8, జనవరి 2019, మంగళవారం

జీవన మంజూష (మార్చి)...!!

నేస్తం,
             సగటు మనిషి ఆలోచనలు ఎలా ఉంటున్నాయని మనకు తెలుస్తుంటే చాలా ఆశ్ఛర్యంగా ఉంటోంది. ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరి ఆలోచన ఒక్కో విధంగా ఉంటోంది. జీవితపు చివరి మజిలిలో ఉన్న అత్తగారిని భారంగా భావించే కోడలు, పడుతున్నారు కదా అని కోడళ్లను ఇప్పటికి ఆరళ్ళు పెట్టే అత్తగార్లు, అమ్మాబాబులను అవసరాలకి వాడుకునే కొడుకులు, కూతుళ్లు ఇలా కళ్ళ ముందు ఎన్ని హృదయవిదారక సంఘటనలు జరుగుతున్నా కనీసం తప్పుని వేలెత్తి చూపలేక ప్రేక్షక పాత్రలో నాలాంటి ఎందరో నేడు ఈ సమాజంలో.
           ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు ఈనాడు లేకపోయినా, మనం అన్న పదం మరుగున పడిపోతున్నా ఏమి చేయలేని నిస్సహాయత. తోడబుట్టిన వాళ్ళని పలకరించలేని నిర్భాగ్యులు, డబ్బే లోకంగా బతికేస్తున్న దౌర్భాగ్యులు ఈనాడు ప్రతి ఇంటా ఉన్నారనడంలో సందేహం ఏమాత్రం లేదు. ఎందుకో ఈ క్రింది సుమతీ శతక పద్యం ఓసారి అందరికి గుర్తు చేయాలనిపించింది.
" అక్కరకు రాని చుట్టము,
మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమున దా
నెక్కిన బారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగవలయు గదరా సుమతి "
           చిన్నప్పుడు చదువుకున్న నీతి పద్యాలు కనీసం కొన్నయినా గుర్తుకు తెచ్చుకుంటే మనలో కాస్తయినా మార్పు వస్తుందేమో అనిపిస్తోంది. ఆధునికంగా ముందుకు పోతూ, అత్యాధునిక పరికరాలు అందుబాటులోనున్న నేటి రోజుల్లో మనుషుల్లో మానవత్వం కనుమరుగై పోవడానికి కారణాలు బోలెడు. రక్త సంబంధాలే రాక్షస బంధాలుగా మారిపోతూ, అవసరానికి అక్కరకు రాని ఆత్మీయతలు, జీవితమొక నాటక రంగమని, బరువులు, బాధ్యతలు మోయకుండా ప్రవక్తలమని ప్రగల్భాలు పలికే దగుల్భాజీల మాటల మత్తులో పడి తప్పించుకు తిరిగే ధన్యులు ఎందరో. ఏ సమస్యలు లేని జీవితాలు లేవు ఈ ప్రపంచంలో. మనకున్నదే అతి పెద్ద సమస్యగా భావించి కష్టాలన్నీ ఏకబిగిన మన చుట్టునే ఉన్నట్టు అనుకుంటూ చావు పరిష్కారమనుకోవడమంత తెలివితక్కువ తనం మరొకటి లేదు. జీవితంలో నాలుగు దశలు పరిపూర్ణమైవే. సంతోషాలు, బాధలు వాటిలో మిళితమై
" జీవితం సప్త సాగర గీతం 
వెలుగు నీడల వేదం
సాగనీ పయనం " అన్న సినీ కవి వేటూరి పాట ఎంత నిజం. కష్టమైనా, సుఖమైనా మన అన్న వారితో పంచుకోవడంలో ఉన్న ఆనందం వేల కోట్లు మన వెంట ఉన్నప్పుడు కూడా రాదు. కావాలనుకున్నవి దక్కలేదని జీవితం నిస్సారమైనదని, ఒంటరితనం శాపమని అనుకుంటూ బాధ పడటం మానేసి మన పుట్టుకకు ఓ అర్ధాన్నిచ్చే బాధ్యతను కల్పించుకుంటే మనమే కాకుండా మన చుట్టూ ఉన్నవారు కూడా సంతోషంగా ఉంటారు. వింత పోకడలు, విపరీత మనస్తత్వాలు కలిగిన ఇప్పటి మానవ సమాజంలో మంచి మార్పు కోసం ఎదురుచూడటం ఎడారిలో ఒయాసిస్సుల కోసం ఎండమావుల వెంట పడినట్లున్నా..మరో మార్గం కనబడనట్లే కనుచూపు మేరలో.
ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం....

         

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner