19, ఫిబ్రవరి 2018, సోమవారం

త్రిపదలు....!!

1.  కొన్ని మౌనాలింతే
కనులతో మాటాడేస్తూ
మనసును పరిచేస్తూ.... !!

2.  పంజరం నుండి పయనం
వింతల పుంతల విశ్వంలోనికి
స్వేచ్ఛా విహంగాలై...!!

3.  చీకటి రంగును పులుముకుంటూ
వెన్నెల వర్ణానికి అడ్డుపడాలని
గ్రహణపు ప్రయత్నమే ఎప్పుడూ...!!

4.  మూసిన రెప్పల చాటున
రాలిన స్వప్నాలను
మెలకువలోఏరుకుంటున్నా...!!

5.   తప్పని పరిస్థితిలో
నెలవు వదలిన చినుకు
అన్యాక్రాంతం కాబోయింది

6.  అక్షరాలెలా ఒంపులు తిరుగుతున్నాయెా చూడు
నీ చేతిలో చిక్కినందుకేమెా
ఇలా నవరసాలొలకబోస్తున్నాయి...!!

7.  మనసును దాయలేనివి
నా అక్షరాలు
మౌనానికి మాటలు నేర్పుతూ....!!

8.  తల్లడిల్లే తలపులు
మది వాకిట నిలిచినా
అక్షరాలకెంత ఆదరణో అక్కునజేర్చుకోవడానికి...!!

9.  ఆశల విహంగాలకు
ఆశయాల ఊతమిచ్చి
ఆచరణలో పయనించేదే కవి(త)త్వం...!!

10.  అక్షరం ఆకర్షిస్తోంది
భావాలతో అలంకరించుకుంటూ
భాషకు వన్నెలద్దుతూ...!!

11.  ప్రేమలేఖ పలకరించిందేమెా
మదిలోని సంతసాలు
చిరునవ్వుల దోబూచుల్లో...!!

12.   నా అక్షరాలింతే
మనసుని తడిమి వస్తాయి కదా
ఎప్పుడూ తడిగానే ఉంటాయి..!!

13.   నా రాతలింతే
ఓటమి వద్దంటూ
గెలుపు మైత్రిని ఆహ్వానిస్తాయి...!!

14.  పాత అనుభవమే కాని
సరి కొత్తగా రాసేందుకే
ఈ అక్షర విన్యాసం...!!

15.   కొన్ని అక్షరాలంతే
కాగితమ్మీద జారిపోతుంటాయి
మనసుని పరిచేస్తూ... !!

16.  కొన్ని పలకరింపులంతే
భావాలను పంచుకుంటాయి
మనసుకు దగ్గరౌతూ..!!

17.   కొన్ని దరహాసాలంతే
సజీవమై నిలిచిపోతాయి
దశాబ్దాలు గడచినా....!!

18.  కొన్ని అభిమానాలంతే
అల్లుకుపోతుంటాయి
ఆసరాగా నిలుస్తూ...!!

19.   అమ్మలాంటిదే అక్షరం
ఆత్మీయంగా అల్లుకుంటూ
మనసుని మురిపిస్తుంది...!!

20.   అక్షరంలో నీ మనసు
అద్దంలా అగుపడుతోంది
చదవనవసరం లేకుండా...!!

21.  కొన్ని జ్ఞాపకాలనంతే
మనతోపాటు తీసుకుపోతూ
కాలానికి అనుసంధానం చేసేస్తుంటాం...!!

22.  మనసాక్షరాలైనందుకేమెా
మానసాలను కొల్లగొడుతూ
పదవిన్యాసాలు అంబరాన్నంటుతున్నాయి...!!

23.   లలాట లిఖితమైనందుకేమెా
అర్ధమయ్యి కాకుండా ఆటలాడుతోంది
ఎన్నిసార్లు వల్లె వేసినా...!!

24.  నన్ను నేనే మలుచుకుంటున్నా
ఉలి దెబ్బలతో దేహాన్ని
రాతిలోని మనసును రాతలో చూపించాలని..!!

25.   కొన్ని బాధ్యతలంతే
బంధాలకు బంధీలై
జీవించేస్తాయి కడవరకు...!!

26.   సహనమూ శాపమేమెా
ఆశనిరాశల నడుమ
ఎటూ తేల్చలేని సందిగ్ధావస్థలో...!!

27.   అముద్రితమైనా
అక్షయమైన భావనల
కలబోతే కదా మనసాక్షరాలు....!!

28.   కలత మేఘం మిగిలింది
కల్లలైన కలలకు
ఓదార్పు వెతుకుతూ...!!

29.   మనసు గానమే
నిరంతరం
సరిగమలు నేర్వకున్నా....!!

30.  మనసు...
పంచుకున్న మౌనాల
అక్షర సమాహారం...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner