5, ఏప్రిల్ 2015, ఆదివారం

స్నేహం...!!


నేస్తం...
             నువ్వు పరిచయం కానప్పుడు నిజమైన స్నేహం అంటే తెలియదు... రాను రాను నీతో అనుబంధంతో స్నేహానికి చిరునామా తెలిసింది.. ఎన్నో ఏళ్లుగా పంచుకుంటున్న అనుభూతుల అనుభవాలు, జ్ఞాపకాల పారిజాతాల పరిమళాలు ఎప్పటికి మనసును వీ(వా)డి పోనీయని మధుర బాంధవ్యాలే... మన మధ్యన జరుగుతున్న అక్షరాల పంపకంలో అందకుండా అటూ ఇటూ పారిపోయే పదాలు కూడా నీ చెలిమికి దాసోహమంటూ పాదాక్రాంతమౌతున్నాయి... మన స్నేహానికి తారతమ్యాలు తెలియలేదు... భావాలు పంచుకోవడానికి వారధిగా చేసుకున్న చెలిమికి జాతి రీతులు అసలే లేవు.. అందుకేనేమో ఇన్నాళ్ళు గడిచినా ఇంకా సరి కొత్తగానే ఉంది మన మధ్యన... నేనుండి నువ్వు లేక పోయినా....
             ఎవరో ఆడిగారు మీ స్నేహం ఎప్పటిదని.. ఏం చెప్పను..? గత జన్మ బంధమని చెప్పాలనుకున్నా అలా చెప్తే ఒక్క జన్మకే పరిమితమై పోతుందని ... ఎన్ని జన్మలదో నాకు తెలియనిదీ బాంధవ్యమని చెప్పాను.. సరిగానే చెప్పాను కదూ... ఆటల నేస్తానివి, కథల సాహచర్యానివి,  నా కోపాన్ని భరించిన నా ఆత్మీయ నేస్తానివి, చదువులో పోటీగా ఉండే నేస్తమై, నా భావనలను వాటితో పాటుగా...  నన్ను నన్నుగా అభిమానించిన నా ప్రాణ స్నేహానివి నువ్వు... నీ తప్పొప్పులను నాతో పంచుకుని స్నేహానికి ఎన్నటికి చెరగని భాష్యాన్ని చెప్పి అన్నింట్లో నాకన్నా నువ్వే ముందు అని నిరూపిస్తూ ఆఖరికి మరణంలో సైతం నువ్వే ముందని నిరూపించిన ప్రియ నేస్తం...
స్నేహమంటే ఏం చెప్పను... మన బంధమని చెప్పడం తప్ప...
 నీ నెచ్చెలి

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner