31, ఆగస్టు 2018, శుక్రవారం

గుండెల్లో గోదారి.. సమీక్ష..!!

                                   జ్ఞాపకాల ప్రేమ పొంగుల వరద గోదారి ఈ గుండెల్లో గోదారి...!!

       మాడిశెట్టి శ్రీనివాస్ మనసుని పుస్తకంగా మలచి అక్షర నివేదనగా అందించిన ఈ " గుండెల్లో గోదారి.."  మనతో పంచుకున్న అనుభూతులను మనమూ ఆస్వాదిద్దాం.
      చివరి మజిలీ వరకు మదిలో భయంగా దాచిన భావాలను ఎంత ప్రేమగా చెప్పారంటే " నా గుండెల్లో పవిత్రంగా దాచుకున్న పాదముద్రలే నీవైనప్పుడు నువ్వెక్కడుంటే నాకేం" అంటూ గుండెల్లో దాచుకున్న జ్ఞాపకాల వరదను, ప్రేమగా గుండెల్లో దాచుకున్న గోదారిని అక్షరాల్లో అనుసంధానం గావించారు అద్భుతంగా. చెట్టుని చుట్టేసిన జ్ఞాపకం అంటూ వాడిపోనిది. వీడిపోనిది ఆత్మ బంధం, కలగా మిగిలే ఈ జ్ఞాపకం ఎన్నాళ్ళో అంటారు. ఘోష, నువ్వు - నేను చక్కని విరహ వేదన, ఆ(త్మ)బంధంలో దూరమైన అనుబంధాన్ని అటు నువ్వు, ఇటు నేను ఉన్నా కలిసే ఉన్న ఆత్మ బంధం అనడంలో ఓ చెమరింత మన మనసుకూ చేరుతుంది. చరమగీతంలో నిశ్శబ్దగీతాన్ని ఆలపించి దూరమైన ప్రేమని ప్రశ్నిస్తారు. ప్చ్.. కవిత తనతో లేని నేస్తం తనలోని జ్ఞాపకాలని కూడా పట్టుకెళిపోతే బ్రతుకు నిర్జీవ గోదారైనదని తనకెలా చెప్పనంటూ ఓ నిట్టూర్పు బాధగా వినిపిస్తారు. చివరి కోరికలో కలకాలం వెలివేయని జ్ఞాపకంగా నేస్తం గుండెలో తానుండిపోవాలన్న కాంక్షను బలంగా వినిపిస్తారు. వెన్నెల, దీపా(వేదనా)వళి.. కవితల్లో ఏ వెన్నెలవో అని అంటూ, దీపావళి దివిటీల్లో అమాస చీకట్లు నింపి ఎక్కడో వెలుగులు చిమ్ముతూ, విషాదపు చీకటిని తనలో నింపిందని అంటారు. ఆమె కవితలో తన నేస్తం లేని జీవితంలో తనకు ఆత్మ బంధువు మృత్యుదేవత అనడం ప్రేమకు పరాకాష్టగా అనిపించక మానదు. దూరం కవితలో దగ్గరకు రాలేని దూరాన్ని, జీవం లేని జీవితంగా మిగిలిన ఈ వెదుకులాట ముగిసేదెప్పుడని అడుగుతారు. తన "అలసిన గుండె" కోసం "కన్నీటి జ్ఞాపకమై" "నా కోసం నువ్వొస్తే " "నువ్వయ్యేంత" గా నే మరణించి నీలో జ్ఞాపకంగా ఉండిపోతానంటారు. కలలు కనే కళ్ళు తన గుండె మత్తుగా నిద్రిస్తూ గమ్మత్తుగా కలవరిస్తోందని పలవరింతలు మనకందించారు. నేనెవర్ని, చివరి పేజీ, వార్ధక్యం వాకిట్లో కవితల్లో తన ప్రేమనంతా అక్షరాల్లో వెదజల్లి గుండెల్లో కన్నీటి తడిని తుడిచేసుకుంటూ చరమగీతం పాడేసుకుంటూ మరణం కౌగిట్లో తల దాచుకుంటూ నేస్తం కోసం మిగిలిపోతాననడం ఎంత గొప్ప తాధాత్మ్యత. కలవరపాటు జీవితాన్ని చెలి తనకిచ్చిన వరమని జీవన సాగరంలో చెప్తారు. తెలీదు, నువ్వు, నేను - గులాబి, నాలో ని స్పర్శ వంటి కవితల్లో ఏమి తెలియని తనకు అన్ని తానైన నేస్తం దూరమైందని ఆ బాధను అక్షరాల్లో పలికించడంలో కృతకృత్యులయ్యారు. ఆఖరి క్షణం కవితలో చివరి కోరికలో కూడా తన ప్రేమను చెప్పడం చదివే అందరి మనసులను తడి చేయక మానదు. కనపడొద్దనీ కవితలో ఓ విషాదం, నిరీక్షణలో తన కోరికను, కాంక్షలో కాదనకూడదన్న ఆకాంక్షను, మనసులో భద్రంగా దాచుకుంటాను త్వరగా వచ్చేయమనడం, కరకు గుండెలో వెన్నెలవౌతావో, నిప్పుకణికవౌతావో ని ఇష్టం అంటూ నేస్తం పై తనకున్న ప్రేమను, ఆరాధనను చూపిస్తారు. ప్రతిబింబం, షరాబీ, నిష్క్రమణం, దూరం, గుండె కోత, నువ్వు - గులాబి, కాళీ మువ్వలు, గ్రహణం, కల, కన్నీటి జీవితం, జ్ఞాపకాల శవం వంటి కవితల్లో వేదనాభరితమైన ప్రేమ నివేదన కనిపిస్తూ వినిపిస్తుంది. అక్షరం చెప్పని భావం, మనసు విప్పని మౌనం, నాలో నిక్షిప్తమైన నీ జ్ఞాపకం అంటూ మనసు విప్పని మౌనం మనసును చూపిస్తారు. కల్లలైన కలలో ప్రేమ అలల గోదారి అలవికాని వేదనను అంతులేని రోదనలా వినిపిస్తారు. "మాటల్లేని మనసు" "విస్ఫోటనం" చెంది తన ఇవితంలో "వెలుగు దివ్వె"గా మిగిలిపోయిందంటారు. జీవచ్ఛవం, ఆల, రుధిర బాష్పం కవితలు విషాదాన్ని చూపిస్తాయి. జ్ఞాపకం కవితలో  అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నువ్వే నాలో ఓ తిరిగిరాని కడపటి కన్నీటి జ్ఞాపకమని హృద్యంగా చెప్తారు. "చివరి శ్వాస"తో మరణశయ్యపై నిరీక్షిస్తున్నా "వచ్చెయ్యి " అనడం, చివరి మాట నేస్తం అంటూ తన  "ఆక్రందన" వినమనడం, నేస్తం వచ్చి,వెళ్లి చేసిన "గారడి" ని మనసు అలజడిగా చెప్పడం, చక్కని ప్రేమ, విరహపు భావాలను సమపాళ్లలో అందించడంలో కవి భావుకత తెలుస్తోంది. "కన్నీటి మేఘం" అందించిన "విషాదానుభూతి" నా "కంటిపాప" లో చేరి "నీ నేను" గా "ముక్కలు కాని జ్ఞాపకం" గా మిగిపోవాలని తపన పడుతుంటే నేను "గుర్తులేని నువ్వు"  నీ జ్ఞాపకాల రుధిరంతో రాసిన "మరణాక్షర"మై "మృత్యు ముఖం" లో ఈ జన్మకింతే అని మరు జన్మలోనైనా "నువ్వంటే" ఎంత ప్రేమో చెప్పాలని ఎదురుచుస్తుంటా అంటారు. కన్నీటి బంధంలో జ్ఞాపకాల ప్రేమ ప్రబంధాన్ని, నాలోని నీ పాట కవితలో తనలోని ప్రేమ స్వరాక్షరం ఆమేనని చెప్పడం బావుంది. వరమిస్తావా, జీవన హోళీ కవితలు మదిలోని ప్రేమను ప్రేయసికి చెప్పడాన్ని చూపిస్తాయి. "నాకు తెలుస్తూనే ఉంది" నువ్వు వచ్చినా "మౌనం" అంటే మనిద్దరమని ప్రేమను సరికొత్తగా చెప్పడం చాలా బావుంది. సెల్ఫీ, నీకై, అందని పిలుపు, గుండెల్ని కెలికే జ్ఞాపకం, ముల్లు, ఆలశ్యం కవితలు మనసును కలవర పరిచే భావాలైనా బావున్నాయి చదవడానికి. ఈ కవితలన్నీ ప్రేమ పొంగుల,పారవశ్యాల, ప్రణయ కావ్యాల, వరద పొంగుల, హృదయ నాదాల, మోదాల, ఖేదాల "గుండెల్లో గోదారులు".
     ఇక అనుభూతుల గోదారిలో అమ్మకు ప్రేమతో, నాన్నతో సెల్ఫీ, నీ నేను, వంటిల్లు, మేరుబతుకు, బతుకు చిత్రం, కరిగిన శి(క)ల, ఆమె, స్నే(హి)హత్వం, ఒంటరి బాల్యం, భార్య, మానవతాశిల్పం, రంగుల కల ఈ కవితలన్నీ తన కుటుంబపు అనుభవాలను తనవైనా అక్షరాల్లోకి అనువదించి తనలోని ఆత్మీయతను, అభిమానాన్ని, అనుబంధాలకు ఇచ్చే విలువను చూపించారు. జీవిత గమ్యాన్ని, గమనాన్ని కూడా సూచాయగా చెప్పారు.
    జీవితం అంటే ప్రేమ, అనుబంధం, అభిమానం, విరహం, వేదన, నిరీక్షణ ఇలా అన్ని అనుభూతుల ప్రణయ ప్రబంధ కావ్యమని మాడిశెట్టి శ్రీనివాస్ " గుండెల్లో గోదారి " లో తన గుండె గొంతుకను అందరి గుండె చప్పుడుగా చక్కని భావాలతో అందించారు. అలతి పదాల అక్షర గోదారి "గుండెల్లో గోదారి.." కి హృదయపూర్వక అభినందనలు.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner