18, ఏప్రిల్ 2015, శనివారం

కాలంతో పాటుగా....!!

అర్ధ శతాబ్దానికి హారతులిచ్చేసినా
మారని బతుకుల అయోమయంలో
కాలం చేస్తున్న గాయాల హోరులో
అమ్మాయిలో అమ్మను చూడలేని
కలియుగపు కీచకుల నిరంకుశ
వికటాట్టహాసం వినిపిస్తూనే ఉంది ఓ పక్కన
మోసపోయిన నమ్మకం అంగడి బొమ్మగా మార్చేసినా 
అందాల భామలుగా కిరీటాలు పెట్టినా
వలువలద్దిన విలువలు నట్టేట మునిగినా
అవసరాలకు మనసును చంపేస్తున్నా
చిరునవ్వు చాటుగా జలతారు పరదాల
మాటున  బడభాగ్నిని దాచేస్తున్న అతివ
ఆటబొమ్మగా అంగడి సరుకుగా మారుతూ 
అంతరిక్షాన్ని అలఓకగా చుట్టి వచ్చినా
సాటిలేని మేధకు మేటి చిరునామాగా నిలిచినా
అమ్మతనానికి కొంగ్రొత్త అర్ధం చెప్పినా
ఆగని భ్రూణ హత్యల ఉదంతాలు
లెక్కకు రాని నిర్భయలెందరో ఈనాడు
వస్తుంది మరో శతాబ్దం...
మారని జీవితాల కథలను వెంటేసుకుని
వెళుతుంది కాలంతో పాటుగా....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner