23, ఏప్రిల్ 2015, గురువారం

ఓ వెన్నెల్లో ఆడపిల్లే....!!

నేస్తం,
          నువ్వు నేను ఇలా బోలెడు కబుర్లు చెప్పేసుకుంటూ ఉంటామా... మరి మన నేస్తాలు అందరు ఇలా ఉండలేరెందుకు...? అప్పటికి ఇప్పటికి స్నేహంలో తేడానా లేక మన మనసుల్లో తేడానా... మనం పలకరిస్తే ఏదో మొహమాటానికి కొందరు మాట్లాడుతుంటారు కాని మనసులో ఉందో లేదో తెలియని ఆ స్నేహం మాటల్లో కనిపించడం లేదు.. జరిగి పోయిన కాలాన్ని ఎలానూ వెనక్కి తేలేము అలానే బాల్యాన్ని కూడా... మన వెంట తెచ్చుకోగలిగేది ఒక్క జ్ఞాపకాలను మాత్రమే... చాలా మంది వాటికి కూడా దూరంగా ఉంటున్నారు ఎందుకనో... డాలర్ల మోజులో అన్ని మర్చిపోవచ్చు... కాని జీవితాన్ని, దానిలో తీయనైన జ్ఞాపకాలను మర్చిపోతే ఎలా...
          అంతుచిక్కని కొన్ని అనుభూతులకు అర్ధాలను వెదికే క్రమంలో మనల్ని మనం కోల్పోయే సన్నివేశాలు ఎదురైనప్పుడు మౌనం మాట్లాడుతుంది మనసుతో.. ఆ మది భావాలనే మన ఈ అక్షరాలు పంచుకుంటాయి కదూ... అందుకేనేమో ఈ అక్షరాలకు అంత కులుకు... అన్ని తమ సొంతమే అని ఎంత అహంకారమో.. అయినా అందంగా ఒదిగి పోతాయి భావాల వీచికల్లో... మిన్నల్లో దాగిన మనసును వెన్నెల్లో చూపిస్తాయి... వెన్నెల వర్షానికి మబ్బులను గొడుగుగా పట్టేస్తాయి... కనుల భావాలను కలల్లో ఒలికిస్తాయి... చీకటి స్వప్నాలను వేకువ పొద్దుల్లో నిజం చేయాలని తాపత్రయ పడతాయి.. అక్షరానికి అద్దిన కన్నీటిలో జీవిత వాస్తవాలను వెలికి తీస్తాయి.. అన్ని వెరసి మనవైన మనకోసం దాచుకున్న కొన్ని జ్ఞాపకాలను సుతిమెత్తగా మనకు మాత్రమే అందిస్తాయి.. ఇలా ఎన్నో స్పందనలను మనం దూరం చేసుకుంటూ యాంత్రికంగా, నిరాసక్తంగా బతికేయడం అవసరం అంటావా... మనసు గొంతు నులిమేసి దాని మాటను బయటికి రానీయకుండా చేసి సమాధి చేయడం నాకు నచ్చడం లేదు... అక్షరాల్లో భావాలు స్వేచ్ఛా విహంగాలైనప్పుడు ఆ అక్షరాల అద్దంలో కనిపించే అందమైన ప్రతిబింబమే మానసం... ఎల్లలు లేని దాని పరిధి హాయిగా విహరిస్తూ తిలక్ అమృతం కురిసిన రాత్రిలా....మనసు కలం నుంచి జాలువారే ప్రతి అక్షరమూ  ఓ వెన్నెల్లో ఆడపిల్లే....!!
ఏదో చెప్పాలనుకుంటూ ఏదేదో చెప్పేసాను మరి ఉండనా నేస్తం...

నీ నెచ్చెలి .

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner