13, నవంబర్ 2015, శుక్రవారం

ఈ నాలుగు కెరటాల చైతన్యం అభినందనీయం...!!

తీరం దాటిన నాలుగు కెరటాలు.... అంటు సరి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు నలుగురు కవులు...    కవిత్వం అంటే తెలియకుండా రాసే నేను ఈ నాలుగు కెరటాలు నిజాన్ని తెలిపే అబద్దాన్ని అక్షరబద్ధం చేసిన తీరుని హర్షించలేకుండా ఉండలేక పోతున్నాను.. ముందుగా ఈ నలుగురికి మనఃపూర్వక అభినందనలు...
ఇక సముద్ర లోతుల్లోనికి తొంగి చూస్తే... ముందుగా ఆ తీరం లో... ఈ తీరానికి ఆ తీరానికి దూరాన్ని కొలిచే సాధనంగా ప్రేమను చూపించడంతో పాటు రెండు మనసుల మద్యన వారధి కట్టడానికి అడ్డంకులను అధిగమించేవి జ్ఞాపకాలని అందంగా చెప్పారు అనిల్...
ఓ ఆయిల్ కవిత్వంలో ...  మెకానిక్ కోటు వెనుక దాగిన కవి రాసిన ఆయిల్ మరకల నుంచి పగిలిన ఆత్మల్లో జారుతున్న భావప్రాప్తి పొందలేని  భావనలోని భావానికి  ఉద్వేగానికి తోడిచ్చి సిరాతో చెలిమి చేస్తూ దాగుతూ వీగిన తీర్మానంలో చెప్పడం నరేష్ కుమార్ గారి ఘనత...
ఫ్లోరైడు ఫలితాలు కవితలో... జీవితంలో నేతల నజరానాకు నేలతలిచ్చిన ఫ్లోరైడు నీళ్ళు తాగి బతుకు బలి అయినప్పుడు, కదలలేక ఆత్మీయుల చీదరింపులను తట్టుకుంటు దగ్గరకు రాని మృత్యువును రమ్మని బతిమాలుతు తెలంగాణా యాసలో వర్ణలేఖ రాసిన ఈ కవిత చదువుతుంటే ఆ జీవితాలు మన కళ్ళ ముందు కదలాడుతుంటాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు..
చైతన్య రాసిన సత్యాన్వేషి కవిత మరో మనిషిని మేల్కొల్పుతుంది... ఆ మనిషి ఏం చేయాలో దిశా నిర్దేశం చేస్తుంది....
ఊరి చివర కవితలో... ఒక అంగట్లో అతివ మల్లెపూలను అన్నం మెతుకులుగా మార్చుతూ శరీరాన్ని రోగాలమయం చేసుకుంటూ కూడా కోపాల తాపాలను భరిస్తూ తనది కాని జీవితాన్ని ఎలా పరిచిచిందో అర్ధం అవుతుంది...
మానవధర్మం లో జీవితాన్ని నిర్వచించిన తీరు బావుంది...
నేను దేముడూలో... చచ్చిపడిన జ్ఞాపకాలు, ఆలోచనల శవాలు మనసు పొలిమేరల్లో లెక్కపెట్టడం... బాల్యాన్ని యవ్వనాన్ని, ప్రేమను, వాదాన్ని, వాగ్యుద్దాన్ని చర్చించుకోవడం బావుంది...
ముంగురులు... దాగని జ్ఞాపకాలను ముంగురుల నుంచి జారనీయకుండా దాయడం బావుంది...
కవి మనిషే.. కాని కవి సమయమే తిరగబడ్డ కాలమై పోతుంది .... కవిత జననం ఎలా ఉంటుందో తనదైన శైలిలో చెప్పారు నరేష్..
అతను ఊరెళ్ళాడు కవితలో... పుట్టుకతో వచ్చిన బొట్టు పూలు తీసేస్తూ భర్త చనిపోతే భార్యను విధవను చేయడాన్ని అద్భుతంగా చెప్తూ సమాజాన్ని ప్రశ్నించారు...
మట్టి పొయ్యి, ఛాయ్ తో అనుబంధాన్ని ఎంత బాగా చెప్పారో .... పెళ్ళితో నిజమైన ప్రేమను పొందిన ఆనందాన్ని ఐ హేట్ యు లో చెప్పారు... సమాజంలో పాతేయబడిన మానవత్వాన్ని వాడెప్పుడు అంతే లో చూపించారు..
అ - అమ్మ చదువుతుంటే ఎందుకో తెలియని ఒక ఆర్తి, వేదన రెండు అనిపించాయి.. ఈ కవిత విశ్లేషించే అంత పరిజ్ఞానం నాకు లేదనిపించింది...
డబల్ రొట్టె అందరి జ్ఞాపకాలు గుర్తుకు తెస్తుంది యాస వేరుగా ఉన్నా ... నేను శకుంతల బడుగు జీవితాలను చూపించింది.. వస్తున్నాడొస్తున్నాడొస్తున్నాడు - జాగ్రత్త  హెచ్చరికగా చెప్పడం బావుంది.. తుపాకి రాముడు తెలంగాణా యాసలో బావుంది.. స్తబ్ధతలో విషాదం నిర్లిప్తత బాగా చెప్పారు.. పాడుపడ్డ బావిలో కామందుల దురాగతాలకు బలైన జీవితాలకు సాక్ష్యంగా మూసేసిన బావి... నీరింకిన బావిలో ఆశలన్నీ వలలోపడిన చేపలతో పోల్చడం.... సశేషాలులో మనసు దాపులకొచ్చే మరి కొంత మందిని ప్రేమతో ఆహ్వానించడానికి .. ఓడిపోతున్నా లో కలుక్కుమనే గుండె గూడుని అదిమి పట్టి జ్ఞాపకాల భారాన్ని అక్షరాల్లోకి అనువదించలేక పోవడాన్ని ఒప్పుకుంటూ .. అద్దం నిజాన్ని చూపించే ఏకైక సాధనం... నన్ను నేను పారేసుకున్నా అంటూ అంతులేని ప్రశ్నలు వేసినా ... నీ కోసం లెక్కలన్నీ పూర్తయ్యాయా అన్నా... నాలుగు సిరా చుక్కలు ఓటమి చూడక హతోస్మి అంటూ ఇంకెన్నాళ్ళు ఎందుకు కనుక్కోలేదో అని వారిరువురు గోస పెట్టినా మనం మళ్ళి పుడదాం మా కిటికిలోఒక  చంద్రుడికి వీడ్కోలు పలుకుతూ శ్రీ శ్రీ అంతటి మహా కవి చూపిన దారిలో హిరోలా మరో ప్రపంచం పైపు అడుగులు వేస్తూ నువ్వింకా మారలేదు అనే ఒకే నాణానికి బొమ్మలా ఒక తిరోగమనంలో కాకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తూ ఒక కళాకారుడుగా కాకుండా మై హిరో అనిపిస్తూ తొలి చూపులోనే ఎందుకంటే నేను కవిని అని గుర్తు చేస్తూ చివరిగా ఓ సారి ఏకాంతంతో సహవాసం చేస్తూ 100%ఇండియన్ అని గుర్తు చేస్తూ వానొస్తే నేను జానీవాకరు ష్ నిశబ్దం మాతోనేం రందిరా మీకు ఎందుకు రాములా ఈ అవసరం అంటూ అన్నా ఓ బహుమతి లో ఆశయాల బాధని పరిచయం చేసిన ఈ నాలుగు కెరటాల చైతన్యం అభినందనీయం...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner