26, మే 2018, శనివారం

సంతోషం...!!

నా అక్షరాలకు లభించిన మరో అదృష్టం రామానుజం మాస్టారు రాసిన ఈ మాటలు. చిన్నప్పుడు చూసినా నేనెవరో గుర్తు లేక పోయినా నా రాతలు చదివి వారు పంపిన ఈ అభినందన నా సంతోషానికి అవధులు లేకుండా చేసింది. ఓ చిన్న మెచ్చుకోలుకే బోలెడు సంతోషపడిపోతాము. అలాంటిది ఇంత ఓపికగా మాస్టారు రాసిన అభిప్రాయం చదివి భలే ఆనందంగా ఉంది. ఏదో అనిపించిన నాలుగు అక్షరాలు రాసుకునే నాకు ఇంతటి మహద్భాగ్యాన్ని అందించిన రామానుజం మాస్టారికి నా మనఃపూర్వక వందనాలు... 

25, మే 2018, శుక్రవారం

కలల కళ్ళ కథ...!!

చేజారిన ఆశలు 
చెమరింతలై చేరగా

రాలిపడిన కన్నీళ్ళు
విగతజీవులై మారగా

విషాదమెరుగని ఊహలు
విషన్నవదనమై మిగలగా

మౌనం చెప్పని మాటలు
మనసులపై లిఖించగా

కాలం మిగిల్చిన గాయాలు
గతకాలపు ఆనవాళ్ళై నిలవగా

విసిరేసిన జ్ఞాపకాలు
వరాలై కలలలో సేదదీర్చునేమెా...!!

మన్నెం శారదగారి చిత్రానికి నా రాత.. ధన్యవాదాలు శారద గారు.  

యద్దనపూడి సులోచనారాణికి అక్షరాంజలి....!!

                                    
    శతాబ్దాల తెలుగు సాహితీ చరిత్రలో రారాణి, నవలారాణి సులోచనారాణి అనడంలో అతిశయోక్తి లేదు. అక్షరాలతోనే అందరిని ఆకట్టుకున్న అద్భుత ప్రతిభాశాలి. కుటుంబ విలువలు, ఆప్యాయతలు, మధ్య తరగతి జీవితాలు, సమాజపు అంతరాలు, యువత కర్తవ్యం ఏమిటి, ఇలా మన చుట్టూనే ఉండే ఎన్నో జీవితాలను మన కళ్ళ ముందుకు తెచ్చి మనలో ఎన్నో ఆలోచనలను రేకెత్తించిన అక్షర బాంఢాగారం యద్దనపూడి సులోచనారాణి. 1939 ఏప్రియల్ రెండున కృష్ణా తీరాన కాజ గ్రామంలో పుట్టారు. మొదట్లో చిన్న కధలు రాసారు. తొలి నవల సెక్రెటరీతోనే ఓ కొత్త ఒరవడిని తెలుగు నవలా సాహిత్యంలో నెలకొల్పారు. 

     నా చిన్నప్పుడు ఏడేళ్ల వయసులో ఆంద్రజ్యోతిలో నే చదివిన మొదటి సీరియల్ రాధాకృష్ణ. అతి సాధారణ పల్లె జీవితాల నుంచి మొదలుపెట్టి ఓ కుటుంబంలో ప్రేమలు, ఆప్యాయతలు, అభిమానాలు, కోపాలు, ద్వేషాలు ఇలా అన్ని కోణాలను సమపాళ్లలో చూపించడం ఆమెకే చెల్లింది.  యుక్త వయసు అమ్మాయిల కలల రాకుమారుడు ఎలా ఉంటాడో, మధ్య తరగతి అమ్మాయి వ్యక్తిత్వం ఎలా ఉండాలో, బాధ్యతలను, బంధాలను ఎలా పంచుకోవాలో మనసులకు హత్తుకునే విధంగా చెప్పడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. నే చదివిన రాధాకృష్ణలో చిన్నప్పటి అల్లరి, ఆకతాయితనం, కల్మషం లేని పసితనపు చిలిపితనం  ఎలా ఉంటుందో రాధలోను, కృష్ణలోనూ మన చిన్నతనం కూడా ఇదేనేమో అన్నంతగా లీనమై పోతాం. చిన్ననాటి అనుబంధమే ఇరువురిలో ప్రేమగా రూపొంది మలుపులు తిరిగిన ఆ వలపు ఎలా ముగిసిందన్నది ఆ నవలను శోభన్ బాబు, జయప్రద జంటగా అదే పేరుతొ సినిమాగా తీయడం అది విజయాన్ని సొంతం చేసుకోవడంలోనే ఆమె నేర్పరితనం తెలుస్తుంది. అందరికి తెలిసిన ఆమె తొలి నవల సెక్రెటరీ సినిమాగా రూపొంది ఎంత టి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నది మనందరికీ తెలిసిందే. మరో నవల సినిమాగా మారిన అగ్నిపూలు ప్రేమ, పగ సమపాళ్లలో చూపిస్తూ ద్వేషాన్ని ప్రేమగా మార్చడం, అమెరికాలో పుట్టిన పిల్లల తీరుతెన్నులు అప్పటి రోజుల్లోనే మనకు సవివరంగా చూపించారు. నాకు బాగా నచ్చిన మరో నవల ఈ దేశం మాకేమిచ్చింది. దీనిలో మనకు సమాజం, దేశం ఏమిచ్చింది అని కాకుండా మనం ఈ దేశంలో పుట్టినందుకు మనం సమాజానికి కాని, దేశానికి కాని ఏమి చేశామని ప్రశ్నిచుకోమని చెప్పడంతో మనలో కర్తవ్యాన్ని మేల్కొల్పుతారు. ఆ రోజుల్లో ఒక నవల రెండు భాగాలుగా రావడం అనేది యద్దనపూడి గారి అక్షర విన్యాసం చేసిన మరో అద్భుతమని చెప్పాలి. సినిమాగా కూడా రూపొందించిన మీనా నవల రెండు భాగాలు మన అందరికి సుపరిచితమే. గిరిజా కళ్యాణం, జీవన తరంగాలు, ప్రేమలేఖలు, విచిత్రకుటుంబం, బంగారు కలలు, జై జవాన్, ఆత్మ గౌరవం వంటి సినిమాలుగా మారిన నవలలు ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయో మనందరికీ విదితమే. 
             ఋతురాగాలు టి వి సీరియల్ గురించి చెప్పనవసరం లేదు. రెండో భాగం కూడా రావడంతోనే ఆమె రచనా పఠిమ ఏమిటో మరోసారి తేటతెల్లం అవుతోంది. ఇప్పటికి తెలుగు నవలా లోకంలో ఆమె మకుటంలేని మహారాణి. ఆమె అక్షరాలు అజరామరం ఎప్పటికి. యద్దనపూడి నవలలు అన్ని చదవడం నాకు లభించిన అదృష్టమేమో. 
         21 మే 2018న అమెరికాలోని కాలిఫోర్నియాలో గుండెనొప్పితో మనందరికీ దూరమైనా, అక్షర రాణి యద్దనపూడి సులోచనారాణి మనందరికీ ఎప్పటికి కలలరాణిగా చిరంజీవే. ఆమె తెలుగు నవలలపై వేసిన ముద్ర చిరస్మరణీయమే. 

22, మే 2018, మంగళవారం

"నా అక్షరాలు" కవితా సంపుటి సమీక్ష..!!

  నే రాసిన "నా అక్షరాలు" కవితా సంపుటిని ప్రచురించిన గోదావరి యాజమాన్యానికి, కత్తిమండ ప్రతాప్ గారికి నా మన:పూర్వక ధన్యవాదాలు...                     

                                 " నా అక్షరాలు" కవితల పంటలు పండించే అక్షరవిత్తులు ...!!

                                  తెలుగు సాహిత్యంలో వైవిధ్యమైన రచనలు చేస్తూ విశ్వపుత్రిక హైకూలు, ఏకత్వ జ్ఞానం, ఆకాశంలో అర్ధభాగం, నా ఆత్మ కళలు, ధరిత్రి విలాపం అనే ఐదు పుస్తకాలు, విశ్వకవి రవీంద్రుని గీతాంజలిని అపూర్వగానంగా తెలుగు అనువాదం చేసిన డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ (విశ్వపుత్రిక) రాసిన ఆరవ పుస్తకం "నా అక్షరాలు" కవితా సంపుటి సమీక్ష ఈ వారం గోదావరి సాహిత్యంలో మీ కోసం.
"నా అక్షరాలు" చూడగానే కాస్త తెలుగు సాహిత్యం తెలిసిన అందరికి ముందుగా గుర్తు వచ్చే పేరు బాలగంగాధర తిలక్ రాసిన "అమృతం కురిసిన రాత్రి"లోని నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అన్న మాటలు. ఈ కవితా సంపుటిలో విజయలక్ష్మి పండిట్ రాసిన మొదటి కవిత నా అక్షరాలు లో ప్రణవనాదం ఓంకారం నుండి ఉద్భవించిన నాద తరంగాలే నటరాజ కాలి అందియల మువ్వల సవ్వడులై, అనంత ఆనందలోకాల అంచులు తాకే కాలం పడవలంటూ మొదలుపెట్టి సూర్య కిరణాల స్పర్శతో వికసించే తామరలు, పున్నమి చంద్రికలు, సముద్రపు ఒడిలో ఓలలాడే అల్లరి పిల్లలు, ముత్యాల వాన చినుకుల అందాలు, సప్త వర్ణాల సీతాకోకచిలుకలు, ఆకాశంలో హాయిగా, స్వేచ్ఛగా ఎగిరే గువ్వల రెక్కల చప్పుళ్ళు, ప్రభాతాన మ్రోగే గుడి గంటల చప్పుడు, నాన్న దాచి ఇచ్చే ప్రేమ పలుకుల తాయిలాలు, అమ్మ చేతి గోరుముద్దలు, పసిబిడ్డల కేరింతలు అంటూ సమస్త ప్రకృతిలో మమేకమైన మనసాక్షరాలను అద్భుతంగా అందించారు.  నా తనం కవితలో ఆమె ఎంచుకున్న కలం పేరు గురించిన వివరణ కవితాత్మకంగా చెప్పారు. నా పుస్తకాల అలమరాలో ఆమె దాచుకున్న పుస్తక నేస్తాలు తానేమిటో చెప్తాయి అంటూ పుస్తకాలతో తన చెలిమి చిరకాలఅనుబంధమని బాల్యం నుంచి దాచుకున్న నవరత్నాలని మురిపెంగా చెప్పడం చాలా బావుంది. ఆమె ఒక శాంతి సందేశంలో ఆమె ఒక శిఖరం అంటూ పడతి ఓరిమిని, ఔన్నత్యాన్ని చాటుతూ ఆమె లేని జగతి శూన్యమని మహిళ విలువను చెప్పడం బావుంది. అక్షర మానవుణ్ణిలో జీవితమే సాహిత్యం , అక్షరమయం, అన్ని సాహిత్యపు అనుబంధాలతో మమేకం, అందుకే నేను అక్షర మానవుణ్ణి అంటారు. భూమాతలో సమస్త జీవుల జీవ బీజ ప్రదాత, మూర్తీభవించిన అమ్మదనం మన భూమాత అంటూ గొప్పగా చెప్తారు. భావజలధిలో అంతర్నేత్రంలో తెలుగు అమ్మభాషగా నిలిచి తన భావాలకు ఊతమివ్వడం, కవితా నా కవితలో కవితా జననాన్ని, రేపటి ఇనుడులో సందె సూరీడు కబుర్లను మధురంగా వినిపిస్తూ చీకటి చెంతకు చేరడాన్ని, ఈ.. క్షణంలో కవిలో ఊపిరి పోసుకునే కవితాభావాలను అన్ని కాలాలకు అన్వయించడం, వికసించ వెరసే మొగ్గలో చితికిపోతున్న పసితనపు భయాన్ని, మృగ్యమౌతున్న మానవత్వాన్ని బాగా చెప్పారు. నీవు ఒంటరివి కాదులో ఒంటరితనానికి స్నేహం ఎవరో, ఆకాశం, భూమి అన్ని తోడేనని, అక్షర బలహీనతలో మంచి పుస్తకాలను చదవడం తన బలం, బలహీనత అని, నా పంచేంద్రియాలే నేనులో పంచేంద్రియాలే మనిషి, మనిషే పంచేద్రియాలని, జీవ బీజాలులో దశాబ్దం వెంటాడిన తన కలలకు అక్షర రూపం ఈ కవితని తన ఆలోచనలను పంచుకోవడం, ఆ మామిడిచెట్టు ఏడుస్తూందిలో జరుగుతున్నా అక్రమాలకు సాక్షిభూతమైన మామిడిచెట్టు మనసు రోదనను మనిషి మారణకాండకు మూగబోయి దేవునికి విన్నవించుకోవడం, రైతు ఆత్మనివేదనలో రైతు రోదనను, బరువు బాల్యంలో ఇప్పటి కార్పొరేట్ల చదువులను, అక్షరాలను పాతిపెట్టకు, అక్షర సముద్రం, నా భాషంటే కవితలలో మనిషి మనుగడకు బాట వేసిన అక్షరాలను పాతిపెట్టవద్దంటూ, అక్షర సేద్యం చేయమని చెప్తూ, తెలుగు భాష అమ్మ భాషని నొక్కి వక్కాణించారు. అరుణోదయం, ఆకుపచ్చని యవ్వనంలలో ప్రకృతి అందాలను, చైతన్యాన్ని చూపించారు. అనంత అద్భుత శక్తి ప్రేమని ప్రేమలేని క్షణం ఏదని ప్రశ్నించారు. నవ్వింది ఆకాశం, యుద్ద భూమి, మిథునం, ఇప్పటికిప్పుడు కవితై, అలిగాయి నా ఆలోచనలు, నిర్లక్ష్యం పడగ నీడల్లో, బాపు గీసిన చిత్రపటాలు, అమృత ఘడియలు, నేను సాక్షినై, సహజత్వం, ఆకు సంవేదన వంటి కవితల్లో ప్రతి చిన్న అనుభూతిని అక్షరాలతో బంధించి జీవిస్తావు అక్షరాలై అని అంతులేని కాలచక్ర కథనాన్ని వినిపిస్తూ, చరాస్తులు, మేము కూడా జవాబు దొరకని ప్రశ్నగా మిగలక కళాత్మక జీవితంలో నీ విజయలక్ష్మిని సొంతం చేసుకొమ్మని ఆ ఆ లు కార్చాయి కన్నీళ్ళ ఆనంద భాష్పాలు. అమ్మకానికి ఆడబిడ్డ అంటూ పసిబిడ్డల చీకటి బతుకుల వెలుగు కోణాలను, ఒక భావనలో భారతదేశపు గొప్పదనాన్ని అందంగా తనదైన శైలిలో అక్షరీకరించారు. సామాజిక అంశాలను, తన ఊహలకు ఆకృతులను, విభిన్న కవితా వస్తువులలో "నా అక్షరాలు" కవితా సంపుటి పరిపూర్ణతను అందుకుంది. చక్కని అక్షర భావాలను అందించిన విజయలక్ష్మి పండిట్ కు హృదయపూర్వక అభినందనలు.  

20, మే 2018, ఆదివారం

సంతాప సభ..!!

రేపు..
నాకు ఓ సభ పెడతారట
ఉపన్యాసాలిస్తారట
అందరూ తమ మనసులిప్పి మాట్లాడతారట
నా ఈ స్థితికి కారణాలు వివరిస్తారట
దాటేసిన నిజాల నిగ్గు తేలుస్తారట
అన్యాయాలకు, అక్రమాలకు చరమగీతాలు పాడతారట
మేథావులూ వింటున్నారా..
అబద్దాలే చెప్పరట
న్యాయదేవత గంతలిప్పుతారట
నలుగురిలో గొంతెత్తి చాటుతారట
ఎవరినో నడి బజారులో నిలదీస్తారట
ఉద్యమాలు చేస్తారట
దేనికోసమంటే తెలియదట
ఎవరో చెప్పారట
సత్యాన్ని చంపేసి సమాధి చేసారని....!!

17, మే 2018, గురువారం

ఏమైనా అనుకోండి..!!

నేస్తం,
        మనం ఒక పోస్ట్ పెట్టినప్పుడు దానికి వచ్చే స్పందనలు కూడ స్వీకరించాలి కాని మనకి నచ్చని కామెంట్లు తీసేసి మన హుందాతనాన్ని చాటుకోవడం ఎంత వరకు సబబు..? నీతులు,  సూక్తిసుధలు అందరం చెప్పేస్తాం, కాని వాటిలో కనీసం ఒకటయినా మనం పాటిస్తున్నామా లేదా అని ఎవరో అడగనక్కరలేదు, గతంలో మనం పెట్టిన పోస్ట్లు మననం చేసుకుంటే చాలు. మరోసారి అందరికీ చెప్తున్నా నా పోస్ట్లకు లైక్ లు,  కామెంట్లు పెట్టమని ఎవరికి చెప్పడం లేదు. పెట్టాలనిపిస్తే ఆ పోస్ట్ కి తగ్గ కామెంట్ పెట్టండి అంతేకాని గుడ్ మార్నింగ్ లు,  గుడ్ నైట్ లు పెట్టవద్దు. అనవసరపు చెత్త చెదారాలు పెట్టకండి.  ప్రెండ్ గా ఆడ్ చేసాము కదాని మీ అతి తెలివి ప్రదర్శించకండి.  చెత్త ఫోటోలు పెట్టి దాన్నేమంటారు, దీన్నేమంటారు అని మీ వక్రబుద్దిని బయటేసుకోకండి. భావాలనేవి మనం రాయాలంటే రావు. వాటిని చులకన చేయకండి.  నా రాతలు నచ్చని వారు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు..

16, మే 2018, బుధవారం

ఓటమి వాపోతోంది...!!

మదిని తడుముతున్నాయి
ఎదను గుచ్చుతున్నాయి 
గాయాలో జ్ఞాపకాలో తెలియదు

కలలు రాలిపోతున్నాయి
కన్నీళ్లు ఆవిరైపోతున్నాయి
చెమ్మలేని రెప్పలు పొడిబారాయి

చీకటి చెలిమి కోరింది
వెలుతురూ వీడిపోయింది
ముసిరిన వెతల  మబ్బులకు

కృష్ణపక్షం మాటేసింది
శుక్లపక్షానికి చోటీయనని
బతుకుని కమ్మేసిన మసక మాయలలో

జీవం ఇంకిపోయింది
జీవితేచ్ఛ నశించింది
జీవన్మరణ సమరంలో

కాలానికి ధీటైన మనోధైర్యమే
నీ గెలుపు చిరునామా అని
ఓటమి వాపోతోంది...!! 

వాకిలి తెరవని వాన సమీక్ష...!!

             నేను రాసిన సమీక్ష " వాకిలి తెరవని వాన " ను ప్రచురించిన గోదావరి యాజమాన్యానికి,  కత్తిమండ ప్రతాప్ గారికి నా మన:పూర్వక ధన్యవాదాలు...

            ప్రఖ్యాత కవి, విమర్శకులు కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి "వాకిలి తెరవని వాన" కవితా సంపుటికి ముందుగా హృదయపూర్వక అభినందనలు.
             వాకిలి తెరవని వాన కవితా సంపుటిలో మొదటి కవితే గుండెగూటిని కాపాడుకుంటూలో ఛిద్రమౌతున్న కుటుంబ అనుబంధాలను చూస్తూ తట్టుకోలేని గుండెకు ఓదార్పు లేపనాన్ని అద్దటంలో గెలుపుని ఆకాంక్షించడం బావుంది. ఏళ్ళ తరబడి ఎదురుచూస్తున్నా వాన బాలారిష్టాలు దాటి, కరి మబ్బుల్లో దూరి కనికరించకుండా కళ్ళలో కన్నీరై తిరుగాడుతూ కరువుకాటకాల కన్నీటిసీమలను కనికరించడం లేదని వాకిలి తెరవని వాన ఎప్పుడు కనికరిస్తుందోనని ఎదురుచూడటాన్ని ఎంత హృద్యంగా చెప్పారో. అందుకనేనేమో ఈ కవితా సంపుటికి వాకిలి తెరవని వాన అని పేరు పెట్టింది అనిపించింది. దాహాగ్ని శిఖల్లో, మాయ పొరల మాటున, శ్రమ చేతులైతే, సమస్యలు అరగదీస్తూ, రాతి కౌగిట్లో, ఊపిరాటలు ఆగిపోకముందే, అంతర్నేత్రం, సృజన సన్నిధి, విడ్డూరాలు, లోగుట్టు మొదలైన కవితల్లో తరిగిపోతున్న మానవతా విలువలను, అస్తవ్యస్తమౌతున్న సమాజపు  రీతిని, అక్రమాలను, అన్యాయాలను ఎండగట్టారు. పాటలో ఒక రాగం, ఒక తాళం, ఒక స్వరం, ఒక పల్లవి ఎలా పుడుతుందో సరికొత్తగా మనకు చెప్తారు. నీకు తెలీక పోవచ్చంటూ మనల్ని సందేహానికి గురి చేస్తారు. మలిగిపోతున్న మట్టి దివ్వెలులో రైతు మనసును చూపిస్తారు. జీవితం జోలపాట కాదంటూ శూన్యంలో మనిషి తన్ని తాను వెదుక్కోవడం కళ్ళకు కట్టినట్టుగా చెప్తారు. ఎలా మీరిలా ఉంటే ఎలా, ఇక ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకమే, నవ నాగరికమా ఎటు నీ పయనం వంటి కవితల్లో యువతను భవిత గురించి  ప్రశ్నించడం బావుంది. మౌనమే ఓ పెద్ద జ్ఞాని అంటూ అర్ధం చేసుకోవాలే గాని  మౌనంలోని భాషను, భావాన్ని తాత్వికతను చెప్తూ మౌన మహాకావ్యాన్ని ఆవిష్కరించడం భలే బావుంది .  అరువు బరువు కాకుండా, ఒక మానసాకాశం-రెండు పక్షులు, కొన్ని వాక్యాలే అంటూ వాక్యాల బలాన్ని, బలహీనతను చెప్పడం, లక్ష్యాలు అలక్ష్యాలైతే, కలాల సాములలో లక్ష్య  సాధన, కలం  గురించి, ఏరువాకకై ఎదురుచూస్తూ, ఊర్లు పేర్లు మాయమౌతున్నాయ్ కవితల్లో పల్లెలను మరచి కొత్తగా వస్తున్న మార్పులు, రెండు పూలు కవితలో కర్షకుడిని, కవిని సమాజానికి రెండు కళ్ళని చెప్పిన తీరు ఆకట్టుకుంది.  దేన్నీ మోయలేనివాడు ప్రజా ద్రోహి అని, ఓ సారి ఆలోచిద్దాంలో కవి కలం నుండి రూపు దాల్చిన అక్షరం ఎందరి స్వప్నాలను సాకారం చేసిందో ఆలోచించమనడం, సైద్ధాంతిక గట్లు తెగాక, ఉగ్రవాదం కవితల్లో అహంకారపు అధికారాన్ని, జాతి విద్వేషాలను చూపిస్తారు. నా నమ్మకం, పిట్టై వాలిన వాక్యం, ఆలోచనా వెలుగులు, అక్షర స్వప్నం, ఒక్కసారైనా, మృత్యు జపం కవితల్లో కవి ఆశలను, ఆలోచనలను, వృద్ధాప్యపు చేదు నిజాలను వెలికి తీయడం., వెండిపూల వాన, తాండవమాడాల్సిందే, కర్షక హర్షాన్ని కోరుతూ, మాయమైపోతున్న నేస్తం వంటి కవితల్లో ఊహలను, వాస్తవాలను, ఇకనైనా కవులు అంటూ ఆర్ధిక వివక్షను ఎండగట్టే కవిత్వం రాయాలని, ఇదా ఆధునిక న్యాయంలో పర్యావరణ పరిరక్షణ గురించి చెప్పడం బావుంది.
      జ్ఞాపకాలు ఎంత పదునైన పనిముట్లో జ్ఞాపకాలు కవితలో చాలా బాగా చెప్పారు. అతని స్వగతాల వెనుకలో ఓ మనసు మధనం కనిపిస్తుంది. చైతన్యానికి చూపుడువ్రేలతడు, నమ్మకండి, ఒక వాక్యం పుట్టాలంటే, కణికలు, ఏకాకితనం, నీవు నీవుగా, పంజరం, పాఠాలు, జీవన మాధుర్యం, ఒక సారాంశం, మరణానంతర జీవితం  వంటి 108 కవితలతో జీవితపు దిశా నిర్ధేశాలను, సమాజపు ఆటుపోట్ల అవకతవకలను, ఒక్క రైతు సమస్యలనే కాకుండా ఓ మనిషి మనసును, మౌనపు భాష్యాన్ని, ఆశలను, ఆశయాలను, కష్టాలను, కన్నీళ్లను, సంతోషాలను, ఊహాలోకాన్ని, వ్యధాభరిత జీవితాన్ని ఇలా అన్ని దృక్కోణాలను కొండ్రెడ్డి మనకు ఈ " వాకిలి తెరవని వాన"  కవితా సంపుటిలో చక్కని భావాలతో, చిక్కని కవితలుగా అందించారు. "వాకిలి తెరవని వాన" లో జీవితపు అన్ని కోణాలను ఆవిష్కరించిన కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డికి మరోమారు అభినందనలు. 

12, మే 2018, శనివారం

ఇదండి మన న్యూస్ ఛానల్స్ నిర్వాకం...!!

న్యూస్ ఛానల్స్ కి చెప్పడానికి ఏమి లేకపోతే నిన్నటివో,  మెున్నటివో వార్తలు చెప్పండి పర్లేదు  కాని తిరుపతిలో ప్రధానమంత్రికి లడ్డూ ప్రసాదం పెట్టారు.  ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కింద కూర్చుని లడ్డు తింటున్నారు అని చెప్పినట్టుగా  ఇప్పుడే చూసిన వార్త ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు రెస్ట్ రూమ్ కి వెళ్ళారని టి వి లో చెప్పడం. కాస్త జనానికి పనికివచ్చే విషయాలు చెప్పండి బాబు మీకు పుణ్యముంటుంది....

10, మే 2018, గురువారం

అభిలాష..!!

                                        అగ్ని కణాలు ఆ అక్షరాలూ...!!     
అభీ వెలువరిస్తున్న ఆరో పుస్తకం "నేను నా పొగరు" కి అభినందనల శుభాకాంక్షలు.
అక్షరాన్ని సున్నితంగా భావాల్లో పొదిగేవారు కొందరు. అక్షరాన్ని ఆయుధంగా వాడేవారు మరికొందరు. అక్షరాల్లో అగ్ని కణాలను వెలువరించేవారు అతి కొద్దీమంది. ఆ కోవలోకే వస్తుందీ "అభి" అనే నిప్పు కణిక.  తన మనసుని దహించే దావానలాన్ని, సమాజంలోని అసమానతలను,  అర్ధం లేని కట్టుబాట్లను, నమ్మకాలను తన అక్షరాల్లో ఘాటుగా దట్టించి ఈ సమాజాన్ని నిర్భయంగా ప్రశ్నిస్తుంది. ఆదరదు, బెదరదు చెప్పాననుకున్నది సూటిగా, నిజాయితీగా చక్కని తేట తెనుగులోనే చెప్తుంది. అందరికి అభిలో కోపం, అసహనం, ఆవేశం, ఓ ధిక్కార స్వరం కనిపిస్తుంది, వినిపిస్తుంది. కానీ నాకు మాత్రం అమ్మ ఒడి చేరడానికి ఓ తల్లడిల్లే ఓ పసి మనసు కనిపిస్తుంది. తన అక్షరాల్లో అందరికి కనిపించే పొగరు, అహంకారం వెనుక "నేను" అన్న ఆత్మాభిమానం మెండుగా ఉంది. అభి అక్షరాల్లో నిజాయితీ ఉంది. అది ఒప్పుకునే ధైర్యం మనకి ఉండాలి అంతే. అప్పుడు ఆ అక్షరాల్లో ఆత్మీయత అర్ధం అవుతుంది. మొక్కవోని ధైర్యానికి  రూపం, దానికి సరిపోయే అక్షరాలే ఆమెకు ఆభరణాలు. ఏ విషయాన్ని రాసినా సూటిగా గుండెల్ని తాకేటట్లు రాస్తుంది. ఈ పుస్తకానికి నేను నా పొగరు అంటే  ఆత్మాభిమానం అన్నది సరైన అర్ధం.

మరిన్ని మంచి రచనలు అభి వెలువరించాలని కోరుకుంటూ... నాకు నాలుగు మాటలు రాసె అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ...
                                                                    ప్రేమతో
                                                                  మంజు అక్క

లూపస్ డే...!!

ఈ రోజు ప్రపంచ లూపస్ డే.... చాలా మందికిప్రమాదకరవ్యాధి.  లూపస్ గురించి అందరికి
అవగాహన కోసం మే పదిని ప్రపంచ లూపస్ డే గా పరిగణిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  దీనిలో ఎస్ ఎల్ ఈ ప్రాణాంతకమైనదే కాని సరైన సమయంలో గుర్తిస్తే కాస్త నివారించవచ్చు.  శాశ్వత పరిష్కారం లేదు కాని నిలువరించే వీలుంది. సరైన వైతీసుకీళ్ళవ్యాధి నిపుణులను సంప్రదించండి క్రింది లక్షణాలలో ఏ కొన్ని మీకున్నా ఆలశ్యం చేయకుండా.   మీరే కాకుండా మీకు తెలిసిన వారికి కూడ చెప్పండి.  
నన్ను కూడ ఇష్టపడి నాతో ఉంది.. 

9, మే 2018, బుధవారం

గురువింద...!! జీవన "మంజూ"ష (10) జూన్ 2018

నేస్తం,
            ఎందుకో ఈమధ్యన పదే పదే నాకు "గురువింద గింజ" సామెత గుర్తుకు వస్తోంది. అది అనుబంధాల్లోనూ, సాహిత్యంలోనూ సమపాళ్ళుగా కనబడుతోంది. విశాలమైన ఈ సాహితీ ప్రపంచంలో నా రాతలు గొప్పని నేను అనుకుంటూ మరొకరికి అవార్డులు, రివార్డులు వచ్చాయని ఒప్పుకోలేక, అవి ఇవ్వడంలో లోపాలు జరిగాయని గగ్గోలు పెడుతూ, అస్సలు అవి రాతలే కాదు, వాటిలో ఏమి లేదు అంటూ ఎదుటివారిని చిన్నబుచ్చే మాటలు మాట్లాడటం బాగా ఎక్కువై పోయింది. అదే మన రాతలకి ఓ పురస్కారం వచ్చిందనుకోండి, మనంత గొప్పవాళ్ళు లేరని మిగిలిన ఏ ఒక్కరి రాతల్లోనూ అసలు ఏ విషయము, లక్షణమూ లేదని, ఇదిగో రాతలంటే నా రాతల్లా ఉండాలని, అసలు నా రాతలకు తిరుగే లేదని ప్రతిభకు పట్టం కట్టారని చెప్పుకుంటాం. చాలావరకు ఈ పురస్కారాలు అనేవి కొందరి చేతుల్లో ఉండిపోయాయి అన్నది ఎవరు కాదనలేని సత్యం. వారి భజనపరులకే పట్టం కడుతున్నారన్నది నిర్వివాదాంశం.
                        ఇక బంధాల విషయానికి వస్తే ఏ బంధమైనా కలకాలం నిలబడేది నమ్మకమైన ప్రేమాభిమానాల మధ్యన. ఈరోజుల్లో రక్త సంబంధాలు కూడా దూరమైపోతున్నాయి అంటే దానికి కారణం ఆ బంధాల మధ్యన గూడు కట్టుకున్న అహాలదే ముఖ్య పాత్ర. కనీసం కాకులకున్న నైతికత మనలో లోపించడమే కారణమేమో. నేను, నా ఇల్లు, నా అమ్మాబాబు అన్న చట్రంలో ఉండిపోతూ మరొకరి ఆపేక్షను ఆశించడం ఎంత వరకు సమంజసం? మనం మన అన్న నలుగురు కాదు కనీసం ఒక్కరి క్షేమ సమాచారాలు అడగము కాని మన కోసం నలుగురు రావాలి అనుకుంటే ఎలా సరిపోతుంది. మన అవసరాలకు వాడుకుని కనీసం వాళ్ళు కష్టంలో ఉంటే వెళ్లము సరికదా ఒక్క ఫోన్ చేసి ఎలా ఉన్నారని అడగడానికి నోరు రాదు కాదు కాదు తీరిక ఉండదు. నలుగురికి నీతులు వల్లిస్తాము, మన అంత భక్తిపరులు ఈ ప్రపంచంలోనే లేరనుకుంటూ వినేవాళ్ళుండాలి కానీ అబ్బో తెగ సూక్తులు ఆ పుస్తకాల్లోవి, ఈ భారతంలోవి అంటూ క్షణం ఖాళీ లేకుండా వినిపిస్తూనే ఉంటాం. ఒక్క మాట మనం ఎదుటివారిని అనడానికి మనకున్న అర్హత ఏమిటి అన్నది ఆలోచించుకుంటే మనకే తెలుస్తుంది మనమెంత నిజాయితీపరులం అన్నది. మనల్ని మనం సమర్ధించుకోవాలి కాస్తయినా నిజాయితీగా. మన మనస్సాక్షిని చంపేసుకుంటే రేపు మనం పోయినరోజు మనల్ని మోసే ఆ నలుగురు కూడా దొరకరు. బంధాలయినా, సాహిత్యపు పరిమళాలయినా కలకాలం నిలవాలంటే నైతిక విలువలనేవి మనం నేర్చుకోవాలి. అప్పుడే ఏదైనా కలకాలం నిలబడుతుంది.

ఈ ముచ్చట్లకు ఇప్పటికి సశేషం.... 

ఏమైనా అనుకోండి....!!

రాతల్లో  పేరు నేను రాయనంత వరకు వారి వారి వ్యక్తిగతాలు కాదని అందరికి మనవి. రాసిన ప్రతి రాతను ఇది నాదేనేమో, నా గురించి రాసిందేనేమో అని అనుకుంటే నాకెలాంటి సంబంధం లేదని ప్రతి ఒక్కరికి ఈ విధంగా తెలియజేయడమైనది. నాకు తెలిసి నేను పేరుతో పెట్టినది ఒకే ఒక పోస్ట్. వారు వారి స్నేహితులు నాకు చాలా చాలా బిరుదులూ( శాడిజం, అసూయ వగైరా...) ఇచ్చారు. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. దయచేసి మిత్రులు, శత్రువులు, బంధువులు అందరు అర్ధం చేసుకోగలరు. నా రాతలను, నన్ను తిడుతున్న, ఆదరిస్తున్న అందరికి నా ధన్యవాదాలు. 

అసత్య జీవితాలు....!!

ఏకాకుల్లా బతికేస్తున్నాయి 
ఎలిగాకులమైపోయామని తెలుసుకోలేకున్నాయి 
ఏతావాతా మనమే గొప్పని ఎగిరెగిరి పడుతూ 

బంధాలు భారమౌతున్నాయి 
రక్తసంబంధాలు రోకలిపోట్లు పొడుస్తున్నాయి
అనుబంధాలో అగచాట్లో అవగతం కావడం లేదు 

పురుషార్ధాలకై పాట్లు పడుతున్నాయి 
పూజల పుణ్యాలన్నీ తమవేనంటున్నాయి 
ఎవరికి తెలియని భాగోతాలో ఈ విషపు నైజాలవి 

ఆర్తి పలుకులకు అర్ధాలు మారాయి 
అభిమానం మరచిన  నాటకీయతలు రాజ్యమేలుతున్నాయి 
నయవంచనలో నటనా చాతుర్యాలో మరి 

ఆత్మీయతలు అక్కర్లేని దౌర్భాగ్యాలైనాయి 
అహంకారాలే ఆభరణాలనుకుంటున్నాయి 
అటూ ఇటూ కాని అర్ధనగ్న అసత్య జీవితాలు...!!

6, మే 2018, ఆదివారం

యాతన నవలా సమీక్ష...!!

   గోదావరి యాజమాన్యానికి,  ప్రతాప్ కత్తిమండ గారికి,  సాగర్ శ్రీరామ కవచం గారికి నా మన:పూర్వక ధన్యవాదాలు... 

                                         
       ఓ మనసు తపన ఈ "యాతన"
                                   
                     కొన్ని పుస్తకాల గురించి చెప్పాలి అంటే ముందుగా మనని మనం తెలుసుకోవాలి. శ్రీరామ కవచం సాగర్ నవల యాతన చదువుతుంటే నాకు కలిగిన అభిప్రాయం ఇది. యాతన నవల నవలా రచనలోనే ఓ విన్నూత్న ప్రక్రియ.  రచనా ప్రపంచంలో విలక్షణమైన శైలితో, ఎవరు ఇప్పటి వరకు సాహసించని వస్తువుతో యాతన నవలను అందించిన సాగర్ శ్రీరామ కవచంకి హృదయపూర్వక అభినందనలు.
                      మనసు పిచ్చిది కానివ్వండి, మంచిది కానివ్వండి ఓ మనసు తపనే నాకు ఈ "యాతన" నవలగా అనిపించింది.  ఓ పిచ్చివాడి మతి భ్రమణం వెనుకనున్న గతానికి వర్తమానానికి సంబంధించిన ఆలోచనల అంతర్నేత్రం నాకు ఈ యాతన నవలలో కనిపించింది. కథానాయకుడు పిచ్చివాడైన ఓ లాయర్, రచయిత కూడానూ. ఆస్తులను పెంచుకోవడానికి భార్య, బావమరిది మోసం చేస్తున్నారని, తన చుట్టూ ఉన్నవారిలో ఎవరిని నమ్మాలో తెలియని స్థితిలో ఉంటూ, ఇంటితోను, తోటతోనూ తనకున్న అనుబంధాన్ని తెంచుకోలేక తనలో తానూ మధనపడుతూ, మరో మనిషిగా మారినట్లు ఊహించుకుంటూ అందరికి పిచ్చివాడుగా కనిపిస్తాడు.
                     ఈ నవల మొత్తం మనకు పిచ్చివాడైన కథానాయకుడే చెప్తాడు.  సాగర్ శ్రీరామ కవచం తీసుకున్న కథావస్తువే విలక్షణమైనది. ఇప్పటి వరకు ఎవరు రాయడానికి సాహసించని కథావస్తువు. తక్కువ పాత్రలతో కథను, కథనాన్ని సాగించిన తీరు, భాష మీద ఆయనకున్న పట్టు, చెప్పన జీవిత సత్యాలు ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉంది. మనకు తారస పడిన ఎందరివో జీవితాలను, మరణాలను కూడా మనం ఈ యాతనలో స్పష్టంగా చూడగలం. నా నలభై ఏళ్ళ పుస్తక పఠన చరిత్రలో ఇలాంటి నవల చదవడం ఇదే మొదటిసారి. చదవడం మొదలు పెట్టినప్పుడు ఇలా వుందేంటి అనుకుంటూ మొదలు పెట్టాను, కాని చదవడం అయిన తరువాత కొన్ని రోజుల వరకు ఈ పాత్రలు, సన్నివేశాలు కళ్ళ  ముందు కదలాడుతూ నా చుట్టూనే తిరుగుతున్నాయి. చాలా చోట్ల రచయితే కథానాయకుడిలో కనిపించారు.
                         ఓ పిచ్చివాడి మనసు మాటలతో మొదలై ఆ పిచ్చితనంతోనే ముగుస్తుంది ఈ యాతన నవల. సహజ సంభాషణలతో నిండిన యాతనలోనికి తొంగి చూస్తే ముందుగా ఆ యాతన పడే మనిషి మనకు కనిపిస్తాడు. పిచ్చివాడో, మామూలు మనిషో మనకు అర్ధం కాదు. తన పేరు కాని, తనకు ఇష్టంలేని ఇంట్లోవాళ్ళ పేర్లు కాని చెప్పడు చివరి వరకు. తనని అందరు పిచ్చివాడని అంటున్నా తాను లాయర్నని మర్చిపోడు. తనలోని మానవత్వాన్ని మరిచిపోడు. తన స్నేహితుడు దొంగ జగ్గడితో మాత్రం తన ఆలోచనలన్నీ పంచుకుంటాడు. సమాజంలో తరిగిపోతున్న విలువలను కడుపుతోనున్న గుడ్డలమూట పిచ్చిదానిలో చూపిస్తూ ఆ అమాయకురాలి స్థితికి సమాజంలోని మన దిగజారుడు తనాన్ని ప్రశ్నిస్తూ ఆమెను ఆదుకోవడంలో కొందరిలోనైనా మిగిలున్న మంచితనాన్ని చూపిస్తారు. ఆ పిచ్చి అమ్మాయిని వెదుక్కుంటూ వచ్చిన తల్లిద్రండ్రులను, సమాజంలో మరికొంతమందిని మనకు పరిచయం చేస్తారు. రోజువారి జీవితంలో పిచ్చితనానికి దక్కే బహుమానాలు, చివాట్లు, రకరకాల మాటలు అన్ని మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తారు. తన ఇంటిని పడగొట్టి అపార్ట్మెంట్ కట్టడానికి భార్య, బావమరిది చేసే ప్రయత్నాలను, ఇంటి మీదున్న మమకారానికి తనలోని మరో మనిషి పడే తపనను చాలా హృద్యంగా చెప్తారు. గుడ్డల మూట అమ్మాయి కవల పిల్లలని కన్న తరువాత ఆ పిల్లలను చూడటానికి తన స్నేహితులను " మా తోటలో నిర్మాణమై వున్న పూతీగల, పూశోభల మహా ప్రసూతి గృహం లేదూ మహా పల్లవ మనో రంజిత కుసుమ ప్రసీద కుటీరం అనండి, అభ్యంతరం లేదు, మా మనోవల్మీకంలోకి అడిగిడే ప్రసూన పారిజాతంను వీక్షించటం అనే బరువైన పదం వాడను గాని ఆ పసి కూనలని అంతకంటే గొప్ప పసివాళ్ళగా చూసి తరించే మహాదృశ్యం లోకి మా కాళ్ళు లాక్కుపోయాయి. " ఈ ఒక్క సన్నివేశం చాలు తెలుగు భాషని, భాషలోని పదాల సొగసులని చెప్పడంలో ఎంత నేర్పు ఉందో.
         తన ఆలోచనలను డైరీలో రాసుకోవడం, పాతకాలపు ఇంటిని, ఆ జ్ఞాపకాలను డబ్బు కోసం వదలలేని మనిషి ఆఖరికి తనవాళ్లు చేసిన మోసంలో ఆ ఇంటిని కోల్పోవడం అక్కడో పెద్ద అపార్ట్మెంట్ వెలవడం, దాన్ని చూస్తూ భోరున విలపించడం, తన ముంగిపును తనే చెప్పుకోవడం  అన్నది ఈ యాతనలో మాత్రమే సాధ్యం. ఓ మనిషి పిచ్చివాడుగా మారటానికి, జీవితంలో ఓడిపోవడానికి గల ఎన్నో కారణాల్లో ఒక కారణాన్ని ఈ నవలలో మనం చూడొచ్చు. ఇది ఒక మనిషి లేదా ఒక పిచ్చివాడి యాతన కాదు ఈ సమాజానిది అని రచయిత నొక్కి వక్కాణించారు.
      ఇలా చెప్పుకుంటూపోతే నవలకన్నా సమీక్ష పెద్దదై పోతుంది. చివరగా జీవితానికి చెప్పిన నిర్వచనంతో ఈ సమీక్షను ముగిస్తాను. " జీవితం అంటే ఓ ద్వారం తెరిచి మరో మూసుకుపోయిన ద్వారం ముందు అన్ని చలి నెగళ్లు పేర్చుకుని ఓ శ్వేత కపోతంలా రాలిన కాలాన్ని దాచి దాని కఠినతను నిందించడమే జీవితం. "
చావుని తల్చుకుంటూ అంతా ఓ యాతన .. ఓ మగత అంటూ ముగిస్తారు.
      ఓ మనిషి మనసు నుండి అమృతమే పుడుతుందో లేదూ హాలాహలమే జనియిస్తుందో మనం ఎవరమూ చెప్పలేము. ఎవరి యాతన ఎలా ఉండబోతోందో అన్నది కాలం చేతిలోనే ఉందని అనిపిస్తుంది. ఓ మనిషి మనసు పడే తపనే ఈ యాతనగా మారి సమాజాన్ని సమాధానం లేని ప్రశ్నగానే మిగిల్చేస్తుందేమెా. పిచ్చితనమో, జ్ఞానమెా, వైరాగ్యమో, తాత్వికతో, మరింకేదైనానేమో ఏం ఉందో నాకు తెలియదు కాని కాస్త మనసు పెట్టి చదివితే మనలో కూడా ఈ యాతనే ఉంటుందని మాత్రం చెప్పగలను. నా నలభై ఏళ్ళ పుస్తక పఠనంలో నేను చదివిన ఓ గొప్ప నవల యాతన అని చెప్పడంలో ఎట్టి సందేహం లేదు. ఇంత గొప్ప పుస్తకాన్ని అందించిన సాగర్ శ్రీరామ కవచంకి మరోసారి అభినందనలు.
     

3, మే 2018, గురువారం

యాతన సమీక్షకు లభించిన బహుమతి....!!

యాతన సమీక్షకు నాకు లభించిన మీ విలువైన మాటలకు థాంక్యూ సో మచ్ సాగర్ అంకుల్...
"Ur essay on Yathana is confirmed that you can as a critic save the literature more than us,dialecical critical critisom is a open minded expression I strongly believe that you have reached the capacity"

1, మే 2018, మంగళవారం

ఏక్ తారలు...!!

1.  కలయికెప్పుడూ కరచాలనమే_మాటలు పంచుకునే మనసుల మధ్యన....!!

2.   కాలానికి కొరుకుడు పడనిదే_మనోధైర్యం మనదైనప్పుడు....!!

3.  ఓటమికి చెప్పిన వీడ్కోలే_ఆ నవ్వుల కాంతులు...!!

4.  దాయలేని స్నేహమే మనది_అక్షరాల్లో నెమలీకలను తలపుకు తెస్తూ..!!

5.   విరించి విదిల్చిన అక్షరాలే_మనల్ని చేరిన ఈ తలరాతలు....!!

6.   చెరగని రాతలే ఇవి_విధాత గీసిన బతుకు చిత్రాలు మనవని తెల్పుతూ...!!

7.  అక్షరాలకెంత ఆరాటమెా_కలంలో చేరి కాలంతో పరిగెట్టాలని....!!

8.   కాలానికి తప్పదు_ కలం విసిరిన కలలను కన్నీళ్ళను మెాయక...!!

9.  కలవరాలన్నీ కనుమాయమే_మౌనం మనసు విప్పాక...!!

10.   శబ్దమూ సద్దుచేయకుంది_మౌనాన్ని నీ మాటల్లో వినాలనేమెా...!!

11.   కలతలన్నీ కన్నీళ్ళుగా జారిపోయాయి_ఏకాంతంతో స్నేహమయ్యాక....!!

12.  కన్నీళ్ళు వాపోతున్నాయి_కాలానికి భారమౌతున్నామని...!!

13.  భారమయినా తప్పని బతుకులు_కాలం కక్ష కట్టినప్పుడు...!!

14.   కాలం విస్తుబోతోంది_కలం చేస్తున్న కనికట్టుకి...!!

15.   మరపు లేపనాన్ని అద్దింది కాలం_గాయపడిన హృదయానికి....!!

16.  కొన్ని జ్ఞాపకాలు దొరికాయిక్కడ_పారేసుకున్న గతానివేమెా..!!

17.  దొరికిన గవ్వల్లో అన్నీ భద్రమే_ఒంపేసిన సంద్రపు హోరులో....!! 

18.   అక్షర వేగానికి కాలం తోడయ్యింది_బంధాలు భావాలకు తోడౌతుంటే..!!

19.  భావాలు మూగబోయాయి_మహానటికి నీరాజనాలర్పిస్తూ..!!

20.   ఓ మహా యజ్ఞం ముగిసింది_మగవాడి అహం అన్న చరిత్రను పునరావృతం చేస్తూ...!!

21.  మనిషిగా నవ్వడమూ ఓ వరమే_మనసు చచ్చిపోయినా...!!

22.  అక్షరానికెప్పుడూ అతిశయమే_అర్ధవంతంగా భావాల్లో ఇమిడిపోతానని...!!

23.   మాయమైనా మరలిపోనిదేమెా_మనసైన జ్ఞాపకం...!!

24.   శతఘ్నిలా మారిన స్వాతి చినుకు_కపట నాటకాలకు చెరమగీతం పాడుతూ...!!

25.  కొన్ని  స్నేహాలంతే_మనసుని సేదదీరుస్తూ...!!

26.  కాలం దాచేసిన జ్ఞాపకం_మళ్ళీ తిరిగొచ్చింది నీతో కలిసి...!!

27.   విడిచిపోదామనుకున్నా_వీడని జ్ఞాపకమై నువ్వుండిపోతావని తెలియక...!!

28.  అక్షరాలని హత్తుకుంటున్నా_ఆర్తిగా ఆదరిస్తున్నాయని...!!

29.   రెప్పచాటు స్వప్నమే మరి_రాబందుల తాకిడికందకుండా....!!

30.  అక్కున చేర్చుకునేది అక్షరమే_అన్ని అనుభూతులకు ఆసరానిస్తూ...!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner