21, ఏప్రిల్ 2015, మంగళవారం

ఓ మౌనం పగిలింది.....!!


ఓ చిన్న శబ్దం
శతాబ్ధాలను మరిపించేంతగా
జన్మ జన్మల వాంఛలు పేర్చుకున్న
ఊహల సౌధాలు కళ్ళముందుగా
తారాడుతున్న స్వప్నాల నీడల్లో
మాయమౌతున్న నిజమైన అబద్దం
వినిపించిన స్వరం ఇంకా గుర్తుంది...

ఓ గుప్పెడు గుండె చప్పుడు
గుర్తు చేస్తూనే ఉంది ఆ సవ్వడిని ఇప్పటికీ
మోసపోయిన జీవితానికి సాక్ష్యంగా
అల్లుకున్న బంధం విడివడక
సాగుతున్న పయనానికి ఎటూ తేలని
గమ్యం ఎక్కడో తెలియని వెదుకులాటలో
హృదయాంతరాళాన్ని తట్టిలేపుతూ
మదిని కదిలిస్తూనే ఉండి పోయింది...

ఓ మౌనం పగిలింది
నిశబ్దాన్ని బద్దలు చేస్తూ
విగతజీవిగా మిగిలిన మనసును కదిలిస్తూ
గాయాల గేయాలను పాడుకొమ్మంటున్న
గుండె గాత్రాన్ని అరువుగా ఇమ్మంటూ
శకలాల శిధిలాలను పునాదులుగా పేర్చుతూ
శతాబ్దాల చరిత్రను తిరిగి రాస్తూ
అక్షరాలతో ఆటలాడుతూ చైతన్యానికి చేతనగా చేరి
సరి కొత్త విజయానికి చిరునామాగా నిలిచింది... !!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner