6, మే 2018, ఆదివారం

యాతన నవలా సమీక్ష...!!

   గోదావరి యాజమాన్యానికి,  ప్రతాప్ కత్తిమండ గారికి,  సాగర్ శ్రీరామ కవచం గారికి నా మన:పూర్వక ధన్యవాదాలు... 

                                         
       ఓ మనసు తపన ఈ "యాతన"
                                   
                     కొన్ని పుస్తకాల గురించి చెప్పాలి అంటే ముందుగా మనని మనం తెలుసుకోవాలి. శ్రీరామ కవచం సాగర్ నవల యాతన చదువుతుంటే నాకు కలిగిన అభిప్రాయం ఇది. యాతన నవల నవలా రచనలోనే ఓ విన్నూత్న ప్రక్రియ.  రచనా ప్రపంచంలో విలక్షణమైన శైలితో, ఎవరు ఇప్పటి వరకు సాహసించని వస్తువుతో యాతన నవలను అందించిన సాగర్ శ్రీరామ కవచంకి హృదయపూర్వక అభినందనలు.
                      మనసు పిచ్చిది కానివ్వండి, మంచిది కానివ్వండి ఓ మనసు తపనే నాకు ఈ "యాతన" నవలగా అనిపించింది.  ఓ పిచ్చివాడి మతి భ్రమణం వెనుకనున్న గతానికి వర్తమానానికి సంబంధించిన ఆలోచనల అంతర్నేత్రం నాకు ఈ యాతన నవలలో కనిపించింది. కథానాయకుడు పిచ్చివాడైన ఓ లాయర్, రచయిత కూడానూ. ఆస్తులను పెంచుకోవడానికి భార్య, బావమరిది మోసం చేస్తున్నారని, తన చుట్టూ ఉన్నవారిలో ఎవరిని నమ్మాలో తెలియని స్థితిలో ఉంటూ, ఇంటితోను, తోటతోనూ తనకున్న అనుబంధాన్ని తెంచుకోలేక తనలో తానూ మధనపడుతూ, మరో మనిషిగా మారినట్లు ఊహించుకుంటూ అందరికి పిచ్చివాడుగా కనిపిస్తాడు.
                     ఈ నవల మొత్తం మనకు పిచ్చివాడైన కథానాయకుడే చెప్తాడు.  సాగర్ శ్రీరామ కవచం తీసుకున్న కథావస్తువే విలక్షణమైనది. ఇప్పటి వరకు ఎవరు రాయడానికి సాహసించని కథావస్తువు. తక్కువ పాత్రలతో కథను, కథనాన్ని సాగించిన తీరు, భాష మీద ఆయనకున్న పట్టు, చెప్పన జీవిత సత్యాలు ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉంది. మనకు తారస పడిన ఎందరివో జీవితాలను, మరణాలను కూడా మనం ఈ యాతనలో స్పష్టంగా చూడగలం. నా నలభై ఏళ్ళ పుస్తక పఠన చరిత్రలో ఇలాంటి నవల చదవడం ఇదే మొదటిసారి. చదవడం మొదలు పెట్టినప్పుడు ఇలా వుందేంటి అనుకుంటూ మొదలు పెట్టాను, కాని చదవడం అయిన తరువాత కొన్ని రోజుల వరకు ఈ పాత్రలు, సన్నివేశాలు కళ్ళ  ముందు కదలాడుతూ నా చుట్టూనే తిరుగుతున్నాయి. చాలా చోట్ల రచయితే కథానాయకుడిలో కనిపించారు.
                         ఓ పిచ్చివాడి మనసు మాటలతో మొదలై ఆ పిచ్చితనంతోనే ముగుస్తుంది ఈ యాతన నవల. సహజ సంభాషణలతో నిండిన యాతనలోనికి తొంగి చూస్తే ముందుగా ఆ యాతన పడే మనిషి మనకు కనిపిస్తాడు. పిచ్చివాడో, మామూలు మనిషో మనకు అర్ధం కాదు. తన పేరు కాని, తనకు ఇష్టంలేని ఇంట్లోవాళ్ళ పేర్లు కాని చెప్పడు చివరి వరకు. తనని అందరు పిచ్చివాడని అంటున్నా తాను లాయర్నని మర్చిపోడు. తనలోని మానవత్వాన్ని మరిచిపోడు. తన స్నేహితుడు దొంగ జగ్గడితో మాత్రం తన ఆలోచనలన్నీ పంచుకుంటాడు. సమాజంలో తరిగిపోతున్న విలువలను కడుపుతోనున్న గుడ్డలమూట పిచ్చిదానిలో చూపిస్తూ ఆ అమాయకురాలి స్థితికి సమాజంలోని మన దిగజారుడు తనాన్ని ప్రశ్నిస్తూ ఆమెను ఆదుకోవడంలో కొందరిలోనైనా మిగిలున్న మంచితనాన్ని చూపిస్తారు. ఆ పిచ్చి అమ్మాయిని వెదుక్కుంటూ వచ్చిన తల్లిద్రండ్రులను, సమాజంలో మరికొంతమందిని మనకు పరిచయం చేస్తారు. రోజువారి జీవితంలో పిచ్చితనానికి దక్కే బహుమానాలు, చివాట్లు, రకరకాల మాటలు అన్ని మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తారు. తన ఇంటిని పడగొట్టి అపార్ట్మెంట్ కట్టడానికి భార్య, బావమరిది చేసే ప్రయత్నాలను, ఇంటి మీదున్న మమకారానికి తనలోని మరో మనిషి పడే తపనను చాలా హృద్యంగా చెప్తారు. గుడ్డల మూట అమ్మాయి కవల పిల్లలని కన్న తరువాత ఆ పిల్లలను చూడటానికి తన స్నేహితులను " మా తోటలో నిర్మాణమై వున్న పూతీగల, పూశోభల మహా ప్రసూతి గృహం లేదూ మహా పల్లవ మనో రంజిత కుసుమ ప్రసీద కుటీరం అనండి, అభ్యంతరం లేదు, మా మనోవల్మీకంలోకి అడిగిడే ప్రసూన పారిజాతంను వీక్షించటం అనే బరువైన పదం వాడను గాని ఆ పసి కూనలని అంతకంటే గొప్ప పసివాళ్ళగా చూసి తరించే మహాదృశ్యం లోకి మా కాళ్ళు లాక్కుపోయాయి. " ఈ ఒక్క సన్నివేశం చాలు తెలుగు భాషని, భాషలోని పదాల సొగసులని చెప్పడంలో ఎంత నేర్పు ఉందో.
         తన ఆలోచనలను డైరీలో రాసుకోవడం, పాతకాలపు ఇంటిని, ఆ జ్ఞాపకాలను డబ్బు కోసం వదలలేని మనిషి ఆఖరికి తనవాళ్లు చేసిన మోసంలో ఆ ఇంటిని కోల్పోవడం అక్కడో పెద్ద అపార్ట్మెంట్ వెలవడం, దాన్ని చూస్తూ భోరున విలపించడం, తన ముంగిపును తనే చెప్పుకోవడం  అన్నది ఈ యాతనలో మాత్రమే సాధ్యం. ఓ మనిషి పిచ్చివాడుగా మారటానికి, జీవితంలో ఓడిపోవడానికి గల ఎన్నో కారణాల్లో ఒక కారణాన్ని ఈ నవలలో మనం చూడొచ్చు. ఇది ఒక మనిషి లేదా ఒక పిచ్చివాడి యాతన కాదు ఈ సమాజానిది అని రచయిత నొక్కి వక్కాణించారు.
      ఇలా చెప్పుకుంటూపోతే నవలకన్నా సమీక్ష పెద్దదై పోతుంది. చివరగా జీవితానికి చెప్పిన నిర్వచనంతో ఈ సమీక్షను ముగిస్తాను. " జీవితం అంటే ఓ ద్వారం తెరిచి మరో మూసుకుపోయిన ద్వారం ముందు అన్ని చలి నెగళ్లు పేర్చుకుని ఓ శ్వేత కపోతంలా రాలిన కాలాన్ని దాచి దాని కఠినతను నిందించడమే జీవితం. "
చావుని తల్చుకుంటూ అంతా ఓ యాతన .. ఓ మగత అంటూ ముగిస్తారు.
      ఓ మనిషి మనసు నుండి అమృతమే పుడుతుందో లేదూ హాలాహలమే జనియిస్తుందో మనం ఎవరమూ చెప్పలేము. ఎవరి యాతన ఎలా ఉండబోతోందో అన్నది కాలం చేతిలోనే ఉందని అనిపిస్తుంది. ఓ మనిషి మనసు పడే తపనే ఈ యాతనగా మారి సమాజాన్ని సమాధానం లేని ప్రశ్నగానే మిగిల్చేస్తుందేమెా. పిచ్చితనమో, జ్ఞానమెా, వైరాగ్యమో, తాత్వికతో, మరింకేదైనానేమో ఏం ఉందో నాకు తెలియదు కాని కాస్త మనసు పెట్టి చదివితే మనలో కూడా ఈ యాతనే ఉంటుందని మాత్రం చెప్పగలను. నా నలభై ఏళ్ళ పుస్తక పఠనంలో నేను చదివిన ఓ గొప్ప నవల యాతన అని చెప్పడంలో ఎట్టి సందేహం లేదు. ఇంత గొప్ప పుస్తకాన్ని అందించిన సాగర్ శ్రీరామ కవచంకి మరోసారి అభినందనలు.
     

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner