15, ఏప్రిల్ 2015, బుధవారం

ఎందరివో జీవిత చరిత్రలు...!!

నేస్తం...
            ఏమిటో కొన్ని జీవితాలు ఎప్పటికి మారవేమో... మనసు గతి ఇంతే...  మనిషి బ్రతుకింతే..  మనసున్న మనిషికీ సుఖము లేదంతే... అని సరిపెట్టేసుకుంటూ బతికేయాలేమో ఈ సమాజంలో...
ఏ రోజుకారోజు హమ్మయ్య ఇవ్వాల్టికి ఏ గొడవా లేకుండా గడిచింది అనుకుంటూ బతికేస్తున్న ఓ మధ్య తరగతి జీవితాన్ని... ఇంట్లో ఏ బాధ్యతలు పట్టించుకోని ప్రపంచానికి అతి మంచివాడైన ఇంటి యజమాని.. కష్టం వస్తే వెంటనే గొడవ పెట్టేసుకుని నేనీ బాధ్యతలు మోయలేనంటూ తప్పుకు తిరిగే అతి మంచివాడు.. అందరి అవసరాలు కనుక్కుంటూ... అయినవారిని కానివారిగా మార్చుకుంటూ... ప్రపంచంలో నీతులన్నీ "వినే వారుంటే చెప్పే వారికి లోకువన్నట్టు" వల్లే వేస్తూ తను మాత్రం వాటికి దూరంగా ఉండే పక్కా అవకాశవాది. ఏది ఎలా ఉన్నా ఇంటి అవసరాలు, బాధ్యతలు, బంధాలు కష్టమైనా ఇష్టంగా భరించేది ఇల్లాలే మరి ఈ సగటు జీవితాల్లో...
మగాడు / మొగుడు వాడి ఇష్టానికి వాడు ఎక్కడికి తిరిగినా, సంసారాన్ని పట్టించుకొనక పోయినా వాడిలా పిల్లలని వదిలేయలేనిది తల్లి ఒక్కటే... శరీరం సహకరించక పోయినా, మనసు చస్తూ బతుకుతున్నా బతుకు పోరాటాన్ని సాగిస్తున్న ఎన్నో మధ్య తరగతి జీవితాలు మన కళ్ళముందే కనిపిస్తున్నా కనీసం మాట సాయం కూడా చేయలేని వాస్తవ జీవితాలు మనవి..
అందలాలు ఎక్కాలనుకోలేదు.... అసాధారణంగా జీవించాలని ఆశ పడనూ లేదు... అతి సామాన్యంగా బతకాలన్న చిన్న కోరిక... కాని అదే ఈనాడు అందని ఆకాశమైంది...ఓ జీవితానికి...అణిగి మణిగి బతుకునీడుస్తున్న ఆడదానికి కోపం వస్తే ఎలా ఉంటుందో చూడాలని ఎప్పటి నుంచో కోరిక.... మొన్న ఒకరోజు హైదరాబాద్ నుంచి బస్ లో వస్తుంటే నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది... ఏంటో కాస్త దిగులుగా అనిపించింది ఆ అమ్మాయి.. వాళ్ళ అన్నయ్య అనుకుంటా బస్ ఎక్కించడానికి వచ్చాడు.. నా సీటులో కూర్చుంటే అది నాది పక్కన కూర్చో అని చెప్పాను... చదువుకోలేదు అనుకుంటా ఇక్కడే కూర్చోమన్నాడు అంటే ... చెప్పాను అది నాది...  పక్కన కూర్చో అని.. నా పక్కనే కూర్చుంది... ఎందుకో కిందికి వెళ్లి మళ్లి  వచ్చింది.. ఆలోపల తన డబ్బులు 50 రూపాయలు నా పక్కనే పడ్డాయి నేను కూడా చూడలేదు ఎవరో నాకు చెప్తే చూసి తీసాను.. తను రాగానే నీవేనా అని ఇచ్చేశాను... తరువాత నాకే ఎందుకో పలకరించాలనిపించి మాట కలిపాను... అలా డబ్బులు పారేసుకుంటే ఎలా అని... వాళ్ళ ఆయన చెప్పా పెట్టకుండా వెళిపోయాడంట... అప్పటికి చాలా సార్లు అలా చేసాడంట.. కొన్ని రోజులు పోయాక ఈమె వెళ్ళి తీసుకువస్తే వస్తాడంట... మళ్ళి నాలుగు రోజులు పోయాక మామూలేనంట... నాలుగు ఇళ్ళలో పని చేసుకు బతికే జీవితం ఆమెది.. అయిన వాళ్ళు ఉన్నా మొగుడు ఇలా చేసినప్పుడు కూడా ధైర్యంగా ఉంటుంది... ఇలాంటి వాడు ఎందుకు వదిలేయరాదా అన్నా... ఇదే ఆఖరుసారి ఇక పొతే తీసుకురాను అంది... మరి ఎక్కడ ఉంటాడో తెలుసా అంటే తెలియదంది.. ఎలా అంటే ఫోను నెంబరు ఇచ్చాడు, బస్ స్టాండ్ కి వస్తాను అన్నాడు అంది... మరి ఎక్కడ ఉంటారు అంటే తెలియదంది... వాళ్ళ వాళ్ళు వద్దని చెప్పినా వీడి కోసం ఆమె రావడం వెనుక ఉన్న బంధానికి విలువ ఆ మొగుడు అన్న వాడికి కూడా అర్ధం అయితే ఎంత బావుండు అనిపించింది... అలా ఏదో తన గోడు చాలా సేపు చెప్తూనే ఉంది... ఈ లోపల బస్ కండక్టర్ తనకి టికెట్ ఇచ్చాడు నాలుగు వందలు తీసుకున్నాడు అంది.. తీరా టికెట్ చూస్తే 308 రూపాయలు ఉంది.. వెనుక రాశారు 90 అని. అడుగు అంటే తరువాత ఇస్తాను అన్నాడు అంది.. అందరికి చిల్లర ఇచ్చేసాడు కాని ఈ అమ్మాయికి ఇవ్వలేదు... మాట్లాడుతూనే నిద్ర పోయింది.. 3 గంటలకి విజయవాడ వచ్చాక నేనే నిద్ర లేపి డబ్బులు అడుగు అని చెప్పా.. మరి అడిగిందో ఆ నిద్ర మత్తులో అలానే వెళ్లిందో తెలియదు...
ఈ జీవిత వాస్తవాలు ఒక్క ఆమెవే కాదు రోజు  చస్తూ బతుకుతున్న ఎందరివో జీవిత చరిత్రలు...!!
కొన్ని వాస్తవాలు వినడానికి చేదుగా అనిపించినా వినకా తప్పడం లేదు...  చూడక తప్పడం లేదు ... భరించడం కూడా తప్పడం లేదు మరి.... సమాజం మారాలో.. సమాజంలో మనం మారాలో తెలియని అయోమయం నేస్తం...!!
నాకనిపించిన సమస్యతో నిన్ను అయోమయంలో పడవేసి ఇప్పటికి ఉంటాను మరి....
నీ నెచ్చెలి.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner