14, నవంబర్ 2018, బుధవారం

ఏక్ తారలు...!!

1.   నవ్వులు నటించలేనంటున్నాయి_నీ నిష్క్రమణాన్ని తట్టుకోలేక...!!

2.  చేరువ కాలేని జీవితమిది_తీరమెరిగిన అలల ఆటుపోట్లకు...!!

3.  ఊతమవ్వదా నా చెలిమి_తీరమెుకటైన మన జీవితాలకు...!!

4.  సంద్రమంటి చెలిమి నీదయ్యింది_సెలఏటిని చేరని నీ చింతని మాపడానికి....!!

5.  అక్షయమే జ్ఞాపకాలు_మరుపులేని కాలపు క్షణాలకు...!!

11, నవంబర్ 2018, ఆదివారం

కంటిధార.....!!

పజ్రగిరి జస్టిస్ గారి అద్భుతమైన చిత్రానికి నా చిన్న ప్రయత్నంగా....

ఓపలేని భారాన్ని
వెన్నాడుతున్న గత గాయాలను
జ్ఞాపకాలుగా మార్చుతూ
మూసిన రెప్పల మాటున
వెతల వేదనను దాచేస్తూ
మది నింపుకున్న
కలల కడలి ఒంపిన
కన్నీటి చినుకులకు
తడిసిన చెక్కిలి
చెప్పిన మగువ మానసపు
విగత జీవపు మింటిధార
సెగల పొగల మెుదటిధార
ఈ కలకంఠి కంటిధార...!!

9, నవంబర్ 2018, శుక్రవారం

విధ్వంసానికి విరుగుడు...!!

పరమాణువులతో
ప్రకృతిని పరిహసిస్తూ
మానవ మేధస్సుకు గులామంటూ
అండపిండ బ్రహ్మాండాలను
అతలాకుతలం చేస్తూ
కృత్రిమ జీవితాల్లోబడి
జీవకణాలను నిర్వీర్యంగావిస్తున్న
ఆధునికత ఓ వైపు

పచ్చదనపు పరిచయాన్ని
ప్రాణాధారపు పలకరింతలను
స్వచ్ఛదనపు సాంత్వనను
కనువిందైన జీవితాన్ని
కోల్పోతున్న లోపాలనెత్తి చూపుతూ
మూలాధారాలను మరవద్దని
మాయల మత్తులో తూగొద్దని
పర్యావరణ పరిరక్షణ పరమావధి
సమాజ శ్రేయస్సుగా చెప్పాల్సిన
దుస్థితీనాడు

ఆద్యంతాల సృష్టి నడుమన
అవకతవకల అస్పష్టాకారాలకు
పరిపూర్ణతనందించే దివ్యౌషదం
కల్తీ ఎరుగని ఆకుపచ్చని అవని...!!

7, నవంబర్ 2018, బుధవారం

రెప్ప...!!

కనురెప్ప మూయని జీవితానికి ఆ రెప్పల మాటున
మెదిలే కలలెన్నో
మదిలో కదలాడే బాసలకు
ఆలంబనగా నిలిచే
అనుబంధపు ఆసరాలెన్నో
వేవేల వర్ణాలద్దిన
ఊహలకు ప్రాణం పోసిన
స్వప్నచిత్రాల సౌందర్యాలెన్నో
గాయాలనోదార్చేందుకు
బతుకు పయనంలో
రాలిన కన్నీళ్ళెన్నో
కాలపు కనికట్టులో
దిగులు దుప్పటి దాచిన
రెప్పల చప్పుళ్ళెన్నో....!! 

3, నవంబర్ 2018, శనివారం

సంతోషాల లోగిళ్ళు....!!

వజ్రగిరి జస్టిస్ గారి చిత్రాలకు ఓ చిన్న ప్రయత్నం.... ధన్యవాదాలు అండి మీ చక్కని చిత్రాలకు... 


కనుమరుగౌతున్న
సంప్రదాయపు నిధులు
గత వైభవ చిహ్నాలుగా

భట్రాజు పొగడ్తల
భజనాట్టహాసాల నడుమ
రంగరంగ వైభోగంగా

కాడెద్దుల సేద్యాల
కనువిందైన కర్షకుల హర్షాల
ఆనందాతిశయపు ఆహ్లాదాలుగా

చిరుజల్లుల సందడులు
చిట్టిపొట్టి చిన్నారుల అల్లరులతో
ప్రతి ఇంటి గడప కనుల పండుగగా

నాదస్వరాల ఆలాపనలు
హరిదాసు సంకీర్తనల గానాలతో
సిరుల సంతోషాల లోగిళ్ళు పల్లె జీవితాలు ఆనాడు

బోసిబోయిన ముంగిళ్ళు
బావురుమంటున్న అనుబంధాలతో
అతి అనావృష్టి పాలబడి బిక్కుబిక్కుమంటున్న బతుకులీనాడు...!! 

2, నవంబర్ 2018, శుక్రవారం

ద్విపదలు...!!

1.  అదే మాట
మన మనసులను పరిచయం చేస్తూ...!!

2.  మౌనమెప్పడూ మాటల్లోనే
మనసు పారేసుకున్న క్షణాల్లో దొర్లిపోతూ....!!

3.   ఆరాధనకర్ధం ఇదేనేమెా
నిరీక్షణనూ ఆస్వాదిస్తూ...!!

4.  అక్షరాలూ తొందర పడుతున్నాయి
పదాల ప్రవాహంలో కలవాలని...!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner