9, ఆగస్టు 2018, గురువారం

జీవన "మంజూ"ష (ఆగస్ట్)

నేస్తం,
         రోజులు గడిచి పోతుంటాయి జ్ఞాపకాలను వెంటేసుకుని. మనుష్యులు దూరమైనా, బంధాలు భారమైనాకొంతమంది మాత్రం గతాన్ని గుర్తుచేసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడైనా మనస్సాక్షికి విలువనిస్తూ. మనసే లేని వారికి మనస్సాక్షితో పనిలేదనుకోండి అది వేరే సంగతి. కొద్దిరోజుల పరిచయాన్ని కూడా జీవితాంతం గుర్తుంచుకునే స్నేహాలు కొన్నైతే, అవసరానికి అయినవాళ్ళని వాడుకుని, వాళ్ళ జీవితాలను తమ శక్తి మేరకు నాశనం చేసి, కనీసం మాటలకు కూడా దూరంగా బతికేస్తున్న ఎందరో ఆత్మీయులు, మరెందరో రక్త సంబంధీకులు నేటి మన సమాజంలో. తోబుట్టువులను తమ ఎదుగుదలకు పావులుగా మార్చుకుని, కష్టంలో అండగా నిలువలేని పెద్దరికపు అహాలు, తామే పైన ఉండాలనుకునే చిన్నవారి కుతిత్సపు నైజాలు ఇలా రకరకాల మనస్తత్వాలు మనకు తారసపడుతూనే ఉన్నాయి జీవితమనే ఈ కాలచక్రంలో.
       దశాబ్దాల కాలంలో శతాబ్దాల చరితను చూపించిన ఘనులు కొందరైతే, ఆ అనుభవాలకు తట్టుకోలేని జీవితాలు జీవకళను కోల్పోయి బతికున్న శవాలుగా మిగలడం మనం రోజు చూస్తున్న ఎన్నో బతుకులే అందుకు సాక్ష్యం. శారీరక హింసకు కూడా కఠినశిక్షలు లేని మన రాజ్యాంగంలో సాక్ష్యాలు చూపెట్టలేని ఈ మానసిక క్షోభలకు ఏపాటి శిక్షలుంటాయనేది జగమెరిగిన సత్యమే. ఈ మధ్యన సామజిక మాధ్యమాల ప్రాచుర్యం పెరిగిపోయాక సమాజ ఉద్ధరణకు మేము సైతం అంటూ ఎంతోమంది బయలుదేరారు. ఇంట్లో మొగుడు / పెళ్ళాం, పిల్లలను కనీసం మాటమాత్రమైనా పలకరించరు కానీ సామాజిల మాధ్యమాలలో సత్సంబంధాల కోసం అందరితో మంచిగా నటిస్తూ క్షేమసమాచారాలు కనుక్కుంటూ, మీ మేలుకోరేవారం, మీ అభివృద్ధిని మాత్రమే ఆకాంక్షిస్తున్నాం అని ప్రతి ఒక్కరికి చెప్పేస్తూ బతికేస్తున్నారు.
      ఎవరు చేసిన చేసిన తప్పులకు వారికి ఎప్పటికైనా శిక్షలు పడక తప్పవనుకుంటూ భగవంతునిపై భారాన్ని వేసి బతికేద్దామనుకున్నా, తప్పుల మీద తప్పులు చేస్తూ పెద్దరికమనే ముసుగును ధరించి అనుబంధాలను అల్లరిపాలు చేస్తూ, ఆపదలో ఆదుకోలేని అహంకారపు, దిగజారిన వ్యక్తిత్వాలకు కొమ్ము కాస్తున్న భగవంతుని నిందించలేక తమలో తాము నలిగిపోతూ రక్త సంబంధాలకు విలువనిస్తూ, మారలేని మనసుల అంతర్మధనం అక్షరీకరించలేనిది. అంతరించి పోతున్న అనుబంధాల నడుమ నలిగిపోతున్న ఎన్నో మనసుల వ్యధలు కనుల ముందు తారాడుతున్నా ఏమి చేయలేని అసమర్ధపు జీవితాలై నలుగురితోపాటు మనమూ మనుష్యుల్లా బతికేద్దాం మరి.ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం.... 

1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Rajyalaxmi Thallapelly చెప్పారు...

చాలా బాగా చెప్పారు మంజు గారు)).

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner