3, జనవరి 2019, గురువారం

యామినిదేవి కోడె...!!

అంతరంగ అంతర్మథనమే యామిని అక్షర శరాలు..!!
          తెలుగు సాహిత్యంలో కవిత్వం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ ఆధునిక తరంలో ఎందరి మనసులనో తడుముతున్న భావాలను రాస్తున్న ఈ తరం కవయిత్రులలో యామినీదేవి కోడె ఒకరు. మూడు వాక్యాలలో ముచ్చటగా త్రిపదాల్లో పొందు పరచినా, తన మనసు స్పందించిన భావాన్ని కవితగా అక్షరీకరించినా, ఎంతోమందిని  తన భావజాలంతో కట్టిపడేస్తున్న యామిని దేవి కోడె అభినందనీయులు.
             సందేశాత్మక కవిత్వమయినా, సామాజిక అంశమయినా తనదైన శైలిలో రాస్తూ చక్కని, చిక్కని భావాలు పలికిస్తూ అనేక సాహితీ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన వంతుగా తెలుగు సాహిత్యానికి సేవ చేస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. ఆత్మాశ్రయ కవిత్వ ధోరణే ఎక్కువగా తన కవితల్లో కనిపిస్తుంది. అడుగంటిపోతున్న అనుబంధాలను చూస్తూ, ఉమ్మడి వ్యవస్థ గొప్పదనాన్ని చాటి చెప్తూ, ఊరి బాగు కోసం అందరం కలసి పని చేద్దామని పిలుపునిస్తూ కలసి అడుగేద్దాం రమ్మంటారు. నాన్న ప్రేమను తల్చుకుంటూ మదిలోని తడిని కన్నీరుతో పంచుకుంటారు. మరో చిరు భావనగా " అక్షరాల మత్తు పట్టింది.. ఆవహించిన అంతరంగమంతా ఇలా .. తరంగమైందని.." అంటూ అక్షరాల అమృతాన్ని మనకందిస్తారు. వెళ్ళనీయని అక్షరాన్నీ, ఉండనీయని కాలాన్ని తలపుల్లో ఉంచడానికి చీకటి ఒడిలో సేదదీరమంటారు. స్వప్నం కవితలో ఆశల ఊహలను అందంగా వినిపిస్తారు.  గురించి చెప్తూ చిన్నప్పటి భయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ చెట్టు  లేకపోయినా ఆ చోటు గుర్తు చేసిన జ్ఞాపకాలను పంచుకుంటూ ఓ చక్కని సందేశాన్ని చెప్తారు..
" జ్ఞాపకాల గుర్తుల్లో
బోసిపోయిన గట్టు మీద
ఎదుగుతున్న ఆశలతో
పెరుగుతున్న చెట్టు
అభివృద్ధికి మరో మెట్టు " అంటూ అద్భుతమైన భావాన్ని అందించారు. ఇలానే మరో కవిత తన ఊరి చెరువు గురించి కూడా రాసారు. మీ టూ, నోట్లరద్దు, ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు ఇలా ప్రతి సమస్యను సున్నితంగా స్పర్శిస్తూ చదువరుల మనసులను గెలవడం యామిని గొప్పదనం. తప్పని పరిస్థితిలో వేశ్యగా మారిన అతివ అంతరంగాన్ని అసహజ హంతకి కవితలో యామిని ఆవిష్కరించిన తీరు అద్భుతం.
" మీ చేతులన్నీ తాకి నేను కదా మైల పడింది
చెదపురుగులై మీరంతా తిన్న నా దేహాన్ని
నీటితో శుద్ధి చేయొచ్చు
మీ మనసు నిండా పట్టిన మకిలెలా
వదులుతుందో
మీ లోపల చూసుకోండి ఓ సారి. "
ఎంత హృదయ వేదన నిండి ఉందో ఈ అక్షరాల్లో చూసారా..
ఇలానే చీకటి గురించి చక్కని భావుకత
"రేయంతా కలల విహారం
ఊహలతో ఊసులాడే
సందు దొరికే రాతిరి.." ఎంత బావుంది ఈ భావన.
ప్రయాణం కవిత చక్కని తత్వాన్ని అందిస్తుంది.
" నన్ను నాలా మిగిల్చే క్షణాల కోసం అన్వేషిస్తూ
మౌనంలోకి జారుతున్నా " అంటూ ఏకాంతంలో తనకు తానుగా పంచుకునే మనసు నొచ్చుకున్న ముచ్చట్లను చెప్తూ ఓ వనిత కోల్పోతున్న జీవితపు ఆనందాలను, స్వేచ్ఛను చాలా తేలిక పదాలతో చెప్పడం హర్షించదగ్గ విషయం. మనం ఓ విషయాన్ని ఎలా చెప్పామన్నది ముఖ్యం కాదు, ఎందరి మనసులకు దగ్గరగా వెళ్ళింది అన్నది ముఖ్యం. ఈ స్థితి యామిని కవితలు చదువుతున్న ప్రతి ఒక్కరికి అనుభవమే. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, భేషజాలు లేకుండా క్లుప్తంగా చెప్పడమే యామినికి ఎంతోమంది అభిమానులను సంపాదించి పెడుతోంది.
దైవం గురించి రాసినా, సామాజిక చైతన్యం గురించి రాసినా, సమాజంలో జరుగుతున్న ఘోరాల గురించి రాసినా, చట్టాల మార్పుల మూలంగా సామాన్యుల ఇబ్బందులను గురించి చెప్పినా, మనసు వేదన, అనుబంధాలు, ఆప్యాయతలు, ఆవసరాలు, అపార్ధాలు, బాల్యపు జ్ఞాపకాలు, కోపం, ఆవేశం ఇలా ఏ పార్శ్వం తీసుకున్నా తనకు తానుగా అనుభవించినట్లుగా చక్కని అనుభూతిని అక్షరాలతో మమేకం చేసి రాయడం యామినికి దేవుడిచ్చిన వరమనే చెప్పాలి. కవిత్వమే కాకుండా చక్కని వ్యాసాలు, సమీక్షలు కూడా రాయగలగడం అభినందించదగ్గ విషయం. ఓ మనిషిలోని అన్ని కోణాలను తనదైన రీతిలో అంతర్లీనంగా దర్శించి ఆ భావాలను నలుగురు మెచ్చేటట్లు రాయడమే కాకుండా, చక్కని కంఠంతో భావయుక్తంగా చదవడమనే కళ కూడా ఈమె సొంతం. మొదటిసారిగా ఓ కవితను వేదిక మీద చుదువుతూనే టైమ్స్ ఆఫ్ ఇండియాలో చోటు సంపాదించుకున్న ఘనత ఈమెది. చాలా పత్రికల్లో యామిని కవితలు ప్రచురితమౌతూనే ఉంటాయి. కవితలు రాయడమే కాకుండా చిత్ర కళ, దుస్తులపై అందమైన పెయింటింగ్ వేయడం, కుట్లు మొదలైన చేతి కళలలో ప్రావీణ్యం బాగా ఉంది. గ్రామీణ నేపధ్యం నుంచి, ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చినా, అనుబంధాలు, అభిమానాలు వదులుకోలేని మధ్య తరగతి మహిళగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ పలు సాహితీ సంస్థలలో కార్య నిర్వాహకురాలిగా బాధ్యతలు స్వీకరించి, బాలోత్సవ్, కవి సమ్మేళనాలలో న్యాయ నిర్ణేతగా ఉంటున్నారు.
ప్రముఖ కవులు దేవిప్రియ, శివారెడ్డి,  రాజారాం తూముచర్ల వంటి వారితో అభినందనలు,సత్కారాలు అందుకున్నారు. అనేక కవి సమ్మేళనాల్లో పలు సత్కారాలు పొందారు. ఇప్పుడిప్పుడే తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేస్తున్న యామినీదేవి కోడె తన అక్షర భావాలతో అందరిని అలరించాలని కోరుకుంటూ శుభాభినందనలు.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner