28, మే 2019, మంగళవారం

త్రిపదలు...!!

1.  అక్షరాలతో ఆంతరంగికంగా
అసలుకు నకలుకు
తేడా తెలుసుకునే క్రమంలో...!!

2.   గొప్పదనమంతా
నా అక్షరానిదేనన్న అహంతో
మనసాక్షరాల రూపాన్ని చూడలేకున్నా...!!

3.   అక్షరమే ప్రపంచం
నాదన్నదంతా
తానే నిండిపోతూ...!!

4.   మాను మూగదైంది
బంధాల గారడీల నడుమ
మనసుల నైజాలను తిలకిస్తూ...!!

5.  తక్కువన్న తూకమే లేదిక్కడ
నెయ్యమైనా కయ్యమైనా
మన మధ్యనే...!!

6.   మలిప్రేమలు
జ్ఞాపకాలను దాచుకునే
మనసు ఖజానాలు...!!

7.   అంపశయ్య ఆలోచనేలా
పలకరించే జ్ఞాపకమై
నిను వీడక నేనుంటే...!!

8.  శూన్యం చుట్టేసినప్పుడంతే
ఏ లెక్కల పద్దులు
సరికావంతే....!!

9.   నైల్యమూ ఓ ఛాయే
ఎదను కమ్మినా
ఎడ మాపుతుందేమెా..!!

10.   ఆవేశమూ, ఆవేదనా కాదది
ఏళ్ళ తరబడి తిరస్కారాల తీర్మానాలకు
ఓర్పు నశించి సంధించబడుతున్న శరాలు..!!

11.    మనసు మెుద్దుబారింది
సహనానికీ ఓ హద్దుంటుందని
చరిత్రను గుర్తుచేస్తూ...!!

12.    స్పందన లేని మనసు
సజీవమైనా నిర్జీవమే
అక్షరాల నడుమ కొనూపిరితో...!!

13.   ఒక్క క్షణమైనా
నాది కావాలన్న కోరిక
గెలుపును ఆస్వాదించడానికి...!!

14.   కొన్ని వాస్తవాలంతే
మనకు నచ్చినట్టోసారి
నచ్చనట్టోసారిగా మిగులుతూ...!!

15.    అన్ని సందర్భాలూ ఇంతే
మన సంతోషం చూడలేని
కొందరికి కంటగింపుగా...!!

16.   వాత్సల్యమెా
అయస్కాంతమనుకుంటా
తాకిన వెంటనే ఇట్టే ఆకర్షించేస్తూ...!!

17.   కదలిక మెుదలైతే చాలు
క్షణాల కాలాన్ని
కలం అక్షరాల్లో ఒంపడానికి...!!

18.   భర్తీ చేయలేనిది
ఈ అమ్మతనమే
విధాతకు సైతం సవాలు విసురుతూ...!!

19.   జ్ఞాపకాల జలతారుల్లా
తడుముతున్న బాల్యం
మరలి రానంటూ మారాము చేస్తూ..!!

20.   భద్రతెప్పుడూ అగమ్యగోచరమే
నమ్మిన నిజాలు
చేదుగా అనిపిస్తుంటే..!!

21.   అస్థిమితమంతే
అటు ఇటు ఎటూ పోనివ్వదు
గమనాన్ని, గమ్యాన్ని నిర్దేశించలేక...!!

22.  ఇంకని నీటి చలమే
కంటిలోని కన్నీరు
మనసును బయల్బెడుతూ..!!

23.    మాటలతో నాకు అలవాటే
అలుక నేర్చిన నీ మౌనాన్ని
అందంగా ఎలా చూపాలో...!!

24.  స్వరం పాతదే
గతి తప్పిన గమకాలను
సరి చేయడానికే ఈ నాదం..!!

25.   పరిభ్రమణాల
పరిలోకనం
బంధాల అనుబంధం..!!

26.   నీవు లేక నేను
మనలేనని తెలిసినప్పుడు
ప్రశ్నాలంకారాలకు తావెందుకట...!!

27.   కొన్నలా గుర్తుంటాయి
బాధలో ఓదార్పులా
బాసటకు తోడుగా...!!

28.   మానని గాయాలే
కొన్ని పరిచయాలు
మనసుని బాధిస్తూ...!!

29.   పలకరింపే ప్రాణమౌతుంది
మరణాన్ని మరలి పొమ్మంటూ
ఆత్మాభిమానం ఆయువుపట్టంటూ...!!

30.    ఓటమికి వెరవని మనసిక్కడ
ఎగుడుదిగుడు రహదారుల్లో
గెలుపు సోపానమధిరోహించడానికి...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner