, ఫిబ్రవరి 2015, శనివారం

ఇదేగా మన జీవితం నేస్తం....!!

నేస్తం....
        అందరు ప్రేమ కోసం పరుగులెత్తిన రోజుల్లో ప్రేమంటే తెలియదు... కావాలని అనిపించలేదు అప్పుడు... అన్ని ప్రేమలు అందుకున్న ఆత్మీయతలో... ఇప్పుడేమో ఏ ప్రేమా వద్దని వారిస్తోంది మనసు.. బాధ్యతలను మాత్రమే గుర్తు చేస్తూ... ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ముళ్ళ బాటలు... ఇప్పటికి గతపు ముళ్ళను ఏరుకుంటునే... నెత్తుటి చారికలు పేర్చుతున్న జ్ఞాపకాలను అప్పుడప్పుడు అక్షరాలుగా వెదజల్లుతూ కాస్త భారాన్ని మనసు నుంచి దించే యత్నం.
       జగమంత కుటుంబం నాది...  ఏకాకి జీవితం నాది...  సంసార సాగరం నాది...  సన్యాసం శూన్యం నాదే.... ఎంత నిజం కదా .. సిరివెన్నెల గారు తన కోసం రాసుకున్న ఈ పాట ఇప్పటికి చాలా మందికి ఇది నా జీవితమే అని అనిపింప చేస్తోంది అంటే ఈ పాట రాసిన శాస్త్రి గారు ధన్యులు... మనం అనుకుంటూ ఉంటాము చాలాసార్లు ఈ రోజు కాకపొతే రేపు మన జీవితంలో గొప్ప మార్పు వచ్చేస్తుంది అని... అలా ఎదురుచూడటం లోనే గడిచిపోతుంది జీవితం అంతా... కనీసం ఒక్కరోజు కూడా మనది అని అనుకోలేనప్పుడు అసలు జీవితానికి అర్ధం ఏమిటి...? ప్రతి క్షణం రేపటి భయంతో బతికేయడమేనా.... లేదా దానికే రేపటి మీద ఉన్న ఆశ అని సర్ది చెప్పుకుంటూ రానంటున్న చిరునవ్వును బలవంతంగా పెదాలపైకి రప్పిస్తూ మనల్ని మనం మోసం చేసుకుంటూ ఆశాజీవులమని మరో నలుగురిని నమ్మించే ప్రయత్నమా... మనసు గాయాలు బాధనే పంచుతాయి కాకపొతే ఆ బాధని కాస్త కన్నీరు తీసుకుంటుంది... ఒక్కోసారి బాధని పంచుకోవడానికి మనకు తీరిక లేనట్లే దానికి తీరిక ఉండదు... అలా అలా పేరుకున్న బాధ బడభానలంలా మదిలోనే దాగుండి పోతుంది... ఎప్పుడో ఒకప్పుడు ఉప్పెనై ముంచుతుంది లేదా తనలో తనే కాలిపోతుంది పరిష్కారం తెలియక... రెప్ప మూసుకుపోతుంది శాశ్వతంగా.... అక్షరం నిరాశ్రయమై పోయి మూగగా రోదిస్తుంది ఆ క్షణాన... తనతో పంచుకునే అనుబంధం దూరమైందని.... అంతే కాని ఈ ముళ్ళ బంధాలకు ఏ బాధా ఉండదు... హమ్మయ్య ఓ పనై పోయిందని ఊపిరి పీల్చుకుంటూ తమ తమ రోజువారి కార్యక్రమాల్లో మునిగి తేలుతుంటారు... ఇదేగా మన జీవితం నేస్తం....!!
నీ నెచ్చెలి.   

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner