18, అక్టోబర్ 2018, గురువారం

ఏక్ తారలు...!!

1.  సంద్రమంత సంతోషమే_గగనమంత చెలిమి సొంతమయ్యిందని...!!

17, అక్టోబర్ 2018, బుధవారం

ఎందుకు...!!

గాయాల గతమెందుకు
గమనమెరుగని బతుకులుండగా

మరలిపోయిన నవ్వులెందుకు
మసకబారిన కలలుండగా

కాలిపోయిన ఆశలెందుకు
కలతబారిన మనసుండగా

వదిలిపోయిన బంధాలెందుకు
ముడిబడని సంబంధాలుండగా

సడిలేని సందడెందుకు
చాటుమాటు సరదాలుండగా

చెరిగిపోయిన రాతలెందుకు
చెరగని విధిరాతలుండగా

రాలిపోయిన పువ్వులెందుకు
పూజకు నోచని విగ్రహాలుండగా

మరచిపోయే జ్ఞాపకాలెందుకు
మరపు వరమిచ్చే కాలముండగా

నీ కోసం మరుజన్మెందుకు
యుగాల నిరీక్షణకు తెరదించగా...!!

15, అక్టోబర్ 2018, సోమవారం

మరణ రహస్యం...!!

మౌనమెా మరణ రహస్యమే ఎప్పటికి
మాట్లాడటానికి అక్షరాలను
పేర్చుకుంటున్న మనిషి
నిస్సత్తువగా ఓ మూల ఒదిగిన క్షణాలు

బావురుమంటున్న ఏకాంతము
మనసుతో సహకరించని శరీరము
అప్పుడప్పుడు వినవస్తున్న రోదనలు
పైపైన పలకరిస్తున్న పరామర్శలు

కలలన్నింటిని కుప్పగా పోసి
ఆశలను హారతిచ్చేస్తూ
గతాన్ని బుజ్జగిస్తూ జ్ఞాపకాలుగా
మారిన గురుతులు వాస్తవానికి మిగిల్చి

నాకై నేను కోరుకొన్న ఈ ఒంటరితనం
కాస్త భయమనిపించిందనుకుంటా
ఓ కన్నీటిచుక్క అలా జారినట్టున్నా
కాలానికి అలవాటైన అంపశయ్య ఇది...!!

7, అక్టోబర్ 2018, ఆదివారం

రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి...!!

                   తెలుగు సాహితీ మానస పుత్రిక రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి...!!        

             రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి ఈ పేరు తెలుగు భాష గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మృదు స్వభావి, స్నేహశీలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావాన్ని కలిగి, ఎన్నో బిరుదులు, సత్కారాలు పొందినా అతి సామాన్యంగా కనిపించే వాగ్దేవి వర పుత్రిక. చిన్నతనం నుంచే తెలుగు భాషపై మక్కువను, మమకారాన్ని పెంచుకుని, తెలుగు భాషకు తన వంతుగా ఎన్నో విలువైన పుస్తకాల సంపదను భావి తరాలకు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
                   గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా మైనేనివారి పాలెంలో జన్మించిన మల్లీశ్వరి తన బాల్యం ఆనందంగా ఎటువంటి ఆంక్షలు, కట్ట్టుబాట్లు లేకుండా కృష్ణమ్మ అలల సందడిలో, ఎటి ఒడ్డున పిచ్చుక గూళ్ళ ఆటలతో, పల్లె పైరగాలుల పలకరింతల మధ్య స్వేచ్ఛగా సంపూర్ణంగా గడిచిందని గర్వంగా చెప్తారు. కళాశాల విద్య వరకు గుంటూరులోనూ, ఎం ఏ భీమవరంలోని డి ఎన్ ఆర్ కళాశాలలో పూర్తి చేసారు. ఉద్యోగ పర్వం విజయవాడలోని సిద్దార్థ పబ్లిక్ స్కూల్ తో మొదలై 26 ఏళ్లకు పైగా హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పదవీ విరమణతో ముగిసింది. పాటలు, నాట్యం మీద చిన్నప్పటి నుండి ఉన్న ఇష్టంతో తాను నేర్చుకోలేక పోయినా వాటి మీద ఆసక్తిని వదులుకోలేక, పిల్లల మీదనున్న మక్కువతో కళాశాల బోధనా కన్నా పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయినిగా చేరి అందరి మన్ననలను పొందారు. అంతకన్నా ఎక్కువగా ఆత్మతృప్తిని అనుభవించారు. పర భాషకు ప్రాముఖ్యత పెరుగుతున్న ఈ రోజుల్లో అంతరించిపోతున్న తెలుగు భాషను నిలబెట్టడానికి ఉపాధ్యాయులకు తెలుగు భాష పట్ల నిబద్ధత ఉండాలని, పిల్లలకు సులభ రీతిలో ఉచ్చారణ, రాయడం నేర్పాలని, కనీసం ఇంట్లోనయినా తల్లిదండ్రులు పిల్లలకు తెలుగులో మాట్లాడటం, రాయడం, చదవడంపై కథలు, కబుర్ల ద్వారా ఆసక్తి కలిగించాలని, తద్వారా తెలుగు భాష బతుకుతుందని అంటారు. మన భాషను మనం మర్చిపోతే మనని మనం మర్చిపోయినట్లే అంటారు.
       పఠనాసక్తి మెండుగానున్న తనకు పదవ తరగతి తరువాత వచన కవితా రాయడం మొదలైందని, అధ్యాపకుల బోధనలలో కొత్త పదాలను సేకరిస్తూ, ప్రముఖ కవుల రచనలు చదవడం ద్వారా తన కవితా రచనకు మెరుగులు దిద్దుకున్నానంటారు. పోతన, కృష్ణశాస్త్రి, కరుణశ్రీ, శేషేంద్ర శర్మ, బాల గంగాధర తిలక్, దాశరథి, నారాయణరెడ్డి మొదలైన వారు తన రచనలకు ప్రేరణ అని చెప్తారు. మొదటి రచన వచన కవితగా చెప్తూ విజయవాడ ఆకాశవాణి యువవాణి కార్యక్రమంలో కవిత చదవడం, దానికి లభించి పారితోషికాన్ని ఇంట్లో అందరితో పంచుకోవడంలో ఆనందాన్ని తీయని జ్ఞాపకంగా చెప్తారు. వచన కవిత్వం, కథ, నవల, పద్యం, వ్యాసం, టాబ్లో, స్కిట్, గేయాలు, గేయ కథలు, లేఖా సాహిత్యం, భావ గేయాలు, గజళ్లు, బాల సాహిత్యం ఇలా తెలుగు భాషా ప్రక్రియలన్నింటిలోనూ తనదైన శైలిలో రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. విశాలాంధ్ర, వార్త వంటి ప్రముఖ పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. మొలక అనే పిల్లల పత్రికలో ఇప్పటికి కరుణశ్రీ గారి తెలుగుబాల పద్య వ్యాఖ్యానం రాస్తున్నారు.
    తెలుగు భాషాసాహిత్యాలకు సంబంధించి దాదాపు 900 వ్యాసాలకు పైగా, 1300 పద్యాలు, 400 కవితలు, 200 గీతాలు రాశారు. 26 పుస్తకాలకు పైగా ప్రచురించారు. సంగీతం, సాహిత్యం, నాట్యం, నటన, దర్శకత్వం తదితర విభాగాల్లో ప్రవేశముండి, రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి ప్రతిభకు దక్కిన పురస్కారాలు బాలసాహితీ పరిషత్ వారి జ్ఞాపిక, రావూరి భరద్వాజ స్మారక ఉత్తమ గ్రంథ పురస్కారం, గురజాడ ఫౌండేషన్ వారి తెలుగు కవితా పురస్కారం ఇలా 15 వరకు బిరుదులు, పురస్కారాలు పొందారు. ఇవి కాకుండా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారు మరియు భారత కల్చరల్ అకాడమి వారు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో విశిష్ట సాహితి సేవా పురస్కారం,  ఆంధ్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం ఈ రెండు మూడు రోజుల వ్యవధిలో అందుకున్న ఏకైక వ్యక్తి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి. నాలుగేళ్ళ  కఠోరశ్రమకోర్చి ఎంతో పరిశోధన చేసి నుడి గుడి అన్న 400 పేజీల పై చిలుకు భాషా పరిశోధక వ్యాసాల పుస్తకంలో కనుమరుగౌతున్న తెలుగు పద సంపదను అర్ధ సహితంగా ఏ ఏ పద్యాల్లో ఎలా వాడారో అన్నది సహేతుకంగా వివరించారు. దానికిగాను గిడుగు రామమూర్తి పంతులు పురస్కారాన్ని అందుకోనున్నారు.
తెలుగు భాషకు ఎనలేని సేవ చేస్తున్న రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి మరిన్ని బాషాసాహిత్య సంపదలను మనకందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి హృదయపూర్వక అభినందనలు.


మైనపు బొమ్మలు సమీక్ష...!!

                      ఆంతర్యాలను స్పృశించిన అక్షరాలు ఈ మైనపు బొమ్మలు..!!     

సుధాకర్  లోసారి కవిత్వం చదువుతుంటే వృత్తికి, ప్రవృత్తికి, సామాజిక విలువలకు, మానవత్వానికి, మంచితనానికి ప్రతీకలుగా చిన్న చిన్న పదాలతో అర్ధవంతమైన భావాలను అక్షరీకరించారని చెప్పడం అతిశయోక్తి కాదు. మైనపు బొమ్మలు సమీక్ష రాయడానికి చదవడం మొదలు పెట్టిన వెంటనే మొదటి కవిత నుంచి చివరి కవిత వరకు మనసు తడి గుండెలను తాకుతూనే ఉంది.
   వానాకాలం మన చిన్నప్పుడు ఎలా ఉండేదో, వాన కోసం ఎదురుచూసిన కరువు నేల తడిసి ముద్దైన తీరు, దాన్ని చూసిన సంతోషాల సంబరాలు, వాస్తవంలో రాని వాన కోసం తపన పడుతూ రాతిరి కలలో
" వానలో తడిచిన నేను
నాలో తడిచిన వాన
తడిచి తడిచి చెరిసగం మట్టిముద్దలవుతాం. " అంటూ కలల పక్షుల కోసం ఎదురుచూడటం చాలా బావుంది.
ఓ నా ప్రియ సైనికుడా కవితలో
" ఏ వీర స్వర్గపు ద్వారాల వద్దో నీవు
నన్నీ చీకటి తీరాన్నొదిలి..." తన వద్దకు వస్తాడో రాడో తెలియని సందిగ్ధతను సైనికుడి భార్య పడే వేదనను, వియోగాన్ని ఇంతకన్నా బాగా ఎవరు చెప్పలేరేమో.
" బతుకు ద్వార బంధాల వద్ద తలక్రిందులై వేలాడే గబ్బిలాల జీవితాలు మావి, చీకటి ఖండాలు మా జీవితాలు, దేవుడా నగ్న హృదయంతో నమస్కరిస్తున్నా, మావి కాని జీవితాలు మాకెందుకని గబ్బిలాలు కవితలో పావలాకి, పాతిక్కి అంగడి సరుకులైన బతుకుల ఆక్రోశాన్ని వినిపిస్తారు తనదైన గొంతుకతో.
కర్ఫ్యూ కవితలో యుద్దానికి, విధ్వంసానికి మధ్యన ఓ గంట విరామ కాలాన్ని వాస్తవాల దృశ్యాలను మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు. మానవీయుడు కవిత మనలో మరో మనిషిని మేల్కొల్పుతుంది. ట్రాఫిక్ పోలీస్ గురించి చెప్పిన అక్షర సత్యం ఇది.
" కాలుతూ నానుతూ సహనమై
మానవీయ స్నేహమై
నాలుగు రోడ్ల కూడలిలో
అతనలా అలుపెరగని యోధుడై
కాలానికి క్రమశిక్షణ నేర్పుతూ.."
ఉద్యమ గీతంలో నిజాలకు, అబద్ధాలకు మధ్యన నిలిచిన శాసనాల చీకటిపై ధిక్కారాన్ని ప్రకటిస్తారు.
అమ్మని లేకుండా చేసిన కాలం మీద కోపాన్ని, అమ్మతోనూ, తనకి జ్ఞాపకాలనిచ్చిన అమ్మ గదితోనూ తన అనుబంధాలను తల్చుకుంటూ అమ్మ గురుతులు దాచుకోవడానికి అక్షరాలను హత్తుకోవడం అద్భుతం.
ఏకాకి ప్రయాణం కవితలో అపరిచితులుగా మిగిలిపోయిన రెండు మనసుల మద్యన ప్రేమ ఏకాకిగా నిలిచి ఎవరిది  వారిది ఒంటరి ప్రయాణం అంటూ ముగించడం కొత్తగా ఉంది. లోకమంతా వెలుగులు చిమ్మే మానవతా దీపాన్నవుతానంటారు మానవత్వం నా మతం కవితలో. జ్ఞాపకాల స్వప్నాలను వెదుకుతుంటారు నిరీక్షణ కవితలో.
పోగొట్టుకున్నది ఎవరికీ దొరకదని, కాలం ఎవరిదీ కాదని వెదకాలి కవితలో చెప్తారు. చావుకి, బతుక్కి,  ఆనందానికి,విషాదానికి పెద్ద తేడా లేదంటూ పల్లె గొడవల్లో ఇరు కుటుంబాలు క్షతగాత్రులే అంటూ ఫ్యాక్షన్ గొడవలకు వాస్తవ రూపాన్ని ఆవిష్కరించారు. అరుణిమ కవితలో అన్యాయానికి సమాధానం చూపించారు. నిశ్శబ్దంగా చెట్టు కరిగిపోయి ఒక అనాధ గీతమాలపించడం, మనసైన జ్ఞాపకంగా ప్రియసఖి, డయానా స్మృతికి స్వేచ్చా గీతాన్ని ఆలపించడం, జీవితం ఓ పెద్ద అబద్దం, బతుకు బార్లా తెరిచిన రహస్యం, ఎప్పుడు తడి గాయాల పర్వమే అంటూ అంగడి బొమ్మల ఆవేదనను ఎండుపూలు కవితలో చెప్తారు. వెలుతురు పాట పాడుతూ ప్రశ్నించడం కావాలంటూ తుపాకీ నీడలో నిలబడతారు. ఊరి పొలిమేర గ్రామదేవత గ్రామ కక్షలకు, కార్పణ్యాలకు సాక్ష్యమని ఆ పరిస్థితులను వివరిస్తారు. నిషేధించే నిజాలను, విజేతలను, పరాజితులను, అక్షరాల పరమార్ధాన్ని అందించిన ఆమెకు ప్రణామాన్ని, చరిత్ర మరచిన రాత్రులను గుర్తుచేస్తూ, ఊహారేఖలో అనువదించుకుంటూ, విశ్వమానవ దీపావళి కోసం కాలానికి అటు ఇటు గాయాలను తుడుస్తూ, రాలుతున్న పసి మొగ్గల కథనాలను అక్షరాల్లో చూపిస్తూ కవిగా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. ఓ యుగాంతానికి ఎరుపెక్కిన ఆకాశాన్ని పరిచయం చేస్తూ, పంజరంలోని ఆమె దేహాన్ని, శూన్యమైన అస్థిత్వపు బతుకును, హెచ్ ఈ వి తో ఆఖరి పోరాటాన్ని, ఇరు సంధ్యల అందాన్ని, ఆట వేట అడవిలో మొదలైనా నేటి నగరపు అడవిలో నాగరికత ఓ మహా అనాగరికత అని చెప్తారు. మానని గాయానికి మందు రాసి మహానుభావుల కోసం ఎదురు చూడటం, మా ఊరొక  వసుదైక కుటుంబం అంటూ సేద దీరడానికి తన ఊరెళ్ళినప్పుడు కనిపించిన, అనిపించిన భావాలకు, ఒకప్పటి జ్ఞాపకాల గురుతులను మేళవించి మన అందరిని కూడా మన ఊరికి పయనింపజేస్తారు. వియోగాన్ని ది బెడ్ రూమ్ కవితలో, మనసులోని ప్రేమను ప్రవహించే జ్ఞాపకంగా, రెండు గుండె గొంతుల ఏక గీతాన్ని గాయ పడిన ఒక మౌన శబ్దంలో, విషాద మోహనాన్ని విరచించడం, సూర్య చంద్రులను, ఉన్మాద ప్రేమను, నిజాలను నీడలను నిర్భయంగా చెప్తారు. ప్రశ్నించడం ఒక చారిత్రక అవసరమంటూ, నల్ల పంజరపు అవశేషాలను వెలికి తీస్తారు. పిడికిలి పట్టును గుర్తెరగమంటారు. వాస్తవికతను దూరం చేస్తున్న ఆధునికతను నాలోంచి నాలోకి కవితలో ఎవరికి వారు తరచి చూసుకునేటట్లు చెప్తారు.
ఘనీభవించిన జీవితం మరో జన్మకు వాయిదా మన జ్ఞాపకాల సాక్షిగా అంటూ అగాధాన్ని సృష్టించి విడిపోయిన ప్రిన్స్ డయానాలకు తన సున్నిత హృదయాన్ని చాటుకుంటారు. విస్మృతి కవిత వింత సోయగంతో చెప్పడానికి మాటలు చాలలేదు. నాకు బాగా నచ్చిన కవిత. చివరగా ఈ కవితా సంపుటి పేరైన మైనపు బొమ్మలు కవితలో
"దేహం వ్రణమై
బతుకు రణమై
క్షణక్షణం ఓ పదునైన కరవాలమై .." అంటూ సాగే అక్షర శరాలు మహాకవి శ్రీ శ్రీ ని  గుర్తుకు తీసుకురాక మానవు.
జీవితంలో తారసపడే ప్రతి చిన్న సంఘటనకు స్పందిస్తూ అక్షరికృతం చేసే సున్నిత హృదయమున్న సుధాకర్ లోసారి మైనపుబొమ్మలు కవితా సంపుటికి హృదయపూర్వక అభినందనలు. 

5, అక్టోబర్ 2018, శుక్రవారం

కొందరి బాదేంటో...!!

నేస్తం,
          చాలా రోజులుగా చెప్పాలనుకుంటున్న కొన్ని విషయాలు ఇప్పుడు చెప్తాను. నేను ఎప్పుడు నాకు రాయాలనిపించింది మాత్రమే రాస్తాను. చాలామంది చాలాసార్లు అడుగుతారు, ఫలానా దాని మీద రాసివ్వండి అని. నాకు కుదిరినప్పుడు, రాయాలనిపించినప్పుడు రాసిస్తానని చెప్తాను. నా రాతలు నాకు రాయాలని అనిపించినప్పుడే రాయడం చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. నేను కవినని కాని, రచయితనని కాని ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు. నాకనిపించిన భావాలకు ఓ అక్షర రూపాన్ని నాకు తోచిన రీతిలో ఇవ్వడం మాత్రమే తెలుసు.
      నే రాసిన అక్షరాలకు స్పందనలో అనురాధ వేదాంతం గారు ఓ సీన్ చెప్పి కవిత రాయమని అడిగారు. నాకు రాయాలనిపించినప్పుడు రాసి పంపిస్తానని చెప్పాను. దానికి ఆవిడ స్పందనలు నా గోడ మీద అందరు చూడవచ్చు. నా గోడ మీద నాకనిపించినవి రాసుకునే హక్కు నాకుంది కదా. నేనెవరికీ సలహాలు, సూచనలు ఎప్పుడు చెప్పను, ముక్కు మొహం తెలియని వారు, వయసులో పెద్దవారు కొందరు ఎందుకిలా ప్రవర్తిస్తారో మరి. నేను రాయడంతో ఆవిడకున్న ఇబ్బంది ఏమిటో నాకర్ధం కాలేదు. ఆవిడ అడిగినది నేను నాకనిపించినప్పుడు రాసిస్తాను అన్నా, ఆవిడ నేనిక నా గోడ మీద ఏమి రాయకూడదనడానికి కారణం ఏమిటో.? ఆవిడ బాధ ఏంటో నాకర్ధం కాలేదు. ఆవిడనే కాదు నా లిస్ట్ లో ఉన్న అందరికి ఇదే చెప్తున్నా మీకు ఇష్టమైతే చదవండి లేదా ఊరుకోండి. కాదు కూడదంటారా నా లిస్ట్ లో నుండి నిరభ్యతరంగా వెళ్లిపోండి. అస్సలు ఇబ్బంది పడవద్దు. సద్విమర్శలు చేయండి స్వాగతిస్తాను, కానీ మీ అక్కసు వెళ్లబోసుకోవడానికి,  ఊరికే ఉచిత సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించకండి. మరోసారి చెప్తున్నా నేను కవిని కాని, రచయితను కాని కాదు. నాకనిపించిన భావాలకు నాకు తోచినట్లు అక్షరరూపమిస్తూ ఆనందిస్తున్నా. మీరేంటి అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా.... నమస్కారం...!!

30, సెప్టెంబర్ 2018, ఆదివారం

ఏక్ తారలు...!!

1.  అవగతమైన అంతరంగమిక్కడ_నిత్యం మన మధ్యన మాటలు లేకున్నా....!!

2.   వెలుతురు వాదులాడింది_చీకటిలో వెన్నెల చెలిమి కోసం...!!

3.   తిమిరమూ తెర మరుగౌతోంది_భారాన్ని భావాలకద్ది....!!

4.  మిన్నకున్నాయి తిమిరాలు_వేకువను అడ్డుకోలేక...!!

5.  జలతారు వెన్నెలది_చీకట్లకు వెరవనిది...!!

6.   అందంగా అమరింది మది భావమే_అల్లుకున్న అక్షరాల్లో ఇమిడిపోయి..!!

7.   ఉప్పనీటి చెమ్మలే ఎక్కువ_జీవితపు చెలమలో...!!

8.   మౌనం ఆలకిస్తోంది_పలకరింపులు ఏ క్షణాలకని...!!

9.   కాలానికి చిక్కనివి_మనవైన క్షణాల గురుతుల గమనాలు...!!

10.  సంతోషం సహపాటయ్యింది_నీ పొడుపుకథలను నే విప్పుతుంటే....!!

11.  గెలుపు మౌనానిదయ్యింది_పలకరింతలొద్దని బెట్టు చేసిన మాటలకందక...!!

12.   బెంగ పడినా బింకాన్ని వీడలేదు_మౌనానికి మనసివ్వాలనేమెా....!!

13.   మనసు భాష మధురమే_లిపి అక్కర్లేని మౌనమది...!!

14.  చిరునవ్వుల మౌనాన్ని నేను_అనునయించిన నీ ఆత్మీయతకు... !!

15.   భారమైనా భరించక తప్పదు_మౌనాన్ని ఆశ్రయించిన మౌనిని...!!

16.   దాగిన మధురాక్షరాలే ఇవన్నీ_మౌనాన్ని వీడిన మనసువై...!!

17.   మనసు మౌనం ఒకటయ్యాయి_భావాల చేరువలో...!!

18.  పరిమళించేది నీ పరిచయంలోనే_మౌనభావం మదిని తాకినప్పుడు...!!

19.   ఓ చిన్న పలకరింపు_యెాజనాల దూరాన్ని దగ్గర చేస్తూ...!!

20.  మందలింపులకు మాలిమి కావడం లేదు_మది కల'వరాలు...!!

21.   మనసుకి నచ్చిన మౌనమే మేలు_ఆత్మీయత కానరాని మాటలకన్నా...!!

22.  కలల పహరానే ఎప్పుడూ_నిదుర కొలను చుట్టూ...!!

23.   చెమ్మతో నిండని చెలమే_మది రాయని భావాల కాగితంలో..!!

24.   ముత్యమంటి మనసది_వన్నె తగ్గని వ్యక్తిత్వంతో మెరుస్తూ...!!

25.   కినుక వహించినా కాళ్ళ బేరం తప్పడం లేదు_పసిడి నవ్వుల ముత్యాలకు..!!

26.   చెలిమి సాహచర్యమది_అహాలకు అందక ఆత్మీయపు ముత్యపు చినుకుల్లో..!!

27.   నవ్వులు చెదిరిపోతాయి_క్షణాల్లో తారుమారయ్యే విధిరాతకు...!!

28.   తప్పని తిరోగమన జీవితమే_వెన్నాడుతున్న విషాదాల నడుమ...!!

29.   అవ్యాజమైన అమ్మ ప్రేమ_ ఆవకాయ ముద్దతోనే జీవితాన్ని బోధిస్తూ...!!

30.   అన్ని రుచులు అమ్మ నేర్పినవే_ప్రేమకు చిరునామాగా....!!

28, సెప్టెంబర్ 2018, శుక్రవారం

ఖాళీ అధ్యాయం...!!

తెరచిన జీవితపు పుస్తకంలో
అక్షరాల అనుభవాలతో
గతాల జ్ఞాపకాలతో
గాయాల కన్నీళ్ళతో
నిండిన పుటలే ఎక్కువ

పుట్టుకతో మెుదలుపెట్టి
పసితనం, బాల్యం, కౌమారం
నడివయసు, ముసలితనాలంటూ
చీకటి వెలుగుల దోబూచులాటలతో
బాంధవ్యాల బంధిఖానాలో
బతుకు వెళ్ళదీత

మనకి మనం రాసుకోలేని
ఖాళీ అధ్యాయమెుకటి
కాచుకునే ఉంటుందెప్పుడు
ఆగిన గుండె చప్పుడును
అనువదించలేని భావాలుగా
యంత్రాలు సైతం మూగబోయే
సమయమే నిర్జీవ దేహయాత్ర....!!

26, సెప్టెంబర్ 2018, బుధవారం

వాన వెలిశాక... !!

                       అక్షర భావాలను మెరిపించి మెప్పించిన " వాన వెలిశాక..."

        సాహిత్యం, కళారంగాలలో విశిష్ట సేవలందిస్తూ ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించినా పరిచయం అక్కర్లేకుండా సామాన్యునిగానే అందరికి 'సు'పరిచితులు కళారత్న బిక్కి కృష్ణ రాసిన వా"న వెలిశాక..."
   చెదిరిన రంగుల కల కవితలో గద్దదలను తరిమేసి కాకులకు పట్టం కట్టడం, ఏడాదికోపాలి కలలు ఎండమావులని  పండుగలు చేసుకోవడం వెనుక చేతగానితనాన్ని ఎండగట్టడం, మానవత్వం మరచిన ఈనాటి వాస్తవ జీవితాలకు అద్దం పట్టింది. మట్టిమనిషి-మృత్యుగీతం కవితలో కవికి బదులుగా మట్టిమనిషి కన్నీటితో మృత్యుగీతాలు రాయడం, పూలతోట కాలితే కవితలో రాలిపడిన కన్నీటి బిందువుల తడి బతుకు కాగితంపై రాయడం, అమ్మ కవిత్వం పండు తిన్నందుకు తాను కవిగా పుట్టి కవిత్వపు మంటైపోయానని చెప్పడంలో ఓ నిండుదనం కనిపిస్తుంది. కూలుతున్న చెట్లను చూస్తూ, బతుకు గరం గరం ఛాయ్! చల్లారనీకండి, మీ సంకల్ప బలానికి ఓటమి తలవంచుకోవాల్సిందే అంటారు. అర్థరాత్రి పక్షి.. వేటగాని వలలో కవితలో కలల రంగుల ప్రపంచాన్ని వర్ణిస్తూ ఎవరెలా పోయినా మనకెందుకని అంటూ అర్థరాత్రి పంజరం నుండి జారిపడ్డ పక్షి తెల్లారాక వేటగాని వలలో ఉంది చూడమనడంలో ఓ హెచ్చరికను అందజేస్తారు. విలువల గొంతులో.. జారుతున్న విషం, ఆకాశంలో గద్దలాడుతున్నాయ్, ఒకే మనిషిలో-అనేక మృగాలు కవితలు ఇంటి  దొంగలు, రాజకీయ నాయకుల అవినీతి, విలువలు మరచిన మనుష్యుల నైజాలను వివరిస్తూ కవిత్వం కావాల్సిన గుండె చెత్తబుట్టగా మారిందంటారు. ఆకాశం.. నిట్టూర్పు కవితలో ప్రకృతిలో జరుగుతున్న విచిత్రాలను కాలం కెమెరాలో చూస్తూ ఆకాశం మౌనంగా..నిట్టూరుస్తుందంటారు. కవి కేరాఫ్ అడ్రస్ సూరీడు కవితలో అమ్మతో తన జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. వాన నెరజాణ ప్రేమ - హరివిల్లు అంటూ ప్రేమ అక్షరాలను రంగుల గాలిపటాలుగా ఆకాశంలోకి విసిరేస్తూ ప్రేమ హరివిల్లు మళ్ళి మెరుస్తుందన్న ఆశావహ దృక్పధాన్ని చెప్తారు. భయం తోడేలు - మేకపిల్ల జీవితం కవిత జీతం కోసం జీవితాన్ని గంటలుగా అమ్ముకున్నప్పుడే ఆత్మను తాకట్టు పెట్టుకున్న అదృశ్య శక్తి అభద్రతా భూతమంటారు. వెన్నెల గాయాల దేహం, వెన్నెల - సముద్రం, పూలు రాలిన చెట్టు, కొన్ని సందర్భాలు.. అంతే, ఆశయాన్ని ప్రేమించడం నేర్చుకో కవితల్లో జ్ఞాపకాలను మింగేసే మౌనాన్ని, కలల ఊహలను, కవి జననాన్ని, శోకం శ్లోకమైన జీవిత కావ్యాన్ని, ఆశయం లేకుండా కవి జీవితానికి అర్ధం  లేదని చక్కని పదాల చురకత్తులతో చురకలు వేశారు. కవిత్వాన్ని ఓ మెరుపుతీగగా వర్ణిస్తారు. ఆమె విశాల ఆకాశం కవిత అమ్మను గురించి ఎంతోమంది చెప్పారు. అమ్మకు రెండు అక్షరాలు చాలవంటూ, అమ్మ ప్రేమకు కొలమానం లేదంటూ, ఓ కవి సూర్యుణ్ణి ఈ దేశానికి కానుకిచ్చిన విశాల ఆకాశమని చెప్తూ తన ఉన్నత హృదయాన్ని కవితాక్షరాల కానుకగా సమర్పించారు. ప్రేమ ముగింపు విషాదమంటూ, మనోకుడ్యంపై హింసాచిత్రాలు కవితలో తాత్వికతతో పాటు జీవితసత్యాన్ని తెలుసుకోవడంలో తర్కానికి కాకుండా జ్ఞానానికి స్థానమిమ్మంటారు. ఈ కవితా సంపుటి పేరైన వాన వెలిశాక కవితలో చెదిరిన బాల్యాన్ని,  జీవిత క్షణాలను నెమరువేసుకుంటూ
"గతం మురికిగుంట..  వర్తమానం సెలయేరు
ఇప్పుడే మొదలైన వానలాంటిది ఙివితం
అన్నింటినీ కరిగేస్తూ కలిపేస్తూ
ఆనందమై స్వచ్ఛంగా జీవించు
వానలెలిశాక ఆకాశంలా.. " అంటూ జీవితపు గమనాన్ని, గమ్యాన్ని అద్భుతంగా చెప్పారు.
నాన్న.. నేను.. అమ్మ... ప్రయాణం కవిత మన అనుభవానికి వచ్చినప్పుడు బాధ్యతల బరువు ఎంత ప్రేమగా ఉంటుందో తెలిసిందంటారు. ఆమె ప్రేమ అతనికి ఓ ఏ టి యం మూడుముళ్ల బంధం అర్ధం చేసుకోలేని మగ అహంకారానికి ఎలా బలౌతుందో నిజాయితీగా చెప్పారు. కవి మనసు కవిత్వం ప్రేమ కవిత సమస్త దృశ్యాలను తనలోకి ఒంపుకోవడమే ప్రేమ, అదే కవిత్వమైన కవి మనసే ప్రేమ కవిత్వమంటారు. జీవించడమంటే అంతా నేర్చుకోవడమేనంటారు. కన్నీటి బతుకులకు కాగడా పట్టేదే కవిత్వమన్నందుకు కలలోకొచ్చిన ప్రేయసి పోలీసు నేడు కవి కంటిలో  కన్నీటిపిన్నీసు గుచ్చిందంటారు.  మరో కవితలో అమ్మ మట్టికుండ శిశువు కట్టెతెడ్డు అని  చెప్తారు. నీడ X ప్రేయసి లో నిజమైన నీడ ప్రేయసేనంటారు. ప్రపంచీకరణ విఫణివీధిలో త్వరలో పూలు పాడే విప్లవ సుగంధాల యుద్ధ గీతాలు వినబోతున్నామంటూ స్వార్ధానికి హెచ్చరిక జారీ చేసారు. గుండెకుండలో మానవత్వం చన్నీరు, మనిషిని ప్రేమించడం ఓ కళ, నమ్మకం దుఃఖమైన వేళ, దుఃఖపుతాబేలు, కళాసూరీడు వంటి కవితల్లో అర్ధాకలి బతుకులు, మానవత్వపు ప్రేమ, మోసపోయిన నమ్మకాలు, ఆశయాల ఆవేశానికి గజ్జె కట్టిన కళా చైతన్యం గురించి బాగా చెప్పారు. జారిపోయిన కాలం నుంచి దేన్నీ తెచుకోలేమని వయసు మళ్ళిన దేహపుచెట్టు మళ్లీ చిగురులు తొడగదంటారు. కవి( గా)మారిన మా ఊరు కవిత కరువుసర్పం కాటేసినా అక్షరాల ఆకుపచ్చని రసం తాగి నాలో కవిగా మారిందంటూ మన అందరిని కూడా మన పల్లెకు తీసుకువెళిపోతారు మన ప్రమేయం లేకుండానే. దేశమంటే ప్రజలు కవిత్వమంటే ప్రేమంటూ, బుద్ధి శరణం గచ్ఛామి అని సర్దుకుపొమ్మంటారు. అందరిలో అన్నింటా అమ్మను చూస్తూ కవిత్వమంటే నిరంతర అన్వేషణే అంటారు. మనిషి మానవత్వానికి చిరునామా కావాలంటారు పిడుగుపడిన చెట్టులో. మబ్బువెనుక చందమామను చూస్తూ, లోపలి మనిషిని అంచనా వేస్తూ, సూర్యబింబం ఉరికొయ్యపై వేలాడటాన్ని గుండె కెమెరాలో కొండ చిత్రాలన్ని  శాశ్వతంగా నిలిచిపోయాయంటారు. కవిత్వం కవి కంటిచూపులో పేలే స్టెన్ గన్ అంటారు. ఊహలను కోరికల నెమలీకలుగా రహస్యంగా రాలిపోతున్నాయంటారు. ప్రేమను ఆకాశపు నీలిమ రంగుగా  బావుంది. ప్రేమంటే కరిగిపోవడమేనంటూ, పిట్టలా వాలి పో అని ప్రేమగా అంటూ పుస్తకం నా చేతుల్లో వాలిన పాలపిట్ట అని ప్రేయసిని, పుస్తకాన్ని అందంగా ఆవిష్కరించారు. మనసంటే ప్రలోభాల ప్రభావాలకు, ఆకర్షణలకు కాలిపోయే దీపం పురుగు అంటూ చెప్పడం అర్ధవంతంగా ఉంది. కొబ్బరాకు సందుల్లో నా సందమామ ఏది అని నగరవాసంలో కోల్పోయిన పల్లె అందాల ఆనందాలను తలచుకుంటారు. పచ్చనోటు  మాయలో కీర్తి అలలపై కవితల పడవలు కొట్టుకుపోతున్నాయంటారు. నేలంతా కవితల మల్లెమొగ్గలు పరుచుకున్నా మనసు మబ్బుపట్టిన ఆకాశంలా ఉందంటూ లేని ప్రేమల ఒలకబోతల గురించి వాపోతారు. ప్రేమంటే కన్నీటి వానంటూ, ఆమె ఆకాశం - రంగులు వెలిసిన ఇంధ్రధనుసు అని  మగాడికి స్త్రీ విలువ ఎప్పటికి తెలియదంటారు. మాయమైన గతంలో పల్లె గుండెలో మిగిలిన తీపి గాయాల జ్ఞాపకం మా ఇల్లంటూ మన మనసులను కూడా మాయ చేస్తారు కాసేపు. ఇప్పటికైనా మనుష్యులను ప్రేమించడం నేర్చుకోమంటారు మరో కవితలో. స్వార్థపు ముఖచిత్రాన్ని, దిగులు రెక్కల మనసుగువ్వలను చూపిస్తూ కవిత్వాన్ని జడివానగా మార్చి, హింస మనిషి - అహింస ఋషి అంటూ తాత్వికతను చెప్తూ, మనిషిని ఓ పంట పొలంగా మారమంటూ, బతుకు పుస్తకంలో మానవత్వానికి చోటిమ్మంటారు. తన కవిత్వం మానవత్వానికి కొత్త డిక్షన్, మనిషి చైతన్యానికి సరికొత్త డైరెక్షన్ అని ఘంటాపధంగా చెప్తూ కొసమెరుపుగా వాన వెలిశాక ఎలా ఉంటుందన్నది.. ఓ కవి భావోద్విగ్నితలను  క్రమబద్దంగా అక్షరీకరిస్తే ఎలా ఉంటుందన్నది మనకు తెలుస్తుంది.
       ప్రతి చిన్న భావాన్ని అందంగా, ఆవేశంగా, ప్రేమగా, ఇష్టంగా అక్షరాలకు అమర్చడం అన్నది కవిత్వ లక్షణాలు తెలిసిన కవికి చాలా కష్టం. అన్నింటిని సంపూర్ణంగా " వాన వెలిశాక..." అంటూ అందించిన కళారత్న కృష్ణ బిక్కి కి అభినందనల శుభాకాంక్షలు.


25, సెప్టెంబర్ 2018, మంగళవారం

కలల లేమి..!!

కలలేమి రాకపోయినా
తెల్లారిపోతూనే ఉంటుంది
మరో రోజుగా మారిపోతూ

ఆత్మకు శరీరానికి అవసరమైన
అనుసంధాన వేళప్పుడు
ఏకాంతానికి స్వాగతం పలుకుతూ

ముహూర్తాలు కుదరలేదన్నా
ముద్దుముచ్చట్లు తీరలేదన్నా
ఎవరి కోసమూ కాలమాగనంటుంది 

అస్పష్టపు నీడలకు కప్పిన
ముసుగు తెరలను తొలగించాలని
వాస్తవాన్ని ఆదేశిస్తూంటే

వెలుతురు పొద్దు సెగకు తాళలేక
వెన్నెల చల్లదనానికై చూస్తూ
కలల లేమి భర్తీకై మాపటిని అర్థిస్తుంటుంది...!!

24, సెప్టెంబర్ 2018, సోమవారం

గుంభనంగా...!!

సముద్రాన్ని చూడు
ఎంత గుంభనంగా ఉంటుందో
లోలోపల ఎన్ని బడబానలాలున్నా
పైకి ప్రశాంతంగా కనిపిస్తూ

చూస్తూనే ఉన్నావుగా  
చీకటంతా నా చుట్టమైనా 
వెలుగుల కోసం వేగిరపడని 
నిశ్శబ్ద నిరీక్షణ నాదని 

నీకు తెలుసు కదా
కాలమాడుతున్న దోబూచులాటలో
మనసుకు దేహానికి కుదరని సమతూకం
మారణాయుధమై వెన్నంటే ఉందని

క్షణాల ఆశల ఆరాటానికి
యుగాల ఎదురుచూపుల  
ఏకాంతాల సహవాసానికి నడుమన 
నిలిచినదీ జీవితమని గమనించు..!!

21, సెప్టెంబర్ 2018, శుక్రవారం

మాటల వరకే పరిమితం....!!

                            పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు, రైతు రాజ్యమే మా లక్ష్యం, రైతన్న అన్నం పెట్టే దేవుడు ఇలా వగైరా వగైరా మాటలన్నీ ఎక్కడో విన్నట్టుగా ఉంది కదూ. పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఓట్ల కోసం చెప్పే మాటలే ఇవి... హమ్మయ్య అందరికి గుర్తు వచ్చాయనుకుంటాను. ఇక అసలు విషయానికి వస్తాను. మాది కృష్ణాజిల్లా దివితాలూకాలోని కోడూరు పక్కన ఓ మారుమూల పల్లెటూరు.  కనీసం ప్రభుత్వ రవాణా సౌకర్యాలు లేని ఊరు. కోడూరు నుంచి ఆటో వారు ఎంతంటే అంతా ఇచ్చి నడవలేని వారు వెళ్లడం అనాదిగా జరుగుతోంది. ఒకప్పుడు రోడ్డు సౌకర్యం కూడా లేదు. ఇప్పుడు ఉన్నా కూడా ప్రభుత్వం ఒక్క బస్ కూడా వేయని ఊరు మా ఊరు నరసింహపురం.
                           అసలు విషయం ఏంటంటే రైతులకు పంటకు ఆధారమైన కాలువలే ఇప్పుడు కనబడకుండా పోయే పరిస్థితి వస్తోంది. పంట కాలువ, మురుగు నీటి  కాలువ అని ప్రత్యేకంగా ఉండే కాలువలు కూడా సరిగా లేని దుస్థితి ఇప్పుడు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే నాధుడు లేడు. మా ఊరి నుంచి సాలెంపాలెం, గొంది ఊర్లకు   దారి, 2500 ఎకరాలకు వెళ్ళడానికి అదే దారి, జయపురం, కృష్ణాపురం, నరసింహపురం, ఉల్లిపాలెం పొలాలకు మురుగు కాలువ అయిన లింగన్న కోడు కాలువ మీద వంతెన 2001 లో పడిపోయినా ఇప్పటి వరకు దాని అతి గతి పట్టించుకున్నవారు లేరు. ఊరివారు కాస్త మట్టి, అవి ఇవి వేసి ఆ వంతెన పూర్తిగా పడిపోకుండా చేసారు. కాని బాగా శిథిలావస్థలోనున్న వంతెన ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునేవారు లేరు. ఊరివారు ఏమైనా చేయగలరా అంటే ఒకరు బాగు చేద్దాం అంటే మరొకరు వద్దని అడ్డం తిరగడం, పనికిమాలిన రాజకీయాలు, మంచి చేసే వారిని తిట్టడం, స్వలాభం లేనిదే ఏమి చేయనివ్వని తత్వాలు పెరిగిపోయాయి.
                       పదిమందికి ఉపయోగ పడే ఆ వంతెన ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, కనీసం మన ఊరంతా కలిసి బాగు చేసుకుందామన్న ఆలోచన వచ్చిన వారికి అండగా నిలబడడానికి ఊరిలోని అధికారంలో ఉన్న పార్టీ నాయకులు ముందుకు రాకపోవడమన్నది చాలా విచారకరం. ఊరి వాళ్ళ ఓట్లతో గెలిచింది మీరు డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే కాదు, కనీసం దానిలో కొంతయినా శ్రద్ధ ఊరి అవసరాల కోసం, ఊరి బాగు కోసం మీ పరపతిని ఉపయోగించండి. నాలుగు కాలాలు ఊరి జనాలు మీ పేరే చెప్పుకుంటారు. అందరికి అవసరమైన వంతెన పునర్నిర్మాణానికి ప్రభుత్వం, ప్రజలు సహకరించాలని కోరుకుంటూ... ఊరి మీద అభిమానాన్ని చంపుకోలేని ఓ సామాన్యుడు. 

త్రిపదలు...!!

1.  ప్రణయం..
పరిచయమయ్యాకే తెలుపుతుందనుకుంటా
బంధాల నడుమ బాంధవ్యాన్ని...!!

2.  మాయ చేసినా
మరిపించినా
జ్ఞాపకమెప్పుడూ మురిపెమే...!!

3.   చిక్కని చీకటి వనంలో
ధవళ వర్ణ శాంతి కపోతం
స్వేచ్ఛా వాయువులకై గగనయానం...!!

4.  నిర్భందించే ఆ చేతులు
నిజానికి చేయూతనిస్తే
రాజ్యాంగపు చట్టాలతో పనేముంది..!!

5.  రాబడి లేని రాయబారాలెన్నో
మౌనానికి తావీయని
మాటల బడిలో....!!

6.   అస్పష్టాన్ని అక్షరీకరించి
సుస్పష్టమైన ఆకృతినివ్వడం
సుసాధ్యమే సంకల్పముంటేే...!!

7.   మౌనానికెన్ని భాష్యాలో
అక్షరాలకు ఆయువునిస్తూ
మనసుని లిఖించేస్తూ...!!

20, సెప్టెంబర్ 2018, గురువారం

జీవన "మంజూ"ష (సెప్టెంబర్ )

నేస్తం,
        వ్యవస్థలో విలువలు తగ్గుతున్నాయంటే కారణాలు మరెక్కడో వెదుకుతాం కాని వెదుకులాట మనతోనే మొదలు పెట్టం. ఎందుకంటే మన మీద మనకంత నమ్మకం. మనం ఏ తప్పు చేయని ప్రబుద్ధులమని ప్రగాఢ విశ్వాసం కూడాను. పెళ్ళాం / మొగుడు పిల్లల మంచి చెడు అవసరం లేదు. ప్రపంచానికంతా ఆదర్శవంతులమే కాని మన ఇంట్లో మాత్రం ఎవరి అవసరాలు పట్టించుకోము. కుటుంబం మన అలంకారానికనుకుంటూ, బాధ్యతలు పంచుకుని, బంధాలను పెంచుకోవడానికని మాత్రం మర్చిపోతాం. ఆపదల్లో అందరిని ఆదుకోవడానికి మన విశాల హృదయాన్ని చాటుకుంటాం ఎల్లప్పుడూ. మంచితనం ముసుగు మనమే కప్పుకున్నామో, మరెవరయినా మనకు దాన్ని ఆపాదించారో తెలియని స్థితిలో ఆ ముసుగు నుండి బయటకు రావడానికి ఇష్టపడక నటిస్తూనే జీవించేస్తుంటాం.
      బాధను సంతోషాన్ని పంచుకోవడానికి మన అన్న వారికి మనం ఎలా లేకుండా ఉంటామో, రేపటి రోజున మనకంటూ ఎవరు ఉండరని తెలుకోలేము. చావు పుట్టుకలు ప్రతి ఇంటిలోనూ సహజమన్నది మరచి, మన అహంకారానికి మనమే మురిసిపోతూ డబ్బు పొగరుతో ఆ డబ్బు జబ్బుని మర్చిపోయి రేపన్నది మనకి ఉంటుందని గుర్తు లేనట్టు ప్రవర్తిస్తాం. విభజించి పాలించడం రాజకీయాల్లోనే పరిమితం కాకుండా మనమూ ఆ లక్షణాలన్నీ అవపోసన పట్టేసి అనుబంధాలను అతలాకుతలం చేస్తూ మన ప్రతిభకు మనమే గర్వపడి పోతున్నాం. ఆ ఇంటి బాధ రేపటి రోజున మన ఇంటిది కాకుండా పోదని మర్చిపోయి ప్రవర్తిస్తున్నాము. వయసు పెరుగుతున్న కొలది మన వ్యక్తిత్వం నలుగురు మెచ్చేదిగా ఉండాలి కాని నలుగురిలో నవ్వులపాలు కాకూడదు. నీతి సూత్రాలు వల్లే వేసి, నాలుగు గుడులు తిరిగినంత మాత్రాన మన సహజ లక్షణం పోయి మనము ఏమి మహాత్ములమైపోము. మనస్సాక్షి ఉంటుంది కదా దాన్ని తరచి చూస్తే తప్పొప్పులు తేటతెల్లమౌతాయి. కాదు కూడదు అహంకారాన్నే ఆభరణంగా అమర్చుకుంటామంటారా అది మీ ఇష్టానికే వదలి నలుగురితోపాటు నారాయణా అనడం మేమూ నేర్చుకుంటాం.

ఇప్పటికి ఈ  ముచ్చట్లకు సశేషం.... 

15, సెప్టెంబర్ 2018, శనివారం

కలల ప్రపంచం...!!

కలల ప్రపంచం కాలిపోతోంది
నైరాశ్యపు నీడలలో పడి

మనోసంద్రం ఘోషిస్తోంది
మౌనపు అలల తాకిడికి

కాలం కనికట్టు చేస్తోంది
ఊహలకు ఊతమిచ్చే క్షణాలకు లొంగి

రెప్పల కవచం అడ్డు పడుతోంది
స్వప్నాల మేలిముసుగు తొలగించడానికి

తెలియని చుట్టరికమేదో పలకరించింది
గతజన్మ బాంధవ్యాన్ని గుర్తు చేయడానికి

ముచ్చట్లకు మనసైనట్లుంది
శూన్యాన్ని నింపేయడానికి

ముగింపునెరుగని జీవితమైంది
మూగబోయిన ఎడద సవ్వడికి

అలసట తెలియని అక్షరాలంటున్నాయి
ఆగిపోయే ఊపిరికి ఆసరాకమ్మని....!!

సినీవాలి నవలా సమీక్ష...!!

                                         సినీ రంగంలోని చీకటిని చీల్చిన "సినీవాలి"..!!


ప్రముఖ నవలా రచయిత, సినీ దర్శకులు ప్రభాకర్ జైనీ రాసిన "సినీవాలి" నవలా సమీక్ష సంక్షిప్తంగా..
    " ఒక చిన్న స్వప్నం సాకారమౌతుంటే కలిగే ఆ ఆనందమే వేరు . "  అంటూ ప్రభాకర్ జైనీ తన స్వప్న సాకారాన్ని గురించి చెప్పిన ఈ మాటలు నిజంగా అనుభవానికి వస్తేనే ఆ అనుభూతి, ఆస్వాదన తెలుస్తాయి.  'సినీవాలి' అంటే అమావాస్య నాటి తెల్లవారు ఝామున కనిపించే వెలుగు అని అర్ధం. పూర్తిగా సినిమా ప్రపంచానికి సంబంధించిన ఈ నవలా ఇతివృత్తానికి ఈ "సినీవాలి" అన్న పేరు పెట్టడం నూటికి నూరుపాళ్లు సమంజసమే. చీకటిని వెన్నంటే వేకువ ఉందని చెప్పడానికి, మనిషిలో ఆశావహ దృక్పధాన్ని కల్పించడానికి, నమ్మిన నమ్మకాన్ని గెలిపించుకోవడానికి మనిషి నిరంతరం కాలంతో చేసే యుద్ధమే నాకు ఈ "సినీవాలి" లో కనిపించింది. మనకు రోజుకు ఇరవైనాలుగు గంటలు. ఈ ఇరవై నాలుగు గంటలు అనేవి ప్రతి మనిషి జీవితంలో ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తాయి. మార్పు అనేది మంచికైనా కావచ్చు లేదా ఓ మనిషిని అధఃపాతాళానికి పడదోయవచ్చు.
"లక్ష్యం అనేది ఎప్పుడూ ఎడారిలోని మరీచికే..
ఒక లక్ష్యం చేరిన తరువాత.. అక్కడ ఏముంటుంది? ఏమీ ఉండదు శూన్యం." ఇంత కన్నా బాగా విజయాన్ని, గెలుపుని ఎవరైనా చెప్పగలరా అనిపించింది ఈ నవల చదువుతుంటే.
కథానాయకుడు తను దర్శకత్వం వహించిన సినిమాకు ఆస్కార్ నామినేషన్లలో చోటు దొరికినందుకు ఆ ఫంక్షన్లో పాల్గొనడానికి బయలుదేరడంతో నవల ప్రారంభం అవుతుంది. ప్రతి మనిషికి జీవితంలో ఒక గమ్యం అంటూ ఉండాలన్న సందేశం కనిపించడంతో పాటు, అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కొన్ని కోల్పోవడాన్ని కూడా చూపిస్తుంది. మనిషి భయానికి లొంగితే ఆ భయమే మనల్ని ఎందుకు పనికిరానివాళ్లుగా ఈ సమాజానికి పరిచయం చేస్తుంది. డబ్బుల కోసమో, పేరు, ప్రతిష్టల కోసమో కాకుండా తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, సినిమానే తన ప్రాణంగా బతికే ఓ మధ్యతరగతి సగటు యువకుడు కథానాయకుడు. ఉన్నత చదువును, కుటుంబాన్ని వదిలేసి తనెంతో ప్రేమించి, ఆరాధిస్తూ తన ప్రాణంకన్నా మిన్నగా ఇష్టపడే సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను, కథ, కధనంతో పాటు దర్శకత్వంలో తనదైన ముద్ర వేయాలని తాపత్రయ పడే సినీ ప్రేమికుడిని సంపూర్ణంగా చూపించడంలో రచయిత కృతకృత్యులయ్యారు.
     సాధారణంగా మనం చూసే మూడు గంటల నిడివి గల సినిమా మన ముందుకు రావడానికి ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయో, ప్రతి ఫ్రేమ్ లోను ప్రతి ఒక్కరి కష్టం ఎంత ఉంటుందో కళ్ళకు కట్టినట్టుగా చూపించడం వెనుక సినిమా మీద రచయితకున్న ఇష్టం కాదు కాదు ఆరాధన అనే చెప్పొచ్చు అది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇరవై నాలుగు గంటల క్రాఫ్ట్ అనేది సినిమా కాదు జీవితానికి సరిపోయే పదం. ప్రతి రంగంలోనూ మంచి చెడు రెండు  ఉంటాయన్నది నిర్వివాదాంశం. మనిషికి రెండు పార్శ్వాలున్నట్లే ఏ రంగానికైనా ఇవి తప్పవు. కాకపొతే ఇంత విపులంగా లోపాలను అదీ తానెంతో ప్రేమించి ప్రాణంకన్నా ఎక్కువగా చూసుకునే సినిమా గురించి ప్రతి చిన్న విషయాన్ని పంచుకోవడమనేది ఏ కొద్దిమందో చేయగలరు. ఆ కోవలోని వారే ప్రభాకర్ జైనీ అని చెప్పడానికి ఎట్టి సందేహము లేదు.
       ఇక సినీవాలి గురించి చెప్పాలంటే సాధారణంగా మనకు తెలిసిన మోసాలు, ద్వేషాలే ఇక్కడా ఉంటాయి. సినిమా మీద అపారమైన ఇష్టం ఉన్న యువకుడు అన్ని వదులుకుని ఓ మూసలో కాకుండా ఏ అవార్డులు, రివార్డులు ఆశించకుండా తాను నమ్మిన విలువల కోసం సినిమా తీయడానికి పడిన పాట్లు, సంతోషం, బాధ, ఆకలి, కోపం, ఆవేశం, ఏడుపు ఇలా అన్ని సహజంగా చెప్పడం, మనుష్యుల్లో, మనసుల్లో కలిగే వికారాలు, వికృతాలు అన్ని మనకు కనిపిస్తాయి. చాలా మంది అనుకున్నట్టు దీనిలో శృంగారం, నేరాలు, ఘోరాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. దానికి రచయితను తప్పు పట్టనక్కరలేదు, నిజం చెప్పాలంటే మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. నిక్కచ్చిగా అన్ని నిజాలు రాసినందుకు.
" సినిమా అన్నది రంగుల ప్రపంచమే కానీ ఆ రంగుల ప్రపంచాన్ని సృష్టించడానికి ఎన్ని వందలమంది కృషి చేస్తారన్నది సామాన్య ప్రజల అంచనాకు చిక్కదు."  ఇదే నిజమని మనకూ తెలుసు. ఓ మూడు గంటలు సినిమా చూసేసి మనకిష్టమైనట్లు నాలుగు మాటలు సమీక్షగా రాసేసి చేతులు దులిపేసుకుంటాం. కానీ ఆ సమీక్షలు అనేవి కూడా ఇప్పుడు ఎంత అసహజంగా ఉంటున్నాయో మనందరికీ తెలుసు. మంచి చెడు బేరీజు వేసుకోవడంలో కాస్త నిజాయితీ, నిబద్దత చూపిస్తే చిన్నా, పెద్దా తేడా లేకుండా మన ముందుకు వచ్చే మూడు గంటల సినిమా వెనుక కష్టాన్ని గుర్తిస్తే మాట తూలడం చేయలేము. మన ఆదరణని బట్టే సినిమాలు తీస్తూ నాలుగు డబ్బులు రాబట్టుకోవాలనుకునే వ్యాపారులే ఎక్కువ ఈ రంగంలో కూడా. సగటు ప్రేక్షకుడిగా మనలో మార్పు వస్తే సినీ రంగమే కాదు ఏ రంగమైనా మంచి వైపుకే పయనిస్తుందనడానికి ఈ సినీవాలి ఓ సరికొత్త ఉదాహరణ.
   సినీ రంగంలో వాస్తవాలను ఒక్కటి కూడా వదలకుండా, దేనికి భయపడకుండా మంచి, చెడు ఉన్నదున్నట్టుగా నిజాయితీగా అక్షరీకరించిన ప్రభాకర్ జైనీ గారికి మనఃపూర్వక అభినందనలు.

13, సెప్టెంబర్ 2018, గురువారం

ఏక్ తారలు...!!

1.  జ్ఞాపకాలతో చెలిమి_యెాజనాల దూరాన్ని దగ్గర చేస్తూ....!!

2.  అల్ప సంతోషమనుకుంటా_అర్ధమయ్యి కాని అనుబంధాల నడుమ....!!

3.  అంతఃసౌందర్యాన్ని దర్శించిందేమెా మనసు_ఆత్మానందమే అలంకారమని తెలిసి....!!

4.  వెక్కిరింతలకు వెరవని జీవితమిది_ఊహలకు వాస్తవాన్ని వివరిస్తూ...!!

5.  ప్రణమిల్లుతోంది కాలం_గతమైన జ్ఞాపకాల ఘన చరితకు...!!

6.  అపరిచితమే ఎప్పటికీ_పరిచితమైన బంధమనిపిస్తూ....!!

7.   శూన్యరాగమూ సుమధురమే_నీ స్వరాన్ని తలిచినంతనే....!!

8.  సుతిమెత్తగా గుచ్చుతూనే ఉంటుంది_కలగా మెదిలే కాలపు కనికట్టులో పడవేసి...!!

9.   కొన్ని మనసులింతే_మౌనాల్లోనే మాటలల్లేస్తూ....!!

10.   రాహిత్యపు ఎడారిలో ఒయాసిస్సులు_మనసెరిగిన సాన్నిహిత్యం ఈ అక్షరాలే....!!

11.  అంతర్వాహినిగా మారాయి_అక్షరాలు అంతరంగపు ఆంతర్యాలై...!!

12.  పరిమళమంతా నీ చెలిమిదే_పలకరింపుల రాశుల్లో చేరినా...!!

13.   బాధను బంధిచడమే_మనసాక్షరాలకు మాలిమి నేర్పుతూ....!!

14.  మాధుర్యమంతా నీ మనసుదే_మరలని జ్ఞాపకమై మిగిలి..!!

15.  ఆవిష్కరణ అనివార్యం_మానసానికి మాటలొస్తే...!!

16.   పదాల పరవళ్ళకే సందడి_ఎదలను తాకిన భావుకతకు...!!

17.   అక్షరమంటే మక్కువెక్కువ_నేనన్నదంతా తానే నిండినందుకేమెా....!!

18.   పదాలన్ని పాతవే_నీ భావాల చేరికలో సరికొత్తగా కనిపిస్తూ....!!

19.   వెన్నెలకు వన్నె తెచ్చిన భావం_విరిసిన ముగ్ధత్వంలో...!!

20.  ఆర్ద్రమైనవి అక్షరాలు_మనసు భారాన్ని పంచుకుంటున్నందుకేమెా

21.  మరీచికలైనాయి అక్షర కవనాలు_అన్యాక్రాంతమౌతాయని భయపడి...!!

22.  భావనలన్నీ మనసు ఆలాపనలే_అక్షరాలకు ఆప్యాయతలనద్దేస్తూ...!!

23.   మృదు పద మంజీరాలే అన్నీ_ఎద చెలిమి చెలమలో....!!

24.   మనోభావనల మానసాక్షరాలు ఇవి_అపహరణలకు అందనివై..!!

25.  కొన్ని మనసులింతే_నిరాశను నెట్టేస్తూ ఆనందాలకు నెలవుగా నిలుస్తూ...!!

26.  గుండెల్లో దాగిన అక్షరాలు_గుంభనాన్ని వీడిన క్షణాలిలా...!!

27.   మార్మికతను అలవర్చుకున్న మౌనమిది_అప్పుడప్పుడు అక్షరాలకు మాలిమైపోతూ..!!

28.  గువ్వల్లా ఒదిగిన జ్ఞాపకాలు_గుట్టు విప్పిన అక్షరాల్లో...!!

29.  గురుతెరిగిన జ్ఞాపకమది_గుట్టు తెలియని గుండెను గదమాయిస్తూ...!!

30.   అర్ధం అయ్యే భావాలే అన్నీ_ ఆర్తిగా అల్లుకున్న అక్షరాల్లో....!!

5, సెప్టెంబర్ 2018, బుధవారం

వందనం గురువులకు...!!

ఆది గురువు అమ్మతో మెదలు... విద్యాబుద్దులు, జీవిత పాఠాలు నేర్పిన, నేర్పుతున్న ప్రతి ఒక్కరికి వందనాలు.. గురువులందరికి గురుపూజోత్సవ శుభాకాంక్షలు...

4, సెప్టెంబర్ 2018, మంగళవారం

పయనం...!!

పాత్రధారులుగా ప్రవేశించి
పాదచారులమై పయనిస్తున్నాం

గమనానికి దిశలను వెదుకుతూ
గమ్యానికై పరుగులు తీస్తున్నాం

పదబంధాలతో పలుకులు నేరుస్తూ
పలకరింపుల ప్రహసనాల్లో తేలియాడుతున్నాం

గతుకుల రహదారుల్లో పడిలేస్తూ
గాయాలకు లేపనాలద్దేద్దామని ఆరాటపడిపోతున్నాం

పోరాడాలని తపన పడుతూనే
గెలుపు దరిని చేరాలని ఉవ్విళ్ళూరుతున్నాం

జీవితానికి అర్ధాన్ని వెదుకుతూ
కాలంతో జత కలిపి కడ వరకు సాగిపోతూనే ఉన్నాం...!!

1, సెప్టెంబర్ 2018, శనివారం

బాల్య స్నేహం...!!

చిన్నప్పటి స్నేహం కల్మషం లేనిదని, అప్పటి మనసే ఇప్పటికి అదే ఆప్యాయతను కురిపిస్తుందని అనుభవించే మా మనసులకే ఆ సంతోషం తెలుస్తుందనుకుంటా. ఆఖరి బెంచ్ లో మనం ఆ చివర, ఈ చివరా కూర్చున్నా ఎప్పటికి విడిపోని మన స్నేహబంధం ఇదే కదా.... థాంక్యూ సో మచ్ డిజేంద్రా....

31, ఆగస్టు 2018, శుక్రవారం

అక్షరం - నేను....!!

నేస్తం,
       అమ్మతో మొదలైన అక్షర సహవాసం నన్ను ఇలా ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేయడం భలే బావుంది. అమ్మతోనూ, అక్షరాలతోనూ పెనవేసుకున్న ఈ అనుబంధం ఏ జన్మ పుణ్యమో మరి. ఊహ తెలిసినప్పటి నుండి అక్షరాలతో ఆటలు మొదలు. పెద్దలు చెబుతున్నట్టు భావాలు పంచుకోవడానికి ఏ లక్షణాలు తెలియని ఓ మామూలు అక్షర ప్రేమికురాలిని మాత్రమే. మనసుకు అనిపించిన భావాన్ని (బాధ, కోపం, సంతోషం ఇలా అది ఏదైనా కానివ్వండి) అక్షరాల్లో రాసుకుని మురిసిపోవడం అలవాటుగా కాదు కాదు ఆత్మానందంగా మారిపోయింది.
అక్షరంతో మనసు, మౌనం, బంధం, అనుబంధం, ఆవేశం ఇలా అనేక రూపాల్లో భావాలు పలికించడానికి నే చేస్తున్న చిన్న ప్రయత్నానికి అండగా నిలుస్తూ, పెద్దా చిన్నా తేడా లేకుండా నా అక్షర భావాలను అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.  _/\_  

చీకటి..!!

వేకువ పొడుపులు తెలియని
వెన్నెల అందాలు చూడలేని
వేవేల వర్ణాలన్నింటిని
తనలో ఇముడ్చుకుని
చీకటి చీరను చుట్టుకుని
వెలుగుకు తోడుగా తానుంటానని
స్నేహానికి మరో రూపమై నిలిచి
సుఖ దుఃఖాల సమ్మేళనాన్ని
జీవన్మరణాల సమతౌల్యాన్ని
అంతర్లోకాల పరిచయాన్ని
ఆనంద విషాదాల అర్ధాన్ని
మనసుల మౌనాన్ని చూడగలిగే
మరో ప్రపంచపు వెలుగురేఖగా మారి
శూన్యాన్ని సైతం సవాలు చేసేది
ఈ చిమ్మచీకటొక్కటే..!!

గుండెల్లో గోదారి.. సమీక్ష..!!

                                   జ్ఞాపకాల ప్రేమ పొంగుల వరద గోదారి ఈ గుండెల్లో గోదారి...!!

       మాడిశెట్టి శ్రీనివాస్ మనసుని పుస్తకంగా మలచి అక్షర నివేదనగా అందించిన ఈ " గుండెల్లో గోదారి.."  మనతో పంచుకున్న అనుభూతులను మనమూ ఆస్వాదిద్దాం.
      చివరి మజిలీ వరకు మదిలో భయంగా దాచిన భావాలను ఎంత ప్రేమగా చెప్పారంటే " నా గుండెల్లో పవిత్రంగా దాచుకున్న పాదముద్రలే నీవైనప్పుడు నువ్వెక్కడుంటే నాకేం" అంటూ గుండెల్లో దాచుకున్న జ్ఞాపకాల వరదను, ప్రేమగా గుండెల్లో దాచుకున్న గోదారిని అక్షరాల్లో అనుసంధానం గావించారు అద్భుతంగా. చెట్టుని చుట్టేసిన జ్ఞాపకం అంటూ వాడిపోనిది. వీడిపోనిది ఆత్మ బంధం, కలగా మిగిలే ఈ జ్ఞాపకం ఎన్నాళ్ళో అంటారు. ఘోష, నువ్వు - నేను చక్కని విరహ వేదన, ఆ(త్మ)బంధంలో దూరమైన అనుబంధాన్ని అటు నువ్వు, ఇటు నేను ఉన్నా కలిసే ఉన్న ఆత్మ బంధం అనడంలో ఓ చెమరింత మన మనసుకూ చేరుతుంది. చరమగీతంలో నిశ్శబ్దగీతాన్ని ఆలపించి దూరమైన ప్రేమని ప్రశ్నిస్తారు. ప్చ్.. కవిత తనతో లేని నేస్తం తనలోని జ్ఞాపకాలని కూడా పట్టుకెళిపోతే బ్రతుకు నిర్జీవ గోదారైనదని తనకెలా చెప్పనంటూ ఓ నిట్టూర్పు బాధగా వినిపిస్తారు. చివరి కోరికలో కలకాలం వెలివేయని జ్ఞాపకంగా నేస్తం గుండెలో తానుండిపోవాలన్న కాంక్షను బలంగా వినిపిస్తారు. వెన్నెల, దీపా(వేదనా)వళి.. కవితల్లో ఏ వెన్నెలవో అని అంటూ, దీపావళి దివిటీల్లో అమాస చీకట్లు నింపి ఎక్కడో వెలుగులు చిమ్ముతూ, విషాదపు చీకటిని తనలో నింపిందని అంటారు. ఆమె కవితలో తన నేస్తం లేని జీవితంలో తనకు ఆత్మ బంధువు మృత్యుదేవత అనడం ప్రేమకు పరాకాష్టగా అనిపించక మానదు. దూరం కవితలో దగ్గరకు రాలేని దూరాన్ని, జీవం లేని జీవితంగా మిగిలిన ఈ వెదుకులాట ముగిసేదెప్పుడని అడుగుతారు. తన "అలసిన గుండె" కోసం "కన్నీటి జ్ఞాపకమై" "నా కోసం నువ్వొస్తే " "నువ్వయ్యేంత" గా నే మరణించి నీలో జ్ఞాపకంగా ఉండిపోతానంటారు. కలలు కనే కళ్ళు తన గుండె మత్తుగా నిద్రిస్తూ గమ్మత్తుగా కలవరిస్తోందని పలవరింతలు మనకందించారు. నేనెవర్ని, చివరి పేజీ, వార్ధక్యం వాకిట్లో కవితల్లో తన ప్రేమనంతా అక్షరాల్లో వెదజల్లి గుండెల్లో కన్నీటి తడిని తుడిచేసుకుంటూ చరమగీతం పాడేసుకుంటూ మరణం కౌగిట్లో తల దాచుకుంటూ నేస్తం కోసం మిగిలిపోతాననడం ఎంత గొప్ప తాధాత్మ్యత. కలవరపాటు జీవితాన్ని చెలి తనకిచ్చిన వరమని జీవన సాగరంలో చెప్తారు. తెలీదు, నువ్వు, నేను - గులాబి, నాలో ని స్పర్శ వంటి కవితల్లో ఏమి తెలియని తనకు అన్ని తానైన నేస్తం దూరమైందని ఆ బాధను అక్షరాల్లో పలికించడంలో కృతకృత్యులయ్యారు. ఆఖరి క్షణం కవితలో చివరి కోరికలో కూడా తన ప్రేమను చెప్పడం చదివే అందరి మనసులను తడి చేయక మానదు. కనపడొద్దనీ కవితలో ఓ విషాదం, నిరీక్షణలో తన కోరికను, కాంక్షలో కాదనకూడదన్న ఆకాంక్షను, మనసులో భద్రంగా దాచుకుంటాను త్వరగా వచ్చేయమనడం, కరకు గుండెలో వెన్నెలవౌతావో, నిప్పుకణికవౌతావో ని ఇష్టం అంటూ నేస్తం పై తనకున్న ప్రేమను, ఆరాధనను చూపిస్తారు. ప్రతిబింబం, షరాబీ, నిష్క్రమణం, దూరం, గుండె కోత, నువ్వు - గులాబి, కాళీ మువ్వలు, గ్రహణం, కల, కన్నీటి జీవితం, జ్ఞాపకాల శవం వంటి కవితల్లో వేదనాభరితమైన ప్రేమ నివేదన కనిపిస్తూ వినిపిస్తుంది. అక్షరం చెప్పని భావం, మనసు విప్పని మౌనం, నాలో నిక్షిప్తమైన నీ జ్ఞాపకం అంటూ మనసు విప్పని మౌనం మనసును చూపిస్తారు. కల్లలైన కలలో ప్రేమ అలల గోదారి అలవికాని వేదనను అంతులేని రోదనలా వినిపిస్తారు. "మాటల్లేని మనసు" "విస్ఫోటనం" చెంది తన ఇవితంలో "వెలుగు దివ్వె"గా మిగిలిపోయిందంటారు. జీవచ్ఛవం, ఆల, రుధిర బాష్పం కవితలు విషాదాన్ని చూపిస్తాయి. జ్ఞాపకం కవితలో  అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నువ్వే నాలో ఓ తిరిగిరాని కడపటి కన్నీటి జ్ఞాపకమని హృద్యంగా చెప్తారు. "చివరి శ్వాస"తో మరణశయ్యపై నిరీక్షిస్తున్నా "వచ్చెయ్యి " అనడం, చివరి మాట నేస్తం అంటూ తన  "ఆక్రందన" వినమనడం, నేస్తం వచ్చి,వెళ్లి చేసిన "గారడి" ని మనసు అలజడిగా చెప్పడం, చక్కని ప్రేమ, విరహపు భావాలను సమపాళ్లలో అందించడంలో కవి భావుకత తెలుస్తోంది. "కన్నీటి మేఘం" అందించిన "విషాదానుభూతి" నా "కంటిపాప" లో చేరి "నీ నేను" గా "ముక్కలు కాని జ్ఞాపకం" గా మిగిపోవాలని తపన పడుతుంటే నేను "గుర్తులేని నువ్వు"  నీ జ్ఞాపకాల రుధిరంతో రాసిన "మరణాక్షర"మై "మృత్యు ముఖం" లో ఈ జన్మకింతే అని మరు జన్మలోనైనా "నువ్వంటే" ఎంత ప్రేమో చెప్పాలని ఎదురుచుస్తుంటా అంటారు. కన్నీటి బంధంలో జ్ఞాపకాల ప్రేమ ప్రబంధాన్ని, నాలోని నీ పాట కవితలో తనలోని ప్రేమ స్వరాక్షరం ఆమేనని చెప్పడం బావుంది. వరమిస్తావా, జీవన హోళీ కవితలు మదిలోని ప్రేమను ప్రేయసికి చెప్పడాన్ని చూపిస్తాయి. "నాకు తెలుస్తూనే ఉంది" నువ్వు వచ్చినా "మౌనం" అంటే మనిద్దరమని ప్రేమను సరికొత్తగా చెప్పడం చాలా బావుంది. సెల్ఫీ, నీకై, అందని పిలుపు, గుండెల్ని కెలికే జ్ఞాపకం, ముల్లు, ఆలశ్యం కవితలు మనసును కలవర పరిచే భావాలైనా బావున్నాయి చదవడానికి. ఈ కవితలన్నీ ప్రేమ పొంగుల,పారవశ్యాల, ప్రణయ కావ్యాల, వరద పొంగుల, హృదయ నాదాల, మోదాల, ఖేదాల "గుండెల్లో గోదారులు".
     ఇక అనుభూతుల గోదారిలో అమ్మకు ప్రేమతో, నాన్నతో సెల్ఫీ, నీ నేను, వంటిల్లు, మేరుబతుకు, బతుకు చిత్రం, కరిగిన శి(క)ల, ఆమె, స్నే(హి)హత్వం, ఒంటరి బాల్యం, భార్య, మానవతాశిల్పం, రంగుల కల ఈ కవితలన్నీ తన కుటుంబపు అనుభవాలను తనవైనా అక్షరాల్లోకి అనువదించి తనలోని ఆత్మీయతను, అభిమానాన్ని, అనుబంధాలకు ఇచ్చే విలువను చూపించారు. జీవిత గమ్యాన్ని, గమనాన్ని కూడా సూచాయగా చెప్పారు.
    జీవితం అంటే ప్రేమ, అనుబంధం, అభిమానం, విరహం, వేదన, నిరీక్షణ ఇలా అన్ని అనుభూతుల ప్రణయ ప్రబంధ కావ్యమని మాడిశెట్టి శ్రీనివాస్ " గుండెల్లో గోదారి " లో తన గుండె గొంతుకను అందరి గుండె చప్పుడుగా చక్కని భావాలతో అందించారు. అలతి పదాల అక్షర గోదారి "గుండెల్లో గోదారి.." కి హృదయపూర్వక అభినందనలు.

30, ఆగస్టు 2018, గురువారం

ఏక్ తారలు...!!

1.   మౌనానికి పర్యాయపదాలే అన్నీ_పరిభాషలెన్నున్నా పలుకు నేర్వలేక...!!

2.  వర్ణమాలకెన్ని వంపులో_ఒయ్యారంగా భావాలై ఒదిగిపోతూ...!!

3.  తప్పని నటనలు_నిజం కాని అనుబంధాల నడుమ...!!

4.  మౌనాక్షరాలే ఆలంబన_మనసును పరిచే భావాలతో కలిసి...!!

5.  పదము అప్పటిదే_దగా పడిన అక్షరానికి ఊతమై ఇప్పటికీ..!!

6.  మార్పు సహజమే_ఆస్వాదన మనసుదైనప్పుడు.....!!

7.  కలిసుండే ఆప్తులం మనం_కనపడని మనసుతో మాటాడుకుంటూ...!!

8.  మనసు ముచ్చట్లన్నీ మనవే_మౌనానికి తావీయక...!!

9.   ఆకలి నేరం కాదెప్పుడు_ఆశలే అధ:పాతాళానికి నెట్టేస్తూ...!!

10.  జన్మల బంధాలై జత చేరుతున్నాయి_ఎంత పంచుకున్నా తరగలేదనేమెా....!!

11.   మరలి పోయిన కాలపు గాలానికి చిక్కేవి_మలి వయసులో మధుర జ్ఞాపకాలు..!!

12.  మనసుకంతా నిండుదనమే ఎప్పుడూ_అక్షయమైన అక్షర భావాలతో...!!

13.   నిన్నలన్నీ నాతోనే_నువ్వు లేని వాస్తవాన్ని త్యజిస్తూ... !!

14.  ఆత్మీయతలు దగ్గరైయ్యాయి_వాస్తవాలకో రూపునిస్తూ....!!

15.  నిదురలోనే మెలకువ_నీలినీడలకో ఆకృుతినిచ్చే వేకువతో చేరితే...!!

16.  కొన్ని కన్నీళ్ళంతే_ఆనంద విషాదాలకు నేస్తాలుగా మిగిలిపోతూ...!!

17.   కొన్ని సంతోషాలంతే_విషాదాలకు విరుగుడుగా మిగులుతూ....!!

18.   కొన్ని సాయంత్రాలింతే_సంద్రానికీ సందడి నేర్పేస్తూ...!!

19.   కొన్ని రాతిరులంతే_రెప్పలిప్పని కలలలో దాగుండిపోతూ...!!

20.   కొన్ని మౌనాలింతే_మాటలక్కర్లేకుండా మనసు తెలుపుతూ...!!

21.  కొన్ని మౌనాలింతే_మాటలకందకుండా...!!

22.   పలుకులన్నీ మధురాలయ్యాయి_మౌనాలద్దిన నవ్వుల్లో చేరి...!!

23.   భావాలై మురిపిస్తున్నాయి_అక్షరాలకు వన్నెలద్దుతూ...!!

24.   చిత్తరువు సజీవమైంది_మనసుతో గీసినందుకేమెా...!!

25.  మది మౌన విపంచిగా మారింది_మరబొమ్మగా మారిన క్షణాలను తలపోస్తూ..!!

26.   అలుపెరగని అల అంతరంగం_తీరాన్ని చేరాలన్న ఆరాటంతో...!!

27.  అంతర్లోచనాల అవలోకనం_మనసు అవగతమైతేనే..!!

28.   చిత్తరువు భావచిత్రమే_చిత్తపు రాతలకి...!!

29.   రెప్పపాటు జీవితమిది_క్షణాలకు చిక్కని కాలాన్ని వెంటేసుకుని...!!

30.   క్షణంలో అనంత విషాదమౌతుంది_రవ్వంత అపశృుతి దొర్లినా...!!

23, ఆగస్టు 2018, గురువారం

అసలైన ఆనందం...!!

నేస్తం,
         అసలైన ఆనందం అంటే ఏమిటని ఓ సందేహం వచ్చింది. మానసికమైన సంతృప్తికి మించిన ఆనందం ఈ సృష్టిలో మరేది లేదని అనిపించింది. ఈ మానసిక తృప్తి అనేక రకాలుగా మనిషిని ఉల్లాసపరుస్తుంది. అది ప్రేమ, ఆత్మీయత, అభిమానం ఇలా అనేక రూపాల్లో మనుష్యుల నుంచి మనసులకు చేరుతుంది. కొందరికి ఎంత డబ్బు ఉన్నా సంతోషం ఉండదు, ఇంకా దేనికోసమో ఆరాటపడుతూ, పరుగులెడుతూనే ఉంటారు. రోజు కూలీ చేసుకునే వాళ్ళు హాయిగా బతుకుతుంటారు. తేడా ఉన్న వాడికి ఇంకా సంపాదించాలన్న కోరిక, లేని వాడికి ఆ పూట గడిస్తే అదే పరమానందం.
        ఆధ్యాత్మిక వాదులు ఆత్మానందమే పరమానందమని అంటారు. నాలాంటి భౌతిక వాదులు మనం ఈ ప్రపంచంలో పుట్టినందుకు మన బాధ్యతలను మరువకుండా, చేసే పనిలో దైవత్వముందని నమ్ముతూ, నలుగురికి మంచి చేయక పోయినా పర్లేదు కానీ ఒక్కరికైనా మన వల్ల చెడు జరగకుండా ఉంటే చాలనుకుంటాం. మనకున్నది చాలనుకుంటూ ఉన్నదానితో సంతృప్తిగా బ్రతికేవాళ్లు ఈ రోజుల్లో దుర్భిణి వేసి వెదికినా దొరకడం చాలా కష్టం. ఒకటి ఉంటే మరొకటి లేదని బాధ. ఆశకు అలవాటు పడిపోయిన మానవ జన్మలు మనవైపోయాయి.
     సమస్యలు ప్రతి జీవికి సహజం. వాటికి తలొగ్గి, మనకున్న కాస్త సమయాన్ని అసంతృప్తికి హారతిగా ఇచ్చేస్తూ మానసిక వికాసాన్ని కోల్పోతూ, మనదైన జీవితానికి సంతోషాన్ని మనమే దూరం చేసుకుంటూ, అన్ని ఉన్నా ఇంకా ఎదో లేదని వాపోతూ అసలైన సంతోషాన్ని దూరం చేసుకుంటున్న దురదృష్టవంతులమై పోతున్నాం. సంతోషం అనేది ఎక్కడో ఉండదు, మన మనసులోనే, మనతోనే ఉంటుంది. మనలోనే నిద్రాణమై ఉన్న మానసిక సంతృప్తిని తట్టిలేపి  అసలైన ఆనందానికి నెలవులుగా మనలను మనమే తెలుసుకున్న రోజు ప్రతి ఒక్కరు పరమానందభరితులే ఈ ప్రపంచంలో. 

14, ఆగస్టు 2018, మంగళవారం

మరో స్వరాజ్యమెప్పుడో..!!

స్వరాజ్యమా నువ్వొచ్చావట
నీ చిరునామా కాస్త చెప్పవూ

రాజకీయాల మత మౌఢ్యాల
గుప్పిళ్ళలో దాగున్నావా

కులాల కార్చిచ్చుల్లో పడి మగ్గుతూ
అస్పృశ్యతకు అందుబాటులోనున్నావా

మువ్వన్నెల రంగులకు ముక్తాయింపుగా
గగనానికి ఎగురుతున్న సీతాకోకచిలుకల్లో చేరావా

మూడుకాళ్ళ ముదుసలివైనావని చేష్టలుడిగి మంటగలుస్తున్న మానవత్వంలో దాగుండిపోయావా

తరాలు మారుతున్నా తరగని
అంతరాల నడుమ తల వంచుకుంటున్నావా

రెపరెపలాడుతున్న ఆశల రెక్కల్లో
వెతికి వెతికి వేసారిన జీవితాలకు మరో స్వరాజ్యమెప్పుడో..!! 

12, ఆగస్టు 2018, ఆదివారం

ఏక్ తారలు...!!

1.   అవుననక తప్పదు మరి_మాటనో మౌనాన్నో మన్నించి...!!

2.  మన్నింపు అలంకారమే మదికి_రాలిన జ్ఞాపకాల్లో మౌనం నిక్షిప్తమైతే...!!

3.  అనుబంధమెప్పుడూ ఆనందమే_జ్ఞాపకాల స్పటికాలు పగలనంత వరకు..!!

4.  తుడవనలవి కాని తడే_ఈ తడియారని స్వప్నాలన్నింటా ...!!

5.  కలతాక్షరాలు అక్షయమైనాయి_మనసు కన్నీళ్ళలో తడుస్తూ...!!

6.   మనోనేత్రం ఎర్రనైంది_గాయం జ్ఞాపకాల రుధిరాన్ని స్రవిస్తుంటే...!!

7.   శిలాక్షరమై నిలిచిందో చరిత_నిలువెత్తు వ్యక్తిత్వానికి నిదర్శనంగా...!!

8.  కలలో వర్షమనుకున్నా_కన్నీరొలికిందని తెలియక...!!

9.   మౌనానికి మాట ఇవ్వలేను_గాయాలను పలకరించనని...!!

10.   గురుతుకెలా తెలిసిందో_తన నివాసం నీలోనేనని....!!

11.   మౌనం చెప్పినట్టుంది మనసుకి_గుంభనంగా జ్ఞాపకాలనుంచాలని...!!

12.   అక్షరాలు కొన్నే_మనోభావాలకు అద్భుత రూపాన్నిస్తూ...!!

13.  ఆత్మావలోకనంకి ఆసరా_ అవుతున్నాయి ఈ అక్షర విన్యాసాలే...!!

14.    అరచేతిలో ఆకాశమే_అక్షర లక్షల ఆనందానందిస్తూ...!!

15.  నీకు నాకు మధ్యన దూరమెక్కువైందట_భావాలు అలసి సోలిపోతున్నాయి...!!

16.  చిరునవ్వు సౌకుమార్యమదేనేమెా_ఒంటరితనానికి ఓదార్పౌతూ...!!

17.  అపహాస్యానిదే పైచేయి_మనతోనున్న అద్భుతాన్ని గుర్తెరగనీయక...!!

18.   అక్షరాలు అందమైనవే_నిన్ను తమలో ఆవాహన చేసుకున్నందుకు...!!

19.   కలమెులికించే సిరాదేముంది_మనసులో భావం నీవైతే....!!

20. మది రహస్యాలే స్వప్నాలై మురిపిస్తాయి_చెంత చేరక ఏడిపిస్తాయి కూడా...!! 
21.   భావాలెప్పుడూ అంతర్ముఖాలే_అప్పుడప్పుడూ మెరిసిపోతూ...!!

22.  బంధనాలు వీగిపోతుంటాయి_ఊహకు వాస్తవానికి లంకె కుదరనప్పుడు....!! 

23.   బంధాలకు బాధ్యతలెక్కువ_ఊహలను వాస్తవాలు కానీయవు...!!

24.   చిరునవ్వు చిరకాలముంటుంది_భావాలకు ఊతమిస్తూ...!!

25.  చిందరవందరగా చుట్టుకున్నాయి భావాలు_అక్షరాల అల్లిక నుండి రాలేక...!!

26.   వసంతం విలువ తెలియాలనేమెా_వత్సరానికొకటిగా బుుతువులనిస్తూ...!!

27.   తప్పని నయగారాలే అవి_బందుత్వపు బందిఖానాలో...!!

28.   అలక తీర్చింది భావాలే_మనసాక్షరాలను ఊరడిస్తూ...!!

29.  మనసైన భావాలు చేరువనే ఉన్నాయి_అక్షరానుబంధాన్ని అంటి పెట్టుకుని....!!

30.   మది అలజడికి అంతరాయమే_చిరునవ్వుల మెరుపులతో...!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner