5, జులై 2015, ఆదివారం

రేపటి జ్ఞాపకంగా ....!!

నేస్తం,
         మనల్ని బాధించే జ్ఞాపకాలను మరచిపోగలిగితే ఎంత బావుండు... ఒకప్పుడు ఆత్మీయుల నడుమ సంతోషమైన జ్ఞాపకం అదే ఆత్మీయత కానరాని లోకాలకేగినప్పుడు... మరచి పోగలిగే జ్ఞాపకం కాగలిగితే కన్నీటికి చోటు దక్కదని ఒకింత జాలితో మరచిపోలేనివే జ్ఞాపకాలుగా మనలో దాగుండి పోతున్నాయేమో.. జనన మరణాలు సృష్టిలో ప్రతి జీవికి తప్పవని తెలిసినా ఎందుకో కొన్ని ఆత్మీయతలు మనలను వెన్నాడుతూనే ఉంటాయి ఎప్పుడు... శిధిలాలలో దాగిన శిల్పాల జ్ఞాపకాలు సజీవమైనట్లే మనుష్యులు లేకున్నా కొన్ని జ్ఞాపకాలు సజీవమై మనతోనే ఉంటాయి.. ఆత్మీయతానుబంధం లేని కొందరు దురదృష్టవంతులకు మాత్రం జ్ఞాపకాలే ఉండవు... అది వారి దురదృష్టం అని వారు అనుకోరు.. ఆ జీవితమే అత్యంత ఆనందకర జీవితం అనుకుంటారు... కొందరేమో జ్ఞాపకాలను వదిలేసి బతికేయాలనుకుంటారు కాని అనునిత్యం అవి వారిని వెన్నాడుతూనే ఉంటాయి... కొందరికేమో పదిలంగా మదిలో చేరి తోడుగా ఉంటూ ఆనందాన్నిస్తాయి... నిన్నటి వాస్తవాలు రేపటి జ్ఞాపకాలు కాగలిగితే ... మన జ్ఞాపకాల్లో కొందరున్నట్లే మనము కొందరికి జ్ఞాపకంగా  ఉంటామో లేదో మరి ... ఏమిటో ఎంత వద్దనుకున్నా మనసు పరి భ్రమణం జ్ఞాపకాల చుట్టూనే... ఆత్మీయులు దూరమైతే కన్నీటి జ్ఞాపకం... అనుబంధం దగ్గరైతే ఆనంద జ్ఞాపకం ... ఇలా జీవితంలో ప్రతి క్షణం ఏదో ఒక జ్ఞాపకం మనతోనే... నీతో ఇలా పంచుకోవటము రేపటికి ఓ జ్ఞాపకమే...
నిన్నటి నీ వాస్తవమైన నేను రేపటి జ్ఞాపకంగా .... !!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner