19, జులై 2015, ఆదివారం

పుష్కర పునీత ఈ గోదారమ్మ...!!


నిన్న జరిగిన తెలుగు రక్షణ వేదిక " గోదావరి మహా పుష్కర కవితోత్సవంలో నేను చదవలేక పోయిన నా కవిత "
పుష్కర పునీత ఈ గోదారమ్మ...!!

గోహత్యా పాతక విముక్తికై గౌతముడు
పరమశివుని మెప్పించి గంగను భువికిదెచ్చి
గోదావరిగా ప్రవహింపచేసి సకల పాపాలను హరియింప
పూర్వులకు పుణ్య లోకాల సద్గతులను అందింప
నాసికాత్రయంబకం నుండి ఏతెంచి గోష్పాద క్షేత్రమై
విలసిల్లుతూ ఉభయ గోదావరీ ప్రాంతాల నడుమ
వేద నాదాల మోదంతో రాజమహేంద్రిని అలరించి
అంతర్వేదాన్ని అద్భుత గాంభీర్యాన్ని తనలో దాచుకున్న
అంతర్వాహినుల పుణ్య త్రివేణి సంగమ పవిత్రత
జీవ ధారలను ప్రాణ ధారలుగా అందించే నదీమతల్లి
వెన్నెల అందాల విన సొంపైన కావ్యాల సృష్టి
పచ్చని పైరుల పట్టుకోకల సందడిలో
చెలియల కట్టలో సాగరుణ్ణి కలుసుకున్న
అనంతవాహిని ఈ గౌతమి గోదావరి
పన్నెండేడ్లకోసారి పుష్కరమల్లే
గురువు అడుగిడిన సింహరాశిలో
పుష్కరుని ఆహ్వానించి పుష్కర స్నానాల్లో
పుణ్య గతులను ప్రాప్తింప చేసి
పాప భారాన్ని సుతిమెత్తగా మోసుకుంటూ
సాగరాన్ని చేరుకునే చూడ చక్కని సిరుల వేణి
పుష్కర పునీత ఈ గోదారమ్మ...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner