11, జులై 2018, బుధవారం

ద్విపదలు...!!

1.  నా జీవితమే నువ్వు
జీవనదిలా మారి నా అక్షరాల్లో నిరంతరం ప్రవహిస్తూ....!!

2.  నా ఆస్వాదనలే నీవు
విడివడని భావాలకు జత చేరిన అక్షరాలుగా మారతూ..!!

3.  వలచి వచ్చిందో చెలిమి
వలసపోయే జ్ఞాపకాలను వెంటేసుకుని...!!

4.  మనసుని పరికిస్తున్న క్షణాలివి
మౌనానికి మాటల అలంకారాలద్దేస్తూ...!!

5.  కథ ముగిసింది
కల జీవితమని తెలిసే సరికి...!!

6.  మనసును మాలిమి చేసుకున్న జ్ఞాపకం
కాలానికి చిక్కని పరిమళపు గుభాళింపుతో..!!

7.  కల్లలేగా చెంతనుంది
కలలన్నీ వీగిపోయాక...!!

8.   అమ్మ బడిలో నేర్చుకున్నందుకేమెా
అక్షరానికింత ఆప్యాయత నేనంటే...!!

9.   వెన్నెలంతా నవ్వుల్లో ఒలికింది
కవితాక్షరాలన్ని మది సిరాలో ముంచి రాయాలని అనుకుంటే...!!

10.  బంధమై చేరినందుకేమెా
బాధ్యతగా మిగిలిపోయాను...!!

11.  గతజన్మ పరిమళమనుకుంటా
జన్మలోనూ వదలక వెన్నాడుతోంది...!!

12.  మెాహం సమ్మెాహనమైంది
స్నేహ పరిమళమై చెంత చేరుతుంటే...!!

13.  మదిగమకాలు స్వరాలు ఆలపిస్తూ వెంటబడుతోంది
నిశ్శబ్ధ రాగాన్ని పరిచయం చేయడానికేమెా....!!

14.   ఏకాంతం చేరువయ్యింది ఎందుకో
నీ తలపులనందించాలని కాబోలు..!!

15.  కాలమే నాతో ఉండిపోయింది
నిన్ను విడలేని బంధమై....!!

16.   జీవితాన్ని గెలవాలనుకుంటున్నా
ఓడిన మనసుకు ఓదార్పుగా నిలుస్తూ....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner