19, అక్టోబర్ 2018, శుక్రవారం

దీపావళి సందడి...!!

         మన భారతీయ ఇతిహాసాలు, పురాణాలు మనకందించిన సంస్కృతీ సంప్రదాయాల వెనుక మంచి, చెడుల విశ్లేషణ ఉంది. కాలంతో పాటుగా మనము ఆధునికత వైపు పరుగులెడుతున్న ఈరోజుల్లో పండుగలు వాటి వెనుక కారణాలు కాస్తయినా తెలుసుకోవడం మన తరువాతి తరాలకు అవసరమనిపిస్తోంది. ఐదు తరాలను చూసిన అనుభవాలను తరచి చూసుకుంటే ఎన్నో అందమైన బాల్యపు అనుభూతులు, మరచిపోలేని జ్ఞాపకాలు గుర్తుకు వస్తూనే ఉంటాయి. మన పండుగలకు ఉన్న ప్రాముఖ్యం తెలుసుకోవాలన్న కుతూహలం చిన్నప్పుడు అమ్మ చెప్పే కథలతో మొదలైంది. 
       పిల్లలకు బాగా ఇష్టమైన పండుగలు దసరా, దీపావళి, సంక్రాతి. దసరా, సంక్రాంతి ఎక్కువ సెలవలు ఇచ్చే పండుగలు. దీపావళికి రెండు రోజులైనా కాని ఎంతో సందడిగా ఉండే పండుగ. ప్రతి పండుగ వెనుక ఎదో ఒక కారణమున్నట్లే ఈ దీపావళికి కూడా కొన్ని కారణాలు ఉన్నప్పటికి చెడుపై మంచి సాధించిన విజయంగానే చెప్పవచ్చు. అందరికి తెలిసిన కథ వర ప్రభావంతో నరకాసురుడు దేవతలను, ఋషులను ఇబ్బందులకు గురి చేస్తుంటే యుద్దానికి వెళ్లిన శ్రీకృష్ణుడు సైతం నరకాసురుణ్ణి వధించలేక పొతే సత్యభామ నరకాసురుణ్ణి వధించడం, ఆ మరుసటి రోజు చీకట్లను పారద్రోలి వెలుగు చూపించడానికి చిహ్నంగా ఈ దీపావళి పండుగను బాణాసంచా వెలుగుల్లో జరుపుకోవడం ఆనవాయితీగా మారిందని పురాణ కథనం. రావణాసుర సంహారం తరువాత రాముడు సీతా సమేతంగా అయోధ్యకు వచ్చిన శుభ సందర్భంలో ప్రజలు సంతోషంతో దీపావళిని జరుపుకున్నారని రామాయణంలో మరో కథ ఉందని చెప్తారు. దీపావళి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. ముందు రోజును ఆశ్వయుజ బహుళ చతుర్థశిని నరక చతుర్థశి అని అంటారు. దీపాలను వరుస క్రమంలో అమర్చడాన్ని దీపావళి అంటారు. అమ్మయినా తప్పు చేసిన కొడుకుని దండించక మానదు అన్న సత్యాన్ని నరకాసుర వధతో లోకానికి చాటుతుంది సత్యభామ. 
        మా చిన్నప్పుడు దీపావళి పండుగకి 10,15 రోజుల ముందు నుండే టపాకాయలు, పిస్తోలు బిళ్ళలు, టేపులు టపా టపా కాల్చడం, లేదంటే సూదంటు రాయితో ఆ బిళ్లలను కొట్టడం, ఉల్లిపాయ టపాసులు కాల్చడం మొదలయ్యేది. కొందరు మతాబులు తయారు చేయడం మొదలు పెడితే, మరికొందరు పూలపొట్లాలు తయారు చేసేవారు. చెక్కలు చెక్కిన పొడి ఎండబెట్టి, గుడ్డలో పోసి దానిని చుట్టి, దానికి పేడ రాసి ఎండబెట్టి తాడుతో కట్టి, ఒక చివర వెలిగించి గుండ్రంగా తిప్పుతుంటే ఆ నిప్పురవ్వలు భలే కనిపించేవి. ఇలా రకరకాలుగా బాణసంచా తయారు చేసేవాళ్ళు. కాకరపువ్వొత్తులు, తాళ్లు, పెన్సిళ్ళు, చిచ్చుబుడ్లు, పాము బిళ్ళలు, విష్ణు చక్రాలు, భూచక్రాలు, రాకెట్టులు, తాటాకు టపాకాయలు, లక్ష్మి ఔట్లు, సీమ టపాకాయలు ఇలా బోలెడు మందుగుండు సామాన్లు ముందే తెచ్చుకుని వాటిని ఎండలో పెట్టి చూసుకోవడం ఆదో సరదా అప్పట్లో.  
        దీపావళి ముందు రోజు భోగి , కుంకుడుగాయలతో తలంట్లు, ఆ నీళ్లు కళ్ళలో పడితే మంటలు, అమ్మమ్మ నోట్లో కొద్దిగా ఉప్పు వేయడం, కొత్త బట్టలు, గోరింటాకు సరదాలు. ఇక పండుగ రోజు సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూడటం, చీకటి పడుతుండగానే అమ్మమ్మ దేవుడి దగ్గర దీపారాధన చేయడం, తాతయ్య అప్పటికే తయారు చేసిన తాటాకుల ఉట్టిలో 2 మట్టి ప్రమిదలతో దీపం పెట్టి, ఇంటి ముందు గడ్డితో మంట వేసి ఆ  మంట చుట్టూ మూడు సార్లు తిరిగి ఈ దీపపు ఉట్టి దానిలో వేయడం ఆడపిల్లల సరదా, మగపిల్లలతో ఎండిన గోగుఫుల్లతో కాగడా చేసి (దీనిని దివిటీ అని కూడా అంటారు) మూడుసార్లు మంట చుట్టూ తిప్పి మంటలో వేసి ఇంట్లోకి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కుని తీపి తిని, మట్టి ప్రమిదలతో దీపాలు ఇంటి ప్రహరి గోడలపైన, ఇంటి చుట్టూ అలంకరించడం, కొన్ని చోట్ల కొవ్వొత్తులు వెలిగించడం, తర్వాత నాన్న తెచ్చిన టపాసులు, మతాబులు వగైరా వగైరా మందుగుండు సామాన్లు అన్ని ఎవరి ఓపికకు వాళ్ళు కాల్చుకోవడమే పని. ఎవరు ఎక్కువ కాల్చితే వాళ్ళు గొప్ప అనుకుంటూ పిల్లలందరం భలే సంతోషపడేవాళ్ళం. పాపం మరుసటి రోజు ఆ చెత్తనంతా అమ్మవాళ్ళు ఊడ్చుకోలేక సతమతమయ్యేవారు. ఆ కాల్చే సందడిలోనే అప్పుడప్పుడు కాళ్ళు చేతులు కాలడాలు, బట్టలు చిల్లులు పడటాలు జరిగేవి. 
          వర్షాకాలంలో పడే వర్షాలకు దోమలు, అనారోగ్యాలు ఎక్కువ కాకుండా ఈ దీపావళి పండుగ టపాసులు ఉపయోగపడతాయని తెలియక, ఇప్పటి స్పీడ్ యుగంలో ముందు రోజో, లేదా పండుగ రోజో షాప్ కి వెళ్లి నచ్చినవి తెచ్చుకోవడం, రెండు కొవ్వొత్తులు వెలిగించి పెట్టేసి ఏదో కాల్చామంటే కాల్చామన్న పేరుకే అదీ అపార్ట్మెంట్ కింద ఖాళీ ఉంటే.  హమ్మయ్య  మనకి దీపావళి అయిపొయింది అని ఊపిరి పీల్చేసుకుంటున్నాం. టి వి షోలు, ఐ పాడ్, ఐ ఫోన్లలో గేములు, అక్కడే గంటలు గంటలు లేదా ఐ ఐ టి ర్యాంకులు, చదువులు అంటూ పిల్లల బాల్యాన్ని మనం దోచేస్తూ ఆరోగ్యవంతమైన బాల్యపు అనుభూతులను మన తరువాతి తరాలకు అందించలేని దీనస్థితిలో ఉన్నాం ఇప్పుడు. పరిస్థితులు ఇలా మారడానికి కారణం మనమా లేక మరెవరైనానా అన్నది ప్రశ్నగానే ఉండిపోతోంది. గొప్పల కోసమో మరోదానికోసమో సహజ సిద్దమైన కొన్ని పరిణామాలను మార్చేస్తూ, మన సంస్కృతి, సంప్రదాయాలను మన తరువాతి తరాలకు వారసత్వంగా అందించలేకపోవడమనే దౌర్భల్యం నుండి బయటపడి విలువలతో కూడిన వ్యక్తిత్వ, ఆరోగ్య సంపదను అందించాలని కోరుకుంటూ అందరికి దీపావళి శుభాకాంక్షలు... 


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner