3, ఫిబ్రవరి 2015, మంగళవారం

మనసు గోల....!!

నేస్తం,
        ఈ ముఖ పుస్తకంలో ఎన్ని రకాల మనస్తత్వాలంటే చెప్పడానికి లెక్కలు కూడా సరిపోవేమో... అసూయలు, అహంకారాలు, నమ్మకాల మీద ఆడుకోవడాలు... ఇవేకాక వద్దు బాబోయ్ అన్నా సతాయించడాలు... అమాయిల పేర్లతో రావడాలు అది కాకపొతే రకరకాల పేర్లు పెట్టుకుని సమాచారాలు పంపడాలు ... స్నేహం వద్దు అన్నా వెంట పడటాలు... వయసు లేదు,  వావి వరుసలు లేవు మరి ఏమనుకుంటున్నారో కొంత మంది... ఈ ముఖ పుస్తకంలో అమ్మాయి అంటే అంత లోకువగా ఉందేమో.... వాళ్ళకి పని పాటు లేకపోతే ఇవతలి వాళ్లకి ఉండదా... వాళ్ళ కుసంస్కారమైన సంతోషం కోసం నోటికి ఏది వస్తే అది వాగడమేనా.... వాళ్లకు నచ్చితే సరిపోతుందా.... అబ్బా .... కొన్ని పలకరింతలైతే ఏదో జన్మ జన్మల బంధంలా పెద్దా చిన్నా అని తేడా లేకుండా ఎలా మాట్లాడతారో...కొందరేమో అక్కా, అమ్మా చెల్లి అంటూ మన మీద  పెత్తనం చలాయించాలని చూస్తారు... వాళ్ళకే అన్ని తెలుసు అన్నట్టుగా మనని ఒక చట్రంలో ఉంచాలని చూస్తారు... ఎవరి గురించి వారికి తెలిసినంతగా ఇతరులకు తెలుస్తుందా...మరి కొందరేమో మరి కాస్త ఎక్కువ ప్రేమలో నువ్వు లేకపోతే  నేను బతకనేలేను అంటారు... అది అబద్దమని వాళ్లకు తెలుసు... వినే మనకి తెలుసు.... ఇక కొన్ని కేటగిరిలేమో కొన్ని రోజులు కనిపించకుండా పోవడము... రకరకాల పేర్లతో వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో అని పాపం కుతూహలంతో ఉండలేక వచ్చేయడము.... కొంతమందికి మాట్లాడటానికి ఫోను ఉండదు కాని అంతర్జాలానికి రావడానికి కంప్యూటర్ ఉంటుంది... ఇవి ఎంత నిజాలండి... మనం సమాధానం చెప్పక పోయినా.... అమ్మాయి పేరు కనపడితే చాలు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడము...కనీసం మనం ఏమిటో కూడా తెలియకుండానే స్నేహం అంటూ ... హాయ్ అంటూ మొదలు...ఊరు వాడ, తిన్నావా తాగావా ఇలా...
సాంకేతికత పెరిగింది కాని బుద్దులే పెడ త్రోవ పడుతున్నాయి... చదువు సంస్కారం నేర్పకపోగా... జన్మతః ఉన్న సంస్కారాన్ని కూడా మర్చిపోయేలా చేస్తోంది... పాశ్చాత్య దేశాల్లో వారి సంస్కృతే చాలా గొప్పగా అనిపిస్తోంది... మనం ఎవరో తెలియక పోయినా కనిపించగానే  చక్కగా పలకరించి వెళిపోతారు.. వెంట పడరు.... మన స్వ విషయాలు పట్టించుకోరు .... మనవాళ్ళు వాళ్ళలో మంచిని తీసుకోనక పోగా వాళ్ళ మంచిని కూడా చెడుగా మలచి అదేదో గొప్పతనంగా భావిస్తున్నారు.... అక్కడ మనవాళ్ళు మన సంస్కృతీ సంప్రదాయాలు పిల్లలకు నేర్పిస్తుంటే ఇక్కడ మనం పాశ్చాత్య పోకడల వెంట పడుతున్నాం... మనలో ఎంత మందిమి పండుగలకు పబ్బాలకు మన సంప్రదాయాలను పాటిస్తున్నాము.... మాన్ కట్టు బొట్టు ఆచరిస్తున్నాము.... మనమే చేయనప్పుడు ఇక మన పిల్లలకేం నేర్పిస్తాము...
ఇంతకూ ముందు ప్రపంచం చాలా పెద్దది.. కాని ఇప్పుడు అదే ప్రపంచం మన అరచేతిలో.... మానవాళి గర్వించదగ్గ పరిణామం... మనం అందుకున్న విజయాలనే మనం అధః పాతాళానికి పడిపోవడానికి ఎక్కువగా వినియోగిస్తున్నాం .... మనసులను స్వాంతన పరచుకోవడానికి, మన భావాలను పంచుకోవడానికి, కాస్త సంతోషాన్ని అందుకోవడానికి, మనలోని మేధని పెంచుకోవడానికి, చక్కని స్నేహాలను అందుకోవడానికి ... ఈ ముఖ పుస్తకాన్ని అనుసంధానంగా వాడుకుంటే అందరికి బావుంటుంది... ఒకరి మీద బురద జల్లడానికి కాకుండా...  అవును కదా నేస్తం...!!
ఈ సారి నా మనసు గోల నీకు వినిపించేసాను.... మరి ఉండనా....
నీ నెచ్చెలి

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner