30, జనవరి 2017, సోమవారం

చెలిమి శాశ్వతం...!!

నిద్దరోతున్న నిజాలు
ఒక్కసారిగా లేచి నిలబడితే
తట్టుకోగలిగే గుండె ధైర్యం

వాస్తవాలను ఒప్పుకునే
నిలకడైన నిజాయితీని
చూడగల మనో నేత్రం

అస్తవ్యస్తంగా అల్లుకున్న
అస్పష్టంగా అగుపించే
మనవి కాని అనుబంధాలు

రేపటి రాతను మార్చలేని
నిన్నటి క్షణాల కాలాన్ని
వదలలేని గత జ్ఞాపకాలు

మరపునే మరపించే
మనసైన మది సాంగత్యంతో
కుదిరిన చెలిమి శాశ్వతం...!!

29, జనవరి 2017, ఆదివారం

పుస్తకాలు...!!

నా ఈ పుస్తకాలు కావాల్సినవారు ఈ లింక్ క్లిక్ చేసి చూడగలరు ...
http://kinige.com/author/manju+yanamadala


ధన్యవాదాలు కినిగె వారికి

27, జనవరి 2017, శుక్రవారం

ఓ సగటు ఆడపిల్లగా..!!


అక్షరాలు
అస్పృశ్యతను పాటిస్తున్నాయి
నిరాశ్రయమౌతున్న
తన ఉనికిని చాటుకోలేక
అమ్మ కొంగు వదలలేని
పసిపాపలా మారాం చేస్తూ
నిరక్షరాశ్యుల చేతిలో
కీలుబొమ్మలుగా ఇమడలేక
జీవం లేని నవ్వులతో
జీవితాలు వెళ్ళదీయలేని
జీవశ్చవాలుగా మారలేక
నిశ్చలంగా నిర్వికారంగా
ఒంటరిగా నిలబడిన
ఓ సగటు ఆడపిల్ల
మోసపోయిన జీవితానికి
సాక్ష్యంగా మిగిలిపోతూ ..!!

ప్రతి ఒక్కరికి...!!

జనవరి 21 న జరిగిన సడి చేయని (అ)ముద్రితాక్షరాలు పుస్తక ఆవిష్కరణకు వచ్చిన అందరికి,   అదేరోజు నేను పుట్టినరోజు కావడం .. రెండింటికి కలిపి ప్రత్యక్షంగా పరోక్షంగా, ముఖపుస్తకం వేదికగా
శుభాకాంక్షలు, అభినందనలు అందించిన ప్రతి ఒక్కరికి నా మనఃపూర్వక కృతజ్ఞతా వందనాలు.. 

22, జనవరి 2017, ఆదివారం

అందరికి కృతజ్ఞతా వందనాలు...!!

సడి చేయని (అ)ముద్రితాక్షరాలు పుస్తకావిష్కరణ నిన్న అతిరథ మహారథుల సమక్షంలో ఆత్మీయుల ఆనంద సందడిలో గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు, శ్రీ క్రాంతి శ్రీనివాసరావు గారు, డాక్టర్ పసుపులేటి రమణ గారు, కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు,  సాగర్ శ్రీరామకవచం గారు, ఈమని శివనాగిరెడ్డి గారు, కొంపెల్ల శర్మ గారు కొందరు పెద్దలు  భారతదేశం గర్వించదగ్గ గొప్ప నైరూప్య చిత్రకారులు పద్మశ్రీ యస్.వి.రామారావు గారు, గోళ్ళ నారాయణ రావు గారు, డాక్టర్ త్రిపురనేని రాజగోపాలరావు గారు, డాక్టర్ మల్లిపెద్ది  కోటేశ్వరరావు గారు ఇంకా అనేకమంది మహామహులు అనుకోకుండా వచ్చి అందించిన ఆశీస్సుల మధ్యన అత్యద్భుతంగా ఆవిష్కరించబడింది. ఇందుకు కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరునా పాదాభివందనాలు. 



కోసూరి రవికుమార్ గారు చేసిన పుస్తక సమీక్ష అద్భుతంగా ఉంది. పెద్దలు చెప్పిన సడిచేయని నా అక్షరాలు సమాజాన్ని సరిచేస్తాయో లేదో నాకు తెలియదు కానీ కనీసం ఒక కుటుంబానికి సంతోషాన్ని ఇవ్వగలిగితే అదే నాకు ఆత్మ తృప్తి. మనసు సవ్వడిని వినగలిగే ప్రతి మనిషికి నా ముచ్చట్లు నచ్చుతాయని అనుకుంటున్నాను.

కార్యక్రమంలో అందరిని అలరించిన సుబ్బారావు గారి హరిశ్చంద్ర పద్యాలు, సభ ఆలశ్యంగా మొదలైనా ఓపికగా వేచి ఉండి ఖాళీ లేకపోయినా చివరి వరకు నిలబడి  తమ అభిమానాన్ని అందించిన నా అనుంగు పుత్రులు, సోదరులు, ముఖ పుస్తక మిత్రులు, ఎంతో దూరం నుంచి వచ్చిన నా చిన్ననాటి నేస్తాలు, మిత్రులు, బంధువులు వెరసి నా ఆత్మీయులు అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు .

కార్యక్రమాన్ని ఆద్యంతమూ చక్కగా నిర్వహించిన మల్లెతీగ కలిమిశ్రీ గారికి వందనాలు.
ఆర్ధిక, హార్దిక సహాయ సహకారాలను అందించిన శ్రీ రామకృష్ణ వజ్జా గారికి, పద్మజ గుత్తా, సత్య స్వాతి, కుటుంబ సభ్యులు, సన్నిహితులు అందరికి పేరు పేరునా నా ధన్యవాదాలు.
కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు.

సడిలేని నా అక్షరాలను సందడి చేయించి సవ్వడిని అందరికి వినిపించడానికి కారణమైన ప్రతి ఒక్కరికి నా వందనాలు. తెలియకుండా నావలన ఏమైనా పొరపాట్లు జరిగితే పెద్ద మనసుతో మన్నించండి. 

19, జనవరి 2017, గురువారం

ఓ జీవితం ముగిసిపోతోంది.

నేస్తం,
        మనం పరుగులెత్త లేక పోతున్నామని మనతో పాటుగా ఆగలేనని కాలం మరోమారు నిరూపిస్తూ గతాల గాయాలను, జ్ఞాపకాల చెమరింతలను తోడు తీసుకుని మరో వత్సరానికి వచ్చేసింది. తప్పొప్పుల బేరీజులు వేసుకుని బంధాల కోసం ఆశ పడేవారు కొందరైతే,  ఇంట్లో ఎవరు ఎలా పోయినా నాకేంటి నేను ఇంతే ... నా గొప్పదనం తెలియని మూర్ఖులు నన్ను పొగడక పోయినా పర్లేదు .. నలుగురిలో నా గురించి మాట్లాడుకుంటే చాలు అని అనుకునే అవకాశవాదులు, ఇలా చెప్పుకుంటూ పొతే ఎప్పటిలానే విషయాలు షరా మామూలే..
      జీవితంలో కన్నీళ్ళు, చిరునవ్వుల సంతోషాలు వస్తూ పోతూ ఉంటాయి. ఎప్పటికో ఒకసారి కొన్ని బాధలకు ముగింపు ఉంటుందన్న నమ్మకంతో బతికేస్తున్న బాంధవ్యాలు, బంధుత్వాలు కోకొల్లలు ఈనాటి మన సమాజంలో. ఈ జనారణ్యంలో నేను సైతం అంటూ రాజీల సర్దుబాట్లతో చిరునవ్వుల చాటున కన్నీళ్ళను దాచేస్తూ నలుగురిలో చులకన కాకూడదని ఒకప్పుడు రూపాయి లేకపోయినా బాగా బతికినా, తరువాత రూపాయిలు సంపాదించినా తనకంటూ ఒక రూపాయి దాచుకోవడం చేతకాక ఇప్పుడు అవసరానికి రూపాయికి ఎవరి దగ్గరా చేయి చాచలేక మహా గొప్పగా బతికేస్తున్నట్టు నటిస్తూ ఉండటం కూడా బోలెడు కష్టమే అనిపిస్తోంది కొన్ని జీవితాలను చూస్తుంటే.
    గాంధీగారు మానవజాతికే మహాత్ముడు కానీ వారి భార్య కస్తూరిబాయి ఎన్ని వదులుకుందో ఎందరికి తెలుసు. చాలామంది సమాజంలో పేరు కోసం గొప్ప కోసం తమ కుటుంబాలను ఏడిపిస్తూనే ఉంటారు. వాళ్ళకు జనం చేసే భజన మాత్రమే కనిపిస్తుంది వినిపిస్తుంది కానీ కుటుంబ రోదన వినపడదు. పెళ్ళాం పిల్లల అవసరాలు అస్సలు గుర్తుండవు. వాళ్ళను అప్పుల్లో ముంచి వీళ్ళు మాత్రం కోట్లకు పడగలెత్తినట్లు జనాలకు చెప్తారు. అందరికి తెలిసిన సామెతను మరోసారి గుర్తు చేస్తూ "ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత" .. ఇది అక్షరాలా నూటికి తొంభై కుటుంబాలలో నిజమని వక్కాణిస్తూ ... మనిషి, మనసు నిరాశ్రయమైనా అక్కున చేర్చుకున్న అక్షరాలతో సహవాసం చేస్తున్న భావాలు కలిసి ఎన్నో చెప్పాలంటూ మొదలెట్టి కొన్నే చెప్తూ.. ఇలా ఓ జీవితానికి నిర్వచనం..
పాతికేళ్ళ సంతోషాలు ఇరవైఏళ్ళ కన్నీళ్ళు కలిస్తే ఓ జీవితం ముగిసిపోతోంది.    

12, జనవరి 2017, గురువారం

ఓ పయనం...!!

చేవ్రాలు చెదిరిపోతూ
కన్నీటి చెమరింతల చెక్కుడు రాళ్ళు 
కలవరింతలకు తోడైనా

విధి రాత విలాసంగా
నుదుటిపై గర్వంగా నిలిచి
వీధి నాటకంలో పాత్రలను చూస్తున్నా 

జీవిత బంధాలను
అడ్డుకోలేని అసహాయత వెక్కిరిస్తున్నా
పాకులాడుతున్న బాంధవ్యాలను

జ్ఞాపకాల్లో దాచేసుకున్న
పసితనపు ఆనవాళ్ళు అక్కడక్కడా ఏరుకుంటూ
చేరలేని గమ్యాన్ని చూస్తూ

కాలానికి సామీప్యంగా
కాల్పనికతను దగ్గరగా ఉండాలని తలపిస్తూ
సాగే ఓ పయనం...!!

అందరికి ఇదే నా ఆహ్వానం...!!

వ్యక్తిగతంగా పిలువలేదని అనుకోవద్దు.. రాగలిగిన ప్రతి ఒక్కరికి ఇదే నా ఆహ్వానం ...
మిత్రులందరికి సంకురాతిరి సంబరాల శుభాకాంక్షలతో జనవరి 21న జరగబోయే " సడి చేయని (అ)ముద్రితాక్షరాలు" ... పుస్తక ఆవిష్కరణకు హృదయపూర్వక స్వాగతం ....
                                                                                                      మీ
                                                                                                   మంజు

5, జనవరి 2017, గురువారం

Kotta samvatsaramlo... modati kavita,,,!!

Kotta samvatsaramlo naa modati kavita....

Baandhavyam...!!

20years taruvaata kalisina aaptulu..

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner